ఉద్యోగ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచే ఆరోపణలు మొదలయ్యాయి. చివరికి ఆ ఆరోపణలే ఆయన్ను సాగనంపేలా చేశాయి. ప్రభుత్వ అధికారులకు బదిలీలనేవి సహజం. కానీ కొద్ది నెలలకే బదిలీ కావడం జిల్లాలో చర్చానీయాంశమైంది. పాలనాపరమైన కార్యక్రమాల్లో చొరవ చూపకుండా, హత్యకు సంబంధించిన కేసులో, ఇసుక, సివిల్ వ్యవహారాల్లో డబ్బులు అడిగినట్లు సమాచారం.
వికారాబాద్ : పరిగి డీఎస్పీ అశ్ఫక్ బదిలీ అయ్యాడు. సిరిసిల్ల జిల్లా 17వ బెటాలియన్ డీఎస్పీగా ఆయనను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అశ్ఫక్ పరిగి డీఎస్పీగా బాధ్యతలు చేపట్టి 10 నెలలకే ఆయన బదిలీ చేసింది. ఆయన గడువులోపే బదిలీ అయిన నేపథ్య ంలో బదిలీపై పలు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. జిల్లాల పునర్విభజనలో భాగంగా పరిగిలో 2016 అక్టోబర్‌లో పోలీస్ సబ్ డివిజన్ ఏర్పాటు అయ్యింది. మొదటి డీఎస్పీగా చేవెళ్ల డీఎస్పీ శృతకీర్తికి పరిగి బాధ్యతలు చేపట్టారు. ఆ వెంటనే నెలలోపే చేవెళ్లలో ఏసీపీ కార్యాలయం ప్రారంభమవడంతో అక్కడికే ఆమె ఏసీపీగా వెళ్లింది. దీంతో పరిగిలో డీఎస్పీ పోస్టు నెల తిరక్కుండానే ఖాళీ అయ్యింది. అనంతరం రెండు నెలల పాటు పరిగి సబ్ డివిజన్ కార్యాలయంలో డీఎస్పీ కుర్చీ ఖాళీగానే ఉండగా వికారాబాద్ పోలీస్ శిక్షణా కేంద్రం డీఎస్పీలు ఇన్‌చార్జిలుగా కొనసాగారు. కాగా డిసెంబర్‌లో అశ్ఫక్‌కు పరిగి డీఎస్పీగా పోస్టు ఇవ్వడంతో ఆయన బాధ్యతలు చేపట్టారు.
తొలి నుంచి ఆరోపణల పర్వం
పరిగి డీఎస్పీగా అశ్ఫక్ బాధ్యతలు చేపట్టిన మొదలు వివిధ ఆరోపణలు ఎదుర్కొంటూ వచ్చారు. డబ్బుల కోసం ఎస్‌ఐలను పీడించారని, సీఐలతో పొసగడం లేదని.. ఐనాపూర్ హత్య కేసులో సంబంధం లేని దోమ, పరిగి ఎస్‌ఐలపై వేటు వేయించేందుకు లోపాయికారిగా వ్యవహరించారని, ఇసుక, సివిల్ విషయాల్లో డబ్బుల వసూళ్లకు పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటూ వచ్చారు. ఇదే సమయంలో బాధ్యతలు నిర్వహించిన 10 నెలల్లో ఏ రోజు కూడా ఆయన లా అండ్ ఆర్డర్ విషయంలో దృష్టి సారించినట్లు కనిపించలేదు. ఈ నేపథ్యంలోనే ఆయన పదవీ కాలం పూర్తి కాకుండానే బాధ్యతలు చేపట్టిన 10 నెలల్లోనే బదిలీ అయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆయన పనితీరుపై ఉన్నతాధికారుల్లో ఉన్న అసంతృప్తి కూడా బదిలీకి కారణమని పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి.
పరిగి నూతన డీఎస్పీగా శ్రీనివాస్
అతడి బదిలీతో గొల్ల శ్రీనివాస్‌కు పరిగి డీఎస్పీగా పోస్టింగ్ ఇచ్చారు. ఇప్పటివరకు హైదరాబాద్ పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో ఇన్‌స్పెక్టర్ ర్యాంకులో విధులు నిర్వహించిన శ్రీనివాస్ పదోన్నతిపై పరిగి రానున్నారు. ఆయనకు డీఎస్పీగా పరిగి మొదటి పోస్టింగ్ కావడం గమనార్హం. పరిగికి పదోన్నతిపై రానున్న డీఎస్పీ శ్రీనివాస్ స్వస్థలం కూడా వికారాబాద్‌లోని గంగారం కాలనీ. 1991లో ఆర్‌ఎస్‌ఐగా శాఖలో చేరిన ఆయన 2000లో సివిల్‌లోకి మారారు. కాగా 2006 నుంచి ఇన్‌స్పెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ వచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment