sheik abdul bashir
-
సీఎం దృష్టికి జిల్లా గజిటెడ్ అధికారుల సమస్యలు
ఒంగోలు టూటౌన్ : జిల్లా గజిటెడ్ అధికారుల అసోసియేషన్ సమస్యలను ఈ నెల 12న సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లనున్నట్లు అసోసియేషన్ జిల్లా చైర్మన్ షేక్ అబ్దుల్ బషీర్ చెప్పారు. అసోసియేషన్ స్థానిక కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గజిటెడ్ అధికారుల సంఘం ఆవశ్యకత, అధికారులు ఎదుర్కొంటున్న సమస్యలను ఈ నెల 12న విజయవాడలోని లయోల కళాశాలలో సీఎంను కలిసి వివరించనున్నట్లు తెలిపారు. అనంతరం జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో సీఎంను సన్మానిస్తామన్నారు. సంఘ కన్వీనర్ వీజీకే ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర జేఏసీ నాయకులు అశోక్‌బాబు నాయకత్వంలో విజయవాడలో జరిగే సమావేశానికి అందరూ హాజరు కావాలని కోరారు. రాష్ట్రాభివృద్ధి విషయంలో ఉద్యోగులందరూ తమ సేవలందించే విషయంలో ముందుంటారని సంఘ కో-చైర్మన్ కె.రాజ్ కుమార్ తెలిపారు. సంఘం రాష్ర్ట ఉపాధ్యక్షుడుప్రసాద్కు ఘన సన్మానం రాష్ర్ట గజిటెడ్ అధికారుల సంఘ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన వీజీకే ప్రసాద్‌ను అసోసియేషన్ నాయకులు సన్మానించారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు కే రాజ్‌కుమార్, జీఆర్ రాజశేఖర్, డాక్టర్ వెంకయ్య, కే కృపారావు, వై ధనలక్ష్మి, హసీనాబేగం, చిత్తరంజన్ శర్మ, సీహెచ్ పద్మజ, వై వెంకట్రావు, సీఐ వెలమూరి శ్రీరామ్, డాక్టర్ వెంకటసుబ్బయ్య, కే నాగేశ్వరరావు, సిటీ యూనిట్ ప్రతినిధులు ప్రసాద్, పున్నారావు, కృష్ణారావు పాల్గొన్నారు. -
సమ్మె కాలాన్ని స్పెషల్ క్యాజువల్ లీవ్‌గా ప్రకటించండి
ఒంగోలు, న్యూస్‌లైన్: సీఎం కిరన్‌కుమార్‌రెడ్డి సమైక్యవాదే అయితే సమైక్యపోరాటంలో ఉద్యోగులు పాల్గొన్న కాలాన్ని స్పెషల్ క్యాజువల్ లీవుగా తక్షణమే ప్రకటించి సమైక్యవాది అని నిరూపించుకోవాలని ఏపీఎన్జీవో సంఘ జిల్లా అధ్యక్షుడు షేక్ అబ్దుల్ బషీర్ పిలుపునిచ్చారు. స్థానిక ఎన్జీవో భవనంలో బుధవారం సాయంత్రం విలేకరుల సమావేశం నిర్వహించి ఆయన మాట్లాడుతూ సమైక్యవాదానికి కట్టుబడి ఉన్నవారికి తమ మద్దతు నిత్యం ఉంటుందన్నారు. తమ రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌బాబు ఇచ్చిన పిలుపునకు స్పందించి జిల్లాలో కూడా సమైక్య పోరాటాలు కొనసాగిస్తామన్నారు. ఈనెల 10వ తేదీ హైదరాబాదులో నిర్వహించే సమైక్య సదస్సుకు జిల్లా వ్యాప్తంగా ఉద్యోగులు కదులుతున్నట్లు తెలిపారు. ఐఆర్ ఇస్తే సరికాదని, పీఆర్సీని, హెల్త్ కార్డుల విషయంలో పెడుతున్న ఇబ్బందులను కూడా సీఎం