ఏలూరు డీఎస్పీ బదిలీ
సాక్షి, ఏలూరు : ప్రజాప్రతినిధులతో జగడాల నేపథ్యంలో ఏలూరు డీఎస్పీ మేకా సత్తిబాబుపై బదిలీ వేటుపడింది. ఆయన స్థానంలో కేజీవీ సరితను డీఎస్పీగా నియమిస్తూ గురువారం ఉత్తర్వులు వెలువడ్డా యి. సత్తిబాబును హైదరాబాద్‌లోని కం ప్యూటర్ సర్వీసెస్ డీఎస్పీగా బదిలీ చేశారు. గురువారం సాయంత్రం ఆయన ఇక్కడి బాధ్యతల నుంచి రిలీవ్ అయ్యారు. సరిత శుక్రవారం బాధ్యతలు స్వీకరించనున్నారు.
జగడాలే కారణం !
డీఎస్పీ సత్తిబాబు 2010 బ్యాచ్‌కు చెందినవారు. ఇక్కడ డీఎస్పీగా బాధ్యతలు చేపట్టి తొమ్మిది నెలలైంది. కొద్దిరోజుల క్రితం ఆయన ప్రజాప్రతినిధులతో వైరం తెచ్చుకున్నారు. దాని ఫలితంగానే అకస్మాత్తుగా బదిలీ అయ్యారని సమాచారం. నిడమర్రు మండలం పెదనిండ్రకొలనులో ఇటీవల చేపల చెరువులకు సంబంధించి తలెత్తిన భూ వివాదంలో రెండువర్గాల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. కేసు నమోదు చేసిన డీఎస్పీ ఎం.సత్తిబాబు సెప్టెంబర్ 28 ఉదయం ఇరువర్గాల వారిని పిలిపించి విచారణ ప్రారంభించారు. ఈ నేపథ్యంలో టీడీపీ వర్గీయులకు మద్దతుగా జిల్లా పరిషత్ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు, ఏలూరు ఎంపీ మాగంటి బాబు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి బుజ్జి, ఉంగుటూరు ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు ఆదివారం రాత్రి ఏలూరు డీఎస్పీ సత్తిబాబు బంగ్లాకు చేరుకుని డీఎస్పీని నిలదీశారు.
అసహనానికి గురైన డీఎస్పీ సత్తిబాబు ‘ఓ డీఎస్పీని, నా డిజిగ్నేషన్ తెలుసుకుని మాట్లాడండి. ఏకవచనంతో మాట్లాడటమే కాకుండా, డబ్బులు తీసుకున్నానంటూ అసత్య ఆరోపణలు చేస్తారా’ అంటూ తాను కూర్చున్న కుర్చీని కాలితో వెనక్కుతన్ని ‘మీ ఇష్టమొచ్చింది చేస్కోండి’ అంటూ తన బంగ్లాలోకి వెళ్లిపోయారని చెబుతున్నారు. ఈ పరిణామంతో కోపోద్రిక్తులైన ప్రజాప్రతినిధులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో ఏఎస్పీ ఎన్.చంద్రశేఖర్ ఆ ఘటనపై విచారణ నిర్వహించి ఉన్నతాధికారులకు నివేదిక పంపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో నాయకులు శాంతించారు. అయితే, ఈ వివాదం అక్కడితో ఆగిపోలేదు. సంచలనం కలిగించిన.. పెదఅవుటపల్లి వద్ద ముగ్గురి హత్యలకు కారణమైన భూతం దుర్గారావు హత్య కేసులో డీఎస్పీ నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలున్నాయి. తాజాగా డీఎస్పీ పరిధిలో పనిచేస్తున్న వన్‌టౌన్ సీఐ మురళీకృష్ణ పెదఅవుటపల్లి వద్ద హత్య కేసుల విషయంలో విచారణ ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో డీఎస్పీ సత్తిబాబును కనీస ప్రాధాన్యం లేని కంప్యూటర్ సర్వీసెస్‌కు బదిలీ చేశారని తెలుస్తోంది.
సరితకు గ్రేహౌండ్స్‌లో అనుభవం
ఏలూరు నూతన డీఎస్పీగా నియమితులైన కేజీవీ సరిత కృష్ణా జిల్లా విజయవాడకు చెందినవారు. 2010లో గ్రూప్ -1 ద్వారా ఆమె ఎంపికయ్యారు. శిక్షణ అనంతరం బోధన్‌లో డీఎస్పీగా విధులు చేపట్టారు. అనంతరం వరంగల్ జిల్లా నర్సంపేట, గ్రేహౌండ్స్‌లో పనిచేశారు. గత సంవత్సరమే పెదవేగిలోని జిల్లా పోలీసు శిక్షణ కేంద్రంలో డీఎస్పీగా చేరారు.
నేరాల అదుపునకు కృషి
ఏలూరు పరిధిలో నేరాలకు అడ్డుకట్ట వేయడానికి తనవంతు కృషి చేస్తానని నూతన డీఎస్పీ సరిత ‘సాక్షి’తో అన్నారు. ప్రజాప్రతినిధులతో నిబంధనల ప్రకారం నడుచుకుంటానని, ప్రజలతో సత్సంబంధాలు ఏర్పరచుకుంటానని ఆమె చెప్పారు. నేరస్తుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తానని, నిష్పక్షపాతంగా విధులు నిర్వర్తిస్తానని అన్నారు.