తీర్మానం ఉండాల్సిందే...
Published Fri, Jan 10 2014 3:18 AM | Last Updated on Wed, Oct 17 2018 5:10 PM
రాష్ర్ట విభజన అంశంలో చర్చకు మద్దతిస్తూ సమైక్య తీర్మానం అంశాన్ని మరచిపోతున్న వారిపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిజమైన సమైక్యవాదులు తీర్మానం కోసం ఎందుకు ప్రయత్నించడం లేదని ప్రశ్నిస్తున్నారు. సమైక్యవాదం వినిపిస్తూ విభజనకు సహకరిస్తున్న నాయకులకు కొందరు ఉద్యోగ నేతలు వత్తాసు పలుకుతుండడాన్ని ఖండిం చారు. సమైక్యవాదానికి అనుకూలంగా తీర్మానం చేయాల్సిందేనని అభిప్రాయం వ్యక్తం చేశారు.
కుమ్మక్కయ్యారు..
సమైకాంధ్ర ముసుగులో అధికార పార్టీ, ప్రధాన ప్రతిపక్షంతో ఎన్జీఓ సంఘ నాయకుడు ములాఖత్ అయినట్లు కనిపిస్తుంది. ముఖ్యమంత్రి నోటి వెంట ఏ మాటలు వస్తున్నాయో అశోక్‌బాబు కూడా అవే మాట్లాడుతుండడం దీనికి నిదర్శనం. రెండు నెలలుగా ఉద్యోగాలు వదిలి ఉద్యమాలు చేస్తే వచ్చిన ఫలితం ఏమిటో అర్థం కావడం లేదు. ఉద్యోగుల సమస్యలు కూడా పరిష్కారం అవ్వలేదు.
- చందాన మహందాతనాయుడు, చైర్మన్, ఎన్జీఒ సంఘం, బొబ్బిలి
తీర్మానం ఉండాలి...
అసెంబ్లీలో విభజన బిల్లుపై ఓటింగ్ జరగకుండా చర్చ జరిపితే పరోక్షంగా రాష్ట్ర విభజనను ఆమోదించినట్లే. సమైక్య తీర్మానం తప్పకుండా చేయాల్సిందే. వైఎస్‌ఆర్ సీపీని అడ్డుకోవడం అధికార, ప్రతిపక్ష పార్టీలకు తగదు.
- ఎ. అశోక్, ఎస్‌ఎఫ్‌ఐ నాయకుడు
కోవర్టులా వ్యవహరిస్తున్నారు...
ఎన్జీఓ సంఘ నాయకుడు కోవర్టులా వ్యవహరిస్తున్నారు. ఉద్యమం చేయడం ద్వారా సొంత లాభం చూసుకొని రాష్ట్ర ప్రయోజనాలకు తూట్లు పొడిచి సీమాంధ్ర ప్రజలను మోసగించారు. ఇది క్షమించరానిది. సమైక్యాంధ్ర సాధన చేతకానప్పడు మొదట్లోనే వదిలేయాల్సింది. ప్రజల నుంచి ఇంత పెద్ద ఎత్తున వచ్చిన ఉద్యమాన్ని అధికార, ప్రతిపక్ష పార్టీలకు అమ్మేశారు.
- డి.రఘు, విద్యార్థి సంఘ నాయకుడు, బొబ్బిలి
తీర్మానం, చర్చ రెండూ జరగాలి
బిల్లును తిప్పికొట్టేందుకు పనికొచ్చే చట్టబద్ధత గల తీర్మానం, చర్చ రెండూ అవసరమే. ఇందులో ఏ ఒక్కటి చేపట్టకపోయినా సమైక్యానికి అన్యాయం జరుగుతుం ది. ప్రజలకు మార్గదర్శకంగా ఉండాల్సిన ఉపాధ్యా య, ఉద్యోగ సంఘాలు ఆ దిశగా శాసన సభ, మండలి సభ్యులపై డిమాండ్ చేయకపోవడం అన్యాయం.
- కొన్నాన శ్రీనివాసరావు,
గౌరవాధ్యక్షుడు, వీఆర్‌ఓ సంఘం.
టీడీపీ వైఖరి మారింది
విభజన బిల్లుపై టీడీపీ వైఖరి ఒక్కసారిగా మారిపోయింది. సీమాంధ్ర టీ డీపీ నేతలంతా చర్చకు వ్యతిరేకమని ముందు చెప్పి చర్చలో పాల్గొనడం ఒక ప్రణాళిక ప్రకారమే జరుగుతోంది. వారంతా డ్రామాలు ఆడుతున్నారు. వారికి కొందరు వత్తాలు పలుకుతుండడం సరికాదు.
- బూతాల వెంకటరమణ, ప్రైవేట్ టీచర్
తీర్మానం చేయకపోతే విభజనను అడ్డుకోలేం
సమైక్య తీర్మానం చేసి పార్లమెంటుకు, రాష్ట్రపతి, సుప్రీంకోర్టుకు పంపకపోతే విభజన బిల్లును అడ్డుకోలేం. ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు రాజకీయాలను పక్కన పెట్టి అన్ని రాజకీయ పార్టీల ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు ఆ దిశగా చట్టసభల్లో వ్యవహరిం చేలా ఒత్తిడి చేయాలి. దీనికి ఉద్యోగ సంఘాల నేతలు వక్రభాష్యం చెబుతుండడం దురదృష్టకరం.- సామల సింహాచలం, రాష్ట్ర కార్యదర్శి, ఎస్సీ ఎస్టీ టీచర్ల సంఘం
మోసం చేయవద్దు
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి చట్టసభల్లో తీర్మానం చేయాలని ఉద్యోగ, ఉపాధ్యాయులు డిమాండ్ చేయాలి. ఈ విషయంలో రాష్ట్రస్థాయి సంఘం నాయకులు తమ సొంత నిర్ణయాలు రుద్దడం శోచనీయం. చట్టబద్ధమైన ప్రక్రియను అమలు చే యాలని ఒత్తిడి తేవడంలో బేషజానికి పోవడం సమైక్యవాదులను మోసం చేయడమే.
- బంకపల్లి శివప్రసాద్, ప్రచారకార్యదర్శి, సమైక్య ఉపాధ్యాయ పోరాట సమితి.
కిరణ్ కోవర్టుగా అశోక్‌బాబు
ఏపీ ఎన్‌జీఓ అధ్యక్షుడు అశోక్‌బాబు చర్చకు డిమాండ్ చేయడంతో ఆయన వైఖరి తేటతెల్లమయ్యింది. చర్చలో పాల్గొనడం విభజనను ఆమోదించినట్లే. ఈ విషయంలో అశోక్‌బాబు కిరణ్‌కుమార్‌రెడ్డికి కోవర్టుగా వ్యవహరిస్తున్నారు. - ఎస్. శ్రీనివాసరావు, యువజన సంఘం నాయకుడు
Advertisement
Advertisement