పరిష్కరించాలన్నారు. త్వరలోనే రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌బాబు రాజకీయ జేఏసీని కూడా ఏర్పాటు చేయనున్నారని పేర్కొన్నారు. అన్ని రాజకీయ పార్టీలు సమైక్య ఎజెండాతో రాజకీయ జేఏసీలోకి రావాలన్నారు. తమ రాష్ట్ర అధ్యక్షుడు పిలుపు ఇస్తే ఈనెల 16 వ తేదీలోపు చలో అసెంబ్లీకి సైతం సిద్ధమని ప్రకటించారు. జిల్లా కార్యదర్శి బండి శ్రీనివాసరావు మాట్లాడుతూ సమైక్యాంధ్ర చాంపియన్ అని సీఎం ప్రకటించుకుంటే సరిపోదని, బచావత్ ట్రిబ్యునల్ వల్ల జరిగిన నష్టంతోపాటు అన్ని విషయాలపైనా సుదీర్ఘ చర్చ జరగాలని, టీనోట్‌ను ఏవిధంగా అయితే రాష్ట్రానికి కేంద్రం పంపిందో...అదే విధంగా తిప్పి కొట్టాలని పేర్కొన్నారు. ఇటీవల జరిగిన ఎన్జీవో సంఘ ఎన్నికల్లో ఓటమిని తాము క్రీడాస్ఫూర్తిగా తీసుకుంటున్నామని, అశోక్‌బాబు నిర్ణయాలను తప్పకుండా అమలు చేస్తామని ప్రకటించారు. కాంట్రాక్టు, కంటింజెంట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. రెవెన్యూ ఉద్యోగుల సంఘ జిల్లా అధ్యక్షుడు కేఎల్ నరశింహారావు , ఎన్జీవో సంఘ నాయకులు శరత్‌బాబు, స్వాములు, మాలకొండయ్య, శ్రీనివాసరావు, చెంచయ్య, ప్రసన్నాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. -
గెలుపు మాదే: బషీర్
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పెద్దల అండదండలున్నా సరే అశోక్‌బాబు ప్యానెల్‌పై తమ ప్యానెల్ ఘన విజయం సాధిస్తుందని ఏపీఎన్జీవోల సంఘం రాష్ట్ర అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న షేక్ అబ్దుల్ బషీర్ ధీమా వ్యక్తం చేశారు. ఏపీ ఎన్జీవో భవన్లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. సమ్మె విరమణ సందర్భంగా అశోక్‌బాబు వ్యవహరించిన తీరుపై ఉద్యోగులు ఆగ్రహంగా ఉన్నారని, మొదటి నుంచి ప్రభుత్వ పెద్దల రూట్‌మ్యాప్‌కు అనుగుణంగానే అశోక్‌బాబు నిర్ణయాలు చోటుచేసుకున్నాయని చెప్పారు. అయినప్పటికీ ఏపీఎన్జీవోల సహకారంతో తమ ప్యానెట్ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తమ ప్యానెల్ మెజారిటీ ఓట్లను కైవసం చేసుకోనుందన్నారు. మంచి నాయకత్వం కోసం ఎదురు చూస్తున్న ఉద్యోగ సంఘాల ప్రతిని ధులు ఎన్నికల్లో తమకు ఓట్లు వేసి గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం కార్యవర్గంలో నాయకత్వ లోపం కారణంగా ఉద్యోగుల డిమాండ్ల పరిష్కారం నత్తనడకన సాగుతోందని బషీర్ విమర్శించారు. గత ఏడాది జూలై 1 నుంచి ఐఆర్‌ను వర్తింపజేయాల్సి ఉన్నా, ఉద్యోగుల పట్ల ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని ఆరోపించారు. 66 రోజుల సమ్మె కాలాన్ని క్రమబద్ధీకరించే విషయంలో ప్రభుత్వం దాటవేత ధోరణి అవలంబిస్తోందన్నారు. తమ ప్యానెల్ గెలిస్తే, ప్రభుత్వంతో రాజీలేని ధోరణి అవలంబించి, ఉద్యోగులకు భరోసా కల్పిస్తామని హామీ ఇచ్చారు. స్నేహపూర్వక వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చర్యలు చేపట్టాలని ఎన్నికల అధికారులకు విన్నవించామని బషీర్ తెలిపారు. ఉద్యమాన్ని నీరు గార్చారు: ఉవ్వెత్తున ఎగసిన సమైక్య ఉద్యమాన్ని నీరు గార్చిన కారణంగా ఏపీఎన్జీవోలంతా నాయకత్వ మార్పు కోరుకుంటున్నారని ప్రధాన కార్యదర్శి అభ్యర్థి పీవీవీ సత్యనారాయణ పరోక్షంగా అశోక్‌బాబుపై విమర్శలు గుప్పించారు. ఏకపక్ష నిర్ణయాల వల్లే తెలంగాణ బిల్లు అసెంబ్లీ వరకు వచ్చిందన్నారు. అనుకోని విధంగా ఎన్నికలకు వెళ్లాల్సి రావడంతో 35 శాతం రావాల్సిన ఐఆర్ 27 శాతానికి పరిమతం చేశారని చెప్పారు. ఆమ్ ఆద్మీ పార్టీ తరహాలో రూపాయి చేతిలో లేకున్నా ఉద్యోగుల కోరిక మేరకు తమ ప్యానెల్ బరిలో నిలిచిందన్నారు. వాస్తవాలు చెప్పి ఉద్యోగులను ఓట్లడిగామని, అన్ని జిల్లాల నుంచి తమకు మంచి స్పందన లభించిందని చెప్పారు. -
ఏ పార్టీతోనూ సంబంధంలేదు
ఏపీఎన్జీవోల సంఘం అధ్యక్ష అభ్యర్థి షేక్ అబ్దుల్ బషీర్ హైదరాబాద్, న్యూస్‌లైన్: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు రెండు నెలల పాటు సమ్మెలో పాల్గొన్న సీమాంధ్ర ఉద్యోగులను ఆ తరువాత ఎలాంటి ఉద్యమానికి సిద్ధం చేయలేదని ఏపీఎన్జీవోల సంఘ అధ్యక్షుడిగా పోటీ చేస్తున్న షేక్ అబ్దుల్ బషీర్ పేర్కొన్నారు. దీంతో ఉద్యోగులు, ప్రజలలో ఉద్యమ స్ఫూర్తి తగ్గుతుందన్నారు. సోమవారమిక్కడ గన్‌ఫౌండ్రీలోని ఏపీఎన్జీవోల కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంట్రాక్టు ఉద్యోగులుగా విధులు నిర్వర్తిస్తున్న వారిని వెంటనే రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. జనవరి 5న ఏపీ ఎన్జీవోల సంఘం ఎన్నికలు ముగిసిన తరువాత 6 నుంచి తమ ప్యానెల్ ఆధ్వర్యంలో ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం కార్యాచరణ రూపొందిస్తామన్నారు. తమ ప్యానెల్‌కు ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదని ప్రకటించారు. ఇటీవల ఏపీఎన్జీవోలు నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి సమైక్యం కోసం పాటుపడుతున్న రాజకీయ పార్టీలను పిలవకుండా విభజనకు అనుకూలంగా లేఖలు ఇచ్చిన వారిని ఆహ్వానించటం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. సీమాంధ్ర ఉద్యోగులు ఎన్నికల్లో రాష్ట్ర సమైక్య పరిరక్షణ కోసం పాటుపడే వారిని ఎన్నుకోవాలని సూచించారు. ప్రలోభాలకు గురికాకుండా ఓట్లు వేయాలని కోరారు. ఏపీఎన్జీవోల సంఘ ప్రధాన కార్యదర్శిగా పోటీ చేస్తున్న పీవీవీ సత్యనారాయణ మాట్లాడుతూ కొందరు సమైక్యాంధ్ర ఉద్యమంతో వచ్చిన చరిష్మాను ఉపయోగించుకుని ఈ ఎన్నికల్లో నెగ్గాలని ప్రయత్నిస్తున్నారన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమం జరుగుతున్న సమయంలో ఎన్నికల నిర్వహణను అన్ని జిల్లాల ఉద్యోగులు వ్యతిరేకించినా ఎన్నికలు నిర్వహించడం దారుణమన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమం కొనసాగాలంటే నాయకత్వంలో మార్పులు రావాలని సూచించారు. ప్రతి మూడేళ్లకు ఓసారి జరిగే సంఘం ఎన్నికలను ఈసారి కొన్ని మీడియా వర్గాలు పెద్దవిగా చేసి చూపడం బాధాకరమన్నారు. పులివెందుల ప్రాంతంలో తమ ప్యానెల్‌కు మద్దతులేదనడం వారి అవివేకమని చెప్పారు. అన్ని జిల్లాలలో తమ ప్యానెల్ అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలుపొందుతారన్నారు. బషీర్ ప్యానెల్ నుంచి వసంతరావు ఉపసంహరణ ఎన్నికల బరిలో బషీర్ ప్యానెల్ నుంచి నామినేషన్ వేసిన వసంతరావు సోమవారం అనూహ్యంగా తన నామినేషన్ ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు. ఈసారి ప్రతి ష్టాత్మకంగా జరుగుతున్న ఎన్నికల్లో ఓటమి భయంతోనే అశోక్‌బాబు ప్యానెల్‌కు చెందిన సభ్యులే వసంతరావును భయపెట్టి నామినేషన్ ఉపసంహరించుకునేలా చేశారని బషీర్ ఆరోపించారు. -
ఎన్జీఓ అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేసిన బషీర్
ఒంగోలు ఒన్‌టౌన్, న్యూస్‌లైన్: ఏపీ ఎన్జీఓ సంఘ రాష్ట్ర అధ్యక్ష పదవికి ఎన్జీఓ సంఘ జిల్లా అధ్యక్షుడు, జేఏసీ చైర్మన్ షేక్ అబ్దుల్ బషీర్ ఆదివారం నామినేషన్‌ను దాఖలు చేశారు. సంఘ ఉపాధ్యక్ష పదవికి కనిగిరికి చెందిన శివరామిరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఎన్జీఓ సంఘ రాష్ట్ర నూతన కార్యవర్గ ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి. సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ఉద్దేశపూర్వకంగా నీరుగార్చిన ఎన్జీఓ సంఘ ప్రస్తుత అధ్యక్షుడు పర్చూరు అశోక్‌బాబును ఎన్నికల్లో ఓడించేందుకు ఆయన వ్యతిరేక వర్గమంతా ఏకమై ఉమ్మడి వ్యూహంతో ఎన్నికల బరిలోకి దిగింది. జిల్లాకు చెందిన పలువురు నాయకులు నామినేషన్ సందర్భంగా బషీర్‌కు సంఘీభావం తెలిపారు. ఎన్జీఓ సంఘ జిల్లా కార్యదర్శి బండి శ్రీనివాసరావు, జిల్లా కోశాధికారి పి.రాజ్యలక్ష్మి, జిల్లా ఉపాధ్యక్షుడు ఆర్సీహెచ్ కృష్ణారెడ్డి, ఎ.