ఏలూరు : జిల్లాలో మూడేళ్లు పైబడి ఒకేచోట పనిచేస్తున్న ఉద్యోగులను బదిలీ చేసే ప్రక్రియ ప్రారంభమైంది. కలెక్టరేట్‌లో శుక్రవారం ఉదయం నుంచి 58 ప్రభుత్వ శాఖలకు సంబంధించి ఉద్యోగులను బదిలీ చేసే విషయంపై ఆయా శాఖల అధికారులతో కలెక్టర్ కె.భాస్కర్ చర్చించారు. ప్రతి శాఖలో జిల్లా స్థాయి అధికారి పరిధిలో ఉండే ఉద్యోగుల వివరాలను నివేదికల రూపంలో రప్పించుకుని అక్కడికక్కడే పరిశీలిస్తు న్నారు. మూడేళ్లకు మించి ఒకేచోట పనిచేసిన వారి బదిలీకి నిర్ణయం తీసుకున్నారు.
కొన్ని ప్రభుత్వ శాఖల్లో ఆఫీస్ సబార్డినేట్ స్థాయి వరకే బదిలీ చేసే అధికారం జిల్లా అధికారికి ఉన్నప్పటికీ ఆ శాఖలో జిల్లా పరిధిలో వివిధ కేడర్లలో ఉండే ఉద్యోగులను బదిలీ చేసే అధికారం జిల్లా కలెక్టర్‌కు ప్రభుత్వం అప్పగించడంతో కలెక్టర్ ఆయా శాఖల అధికారుల సమక్షంలో బదిలీ ప్రక్రియ నిర్వహించారు. జిల్లాలో రెవెన్యూ, జెడ్పీ, జిల్లా పంచాయతీ శాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ, పశుసంవర్ధక శాఖల ఉద్యోగుల్లో ఎక్కువ మందికి బదిలీలు ఉండడంతో ఆయా శాఖల అధికారులు రెండు రోజుల నుంచి ఉద్యోగులను పిలిచి కౌన్సెలింగ్ ద్వారా ఆప్షన్లు స్వీకరించారు.
ఉదయం 9.30 గంటల నుంచి ఈ బదిలీల ప్రక్రియ ప్రారంభమైంది. అక్కడికక్కడే ఆయా ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన నివేదికను సిద్ధం చేయడానికి కలెక్టరేట్‌లో 16 కంప్యూటర్లతో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. బదిలీకి అవకాశమున్న వారందరి పేర్లను సిఫారసు చేస్తూ నివేదికలను సిద్ధం చేశారు. ఈ నివేదికలపై జిల్లా ఇన్‌చార్జి మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు తుది నిర్ణయం తీసుకుంటున్నారు. అదనపు జేసీ ఎండీ షరీఫ్, కలెక్టరేట్ పరిపాలనాధికారి కె.సుబ్బారావు, ఆయా శాఖల అధికారులు ఈ బదిలీ ప్రక్రియలో పాల్గొన్నారు.
బదిలీలకు తెరలేచింది
Published Sat, May 30 2015 1:15 AM | Last Updated on Sun, Sep 3 2017 2:54 AM
Advertisement
Advertisement