ఏ పార్టీతోనూ సంబంధంలేదు
ఏపీఎన్జీవోల సంఘం అధ్యక్ష అభ్యర్థి షేక్ అబ్దుల్ బషీర్
హైదరాబాద్, న్యూస్‌లైన్: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు రెండు నెలల పాటు సమ్మెలో పాల్గొన్న సీమాంధ్ర ఉద్యోగులను ఆ తరువాత ఎలాంటి ఉద్యమానికి సిద్ధం చేయలేదని ఏపీఎన్జీవోల సంఘ అధ్యక్షుడిగా పోటీ చేస్తున్న షేక్ అబ్దుల్ బషీర్ పేర్కొన్నారు. దీంతో ఉద్యోగులు, ప్రజలలో ఉద్యమ స్ఫూర్తి తగ్గుతుందన్నారు. సోమవారమిక్కడ గన్‌ఫౌండ్రీలోని ఏపీఎన్జీవోల కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంట్రాక్టు ఉద్యోగులుగా విధులు నిర్వర్తిస్తున్న వారిని వెంటనే రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. జనవరి 5న ఏపీ ఎన్జీవోల సంఘం ఎన్నికలు ముగిసిన తరువాత 6 నుంచి తమ ప్యానెల్ ఆధ్వర్యంలో ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం కార్యాచరణ రూపొందిస్తామన్నారు. తమ ప్యానెల్‌కు ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదని ప్రకటించారు. ఇటీవల ఏపీఎన్జీవోలు నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి సమైక్యం కోసం పాటుపడుతున్న రాజకీయ పార్టీలను పిలవకుండా విభజనకు అనుకూలంగా లేఖలు ఇచ్చిన వారిని ఆహ్వానించటం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు.
సీమాంధ్ర ఉద్యోగులు ఎన్నికల్లో రాష్ట్ర సమైక్య పరిరక్షణ కోసం పాటుపడే వారిని ఎన్నుకోవాలని సూచించారు. ప్రలోభాలకు గురికాకుండా ఓట్లు వేయాలని కోరారు. ఏపీఎన్జీవోల సంఘ ప్రధాన కార్యదర్శిగా పోటీ చేస్తున్న పీవీవీ సత్యనారాయణ మాట్లాడుతూ కొందరు సమైక్యాంధ్ర ఉద్యమంతో వచ్చిన చరిష్మాను ఉపయోగించుకుని ఈ ఎన్నికల్లో నెగ్గాలని ప్రయత్నిస్తున్నారన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమం జరుగుతున్న సమయంలో ఎన్నికల నిర్వహణను అన్ని జిల్లాల ఉద్యోగులు వ్యతిరేకించినా ఎన్నికలు నిర్వహించడం దారుణమన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమం కొనసాగాలంటే నాయకత్వంలో మార్పులు రావాలని సూచించారు. ప్రతి మూడేళ్లకు ఓసారి జరిగే సంఘం ఎన్నికలను ఈసారి కొన్ని మీడియా వర్గాలు పెద్దవిగా చేసి చూపడం బాధాకరమన్నారు. పులివెందుల ప్రాంతంలో తమ ప్యానెల్‌కు మద్దతులేదనడం వారి అవివేకమని చెప్పారు. అన్ని జిల్లాలలో తమ ప్యానెల్ అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలుపొందుతారన్నారు.
బషీర్ ప్యానెల్ నుంచి వసంతరావు ఉపసంహరణ
ఎన్నికల బరిలో బషీర్ ప్యానెల్ నుంచి నామినేషన్ వేసిన వసంతరావు సోమవారం అనూహ్యంగా తన నామినేషన్ ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు. ఈసారి ప్రతి ష్టాత్మకంగా జరుగుతున్న ఎన్నికల్లో ఓటమి భయంతోనే అశోక్‌బాబు ప్యానెల్‌కు చెందిన సభ్యులే వసంతరావును భయపెట్టి నామినేషన్ ఉపసంహరించుకునేలా చేశారని బషీర్ ఆరోపించారు.