సీమాంధ్ర వ్యతిరేకులతో మంత్రుల కమిటీ వేయడం విడ్డూరంగా ఉందని మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణ, ఎన్జీవో సంఘం అధ్యక్షుడు వెంకటేశ్వరరెడ్డి అన్నారు.
సీమాంధ్ర వ్యతిరేకులతో మంత్రుల కమిటీనా?
Published Thu, Oct 10 2013 3:14 AM | Last Updated on Wed, Oct 17 2018 5:10 PM
ప్రొద్దుటూరు టౌన్, న్యూస్‌లైన్: సీమాంధ్ర వ్యతిరేకులతో మంత్రుల కమిటీ వేయడం విడ్డూరంగా ఉందని మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణ, ఎన్జీవో సంఘం అధ్యక్షుడు వెంకటేశ్వరరెడ్డి అన్నారు. మున్సిపల్ కార్యాలయం ఎదుట మున్సిపల్ ఉద్యోగులు, కార్మికులు, స్వయం సహాయక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో 21మంది మున్సిపల్ ఉద్యోగులు చేస్తున్న ఆమరణ నిరాహార దీక్ష 3వ రోజుకు చేరుకున్న సందర్భంగా వారిని ఎన్జీవో సంఘం నాయకులు, విద్యుత్ జేఏసీ నాయకులు తదితరులు సందర్శించి సంఘీభావం తెలిపారు. కమిషనర్, ఎన్జీవో సంఘం అధ్యక్షుడు మాట్లాడుతూ ఎన్టీఆర్ కుమార్తె మంత్రి పురంధేశ్వరి తెలుగు జాతిని ఢిల్లీ వీధుల్లో తాకట్టుపెట్టి మొసలి కన్నీరు కారుస్తోందన్నారు.
రాజీనామా చేయడానికి మదనపడ్డామని బహిరంగంగా చెప్పడాన్ని చూస్తే సిగ్గుతో తల వంచుకోవాలన్నారు. తెలుగు ప్రజల ఆత్మాభిమానాన్ని ఇటలీ వనితకు తాకట్టు పెట్టారా అని ప్రశ్నించారు. సోనియాజీ క్విట్ ఇండియా అంటూ నినాదాలు చేశారు. సీమాంధ్ర మంత్రులను తెలుగు జాతి ప్రజలు తరిమికొట్టే రోజు దగ్గరలో ఉందన్నారు. రాజీనామాల పేరుతో రాజీ డ్రామాలు ఆడవద్దని హెచ్చరించారు. ఏపీ ట్రాన్స్‌కో, ఏపీ జెన్‌కో, డిస్కంలు సమ్మెలోకి దిగడంతో కేంద్ర ప్రభుత్వంలో కదలిక వచ్చిందన్నారు. దక్షణాదిలో గ్రిడ్ ఫెయిలైతే ఐదు రాష్ట్రాల్లోని మంత్రులు ఇబ్బంది పడతారని కేంద్రం దిగి వస్తోంది తప్ప సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమాన్ని చూసి కాదన్నారు.
కాంగ్రెస్ పార్టీలో ఏ పదవీ లేని దిగ్విజయ్‌సింగ్ చర్చలకు పిలుస్తామని చెప్పడం ఏమిటని ప్రశ్నించారు. విద్యుత్ జేఏసీ నాయకుడు జయరాజ్ మాట్లాడుతూ విద్యుత్ వదిలినప్పటి నుంచి అన్ని బల్పులు వేసి విద్యుత్‌ను వాడితే గ్రిడ్ ఫెయిల్ అవుతుందని, ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని కోరారు. సంఘీభావం తెలిపినవారిలో మున్సిపల్ జేఏసీ నాయకులు సబ్దార్, గౌడ్, రామచంద్రప్రభు, దస్తగిరమ్మ, కెజియాజాస్లిన్, శ్రీదేవి, విమల, రసూలమ్మ, పాలిటెక్నిక్ విద్యార్థులు ఉన్నారు. దీక్షలు చేస్తున్న వారికి ప్రభుత్వ వైద్యులు రక్తం, బీపీ, షుగర్ పరీక్షలు చేశారు.
Advertisement
Advertisement