apngo elections
-
గెలుపు మాదే: బషీర్
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పెద్దల అండదండలున్నా సరే అశోక్‌బాబు ప్యానెల్‌పై తమ ప్యానెల్ ఘన విజయం సాధిస్తుందని ఏపీఎన్జీవోల సంఘం రాష్ట్ర అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న షేక్ అబ్దుల్ బషీర్ ధీమా వ్యక్తం చేశారు. ఏపీ ఎన్జీవో భవన్లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. సమ్మె విరమణ సందర్భంగా అశోక్‌బాబు వ్యవహరించిన తీరుపై ఉద్యోగులు ఆగ్రహంగా ఉన్నారని, మొదటి నుంచి ప్రభుత్వ పెద్దల రూట్‌మ్యాప్‌కు అనుగుణంగానే అశోక్‌బాబు నిర్ణయాలు చోటుచేసుకున్నాయని చెప్పారు. అయినప్పటికీ ఏపీఎన్జీవోల సహకారంతో తమ ప్యానెట్ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తమ ప్యానెల్ మెజారిటీ ఓట్లను కైవసం చేసుకోనుందన్నారు. మంచి నాయకత్వం కోసం ఎదురు చూస్తున్న ఉద్యోగ సంఘాల ప్రతిని ధులు ఎన్నికల్లో తమకు ఓట్లు వేసి గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం కార్యవర్గంలో నాయకత్వ లోపం కారణంగా ఉద్యోగుల డిమాండ్ల పరిష్కారం నత్తనడకన సాగుతోందని బషీర్ విమర్శించారు. గత ఏడాది జూలై 1 నుంచి ఐఆర్‌ను వర్తింపజేయాల్సి ఉన్నా, ఉద్యోగుల పట్ల ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని ఆరోపించారు. 66 రోజుల సమ్మె కాలాన్ని క్రమబద్ధీకరించే విషయంలో ప్రభుత్వం దాటవేత ధోరణి అవలంబిస్తోందన్నారు. తమ ప్యానెల్ గెలిస్తే, ప్రభుత్వంతో రాజీలేని ధోరణి అవలంబించి, ఉద్యోగులకు భరోసా కల్పిస్తామని హామీ ఇచ్చారు. స్నేహపూర్వక వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చర్యలు చేపట్టాలని ఎన్నికల అధికారులకు విన్నవించామని బషీర్ తెలిపారు. ఉద్యమాన్ని నీరు గార్చారు: ఉవ్వెత్తున ఎగసిన సమైక్య ఉద్యమాన్ని నీరు గార్చిన కారణంగా ఏపీఎన్జీవోలంతా నాయకత్వ మార్పు కోరుకుంటున్నారని ప్రధాన కార్యదర్శి అభ్యర్థి పీవీవీ సత్యనారాయణ పరోక్షంగా అశోక్‌బాబుపై విమర్శలు గుప్పించారు. ఏకపక్ష నిర్ణయాల వల్లే తెలంగాణ బిల్లు అసెంబ్లీ వరకు వచ్చిందన్నారు. అనుకోని విధంగా ఎన్నికలకు వెళ్లాల్సి రావడంతో 35 శాతం రావాల్సిన ఐఆర్ 27 శాతానికి పరిమతం చేశారని చెప్పారు. ఆమ్ ఆద్మీ పార్టీ తరహాలో రూపాయి చేతిలో లేకున్నా ఉద్యోగుల కోరిక మేరకు తమ ప్యానెల్ బరిలో నిలిచిందన్నారు. వాస్తవాలు చెప్పి ఉద్యోగులను ఓట్లడిగామని, అన్ని జిల్లాల నుంచి తమకు మంచి స్పందన లభించిందని చెప్పారు. -