స్వాములు, ఒంగోలు తాలూకా అధ్యక్షుడు నాసర్ మస్తాన్‌వలి, కార్యదర్శి ప్రకాష్, డిజె ప్రసాద్, వీరనారాయణ, శోభన్‌బాబు, బడే మీరావలి, జిల్లాకు చెందిన మరో 150 మంది ఎన్జీఓలు బషీర్ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. పోటీ ఎందుకంటే... తాను అధ్యక్ష పదవికి ఎందుకు పోటీచేయాల్సి వచ్చిందో బషీర్ ‘న్యూస్‌లైన్’కు వివరించారు. సమైక్యాంధ్ర ఉద్యమం ముసుగులో ఏపీ ఎన్జీఓ సంఘ ఎన్నికల్లో గెలుపొందేందుకు అశోక్‌బాబు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. రాజకీయ నాయకుల కనుసన్నల్లో మెలుగుతూ వారి ఆదేశానుసారం ఉద్యమాన్ని తన స్వార్థం కోసం వాడుకున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు చివరి వరకు పోరాడతామని బీరాలు పలికిన అశోక్‌బాబు మధ్యలోనే కాడి కిందేశారని విమర్శించారు. బిల్లు అసెంబ్లీకి వస్తే మెరుపు సమ్మె చేస్తామని ప్రగల్బాలు పలికిన ఆయన బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టినా..సమ్మె ఊసే ఎత్తలేదన్నారు. రాష్ట్ర విభజనకు మూల కారకులైన దిగ్విజయ్‌సింగ్ రాష్ట్రానికి వస్తే అడ్డుకుంటామని హెచ్చరించిన అశోక్‌బాబు అసలు ఆ విషయాన్ని మరిచిపోయారని ఆక్షేపించారు. సమైక్యాంధ్ర నినాదంతో ముందుకొచ్చే పార్టీలను కలుపుకొని ఉద్యమించాలని తామెంతగా చెప్పినా పట్టించుకోలేదని బషీర్ వెల్లడించారు. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న చందంగా ఇప్పుడు రాజకీయ పార్టీలతో కలిసి పనిచేయాలని అశోక్‌బాబు చెప్తుండటం సందేహాలకు తావిస్తోందన్నారు. ఎన్నికల సమయానికి రాష్ట్ర విభజనకు పూర్తిస్థాయిలో సహకరిస్తున్న రాజకీయ పార్టీలతో అఖిలపక్ష సమావేశం నిర్వహించడం దేనికి సంకేతమని ఆయన ప్రశ్నించారు. తాము మాత్రం చివరి క్షణం వరకు సమైక్యాంధ్ర కోసం పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఉద్యోగుల సమస్యల ఊసేదీ... అశోక్‌బాబు ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని బషీర్ ధ్వజమెత్తారు. ఉద్యోగులు ఇప్పటికే రెండున్నర పీఆర్సీలు కోల్పోయారని, పదో పీఆర్సీ ఈ ఏడాది జూలై 1 నుంచి అమలులోకి రావాల్సి ఉండగా ఇప్పటి వరకు ఆ ఊసేలేదన్నారు. ఉద్యోగులంతా కనీసం తాత్కాలిక భృతి (ఐఆర్) వర్తిస్తుందని ఆశించినా..ఆ విషయంలో ప్రభుత్వ స్థాయిలో పట్టుబట్టిన దాఖలాల్లేవన్నారు. ఉద్యోగుల హెల్త్‌కార్డుల విషయంలో ఇప్పటికీ అనిశ్చితి కొనసాగుతోందని చెప్పారు. ఎన్నికల్లో అక్రమంగానైనా గెలుపొందేందుకు అశోక్‌బాబు ప్రయత్నిస్తున్నారని బషీర్ దుయ్యబట్టారు. సంఘంలో మొత్తం 866 మంది ఓటర్లుండగా, వీరిలో 33 మంది పేర్లు రిపీట్ అయ్యాయని వెల్లడించారు. విచ్చలవిడిగా డబ్బు వెదజల్లైనా గెలుపొందేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. ఎవరెన్ని ప్రలోభాలకు గురి చేసినా నిజాయితీపరులైన ఎన్జీఓలు సమైక్యాంధ్రకు కట్టుబడిన వారిని ఎన్నికల్లో గెలిపిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.