జర్నలిస్టులు, ఎన్‌జీవో కార్యకర్తలు, సినీ, డాక్యుమెంటరీ దర్శకులను ఇక నుంచి జైళ్లలోకి అనుమతించరు.
న్యూఢిల్లీ: జర్నలిస్టులు, ఎన్‌జీవో కార్యకర్తలు, సినీ, డాక్యుమెంటరీ దర్శకులను ఇక నుంచి జైళ్లలోకి అనుమతించరు. వీరు జైళ్లలోకి వెళ్లి ఇంటర్వ్యూలు తీసుకోవడం, వార్తలు రాయడంపై కేంద్రం నిషేధం విధించింది. బ్రిటిష్ దేశస్థురాలు లెస్లీ ఉడ్విన్ బీబీసీ కోసం తీసిన నిర్భయ డాక్యుమెంటరీపై వివాదం రేగిన నేపథ్యంలో కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి కుమార్ అలోక్ అన్ని రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు మార్గదర్శకాలను పంపారు. ఇలాంటి ఇంటర్వ్యూలు, డాక్యుమెంటరీల వల్ల సమాజంపై సానుకూల ప్రభావం ఉంటుందని భావిస్తే... రాష్ట్రాలు అనుమతి జారీచేయవచ్చు.
ఇలాంటి పనులపై జైలులోకి వెళుతున్న వారు రూ. లక్ష సెక్యూరిటీ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. హ్యాండీక్యామ్, కెమెరా లేదా రికార్డర్‌లను మాత్రమే అనుమతిస్తారు. జైలు సూపరింటెండెంట్ సమక్షంలోనే ఖైదీలతో మాట్లాడాల్సి ఉంటుంది. రికార్డరు లేదా వీడియో కెమెరాను 3 రోజులు సూపరింటెండెంట్‌కు అప్పగించాలి. ఆయన ఏదైనా అభ్యంతరకరంగా అనిపిస్తే ఆ భాగాన్ని తొలగిస్తారు. ఖైదీలతో మాట్లాడి రాసే ఆర్టికల్స్ ప్రచురించే ముందు జైళ్లశాఖ ఉన్నతాధికారి అనుమతి తప్పనిసరి.