విజయం తథ్యం: అశోక్‌బాబు
సాక్షి, హైదరాబాద్: ఏపీ ఎన్జీవో కార్యవర్గ ఎన్నికలు ఆదివారం ఏకపక్షంగా జరగనున్నాయని, ఎన్నికల్లో తమ ప్యానెల్‌కు ఘనవిజయం తథ్యమని ప్రస్తుత అధ్యక్షుడు అశోక్‌బాబు ధీమా వ్యక్తం చేశారు. ఏపీ ఎన్జీవో భవన్లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రతి ఓటరు తాము జారీ చేసిన గుర్తింపు కార్డును వెంట తెచ్చుకోవాలని సూచించారు. ఓటర్ల జాబితాలో రిటైరైన ఉద్యోగుల పేర్లు ఉన్నా, వారిని అనుమతించరాదని ఎన్నికల అధికారులను కోరనున్నామని, ఈ విషయంలో తుది నిర్ణయం వారిదేనని చెప్పారు. ఉద్యోగుల సంక్షేమం పట్ల, సమైక్యవాదం పట్ల తమ నిరతికి ఇటీవల ప్రభుత్వం ఉదారంగా ప్రకటించిన 27 శాతం మధ్యంతర భృతే నిదర్శనమన్నారు. ప్రభుత్వంతో చర్చలతో పాటు లాబీయింగ్ కూడా అవసరమేనని, చర్చల సందర్భంగా తెలంగాణ ఉద్యోగ సంఘాలతో కూడా కలసి ఉద్యోగులకు మంచి ఐఆర్ సాధించగలిగామని, ఇలాగే మంచి పీఆర్సీని కూడా ఇప్పించేందుకు కృషి చేస్తామన్నారు. ఎన్నికలకు రాజకీయ రంగు పులమడం దురదృష్టకరమని, ఎపీఎన్జీవో చరిత్రలో రాజకీయ ప్రభావం లేదని అన్నారు. ఉద్యమ సమయంలో మినహా ఏపీ ఎన్జీవోలు ఎన్నడూ రాజకీయ పార్టీలను ఆహ్వానించలేదన్నారు. సమైక్య రాష్ట్ర పరిరక్షణ కోసం అవసరమైతే సాధారణ ఎన్నికల సమయంలో రాజకీయ నిర్ణయం తీసుకుంటామని అశోక్‌బాబు ప్రకటించారు. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాల్లో విభజన బిల్లు కొలిక్కి వచ్చే అవకాశం లేదని, ఈ నెల 16 నుంచి జరగనున్న మూడో విడత అసెంబ్లీ సమావేశాలే కీలకం కానున్నాయని చెప్పారు. ఉద్యమ భవిష్యత్ కార్యాచరణ కోసం ఈనెల 6న లేదా 7న మరోసారి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. సమైక్య రాష్ట్రం కోసం ఎంపీలు చేసిన సంకల్ప దీక్షకు తాము మద్ధతు తెలిపామన్నారు. ఏపీ ఎన్జీవోలు సమైక్య ఉద్యమాన్ని భుజానికెత్తుకున్న నేపథ్యంలో రాష్ట్ర కార్యవర్గ ఎన్నికలపై రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొందని ప్రధాన కార్యదర్శి చంద్రశేఖరరెడ్డి అన్నారు. -
నేడు ఏపీఎన్జీవో ఎన్నికలు
