జైపూర్ చేరుకున్న బిల్ క్లింటన్!
జైపూర్: అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ సోమవారం అర్ధరాత్రి ప్రత్యేక చార్డెట్ విమానంలో జైపూర్ చేరుకున్నారు. లక్షలాది మంది పాఠశాల విద్యార్ధులకు భోజన ఏర్పాటు చేస్తున్న ఓ స్వచ్చంద సంస్థ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో క్లింటన్ పాలుపంచుకోనున్నారు. సోమవారం అర్ధరాత్రి జైపూర్ చేరుకున్న క్లింటన్ ఒబెరాయ్ రాజ్ విలాస్ లో బస చేశారు.
దేశవ్యాప్తంగా లక్షలాది పాఠశాల విద్యార్ధులకు మధ్యాహ్న భోజన సదుపాయాన్ని కల్పిస్తున్న అక్షయ పాత్ర అనే స్వచ్చంద సంస్థ నిర్వహించే అతిపెద్ద వంటశాలను బుధవారం క్లింటన్ సందర్శిస్తారని నిర్వహకులు, పోలీసులు వెల్లడించారు.
జైపూర్ జిల్లాలోనే ప్రతి రోజు 1100 పాఠశాలల్లో 1.25 లక్షల విద్యార్ధులకు మధ్యాహ్న భోజనాన్ని అక్షయ పాత్ర ఏర్పాటు చేస్తోంది. అంతేకాకుండా జైపూర్ లోని 20 వేల అంగన్ వాడి కార్యకర్తలకు, 4 వేల రోజువారి కూలీలకు కేవలం 5 రూపాయలకే భోజనాన్ని ఏర్పాటు చేస్తున్నారు.
జైపూర్ లోనే కాకుండా రాజస్థాన్ లోని నతద్వారా, జోధ్ పూర్, బరాన్ పట్టణాల్లో వంటశాలలను నిర్వహిస్తోంది. జైపూర్ లోని ప్రతాప్ నగర్ లో సంస్కృత వేద పాఠశాలను కూడా క్లింటన్ సందర్శిస్తారని నిర్వహాకులు తెలిపారు. గురువారం ఉత్తర ప్రదేశ్ లోని లక్నోలో పర్యటించనున్నారు.