శాంతియుతంగా సాగుతున్న మునిసిపల్ కార్మికుల సమ్మెపై సర్కార్ ఉక్కుపాదం మోపింది. పోలీసుల ద్వారా ఉద్యమాన్ని అణచివేసింది. సోమవారం నిర్వహించతలపెట్టిన మంత్రి కాలవ శ్రీనివాసులు ఇంటి ముట్టడిని భగ్నం చేసింది. కార్మికులపై పోలీసులు విరుచుకుపడ్డారు. పిడిగుద్దులు గుద్ది బలవంతంగా ఈడ్చి వాహనాల్లోకి విసిరేశారు. ఈ క్రమంలో మహిళలని కూడా చూడకుండా మగ పోలీసులు విచక్షణారహితంగా ప్రవర్తించారు.
అనంతపురం న్యూసిటీ: పారిశుద్ధ్య పనులను ప్రైవేట్ ఏజెన్సీలకు ఇచ్చి కార్మికులను రోడ్డుపాలు చేసే జీఓ 279ను రద్దు చేయాలని, కనీస వేతనాలు అమలు చేయాలని మునిసిపల్ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో చేపడుతున్న సమ్మెలో తారస్థాయికి చేరింది. డిమాండ్ల సాధనలో భాగంగా సోమవారం సీపీఎం, సీఐటీయూ, ఏఐటీయూసీ, ఎస్‌యూసీఐ మద్దతుతో మునిసిపల్ కార్మికులు రామ్‌నగర్‌లోని మంత్రి కాలవ శ్రీనివాసులు ఇంటి ముట్టడించేందుకు భారీ సంఖ్యలో వెళ్లారు. ఇంటి ముందు బైఠాయించి జీఓ 279ను రద్దు చేయాలని నినాదాలు చేశారు. అనంతరం ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నించగా అప్పటికే అక్కడ భారీగా మోహరించిన పోలీసులు అడ్డుకున్నారు. దొరికిన కార్మికులను దొరికినట్టుగా అక్కడి నుంచి ఈడ్చిపడేశారు.
కొంతమంది నాయకులను చుట్టుముట్టి కాళ్లు, చేతులు పట్టుకుని లాగేశారు. చేతులు పెడవిరిచి, మెడను తిప్పి, పిడిగుద్దులు గుద్దారు. నొప్పితో విలవిలలాడినా కర్కశంగా వ్యవహరించారు. మహిళా కార్మికులపైనా విరుచుకుపడ్డారు. లేడీ కానిస్టేబుళ్లతో వారిని అక్కడి నుంచి పక్కకు పంపించే అవకాశం ఉన్నా మగ పోలీసులు రెచ్చిపోయారు. మహిళలు పక్కకు కదలకుండా వారిని చుట్టుముట్టి.. వారిని చేతులతో నెట్టుతూ బలవంతంగా వాహనాల్లోకి కుక్కారు. ఒంటిపై దుస్తులు జారిపోతున్నా ఏమాత్రం పట్టించుకోలేదు. డీఎస్పీ వెంకట్రావ్ ఆదేశాల మేరకు కార్మికులను బలవంతంగా పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పోలీసుల తోపులాటలో సీఐటీయూ నాయకులు గోపాల్, మంజుల, నాగరత్న, ఆదిలక్ష్మి, శివ గాయపడ్డారు. వీరిని పోలీసు స్టేషన్ నుంచి సర్వజనాస్పత్రికి తరలించారు. మంజుల, ఆదిలక్ష్మిలకు ఫ్రాక్చర్ అయినట్లు తెల్సింది.
దుర్మార్గపు చర్య
జీఓ 279 రద్దు చేయాలని పోరాడుతున్న కార్మికులపై దాడులు చేయడం దుర్మార్గపు చర్య అని వామపక్షాల నేతలు నాగేంద్ర, రాజారెడ్డి, నాగరాజు, కార్మిక సంఘాల నేతలు గోపాల్, రాజేష్‌గౌడ్ ఖండించారు. ఉద్ధేశ్యపూర్వకంగానే కార్మికులపై పోలీసులు దాడులు చేశారన్నారు. మహిళా కార్మికులని చూడకుండా దాడులు చేయడం సరికాదన్నారు. మహిళలను మగ పోలీసుల ద్వారా బలవంతంగా జీపులోకి తోసేయడం దారుణమన్నారు. సమ్మెను ప్రభుత్వం నిర్వీర్యం చేయడానికి కుట్ర చేస్తోందని ధ్వజమెత్తారు. ఈ నెల 19 నుంచి ప్రత్యక్ష ఆందోళన చేపడతామని స్పష్టం చేశారు. అత్యవసర సేవలకు కార్మికులు రారని తేల్చి చెప్పారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ మంగళవారం కలెక్టరేట్ ముట్టడికి పిలుపునిచ్చారు.
పరామర్శ
పోలీసుల తోపులాటలో గాయపడ్డ కార్మికులను వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్ జానకి పరామర్శించారు. కార్మికుల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని ఆమె తప్పుబట్టారు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం సరికాదని ధ్వజమెత్తారు.
పోలీసులా.. పశువులా?
ఏం సార్ పోలీసులకు పెళ్లాం, బిడ్దలుండరా? ఎక్కడపడితే అక్కడ చేతులు వేస్తారా? యదపై చేతులు వేసి అసభ్యంగా ప్రవర్తించారు. ఒంటిపై చీరలేకుండా ఊడదీశారు. దెబ్బలు తగిలినా బాధ లేదు. కానీ పోలీసులు చేసిన పనులు బాగలేవు. వాళ్లు పోలీసులా..పశువులా?
– మంజుల, పారిశుద్ధ్య కార్మికురాలు
Comments
Please login to add a commentAdd a comment