గంగూలీపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయండి
Published Sat, Dec 7 2013 10:36 PM | Last Updated on Wed, Oct 17 2018 5:10 PM
న్యూఢిల్లీ: సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తి అశోక్‌కుమార్ గంగూలీపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలంటూ ఢిల్లీ పోలీసులపై ఒత్తిడి అంతకంతకూ పెరుగుతోంది. కోల్‌కతాకు చెందిన స్వచ్ఛంద సంస్థ భారత్ బచావో ఆందోళన్ ఈ విషయమై ఢిల్లీ పోలీస్ కమిషనర్ బీఎస్ బస్సీకి లేఖ రాసింది. గంగూలీపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాల్సిందిగా లేఖలో కోరింది. లా ఇంటర్న్‌గా పనిచేస్తున్న యువతిని గంగూలీ లైంగికంగా వేధించారనే ఆరోపణలు ఈ కేసు ఉన్నత స్థాయి కేసని, సాక్షులను ప్రభావితం చేసి, ఆధారాలను మాయం చేసే అవకాశముందని ఎన్జీవో ఆందోళన వ్యక్తం చేసింది. లైంగికంగా వేధింపుల ఘటన జరిగిన హోటల్ లీ మెరిడియన్ పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ పరిధిలోనిది కావడంతో ఆ పోలీస్ స్టేషన్‌కు కూడా ఎన్జీవో లేఖ రాసింది. వెంటనే స్పందించి ఆధారాలు సేకరించాలని లేఖలో కోరింది. ‘పోలీసులు అవసరమైన ఆధారాలన్నింటిని సేకరించాలి. సీసీటీవీ దృశ్యాలను స్వాధీనం చేసుకోవాల’ని లేఖలో కోరినట్లు భారత్ బచావో సంఘటన్ అధ్యక్షురాలు వినీత్ రుయా తెలిపారు.
గంగూలీని అరెస్టు చేయాలనే డిమాండ్‌తో మానవ హక్కుల దినం సందర్భంగా ఈ నెల 10న ర్యాలీ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్ మానవహక్కుల సంఘం చైర్మన్ అయిన రుయా ఇదివరకే హరే స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు కూడా లేఖ రాశారు. అంతేకాక గంగూలీ ఇంటిముందు మౌనదీక్ష కూడా నిర్వహించారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా గంగూలీపై చర్యలు తీసుకోవాలని కోరుతూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ఇప్పటికే రెండుసార్లు లేఖ రాశారు. సుప్రీం కోర్టు నియమించిన ముగ్గురు సభ్యులు కమిటీ కూడా గంగూలీ ప్రవర్తనను తప్పుబట్టిన విషయం తెలిసిందే. కాగా బాధితురాలు తనపట్ల జరిగిన అన్యాయాన్ని బ్లాగు ద్వారా వివరించడంతో.. ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని ఢిల్లీ పోలీసులు ఆమెకు లేఖ రాసిన విషయం తెలిసిందే.
Advertisement
Advertisement