ఒంగోలు టౌన్, న్యూస్‌లైన్:
జిల్లాలో సమైక్యాంధ్ర ఉద్యమ జోరు కొనసాగుతోంది. ఆదివారం సెలవు రోజు కూడా ఉద్యమకారులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు తెలిపారు. వరుసగా 54వ రోజు ర్యాలీలు, మానవహారాలు, రిలే దీక్షలతో రాష్ట్ర విభజనపై నిరసన వ్యక్తం చేశారు. ఉద్యమంలో భాగంగా ఆర్యవైశ్యులు పీసీపల్లి మండలం పడమటిపల్లె నుంచి చేపట్టిన ‘పొట్టిశ్రీరాములు ఆత్మఘోష’ పాదయాత్ర ఆదివారం ఒంగోలు చేరింది. ఈ సందర్భంగా స్థానిక పొట్టిశ్రీరాములు విగ్రహం వద్ద భారీ బహిరంగ సభ నిర్వహించారు. సభలో పాల్గొన్న గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు మాట్లాడుతూ రాష్ట్ర విభజనలో ప్రధాన ముద్దాయి కాంగ్రెస్ పార్టీయేనని, సుదీర్ఘ చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ పెద్ద తప్పు చేసిందని నిందించారు. సీడబ్ల్యూసీ నిర్ణయాన్ని వెనుక్కు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
జిల్లాలోని పలు నియోజకవర్గ కేంద్రాలు, మండల కేంద్రాల్లో ఆదివారం ఉద్యమం ఉవ్వెత్తున సాగింది. దీనిలో భాగంగా అద్దంకి పట్టణంలో ఎన్‌జీఓలు, ఆర్టీసీ జేఏసీ నాయకులు స్థానిక బస్టాండ్ సెంటర్ నుంచి వీధుల్లో ర్యాలీ నిర్వహించి రాష్ట్రీయ రహదారిపై మానవహారం ఏర్పాటు చేసి ఆటలు ఆడి నిరసన తెలిపారు. సమైక్యాంధ్ర కోరుతూ ఐకాస నాయకుడు సుబ్బయ్య సమైక్యవాదులతో కలసి పట్టణ గ్రామ దేవత పోలేరమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. బంగ్లారోడ్‌లో సమైక్యాంధ్రకు మద్దతుగా చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 35వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా ప్రైవేట్ పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులు దీక్షల్లో పాల్గొన్నారు.
తిరుపతికి పాదయాత్ర:
సమైక్యాంధ్ర కోసం అద్దంకి నుంచి తిరుపతికి గోవిందాంబిక పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులు పాదయాత్ర మొదలుపెట్టారు. ఆయనకు పలు సంఘాల నాయకులు సంఘీభావం తెలిపారు. బల్లికురవలో ఉపాధ్యాయుల రిలే దీక్షలు 11వ రోజుకు చేరాయి. అలాగే కొణిదెన గ్రామంలోని గ్రామస్తులందరూ సంతకాలు సేకరించి రాష్ట్రపతికి పంపారు. చీరాల పట్టణంలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు చేపట్టిన రిలే దీక్షలు 23వ రోజుకు చేరాయి. ఉపాధ్యాయ జేఏసీ నాయకుల, పలు సంఘాల నాయకుల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. వేటపాలెంలో సమైక్యాంధ్రకు మద్దతుగా సర్పంచ్, వార్డు మెంబర్లు నిరాహార దీక్షలు చేపట్టారు. కారంచేడులో మండల ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దీక్షలు కొనసాగుతున్నాయి. యద్దనపూడిలో వంటా-వార్పు చేపట్టి ఉపాధ్యాయులు నిరసన తెలిపారు.
ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో ఇంకొల్లులో చేపట్టిన రిలే దీక్షలు 3వ రోజుకు చేరాయి. గిద్దలూరు మండలంలోని ముండ్లపాడులో ప్రజలు, ఉద్యోగులతో కలసి ర్యాలీ, మానవహారం నిర్వహించి వంటా-వార్పు చేపట్టారు. గిద్దలూరులోని తహసీల్దారు కార్యాలయం వద్ద జేఏసీ దీక్షా శిబిరంలో రాచర్ల మండలంలోని యడవల్లికి చెందిన యువకులు రిలే నిరాహార దీక్షలు చేశారు. ట్రాక్టరు మెకానిక్‌లు, రైతులు, ఉద్యోగ, కార్మిక సంఘాల నాయకులు ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు. బేస్తవారిపేటలో మ్యాజిక్ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఆటోలతో ర్యాలీ, రాష్ట్ర రహదారిపై మానవహారం, అర్ధనగ్న ప్రదర్శన చేశారు. కంభంలో వాసవీ విద్యానికేతన్ బీఈడీ విద్యార్థులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. కొమరోలులో ఉపాధ్యాయులు రిలే నిరాహార దీక్షలు చేశారు. అలాగే కందుకూరులోనూ సమైక్యాంధ్ర ఉద్యమం రోజు రోజుకూ ఉధృతమవుతోంది. సమైక్యాంధ్రపై గ్రామీణ ప్రాంత ప్రజలకు అవగాహన కల్పించాలని జేసీఏ ఆధ్వర్యంలో చేపట్టిన బస్‌యాత్రను ఆర్డీఓ టి.బాపిరెడ్డి ప్రారంభించారు. ఉలవపాడులో సమైక్యాంధ్ర ఉద్యమంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఉద్యోగులు చేపట్టిన బస్సుయాత్ర 6వ రోజుకు చేరుకుంది. కనిగిరిలో సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ముదిరాజ్ సంఘం యువకులు రిలేదీక్షలో కూర్చున్నారు.
ఉపాధ్యాయ సంఘాలు, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో బిక్షాటన కార్యక్రమం చేశారు. అలాగే మార్కెట్ యార్డ్ కమిటీ ఉద్యోగ సిబ్బంది చెక్ పోస్టు వద్ద రిలేదీక్షలు చేపట్టారు. రాష్ట్ర విభజనకు నిరసనగా రోడ్డుపై యూటీఎఫ్ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో వంటా వార్పు చేశారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు చేపట్టిన రిలే దీక్షలు 7వ రోజుకు చేరాయి. టీడీపీ కార్యకర్తలు 14వ రోజు రిలే దీక్షలో కూర్చున్నారు. హనుమంతునిపాడులో విద్యార్థులు మానవహారం నిర్వహించారు. పామూరులో రాష్ట్ర విభజనకు నిరసనగా సర్పంచ్ మనోహర్ చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష 5వ రోజుకు చేరింది. అలాగే వ్యవసాయ మార్కెట్ సిబ్బంది రిలేదీక్షలు చేపట్టారు. మార్కాపురంలో రాష్ట్ర విభజనను నిరసిస్తూ ఉద్యోగులు వెనక్కి నడుస్తూ వినూత్న నిరసన తెలిపారు. దోర్నాలలో సమైక్యాంధ్రకు మద్దతుగా ఉపాధ్యాయులు చేపట్టిన రిలే దీక్షలు 20 వ రోజుకు చేరాయి. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని ఉద్యమకారులు నినదిస్తున్నారు.
54వ రోజూ జిల్లా వ్యాప్తంగా కొనసాగిన ఆందోళనలు
Published Mon, Sep 23 2013 3:43 AM | Last Updated on Mon, Jun 18 2018 8:10 PM
Advertisement