సాక్షి, హైదరాబాద్: ఏపీఎన్జీవో ఎన్నికలు ఆదివారం గన్‌ఫౌండ్రీలోని సంఘం కార్యాలయంలో జరగనున్నాయి. పోలింగ్ ఉదయం 9 గంటలకు ప్రారంభమై, సాయంత్రం 3 వరకు సాగనుంది. ఏపీఎన్జీవో సంఘానికి 13 సీమాంధ్ర జిల్లాలతో పాటు హైదరాబాద్, నాగార్జునసాగర్ జిల్లా కమిటీలు ఉన్నాయి. 15 జిల్లాల కార్యవర్గాలు, తాలూకా శాఖల అధ్యక్ష, కార్యదర్శులకు ఓటు హక్కు ఉంటుంది. ప్రస్తుతం 847 మంది ఓటర్లు ఉన్నారు. అధ్యక్షుడు, సహాధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి, కార్య నిర్వాహక కార్యదర్శి, కోశాధికారి, ఎనిమిది మంది ఉపాధ్యక్షులు, నలుగురు కార్యదర్శులను ఎన్నుకోనున్నారు. అశోక్‌బాబు, అబ్దుల్ బషీర్ ప్యానెళ్ల పక్షాన మొత్తం 33 మంది పోటీలో ఉన్నాయి. ప్రభుత్వ అండదండలు ఉన్నట్లు ప్రచారమున్న అశోక్‌బాబు ప్యానెల్లో అధ్యక్షుడుగా అశోక్‌బాబు, ప్రధాన కార్యదర్శిగా చంద్రశేఖరరెడ్డి, సహాధ్యక్షుడుగా పురుషోత్తం, కార్యనిర్వాహక కార్యదర్శిగా వెంకటేశ్వరరెడ్డి, కోశాధికారిగా వీరేంద్రబాబు, ఉపాధ్యక్షులుగా ఆశీర్వాదం, బతీజ్, రామకృష్ణారెడ్డి, డి.వి.రమణ, రవిశంకర్, శివారెడ్డి, సుబ్బారెడ్డి, విద్యాసాగర్, కార్యదర్శులుగా గంగిరెడ్డి, ఆర్.లూక్, నరసింహం, నర్సింగరావు పోటీ చేస్తున్నారు. సమైక్యాంధ్ర ఉద్యమం, ఉద్యోగుల సమ్మె విరమణ అంశాల్లో అశోక్‌బాబు వ్యవహరించిన తీరుపై అసహనంగా ఉన్న బషీర్ ప్యానెల్ పక్షాన అధ్యక్షుడిగా అబ్దుల్ బషీర్, ప్రధాన కార్యదర్శిగా పి.వి.వి.సత్యనారాయణ, సహాధ్యక్షుడుగా రాజ కుళ్లాయప్ప, కార్యనిర్వాహక కార్యదర్శిగా ఎ.ఎం.ఎ.ప్రసాద్, కోశాధికారిగా బి.కృపావరం, ఉపాధ్యక్షులుగా కోటమ్మ, దేవరాజు, దొరైకన్న, మోహన్దత్త నాయుడు, నాగరాజు, నర్సింహ, వెంకంరాజు, విజయభాస్కర్, కార్యదర్శులుగా పద్మావతి, రవూఫ్, సత్యనారాయణ గౌడ్ పోటీ చేస్తున్నారు. ఎలాంటి హామీలు, ప్రయోజనాలూ లేకుండానే బేషరతుగా సమ్మె విరమింపజేసిన అశోక్‌బాబు వైఖరిని ఈ ప్యానెల్ తప్పుపడుతోంది. పోలింగ్ పూర్తయిన వెంటనే లెక్కింపు ప్రారంభం కానుంది. రాత్రికే ఫలితాలు వెలువడనున్నాయి. ఏర్పాట్లు పూర్తి: 847 మంది ఓటర్ల కోసం మూడు పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేశామని, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఎన్నికల అధికారి హనుమంతరావు చెప్పారు. మధ్యాహ్నం 3 గంటల వరకు ఓటింగ్ జరగనుందని, వెంటనే కౌంటింగ్ కూడా ప్రారంభిస్తామని చెప్పారు. రాత్రి 8 గంటల తర్వాత ఫలితాలు వెలువడే అవకాశం ఉందన్నారు. నిబంధనల ప్రకారం కోటమ్మ అనే అభ్యర్థిని పోటీ చేసేందుకు అనర్హురాలిగా ప్రకటించామని, అయితే.. కోర్టు ఆదేశాల మేరకు ఆమెను ఉపాధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు అనుమతించామన్నారు. ఓటింగ్‌కు వచ్చే ఉద్యోగులు తప్పనిసరిగా తమ ఫొటో గుర్తింపు కార్డు వెంట తెచ్చుకోవాలని సూచించారు. -
