సాక్షి, హైదరాబాద్: ఏపీఎన్జీవో ఎన్నికలు ఆదివారం గన్‌ఫౌండ్రీలోని సంఘం కార్యాలయంలో జరగనున్నాయి. పోలింగ్ ఉదయం 9 గంటలకు ప్రారంభమై, సాయంత్రం 3 వరకు సాగనుంది. ఏపీఎన్జీవో సంఘానికి 13 సీమాంధ్ర జిల్లాలతో పాటు హైదరాబాద్, నాగార్జునసాగర్ జిల్లా కమిటీలు ఉన్నాయి. 15 జిల్లాల కార్యవర్గాలు, తాలూకా శాఖల అధ్యక్ష, కార్యదర్శులకు ఓటు హక్కు ఉంటుంది. ప్రస్తుతం 847 మంది ఓటర్లు ఉన్నారు. అధ్యక్షుడు, సహాధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి, కార్య నిర్వాహక కార్యదర్శి, కోశాధికారి, ఎనిమిది మంది ఉపాధ్యక్షులు, నలుగురు కార్యదర్శులను ఎన్నుకోనున్నారు.
అశోక్‌బాబు, అబ్దుల్ బషీర్ ప్యానెళ్ల పక్షాన మొత్తం 33 మంది పోటీలో ఉన్నాయి. ప్రభుత్వ అండదండలు ఉన్నట్లు ప్రచారమున్న అశోక్‌బాబు ప్యానెల్‌లో అధ్యక్షుడుగా అశోక్‌బాబు, ప్రధాన కార్యదర్శిగా చంద్రశేఖరరెడ్డి, సహాధ్యక్షుడుగా పురుషోత్తం, కార్యనిర్వాహక కార్యదర్శిగా వెంకటేశ్వరరెడ్డి, కోశాధికారిగా వీరేంద్రబాబు, ఉపాధ్యక్షులుగా ఆశీర్వాదం, బతీజ్, రామకృష్ణారెడ్డి, డి.వి.రమణ, రవిశంకర్, శివారెడ్డి, సుబ్బారెడ్డి, విద్యాసాగర్, కార్యదర్శులుగా గంగిరెడ్డి, ఆర్.లూక్, నరసింహం, నర్సింగరావు పోటీ చేస్తున్నారు. సమైక్యాంధ్ర ఉద్యమం, ఉద్యోగుల సమ్మె విరమణ అంశాల్లో అశోక్‌బాబు వ్యవహరించిన తీరుపై అసహనంగా ఉన్న బషీర్ ప్యానెల్ పక్షాన అధ్యక్షుడిగా అబ్దుల్ బషీర్, ప్రధాన కార్యదర్శిగా పి.వి.వి.సత్యనారాయణ, సహాధ్యక్షుడుగా రాజ కుళ్లాయప్ప, కార్యనిర్వాహక కార్యదర్శిగా ఎ.ఎం.ఎ.ప్రసాద్, కోశాధికారిగా బి.కృపావరం, ఉపాధ్యక్షులుగా కోటమ్మ, దేవరాజు, దొరైకన్న, మోహన్‌దత్త నాయుడు, నాగరాజు, నర్సింహ, వెంకంరాజు, విజయభాస్కర్, కార్యదర్శులుగా పద్మావతి, రవూఫ్, సత్యనారాయణ గౌడ్ పోటీ చేస్తున్నారు.
ఎలాంటి హామీలు, ప్రయోజనాలూ లేకుండానే బేషరతుగా సమ్మె విరమింపజేసిన అశోక్‌బాబు వైఖరిని ఈ ప్యానెల్ తప్పుపడుతోంది. పోలింగ్ పూర్తయిన వెంటనే లెక్కింపు ప్రారంభం కానుంది. రాత్రికే ఫలితాలు వెలువడనున్నాయి.
ఏర్పాట్లు పూర్తి: 847 మంది ఓటర్ల కోసం మూడు పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేశామని, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఎన్నికల అధికారి హనుమంతరావు చెప్పారు. మధ్యాహ్నం 3 గంటల వరకు ఓటింగ్ జరగనుందని, వెంటనే కౌంటింగ్ కూడా ప్రారంభిస్తామని చెప్పారు. రాత్రి 8 గంటల తర్వాత ఫలితాలు వెలువడే అవకాశం ఉందన్నారు. నిబంధనల ప్రకారం కోటమ్మ అనే అభ్యర్థిని పోటీ చేసేందుకు అనర్హురాలిగా ప్రకటించామని, అయితే.. కోర్టు ఆదేశాల మేరకు ఆమెను ఉపాధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు అనుమతించామన్నారు. ఓటింగ్‌కు వచ్చే ఉద్యోగులు తప్పనిసరిగా తమ ఫొటో గుర్తింపు కార్డు వెంట తెచ్చుకోవాలని సూచించారు.
నేడు ఏపీఎన్జీవో ఎన్నికలు
Published Sun, Jan 5 2014 12:53 AM | Last Updated on Sat, Sep 2 2017 2:17 AM
Advertisement