సమ్మెకు సకలజనుల మద్దతు | All Employees Union Giving Support For RTC Strike In Telangana | Sakshi
Sakshi News home page

సమ్మెకు సకలజనుల మద్దతు

Published Fri, Oct 18 2019 8:57 AM | Last Updated on Fri, Oct 18 2019 9:13 AM

All Employees Union Giving Support For RTC Strike In Telangana - Sakshi

సాక్షి, ఆదిలాబాద్‌ : ఆర్టీసీ కార్మికులు చేపడుతున్న సమ్మెకు రోజురోజుకు సబ్బండ వర్ణాల నుంచి మద్దతు లభిస్తోంది. ఇప్పటికే ఆయా రాజకీయ పార్టీలు, విద్యార్థి, ఉపాధ్యాయ సంఘాలు మద్దతు ప్రకటించగా, తాజాగా ఉద్యోగ జేఏసీ నాయకులు కార్మికుల సమ్మెకు సంఘీభావం ప్రకటించారు. మోటార్‌సైకిల్‌ ర్యాలీ నిర్వహించారు. కళాకారుల ఆటాపాటలతో నిరసన కార్యక్రమాలు హోరెత్తుతున్నాయి. వంటావార్పు, ర్యాలీలు, మానవహారం, సీఎం దిష్టిబొమ్మ దహనం, తదితర కార్యక్రమాలతో జోరు పెంచారు. ఈ నెల 5న ప్రారంభమైన సమ్మె గురువారం నాటికి 13వ రోజుకు చేరుకుంది. రోజుకో విధంగా నిరసన కార్యక్రమాలుచేపడుతూ సమ్మెను ఉధృతం చేస్తున్నారు. 

మోటార్‌సైకిల్‌ ర్యాలీలు 
కార్మికుల సమ్మెకు మద్దతుగా టీఎన్జీఓ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఆదిలాబాద్‌ పట్టణంలోని పలు వీధుల గుండా మోటార్‌సైకిల్‌ ర్యాలీలు నిర్వహించారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ప్ల కార్డులు ప్రదర్శించారు. అనంతరం సుందరయ్య భవన్‌లో కార్మికులకు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా టీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు అశోక్‌ మాట్లాడుతూ ఉద్యోగులు, కార్మికులు ఒకటేనన్నారు. ప్రభుత్వం ఆర్టీసీకి రూ.2600 కోట్ల బకాయి ఇవ్వాల్సి ఉందన్నారు. డీజిల్‌పై పన్ను విధించడంతో ఆర్టీసీపై భారం పడుతుందన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీకి రూ.50వేల కోట్ల ఆస్తులు ఉన్నాయని తెలిపారు. సమ్మె చేపడుతున్న కార్మికులను సెల్ఫ్‌ డిస్మిస్‌ పేరిట 48వేల మంది ఉద్యోగులను తొలగించామనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఉద్యోగులను తొలగించే హక్కు ప్రభుత్వానికి లేదన్నారు. యూనియన్‌లు వద్దంటే పార్టీలు ఎందుకని ప్రశ్నించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్‌ చేశారు. ఆర్టీసీ సమ్మె మరింత ఉధృతమవుతుందని భావించి విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించిందన్నారు.

కార్యక్రమంలో టీఎన్జీఓ తాలూకా అధ్యక్ష, కార్యదర్శులు నవీన్‌కుమార్, మహేందర్, రాష్ట్ర కార్యదర్శి తిరుమల్‌రెడ్డి, గోపి, మోహన్, సుధాకర్, నాల్గో తరగతి ఉద్యోగుల సంఘం నాయకులు గంగాధర్, అశోక్‌గౌడ్, డ్రైవర్స్‌ యూనియన్‌ అధ్యక్షుడు సబ్దార్‌అలీ, వాసిఖ్, అటవీ శాఖ ఉద్యోగుల సంఘం నాయకులు రామకృష్ణ, వార్డెన్‌ సంఘం అధ్యక్షుడు రమేశ్‌ చందర్‌గౌడ్, వివిధ శాఖల ఉద్యోగులు, మహిళలు పాల్గొన్నారు. ఉపాధ్యాయ సంఘాల నాయకులు రవీంద్ర, వృకోధర్, వెంకట్, శ్రీనివాస్, నరేందర్, గిరి, తదితరులు పాల్గొన్నారు.

సీఎం దిష్టిబొమ్మ దహనం..


సమ్మెలో భాగంగా ఏఐవైఎఫ్‌ ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ దిష్టిబొమ్మ దహనం చేశారు. పట్టణంలోని తెలంగాణచౌక్‌లో నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. లేదంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో వంటావార్పు
ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెకు కాంగ్రెస్‌ మద్దతు తెలిపింది. ఇందులో భాగంగా సుందరయ్యభవన్‌ ఎదుట వంటావార్పు నిర్వహించింది. ఈ కార్యక్రమానికి హాజరైన ఏఐసీసీ సభ్యురాలు గండ్రత్‌ సుజాత మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అబద్దాల కోరని విమర్శించారు. కార్మికులు చనిపోతున్నా స్పందించడం లేదన్నారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించే వరకూ వారికి అండగా ఉండి పోరాడుతామని స్పష్టం చేశారు. నాయకులు సంజీవ్‌రెడ్డి, యాసం నర్సింగ్, అంబకంటి అశోక్, రూపేశ్‌రెడ్డి, జైపాల్, పొచ్చన్న, సులోచన, సరిత తదితరులు పాల్గొన్నారు.

గ్రామీణులకు ఇక్కట్లు
మారుమూల గ్రామాలకు బస్సులు వెళ్లకపోవడంతో ఆయా ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆదిలాబాద్, ఉట్నూర్‌ డిపోల పరిధిలో 63 ఆర్టీసీ బస్సులు, 33 ప్రైవేట్‌ అద్దె బస్సులు, 15 సీసీ బస్సులు, 52 మ్యాక్సీ క్యాబ్‌లు, మొత్తం 173 బస్సులు నడిపిస్తున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement