
కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యలు తీర్చాలి
విజయవాడ : కాంట్రాక్టు, కంటింజెన్సీ, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చేపట్టే కార్యక్రమాలకు మద్దతు పలకాల్సిన బాధ్యత ప్రతి ఉద్యోగిపై ఉందని ఏపీ ఎన్జీవో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పి.అశోక్‌బాబు తెలిపారు. అసోసియేషన్ పశ్చిమ కృష్ణా శాఖ కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా శనివారం స్థానిక ఎన్జీవో హోమ్‌లో సభ జరిగింది. ఈ సందర్భంగా అశోక్‌బాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా సేవలు అందిస్తున్న కాంట్రాక్టు, కంటింజెన్సీ, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆర్థిక సమస్యలతో అల్లాడిపోతున్నారని, ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వారి జీతాలు కొంచెం పెంచామని, అయితే, పూర్తిస్థాయిలో న్యాయం జరగాల్సిన అవసరం ఉందన్నారు. పశ్చిమ కృష్ణా అధ్యక్షుడిగా ఎన్నికైన ఏ.విద్యాసాగర్ మాట్లాడుతూ అసోసియేషన్‌లో మూడు దశాబ్దాలుగా పనిచేసే అవకాశం కల్పించిన నాయకులకు, ఉద్యోగులకు కృతజ్ఞతలు తెలిపారు. తనకు రాష్ట్ర నాయకత్వం అప్పగించిన బాధ్యతలను సమర్థంగా నిర్వహించి ఉద్యోగుల సమస్యలతో పాటు కాంట్రాక్టు, కంటింజెన్సీ, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తొలుత బందరురోడ్డులోని ఠాగూర్ గ్రంథాలయం నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎన్జీవో హోమ్‌కు వెళ్లి నామినేషన్లు వేశారు.
నూతన కార్యవర్గం ఇదే..
ఏపీ ఎన్జీవో అసోసియేషన్ పశ్చిమ కృష్ణా అధ్యక్షుడిగా ఏ.విద్యాసాగర్, అసోసియేట్ అధ్యక్షుడిగా డి.సత్యనారాయణరెడ్డి, ఉపాధ్యక్షుడిగా జి.ఏసురత్నం, ఎన్.శివకుమార్, ఎస్.అలెగ్జాండర్, ఎం.రాజబాబు, వి.నాగార్జున, కార్యదర్శిగా ఎండీ ఇక్బాల్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా పి.రమేష్, సంయుక్త కార్యదర్శులుగా సీహెచ్ దిలీప్‌కుమార్, డి.ప్రసాదరాజు, ఎస్‌కే దాదాసాహెబ్, ఆర్‌హెచ్ ప్రకాష్, మహిళా విభాగం సంయుక్త కార్యదర్శిగా ఎం.సుజాత, కోశాధికారిగా ఆనంద్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి బి.ఆశీర్వాదం, సహాయ ఎన్నికల అధికారి బాసిత్ ప్రకటించారు. అసోసియేషన్ రాష్ట ప్రధాన కార్యదర్శి డి.చంద్రశేఖరరెడ్డి, తూర్పు కృష్ణా అధ్యక్ష, కార్యదర్శులు ఉల్లికృష్ణ, దారపు శ్రీనివాస్, సిటీ అధ్యక్ష, కార్యదర్శులు కోనేరు రవి, ఉపాధ్యక్షుడు వీవీ ప్రసాద్, మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు డి.ఈశ్వర్, గ్రంథాలయ ఉద్యోగుల సంఘం ప్రతినిధి కళ్లేపల్లి మధుసూదనరాజు, ప్రభుత్వ పెన్షనర్ల అసోసియేషన్ ప్రతినిధులు దాళినాయుడు, భోగరాజు, వివిధ శాఖల ఉద్యోగ సంఘాల నేతలు పాల్గొన్నారు.