ఏలూరు : బదిలీల గుబులుతో సతమతమవుతున్న అధికారులకు ప్రభుత్వ నిర్ణయం ఊరటనిస్తోంది. ఎన్‌జీవో సంఘ అభ్యర్థనతో అన్ని శాఖల్లో నూరుశాతం బదిలీలకు బదులు అవసరమైన చోట్లకే స్థానచలనాలుండాలని సర్కారు ఆదేశాలివ్వడంతో గండం గట్టెక్కిందని ఊపిరి తీసుకుంటున్నారు. ప్రభుత్వశాఖల్లో బదిలీల ప్రక్రియను ఆయాశాఖల్లో అవసరాల మేర కే చేపట్టేందుకు ప్రభుత్వం నిర్ణయించడంతో కొంతమంది అధికారుల నెత్తిన పాలుపోసినట్టు అయింది. కాగా చాలా శాఖల్లో ఈ పరిణామంతో అధికారులు ఊరట పొందుతున్నారు. బదిలీల ప్రకటన విషయంలో ప్రభుత్వం మొదటి నుంచీ తాత్సారం చేసింది.
తమకు అనుకూలంగా ఈ ప్రక్రియను మలుచుకోవాలని అధికార పార్టీ నాయకులు ప్రయత్నించినప్పటికీ పరిస్థితులు కలిసిరాలేదు. ఎటూకాని వేళలో ఈ బదిలీలు వద్దని అవసరాల మేరకే స్థానచలనాలు కల్పించాలని రాష్ట్ర ఎన్‌జీవో సంఘం ప్రభుత్వాన్ని అభ్యర్థించింది. దీంతో ప్రభుత్వం ఈనెల 3 నుంచి 15వ తేదీలోగా అవసరాల మేరకే బదిలీలు చేపట్టేందుకు నిర్ణయించింది. హుద్‌హుద్ తుపాను కారణంగా జన్మభూమి- మా ఊరు సభలు అన్ని జిల్లాల్లో పూర్తికాలేదు. ఈ నేపథ్యంలో ఈ నెల ఒకటో తేదీన జన్మభూమి సభలను తిరిగి చంద్రబాబునాయుడు ప్రారంభింపచేశారు. 10వ తేదీలోగా జన్మభూమి సభలు అన్ని జిల్లాల్లో పూర్తికానున్నాయి. దీంతో కీలకశాఖల్లో అవసరాల మేరకే బదిలీల ప్రక్రియను ప్రభుత్వం పూర్తి చేసే అవకాశం ఉంది.
రెవెన్యూ శాఖకు పూర్తిస్థాయి ఊరట
రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 13వ తేదీ నుంచి ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో రెవెన్యూతో సంబంధం ఉన్న కిందిస్థాయి ఉద్యోగి నుంచి కలెక్టరు వరకు బదిలీలను చేపట్టేందుకు అవకాశం కనిపించడంలేదు. ఇప్పటికే ఖాళీలు ఉన్నచోట్ల రాజకీయ పైరవీల నేపథ్యంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, జిల్లా స్థాయి అధికారుల బదిలీలు 20 శాతం వరకు పూర్తైట్టు సమాచారం. బదిలీల గడువును ప్రభుత్వం పొడిగిస్తూనే వివిధ శాఖల్లో గుట్టుచప్పుడు కాకుండా అధికారులకు స్థాన చలనం కల్పిస్తుండడం విశేషం.
కీలక పోస్టులు భర్తీ అయ్యే అవకాశం
జిల్లాలో పలు కీలకస్థాయి పోస్టులు చాలాకాలంగా ఖాళీగా ఉంటున్నాయి. ఇవి ఈ వారంలో భర్తీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. జడ్పీ డిప్యూటీ సీఈఓ, డీఎంహెచ్‌ఓ, డీఆర్‌డీఏ పీడీ, హౌసింగ్ పీడీ, తదితర కీలక అధికారులు ఇతర జిల్లాల నుంచి బదిలీపై వచ్చే అవకాశాలున్నాయి.
హమ్మయ్య..!
Published Fri, Nov 7 2014 2:22 AM | Last Updated on Wed, Oct 17 2018 5:10 PM
Advertisement