గెలుపు మాదే: బషీర్
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పెద్దల అండదండలున్నా సరే అశోక్‌బాబు ప్యానెల్‌పై తమ ప్యానెల్ ఘన విజయం సాధిస్తుందని ఏపీఎన్జీవోల సంఘం రాష్ట్ర అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న షేక్ అబ్దుల్ బషీర్ ధీమా వ్యక్తం చేశారు. ఏపీ ఎన్జీవో భవన్‌లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. సమ్మె విరమణ సందర్భంగా అశోక్‌బాబు వ్యవహరించిన తీరుపై ఉద్యోగులు ఆగ్రహంగా ఉన్నారని, మొదటి నుంచి ప్రభుత్వ పెద్దల రూట్‌మ్యాప్‌కు అనుగుణంగానే అశోక్‌బాబు నిర్ణయాలు చోటుచేసుకున్నాయని చెప్పారు. అయినప్పటికీ ఏపీఎన్జీవోల సహకారంతో తమ ప్యానెట్ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తమ ప్యానెల్ మెజారిటీ ఓట్లను కైవసం చేసుకోనుందన్నారు. మంచి నాయకత్వం కోసం ఎదురు చూస్తున్న ఉద్యోగ సంఘాల ప్రతిని ధులు ఎన్నికల్లో తమకు ఓట్లు వేసి గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రస్తుతం కార్యవర్గంలో నాయకత్వ లోపం కారణంగా ఉద్యోగుల డిమాండ్ల పరిష్కారం నత్తనడకన సాగుతోందని బషీర్ విమర్శించారు. గత ఏడాది జూలై 1 నుంచి ఐఆర్‌ను వర్తింపజేయాల్సి ఉన్నా, ఉద్యోగుల పట్ల ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని ఆరోపించారు. 66 రోజుల సమ్మె కాలాన్ని క్రమబద్ధీకరించే విషయంలో ప్రభుత్వం దాటవేత ధోరణి అవలంబిస్తోందన్నారు. తమ ప్యానెల్ గెలిస్తే, ప్రభుత్వంతో రాజీలేని ధోరణి అవలంబించి, ఉద్యోగులకు భరోసా కల్పిస్తామని హామీ ఇచ్చారు. స్నేహపూర్వక వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చర్యలు చేపట్టాలని ఎన్నికల అధికారులకు విన్నవించామని బషీర్ తెలిపారు.
ఉద్యమాన్ని నీరు గార్చారు: ఉవ్వెత్తున ఎగసిన సమైక్య ఉద్యమాన్ని నీరు గార్చిన కారణంగా ఏపీఎన్జీవోలంతా నాయకత్వ మార్పు కోరుకుంటున్నారని ప్రధాన కార్యదర్శి అభ్యర్థి పీవీవీ సత్యనారాయణ పరోక్షంగా అశోక్‌బాబుపై విమర్శలు గుప్పించారు. ఏకపక్ష నిర్ణయాల వల్లే తెలంగాణ బిల్లు అసెంబ్లీ వరకు వచ్చిందన్నారు. అనుకోని విధంగా ఎన్నికలకు వెళ్లాల్సి రావడంతో 35 శాతం రావాల్సిన ఐఆర్ 27 శాతానికి పరిమతం చేశారని చెప్పారు. ఆమ్ ఆద్మీ పార్టీ తరహాలో రూపాయి చేతిలో లేకున్నా ఉద్యోగుల కోరిక మేరకు తమ ప్యానెల్ బరిలో నిలిచిందన్నారు. వాస్తవాలు చెప్పి ఉద్యోగులను ఓట్లడిగామని, అన్ని జిల్లాల నుంచి తమకు మంచి స్పందన లభించిందని చెప్పారు.