సాక్షి, నెల్లూరు : జిల్లాలో సమైక్యాంధ్ర ఉద్యమం 63వ రోజు మంగళవారం ఉధృతంగా సాగింది. అలుపెరగక సింహపురివాసులు పోరాటాన్ని ముందుకు నడిపిస్తున్నారు. సూళ్లూరుపేటలో మంగళవారం పులికాట్ పొలికేక పేరుతో భారీసభ నిర్వహించారు. ఈ సభకు వేలాదిగా ప్రజలు తరలి వచ్చారు.
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే డిమాండ్‌పై బుధవారం నుంచి వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో చేపట్టనున్న ఆమరణ నిరాహారదీక్షలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిల్లా వ్యాప్తం గా పార్టీ శ్రేణులు నిరాహారదీక్షలకు దిగనున్నారు. వైఎస్సార్‌సీపీ మాదిరిగా మిగిలిన పార్టీలు రాజీనామాలు చేసి సమైక్యాంధ్ర ఉద్యమంలోకి రావాలని ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ వేదిక రాష్ట్ర కో ఆర్డినేటర్ లక్ష్మణ్‌రెడ్డి డిమాండ్ చేశారు. జిల్లా వ్యాప్తంగా ఉద్యోగ, విద్యార్థి, జేఏసీల ఆధ్వర్యంలో నిరసన దీక్షలు కొనసాగుతున్నాయి. వెంకటగిరిలో జే ఏసీ నేతలు కేసీఆర్‌పై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
నగరంలోని వేదాయపాళెం సెంటర్‌లో ముదిరాజ్ సేవా సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షలు ఏడో రోజుకు చేరుకున్నాయి. రోడ్డుపై ఆటాపాట నిర్వహించారు. జిల్లా పరిషత్ ఉద్యోగులు జెడ్పీ కార్యాలయం ఎదుట వంటావార్పు చేసి నిరసనను వ్యక్తం చేశారు. గూడూరులో టవర్‌క్లాక్ సెం టర్‌లో సమైక్యాంధ్ర కోసం రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. పట్టణంలోని పలు పాఠశాలలకు చెందిన విద్యార్థులు మానవహారం ఏర్పాటు చేసి ఆటలాడుతూ వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు.
ఆత్మకూరులో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 50 రోజులకు చేరుకున్న సందర్భంగా జేఏసీ, ఉద్యోగ, కార్మిక, ఉపాధ్యాయ జేఏసీ నేతలు తోలు బొమ్మలాటతో పొట్టి శ్రీరాములు విగ్రహం నుంచి బస్టాండ్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని హోటల్స్ అసోసియేషన్స్ ఆధ్వర్యంలో అన్నదానం చేశారు.
వెంకటగిరి పట్టణ జేఏసీ ఆధ్వర్యంలో కేసీఆర్‌పై పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సమైక్యాంధ్ర సాధన కోసం బుధవారం నుంచి వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో నిర్వహించే ఆమరణ నిరాహారదీక్షలకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. దీనిపై పార్టీ కార్యకర్తలతో మండల కన్వీనర్లు సమీక్షించారు.
పొదలకూరులో బ్రాహ్మణులు పెద్ద సంఖ్యలో ప్రదర్శన జరిపారు. రిలే నిరాహారదీక్షలు చేశారు. రాష్ట్ర విభజన జరగకూడదంటూ నడిరోడ్డుపై యజ్ఞాలు నిర్వహించారు. ముత్తుకూరు మండలంలోని పంటపాళెం బైపాస్‌రోడ్డులో మూడు పంచాయతీలకు చెందిన అన్ని రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు, తహశీల్దార్, విద్యార్థులు, ఉపాధ్యాయులు ప్రదర్శన నిర్వహించారు. మానవహారం నిర్మించారు. నడిరోడ్డుపై ఉపాధ్యాయులు కబడ్డీ, ఖోఖో ఆడారు.
కావలిలో సమైక్యాంధ్రకు మద్దతుగా విక్రమసింహపురి యూనివర్సిటీ పీజీ సెంటర్ విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం మానవహారం ఏర్పాటు చేశారు. ప్రభుత్వ ఉద్యోగ జేఏసీ, ఆర్టీసీ జేఏసీ, వైఎస్సార్‌సీపీ, సమైక్యాంధ్ర జేఏసీ ఆద్వర్యంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగించారు.
సూళ్లూరుపేట ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో లక్ష జనగళ గర్జనను వినిపించేందుకు వేలాది మందితో పులికాట్ పొలికేకను ఘనంగా నిర్వహించారు. స్థానికంగా ఓ స్కూల్‌లో పనిచేస్తున్న బెల్జియం దేశస్తులు ఆందోళనలో పాల్గొని సమైక్య నినాదాలు చేశారు. నాయుడుపేటలో ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్షలు కొనసాగుతున్నాయి.
ఉదయగిరిలో ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షలో నాయీ బ్రాహ్మణులు పాల్గొన్నారు. ఉపాధ్యాయుడు గుండు గీయించుకొని నిరసన తెలిపారు. వరికుంటపాడులో సమైక్యాంధ్ర పోరాట సమితి ఆధ్వర్యంలో జరిగిన దీక్షలో స్థానిక యువకులు పాల్గొన్నారు.
బుచ్చిరెడ్డిపాళెంలో ఫొటో, వీడియోగ్రాఫర్లు ర్యాలీ, ధర్నా నిర్వహించారు.
కోవూరు ఎన్జీఓ హోంలో ఆదర్శరైతుల దీక్షకు వ్యవసాయ శాఖ జేడీ సుబ్బారావు సంఘీభావం తెలిపారు. కొడవలూరు మండలం నార్తురాజుపాళెం టపాతోపు జాతీయరహదారిని దిగ్బంధించారు. రాజకీయ జేఏసీ ఆధ్వర్యంలో రాజుపాళెం నుంచి భారీ ర్యాలీ, జాతీయ రహదారిపైనే వంటావార్పు, రక్తదాన శిబిరాలు నిర్వహించారు.
సమైక్య కేక
Published Wed, Oct 2 2013 4:03 AM | Last Updated on Tue, May 29 2018 4:06 PM
Advertisement
Advertisement