విజయనగరం కలెక్టరేట్, న్యూస్‌లైన్ :
సమైక్యాంధ్రకు మద్దతుగా ఎన్‌జీఓ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన సమ్మెకు తాత్కాలికంగా విరామం ఇచ్చారు. దీంతో శుక్రవారం నుంచి జిల్లాలో 25 వేల మంది ఉద్యోగులు విధులకు హాజరుకానున్నారు. ఇది తాత్కాలిక విరామమేనని, అవసరమైతే మళ్లీ ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని జిల్లా జేఏసీ నాయకులు చెప్పారు. రాష్ట్ర విభజన ప్రక్రియ ప్రకటన వచ్చినప్పటి నుంచి జిల్లాలో 35 శాఖలకు చెందిన 25 వేల మంది ఉద్యోగులు సమ్మెకు దిగిన విషయం విదితమే. ఎన్జీఓలు సమ్మెలోకి వచ్చినప్పటి నుంచి సమైక్యాంధ్ర ఉద్యమం ఊపందుకుంది. అన్ని మండలాల్లో జేఏసీలను ఏర్పాటు చేసి ఆందోళనలు నిర్వహించారు. పాలన పూర్తిగా స్తంభించింది. ఫలితంగా మండల కేంద్రంతోపాటు జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ కూడా మూత పడింది. సమ్మె కాలంలో వందలాది ఫైళ్లు పెండింగ్‌లో ఉన్నాయి.
సమ్మె నేపథ్యంలో ఆర్టీఓ కార్యాలయానికి సుమారు రూ 6 కోట్ల నష్టం వాటిల్లింది. ఖజానా కార్యాలయాలు మూతపడడంతో రూ.80 కోట్ల లావాదేవీలు నిలిచిపోయాయి. రెవెన్యూలో 300 ఫైళ్లు కదల లేదు. పంట రుణ లక్ష్యం కూడా నెరవేరలేదు. రూ.300 కోట్ల రుణ లక్ష్యం కాగా కేవలం రూ.90 కోట్లు రుణాలుగా అందజేశారు. రిజిస్ట్రేషన్ శాఖ ఉద్యోగుల సమ్మెకారణంగా ఆ శాఖ రూ.25 కోట్ల ఆదాయం నష్టపోయింది.
తెరుచుకోనున్న ప్రభుత్వ కార్యాలయాలు
ఉద్యోగులు సమ్మె గురువారం అర్ధరాత్రి నుంచి విరమించనుండడంతో శుక్రవారం నుంచి ప్రభుత్వ కార్యాలయాలు తెరుచుకోనున్నాయి. సమ్మె విరమించిన నేపథ్యంలో ఎన్జీఓలతోపాటూ రెవెన్యూ ఉద్యోగులు, వీఆర్వోలు విధులకు హాజరు కావాలని ఆయా ఉద్యోగ సంఘాల నేతలు కోరారు. సమ్మెకు సహకరించిన జిల్లా ప్రజానీకంతో పాటూ కలెక్టర్, జేసీలకు జేఏసీ నాయకులు పేడాడ జనార్దనరావు, ప్రభూజీ కృతజ్ఞతలు తెలిపారు.
సమ్మెకు విరామం
Published Fri, Oct 18 2013 2:35 AM | Last Updated on Wed, Oct 17 2018 5:10 PM
Advertisement
Advertisement