విజయం తథ్యం: అశోక్‌బాబు
సాక్షి, హైదరాబాద్: ఏపీ ఎన్జీవో కార్యవర్గ ఎన్నికలు ఆదివారం ఏకపక్షంగా జరగనున్నాయని, ఎన్నికల్లో తమ ప్యానెల్‌కు ఘనవిజయం తథ్యమని ప్రస్తుత అధ్యక్షుడు అశోక్‌బాబు ధీమా వ్యక్తం చేశారు. ఏపీ ఎన్జీవో భవన్‌లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రతి ఓటరు తాము జారీ చేసిన గుర్తింపు కార్డును వెంట తెచ్చుకోవాలని సూచించారు. ఓటర్ల జాబితాలో రిటైరైన ఉద్యోగుల పేర్లు ఉన్నా, వారిని అనుమతించరాదని ఎన్నికల అధికారులను కోరనున్నామని, ఈ విషయంలో తుది నిర్ణయం వారిదేనని చెప్పారు. ఉద్యోగుల సంక్షేమం పట్ల, సమైక్యవాదం పట్ల తమ నిరతికి ఇటీవల ప్రభుత్వం ఉదారంగా ప్రకటించిన 27 శాతం మధ్యంతర భృతే నిదర్శనమన్నారు. ప్రభుత్వంతో చర్చలతో పాటు లాబీయింగ్ కూడా అవసరమేనని, చర్చల సందర్భంగా తెలంగాణ ఉద్యోగ సంఘాలతో కూడా కలసి ఉద్యోగులకు మంచి ఐఆర్ సాధించగలిగామని, ఇలాగే మంచి పీఆర్‌సీని కూడా ఇప్పించేందుకు కృషి చేస్తామన్నారు.
ఎన్నికలకు రాజకీయ రంగు పులమడం దురదృష్టకరమని, ఎపీఎన్జీవో చరిత్రలో రాజకీయ ప్రభావం లేదని అన్నారు. ఉద్యమ సమయంలో మినహా ఏపీ ఎన్జీవోలు ఎన్నడూ రాజకీయ పార్టీలను ఆహ్వానించలేదన్నారు. సమైక్య రాష్ట్ర పరిరక్షణ కోసం అవసరమైతే సాధారణ ఎన్నికల సమయంలో రాజకీయ నిర్ణయం తీసుకుంటామని అశోక్‌బాబు ప్రకటించారు. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాల్లో విభజన బిల్లు కొలిక్కి వచ్చే అవకాశం లేదని, ఈ నెల 16 నుంచి జరగనున్న మూడో విడత అసెంబ్లీ సమావేశాలే కీలకం కానున్నాయని చెప్పారు. ఉద్యమ భవిష్యత్ కార్యాచరణ కోసం ఈనెల 6న లేదా 7న మరోసారి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. సమైక్య రాష్ట్రం కోసం ఎంపీలు చేసిన సంకల్ప దీక్షకు తాము మద్ధతు తెలిపామన్నారు. ఏపీ ఎన్జీవోలు సమైక్య ఉద్యమాన్ని భుజానికెత్తుకున్న నేపథ్యంలో రాష్ట్ర కార్యవర్గ ఎన్నికలపై రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొందని ప్రధాన కార్యదర్శి చంద్రశేఖరరెడ్డి అన్నారు.