ఒంగోలు ఒన్‌టౌన్, న్యూస్‌లైన్: ఏపీ ఎన్‌జీఓ సంఘ రాష్ట్ర అధ్యక్ష పదవికి ఎన్‌జీఓ సంఘ జిల్లా అధ్యక్షుడు, జేఏసీ చైర్మన్ షేక్ అబ్దుల్ బషీర్ ఆదివారం నామినేషన్‌ను దాఖలు చేశారు. సంఘ ఉపాధ్యక్ష పదవికి కనిగిరికి చెందిన శివరామిరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఎన్‌జీఓ సంఘ రాష్ట్ర నూతన కార్యవర్గ ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి. సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ఉద్దేశపూర్వకంగా నీరుగార్చిన ఎన్‌జీఓ సంఘ ప్రస్తుత అధ్యక్షుడు పర్చూరు అశోక్‌బాబును ఎన్నికల్లో ఓడించేందుకు ఆయన వ్యతిరేక వర్గమంతా ఏకమై ఉమ్మడి వ్యూహంతో ఎన్నికల బరిలోకి దిగింది.
జిల్లాకు చెందిన పలువురు నాయకులు నామినేషన్ సందర్భంగా బషీర్‌కు సంఘీభావం తెలిపారు. ఎన్‌జీఓ సంఘ జిల్లా కార్యదర్శి బండి శ్రీనివాసరావు, జిల్లా కోశాధికారి పి.రాజ్యలక్ష్మి, జిల్లా ఉపాధ్యక్షుడు ఆర్‌సీహెచ్ కృష్ణారెడ్డి, ఎ.స్వాములు, ఒంగోలు తాలూకా అధ్యక్షుడు నాసర్ మస్తాన్‌వలి, కార్యదర్శి ప్రకాష్, డిజె ప్రసాద్, వీరనారాయణ, శోభన్‌బాబు, బడే మీరావలి, జిల్లాకు చెందిన మరో 150 మంది ఎన్‌జీఓలు బషీర్ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
పోటీ ఎందుకంటే...
తాను అధ్యక్ష పదవికి ఎందుకు పోటీచేయాల్సి వచ్చిందో బషీర్ ‘న్యూస్‌లైన్’కు వివరించారు. సమైక్యాంధ్ర ఉద్యమం ముసుగులో ఏపీ ఎన్‌జీఓ సంఘ ఎన్నికల్లో గెలుపొందేందుకు అశోక్‌బాబు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. రాజకీయ నాయకుల కనుసన్నల్లో మెలుగుతూ వారి ఆదేశానుసారం ఉద్యమాన్ని తన స్వార్థం కోసం వాడుకున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు చివరి వరకు పోరాడతామని బీరాలు పలికిన అశోక్‌బాబు మధ్యలోనే కాడి కిందేశారని విమర్శించారు. బిల్లు అసెంబ్లీకి వస్తే మెరుపు సమ్మె చేస్తామని ప్రగల్బాలు పలికిన ఆయన బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టినా..సమ్మె ఊసే ఎత్తలేదన్నారు. రాష్ట్ర విభజనకు మూల కారకులైన దిగ్విజయ్‌సింగ్ రాష్ట్రానికి వస్తే అడ్డుకుంటామని హెచ్చరించిన అశోక్‌బాబు అసలు ఆ విషయాన్ని మరిచిపోయారని ఆక్షేపించారు. సమైక్యాంధ్ర నినాదంతో ముందుకొచ్చే పార్టీలను కలుపుకొని ఉద్యమించాలని తామెంతగా చెప్పినా పట్టించుకోలేదని బషీర్ వెల్లడించారు.
చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న చందంగా ఇప్పుడు రాజకీయ పార్టీలతో కలిసి పనిచేయాలని అశోక్‌బాబు చెప్తుండటం సందేహాలకు తావిస్తోందన్నారు. ఎన్నికల సమయానికి రాష్ట్ర విభజనకు పూర్తిస్థాయిలో సహకరిస్తున్న రాజకీయ పార్టీలతో అఖిలపక్ష సమావేశం నిర్వహించడం దేనికి సంకేతమని ఆయన ప్రశ్నించారు. తాము మాత్రం చివరి క్షణం వరకు సమైక్యాంధ్ర కోసం పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.
ఉద్యోగుల సమస్యల ఊసేదీ...
అశోక్‌బాబు ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని బషీర్ ధ్వజమెత్తారు. ఉద్యోగులు ఇప్పటికే రెండున్నర పీఆర్‌సీలు కోల్పోయారని, పదో పీఆర్‌సీ ఈ ఏడాది జూలై 1 నుంచి అమలులోకి రావాల్సి ఉండగా ఇప్పటి వరకు ఆ ఊసేలేదన్నారు.
ఉద్యోగులంతా కనీసం తాత్కాలిక భృతి (ఐఆర్) వర్తిస్తుందని ఆశించినా..ఆ విషయంలో ప్రభుత్వ స్థాయిలో పట్టుబట్టిన దాఖలాల్లేవన్నారు. ఉద్యోగుల హెల్త్‌కార్డుల విషయంలో ఇప్పటికీ అనిశ్చితి కొనసాగుతోందని చెప్పారు. ఎన్నికల్లో అక్రమంగానైనా గెలుపొందేందుకు అశోక్‌బాబు ప్రయత్నిస్తున్నారని బషీర్ దుయ్యబట్టారు. సంఘంలో మొత్తం 866 మంది ఓటర్లుండగా, వీరిలో 33 మంది పేర్లు రిపీట్ అయ్యాయని వెల్లడించారు.
విచ్చలవిడిగా డబ్బు వెదజల్లైనా గెలుపొందేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. ఎవరెన్ని ప్రలోభాలకు గురి చేసినా నిజాయితీపరులైన ఎన్‌జీఓలు సమైక్యాంధ్రకు కట్టుబడిన వారిని ఎన్నికల్లో గెలిపిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ఎన్‌జీఓ అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేసిన బషీర్
Published Mon, Dec 23 2013 2:08 AM | Last Updated on Wed, Oct 17 2018 5:10 PM
Advertisement
Advertisement