womes
-
ఒక ఊరికథ..మంచిపని ఊరకే పోలేదు...ఎన్నో ఊళ్లకు స్ఫూర్తి ఇచ్చింది
బాలాసోర్ జిల్లా(ఒడిశా) బస్తా బ్లాక్‌లోని అంబక్చౌ అనే గ్రామం అది. ఊరు ఎప్పుడూ ప్రశాంతంగా ఉండదు. కరువు కావచ్చు కరోనా కావచ్చు మరేదైనా కష్టం కావచ్చు. ఉపాధి కష్టమయ్యేది. ఊళ్లోని మగవాళ్లు పనుల కోసం పట్టణాలు వెదుక్కుంటూ వెళ్లేవాళ్లు. అలా పట్టణాలకు వెళ్లి కొత్త అలవాట్లు నేర్చుకొని కష్టపడిన సొమ్మును మద్యానికి తగలేసిన వారు కూడా ఉన్నారు. ఇక ఆ ఊళ్లో మహిళల విషయానికి వస్తే ఊరు దాటిన సందర్భాలు వేళ్ల మీద లెక్కపెట్టుకోవచ్చు. ఇంటిపనులు పూర్తయిన తరువాత, ఆరుబయట కూర్చొని మాట్లాడుకుంటున్న సందర్భంలో ‘మనం ఎందుకు వ్యాపారం మొదలుపెట్టకూడదు!’ అన్నారు ఒకరు. కొందరు నవ్వారు. కొందరు ఆలోచించారు. ఆ మాట ఈ మాట పూర్తయిన తరువాత అందరూ ఒక ఆలోచనకు వచ్చారు. ఆవులను కొనాలని. తాము కూడబెట్టుకున్న డబ్బు, అప్పు చేసిన సొమ్ముతో 13 మంది మహిళలు కలిసి 10 ఆవులను కొనుగోలు చేశారు. ‘శివశంకర్’ పేరుతో స్వయంసహాయక బృందంగా ఏర్పడ్డారు. ‘వాటిని మేపడానికే మీ జీవితం సరిపోతుంది’ అని వెక్కిరించిన వాళ్లు ఉన్నారు. బృందంలోని సభ్యులలో చాలామంది భర్తల మూలంగా ఇబ్బంది పడ్డారు. భర్తలు భరించలేదు! ‘వాళ్ల మాటలు విని డబ్బు తగలేస్తావా?’ అంటాడు ఒక భర్త. ‘ఇంత డబ్బు నీ దగ్గర ఉందని ఎప్పుడూ చెప్పలేదేం’ అని ఈసడిస్తాడు ఒక భర్త. అయితే వారు వేటికీ చలించలేదు. మొదట పాలవ్యాపారం. ఆ తరువాత పెరుగు, నెయ్యి, వెన్న... మొదలైనవి అమ్మడం మొదలుపెట్టారు. ఆ ఊళ్లోనే కాదు... చుట్టు పక్కల ఊళ్లో నుంచి కూడా పాల ఉత్పత్తులు కొనడానికి వచ్చేవాళ్లు. ఆ తరువాత...రసగుల్లతో పాటు ఆ ప్రాంతంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ‘చెన’లాంటి స్వీట్ల తయారీ మొదలుపెట్టారు. సమీప పట్టణమైన బాలాసోర్‌లో ఈ స్వీట్లను అమ్మే ప్రయత్నం మొదలుపెట్టినప్పుడు ‘పట్టణాల్లో మీ పల్లె మిఠాయిలు ఎవరు కొంటారు? అక్కడ పెద్ద పెద్ద స్వీట్‌షాప్‌లు ఉంటాయి’ అని వెనక్కిలాగే ప్రయత్నం చేశారు కొందరు. అయితే వారు వెనక్కి తగ్గలేదు. స్వీట్ హిట్æ ‘శివశంకర్ స్వీట్’ సూపర్ హిట్ అయింది! బాలాసోర్‌లోనే కాదు బధ్రక్, మహారాజ్‌గంజ్... మొదలైన పట్టణాలతో పాటు పశ్చిమబెంగాల్‌కు కూడా విస్తరించింది స్వీట్ల వ్యాపారం. ‘మొదట్లో భయమేసి వెనక్కి తగ్గుదాం అనుకున్నాను. కాని ఆతరువాత నాకు నేనే ధైర్యం చెప్పుకున్నాను. కొనసాగాను. శివశంకర్ బృందంలో నేను కూడా భాగం అయినందుకు గర్విస్తున్నాను’ అంటుంది మాలతి. ‘వారి మాటల్లోని నిజాయితీ, వారి ఉత్పత్తుల్లో కూడా కనిపిస్తుంది. ఎక్కడా కల్తీ ఉండదు. నాణ్యంగా ఉంటాయి’ అంటున్నాడు బాలాసోర్‌కు చెందిన వైద్యుడు చందన్. ఇది అతడి మాట మాత్రమే కాదు ఎంతోమంది మాట. అందుకే ‘శివశంకర్’ పాల ఉత్పత్తులకు మంచి పేరు వచ్చింది. అడ్వాన్స్డ్ టెక్నాలజీ కూడా ఉపయోగించడం ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నారు. ఒక మంచిపని ఊరకే పోదు! ఎన్నో ఊళ్లకు స్ఫూర్తిని ఇస్తుందని గెలుపుజెండా ఎగరేసి నిరూపించారు పదమూడు మంది మహిళలు. -
ఏపీ సీఎంఓ స్పందనపై బాధిత కుటుంబాలు హర్షం
సాక్షి, విజయవాడ: కువైట్ ఎంబసీ పునరావాస కేంద్రంలో చిక్కుకున్న పశ్చిమగోదావరి మహిళల కష్టాలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయం స్పందించింది. తమ దీనావస్థను తెలియజేస్తూ.. బాధిత మహిళలు విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో మంగళవారం సీఎంఓ కార్యాలయం ఆదేశాలతో ’దిశా’ స్పెషల్ ఆఫీసర్ దీపికా పాటిల్, పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ నవదీప్ సింగ్ రంగంలోకి దిగారు. బాధితుల కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరించారు. కువైట్ ఎంబసీతో సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు. నలుగురు బాధిత మహిళలకు విముక్తి కల్పించి, దుబాయ్ నుంచి వారి స్వగ్రామాలకు తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. సీఎంఓ స్పందనపై బాధిత మహిళల కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.( ఇక్కడ చదవండి: జగనన్నా.. మమ్మల్ని మీరే కాపాడాలి! ) -
ఏం సార్ పోలీసులకు పెళ్లాం, బిడ్దలుండరా?
శాంతియుతంగా సాగుతున్న మునిసిపల్ కార్మికుల సమ్మెపై సర్కార్ ఉక్కుపాదం మోపింది. పోలీసుల ద్వారా ఉద్యమాన్ని అణచివేసింది. సోమవారం నిర్వహించతలపెట్టిన మంత్రి కాలవ శ్రీనివాసులు ఇంటి ముట్టడిని భగ్నం చేసింది. కార్మికులపై పోలీసులు విరుచుకుపడ్డారు. పిడిగుద్దులు గుద్ది బలవంతంగా ఈడ్చి వాహనాల్లోకి విసిరేశారు. ఈ క్రమంలో మహిళలని కూడా చూడకుండా మగ పోలీసులు విచక్షణారహితంగా ప్రవర్తించారు. అనంతపురం న్యూసిటీ: పారిశుద్ధ్య పనులను ప్రైవేట్ ఏజెన్సీలకు ఇచ్చి కార్మికులను రోడ్డుపాలు చేసే జీఓ 279ను రద్దు చేయాలని, కనీస వేతనాలు అమలు చేయాలని మునిసిపల్ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో చేపడుతున్న సమ్మెలో తారస్థాయికి చేరింది. డిమాండ్ల సాధనలో భాగంగా సోమవారం సీపీఎం, సీఐటీయూ, ఏఐటీయూసీ, ఎస్‌యూసీఐ మద్దతుతో మునిసిపల్ కార్మికులు రామ్‌నగర్‌లోని మంత్రి కాలవ శ్రీనివాసులు ఇంటి ముట్టడించేందుకు భారీ సంఖ్యలో వెళ్లారు. ఇంటి ముందు బైఠాయించి జీఓ 279ను రద్దు చేయాలని నినాదాలు చేశారు. అనంతరం ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నించగా అప్పటికే అక్కడ భారీగా మోహరించిన పోలీసులు అడ్డుకున్నారు. దొరికిన కార్మికులను దొరికినట్టుగా అక్కడి నుంచి ఈడ్చిపడేశారు. కొంతమంది నాయకులను చుట్టుముట్టి కాళ్లు, చేతులు పట్టుకుని లాగేశారు. చేతులు పెడవిరిచి, మెడను తిప్పి, పిడిగుద్దులు గుద్దారు. నొప్పితో విలవిలలాడినా కర్కశంగా వ్యవహరించారు. మహిళా కార్మికులపైనా విరుచుకుపడ్డారు. లేడీ కానిస్టేబుళ్లతో వారిని అక్కడి నుంచి పక్కకు పంపించే అవకాశం ఉన్నా మగ పోలీసులు రెచ్చిపోయారు. మహిళలు పక్కకు కదలకుండా వారిని చుట్టుముట్టి.. వారిని చేతులతో నెట్టుతూ బలవంతంగా వాహనాల్లోకి కుక్కారు. ఒంటిపై దుస్తులు