ఏపీఎన్జీవోల అధ్యక్షుడిగా అశోక్‌బాబు
సంఘం ఎన్నికలలో ఆయన ప్యానెల్ విజయం
సాక్షి, హైదరాబాద్: ఏపీఎన్జీవోల సంఘం ఎన్నికల్లో అశోక్‌బాబు ప్యానెల్ విజయం సాధించింది. అధ్యక్షుడిగా పోటీ చేసిన అశోక్‌బాబుకు 630 ఓట్లు రాగా, ఆయన ప్రత్యర్థి అబ్దుల్ బషీర్‌కు 174 ఓట్లు వచ్చాయి. 11 ఓట్లు చెల్లలేదు. ఆదివారం ఉదయం 9 నుంచి సాయంత్రం 3 గంటల వరకు సంఘ కార్యాలయంలో జరిగిన పోలింగ్‌లో మొత్తం 847 ఓట్లకు గాను 815 పోలయ్యాయి. సాయంత్రం 3.30 గంటలకు ప్రారంభమైన ఓట్ల లెక్కింపు రాత్రి 9 గంటల వరకూ సాగింది. మొత్తం ఎనిమిది రౌండ్లుగా ఓట్లను లెక్కించారు. అన్ని రౌండ్లలో అశోక్‌బాబు ప్యానెల్ ఆధిక్యత కనబరిచింది. ఓట్ల లెక్కింపు రెండో దశ పూర్తవగానే అశోక్‌బాబు వర్గీయులు ఏపీఎన్జీవో భవన్‌లో సంబరాలు ప్రారంభించారు. డప్పుల వాయిద్యాలతో నృత్యం చేశారు. పెద్దఎత్తున బాణసంచా కాల్చారు. విజయం సాధించిన అభ్యర్థులను అభినందించారు. అధ్యక్షుడుగా అశోక్‌బాబుతో పాటు మొత్తం పదవులకు ఆయన ప్యానెల్ అభ్యర్థులే విజయం సాధించారు.
ప్రధాన కార్యదర్శిగా చంద్రశేఖరరెడ్డి, సహాధ్యక్షుడిగా పురుషోత్తంనాయుడు, కార్యనిర్వాహక కార్యదర్శిగా వెంకటేశ్వరరెడ్డి, కోశాధికారిగా వీరేంద్రబాబు, ఉపాధ్యక్షులుగా ఆశీర్వాదం, బతీజ్, రామకృష్ణారెడ్డి, డీవీ రమణ, రవిశంకర్, శివారెడ్డి, సుబ్బారెడ్డి, విద్యాసాగర్, కార్యదర్శులుగా గంగిరెడ్డి, ఆర్.లూక్, నర్సింహం, నర్సింగరావు ఎన్నికయ్యారు. ఫలితాలు వెలువరించిన అనంతరం రిటర్నింగ్ అధికారి హనుమంతరావు వారిచేత ప్రమాణం చేయించారు. కార్యవర్గం అంతా ఆంగ్లంలోనే ప్రమాణ స్వీకారం చేయడం విశేషం. గతంలో ఏపీఎన్జీవోల సంఘం ఎన్నికల గురించి ఎవరికీ పెద్దగా తెలిసేదికాదు. అయితే ఈసారి అందుకు భిన్నంగా సాధారణ ఎన్నికలను తలపించేలా ఆద్యంతం సాగాయి.
బాధ్యత పెరిగింది: అశోక్‌బాబు
తనపై ఎంతో విశ్వాసం ఉంచి గెలిపించిన నేపథ్యంలో తన బాధ్యత మరింత పెరిగిందని అశోక్‌బాబు వ్యాఖ్యానించారు. ఓట్ల లెక్కింపు ముగిసాక ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగుంటే ఏపీఎన్జీవోల ప్రతిష్ట మరింత పెరిగేదన్నారు. అయినా నామినేషన్ రోజునే తమ విజయం తథ్యమని తెలిసిపోయిందన్నారు. తాము ఊహించిన దానికన్నా బషీర్‌కు ఎక్కువ ఓట్లే వచ్చాయన్నారు. సమైక్య ఉద్యమాన్ని ఉద్ధృతంగా ముందుకు తీసుకెళ్తామని చెప్పారు.
డబ్బు పెద్దఎత్తున ఖర్చు చేశారు: బషీర్
ఈ ఎన్నికల్లో పెద్దఎత్తున డబ్బు ఖర్చు చేశారని బషీర్ ఆరోపించారు. జిల్లాల నుంచి ఉద్యోగులను హైదరాబాద్‌కు తీసుకురావడానికి బస్సులు ఏర్పాట్లు చేశారని, వారి బస కోసం 12 హోటళ్లను తీసుకున్నారని చెప్పారు. పోలింగ్‌కు ముందు రోజు రాత్రే ఓటర్లకు డబ్బు పంపిణీ చేశారని ఆరోపించారు. అలాగే అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు అశోక్‌బాబు విజయానికి కృషి చేశారని, జిల్లాల్లో ఎన్జీవో నేతలను పిలిపించి మాట్లాడారని ధ్వజమెత్తారు. ప్రతిపక్ష టీడీపీ ఎమ్మెల్యేలు సైతం ఈ విషయంలో సహకారం అందించారని ఆరోపించారు. అయినా ఈ ఎన్నికలలో ఓటమిని క్రీడాస్ఫూర్తితో తీసుకుంటామన్నారు. ఓటర్ల జాబితాలో తప్పులను సవరించాలని తాము విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదని, ఈ విషయంపై న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని యోచిస్తున్నామని బషీర్ వెల్లడించారు.