ఉద్యమంపై ఎన్నికల ప్రభావం ఉండదు:అశోక్ బాబు
శ్రీకాకుళం: సమైక్యాంధ్ర ఉద్యమంపై ఏపిఎన్జిఓ సంఘం ఎన్నికల ప్రభావం ఉండదని ఆ సంఘం తాత్కాలిక అధ్యక్షుడు అశోక్ బాబు చెప్పారు. ఎన్నికల కారణంగా సమైక్య ఉద్యమం పక్కతోవ పట్టలేదన్నారు. ఏపిఎన్జిఓ సంఘం ఎన్నికలలో ఎవరు గెలిచినా సమైక్యరాష్ట్ర ఉద్యమం తీవ్రంగా ఉంటుందని చెప్పారు. ఏపీఎన్జీవోల సంఘం ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ఆదివారంతో పూర్తయిన విషయం తెలిసిందే. ప్రస్తుత తాత్కాలిక కమిటీ అధ్యక్షుడు అశోక్‌బాబు, పలువురు సభ్యులు తిరిగి నామినేషన్లు దాఖలు చేశారు. అశోక్‌బాబు ప్యానెల్‌కు వ్యతిరేకంగా ఏపీఎన్జీవోల సంఘం ప్రకాశం జిల్లా అధ్యక్షుడు బషీర్ నేతృత్వంలో మరో ప్యానెల్ బరిలోకి దిగింది. మొత్తం 17 మందితో ఒక్కో ప్యానెల్ ఏర్పడింది. -
అశోక్‌బాబు వైఖరిని నిరసిస్తూ కారెం శివాజీ రాజీనామా
రాజమండ్రి: ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబుపై సమైక్య రాష్ట్రపరిరక్షణ వేదిక ఉపాధ్యక్షుడు కారెం శివాజీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అశోక్ బాబు ద్వంద్వవైఖరిని నిరసిస్తూ ఆయన రాజీనామా చేశారు. అఖిలపక్షంలో దళిత సంఘాలకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని ఆయన ఆరోపించారు. ఏపీఎన్జీవో ఎన్నికలపై ప్రభావం పడేలా అశోక్‌బాబు అఖిలపక్ష సమావేశాన్ని నామమాత్రంగా నడిపించారని శివాజీ వివర్శించారు. సమైక్యాంధ్ర ఉద్యమాన్ని అశోక్‌బాబు నీరుగార్చారని చెప్పారు. దళిత సంఘాలను అశోక్‌బాబు దూరం చేస్తున్నారంటా శివాజీ ఆవేదన వ్యక్తం చేశారు. అశోక్‌బాబు నియంతృత్వధోరణి వల్లే.. సమైక్యాంధ్ర ఉద్యమం నుండి ఆర్టీసీ, విద్యుత్ సచివాలయ ఉద్యోగ సంఘాలు దూరమయ్యాయిని కారెం శివాజీ విమర్శించారు. -
25న ఏపీఎన్జీవో ఎన్నికలు, అశోక్ బాబుపై అసంతృప్తి
హైదరాబాద్ : ఈనెల 25న ఏపీఎన్జీవో రాష్ట్ర కమిటీ ఎన్నికలు జరగనున్నాయి. 22వ తేదీ మధ్యాహ్నం 1 గంట వరకు హైదరాబాద్‌లోని ఎన్జీవో హోంలో నామినేషన్లు స్వీకరిస్తారు. కాగా ఏపీఎన్జీవో తాత్కాలిక అధ్యక్షుడు అశోక్ బాబుపై ఎనిమిది జిల్లాల నేతలు అసంతృప్తిగా ఉన్నారు. అశోక్ బాబుకు వ్యతిరేకంగా వారు గురువారం సమావేశం అయ్యారు. ఉద్యోగుల సమస్యలను పక్కనపెట్టి రాజకీయాలు చేస్తున్నారని ఆయా జిల్లాల నేతలు మండిపడ్డారు.