జారిపోతున్నా ఏమాత్రం పట్టించుకోలేదు. డీఎస్పీ వెంకట్రావ్ ఆదేశాల మేరకు కార్మికులను బలవంతంగా పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పోలీసుల తోపులాటలో సీఐటీయూ నాయకులు గోపాల్, మంజుల, నాగరత్న, ఆదిలక్ష్మి, శివ గాయపడ్డారు. వీరిని పోలీసు స్టేషన్ నుంచి సర్వజనాస్పత్రికి తరలించారు. మంజుల, ఆదిలక్ష్మిలకు ఫ్రాక్చర్ అయినట్లు తెల్సింది. దుర్మార్గపు చర్య జీఓ 279 రద్దు చేయాలని పోరాడుతున్న కార్మికులపై దాడులు చేయడం దుర్మార్గపు చర్య అని వామపక్షాల నేతలు నాగేంద్ర, రాజారెడ్డి, నాగరాజు, కార్మిక సంఘాల నేతలు గోపాల్, రాజేష్‌గౌడ్ ఖండించారు. ఉద్ధేశ్యపూర్వకంగానే కార్మికులపై పోలీసులు దాడులు చేశారన్నారు. మహిళా కార్మికులని చూడకుండా దాడులు చేయడం సరికాదన్నారు. మహిళలను మగ పోలీసుల ద్వారా బలవంతంగా జీపులోకి తోసేయడం దారుణమన్నారు. సమ్మెను ప్రభుత్వం నిర్వీర్యం చేయడానికి కుట్ర చేస్తోందని ధ్వజమెత్తారు. ఈ నెల 19 నుంచి ప్రత్యక్ష ఆందోళన చేపడతామని స్పష్టం చేశారు. అత్యవసర సేవలకు కార్మికులు రారని తేల్చి చెప్పారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ మంగళవారం కలెక్టరేట్ ముట్టడికి పిలుపునిచ్చారు. పరామర్శ పోలీసుల తోపులాటలో గాయపడ్డ కార్మికులను వైఎస్సార్సీపీ కార్పొరేటర్ జానకి పరామర్శించారు. కార్మికుల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని ఆమె తప్పుబట్టారు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం సరికాదని ధ్వజమెత్తారు. పోలీసులా.. పశువులా? ఏం సార్ పోలీసులకు పెళ్లాం, బిడ్దలుండరా? ఎక్కడపడితే అక్కడ చేతులు వేస్తారా? యదపై చేతులు వేసి అసభ్యంగా ప్రవర్తించారు. ఒంటిపై చీరలేకుండా ఊడదీశారు. దెబ్బలు తగిలినా బాధ లేదు. కానీ పోలీసులు చేసిన పనులు బాగలేవు. వాళ్లు పోలీసులా..పశువులా? – మంజుల, పారిశుద్ధ్య కార్మికురాలు -
మహిళలు చట్టాలపై అవగాహన పెంచుకోవాలి
జిల్లా జడ్జి నాగమారుతీశర్మ ముకరంపుర : మహిళలు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని జిల్లా జడ్జి నాగమారుతీశర్మ అన్నారు. శుక్రవారం స్వశక్తి కళాశాలలో జిల్లా సోషల్ యాక్షన్ కమిటీ సభ్యుల నెలవారీ సమావేశంలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ సోషల్ యాక్షన్ కమిటీ ద్వారా కేసుల పరిష్కారం పారదర్శకంగా ఉండాలన్నారు. ఇరువర్గాలకు కౌన్సెలింగ్ నిర్వహించి కేసులు పరిష్కరించాలని సూచించారు. ఎన్ని ఆటుపోట్లు వచ్చినా న్యాయం వైపే మొగ్గు చూపాలన్నారు. లీగల్ సర్వీసెస్ అథారిటీ ద్వారా జిల్లా సోషల్ యాక్షన్ కమిటీ సభ్యులకు శిక్షణ ఇప్పించి అర్హులను పారా లీగల్ సభ్యురాలిగా కార్డు ఇప్పిస్తామని తెలిపారు. అనంతరం జడ్జిని సన్మానించారు. డీఆర్డీఏ పీడీ అరుణశ్రీ, లీగల్ సర్వీసెస్ అ«థారిటీ సెక్రటరీ భవానిచంద్ర, ఏపీడీ వై.రమేశ్, ప్రాజెక్టు మేనేజర్ పి.సునిత, సెర్ప్ హ్యూమన్ డెవలప్మెంట్ ప్రాజెక్టు మేనేజర్ జంగారెడ్డి, లీగల్ కన్సల్టెంట్ వేణుగోపాల్ తదితరులున్నారు.