సాక్షి, రాజమండ్రి :
సమైక్య ఉద్యమంలో 52వ రోజైన శుక్రవారం జిల్లా నిరసనలు, ర్యాలీలతో మారుమోగింది. ఏపీ ఎన్‌జీఓల రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు వరుసగా రెండవ రోజు కూడా జిల్లా అంతటా బీఎస్‌న్‌ఎల్, తపాలా శాఖ వంటి కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను, బ్యాంకులను ముట్టడించారు. జిల్లాలో 250కి పైగా ప్రధాన బ్యాంకుల శాఖలు మూతపడగా రూ.300 కోట్ల మేర లావాదేవీలు నిలిచిపోయాయి. విజయవాడలో జరిగిన ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభకు పెద్ద సంఖ్యలో ఉద్యోగులు బస్సులు, ఇతర వాహనాల్లో ఉదయాన్నే తరలి వెళ్లారు. ధవళేశ్వరంలో దీక్షా శిబిరం వద్ద ఇరిగేషన్ ఉద్యోగి ఏడుకొండలు కట్టబ్రహ్మన్న వేషంతో, మరో ఉద్యోగి వై. సూర్యనారాయణ పొట్టి శ్రీరాములు వేషంతో ఆకట్టుకున్నారు. రాజమండ్రిలో గోకవరం బస్టాండు వద్ద ఎన్‌జీఓలు మానవహారం నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ రాజేంద్ర ప్రసాద్ రిక్షా తొక్కి నిరసన తెలిపారు. పశుసంవర్థక శాఖ జేఏసీ జిల్లా చైర్మన్ డాక్టర్ రామకోటేశ్వరరావు ఆధ్వర్యంలో రోడ్డుపై డప్పులు కొడుతూ నిరసన తెలిపారు. బొమ్మూరులో మాజీ సర్పంచ్ మత్స్యేటి ప్రసాద్ 50 గంటల దీక్షను జిల్లా టీడీపీ అధ్యక్షులు నిమ్మకాయల చినరాజప్ప విరమింప చేశారు. ఉద్యోగులు ఓఎన్‌జీసీ కార్యాలయాన్ని రెండవ రోజు కూడా ముట్టడించారు.
తెలుగుతల్లికి దిష్టితీత
కాకినాడ జెడ్పీ సెంటర్‌లో న్యాయశాఖ ఉద్యోగులు మోకాళ్లపై నడుస్తూ నిరసన తెలిపారు. రిజిస్ట్రేషన్ శాఖ ఉద్యోగులు రోడ్డుపై బూరాలు ఊదుతూ, దస్తావేజు లేఖరులు విల్లంబులతో నిరసన ప్రదర్శన చేశారు. న్యాయశాఖ గుమస్తాలు రామారావుపేటలో తెలుగుతల్లి విగ్రహాలకు కొబ్బరికాయలతో దిష్టి తీశారు. పీఆర్ డిగ్రీ కళాశాలలో కొందరు అధ్యాపకులు విధులు నిర్వహిస్తుండడంతో సమైక్యవాదులు అక్కడకు చేరుకుని ఫర్నిచర్ ధ్వంసం చేశారు. ప్రిన్సిపాల్ సత్యనారాయణకు పసుపు, కుంకుమ, గాజులతో చీర అందచేసి నిరసన తెలిపారు. అనంతరం ఆయనను జేఏసీ శిబిరం వద్దకు తీసుకువచ్చి సమైక్య నినాదాలు చేశారు. ఆంధ్రా యూనివర్సిటీ క్యాంపస్ విద్యార్థులు అచ్చంపేట సెంటర్‌లో నిరసన ప్రదర్శన చేశారు. విలియమ్స్ విద్యాసంస్థల విద్యార్థులు, నిర్వాహకులు రాయుడుపాలెంలో ర్యాలీ, రాస్తారోకో చేశారు. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే కురసాల కన్నబాబు తూరంగి నుంచి సర్పవరం జంక్షన్ వరకూ బెక్ ర్యాలీ చే శారు.
సమైక్యాంధ్రను కోరుతూ బుర్రకథాగానం
అమలాపురం గడియారస్తంభం సెంటర్ శిబిరంలో కోచ్ కంకిపాటి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో జిమ్ క్రీడాకారులు రిలే దీక్షలు చేపట్టారు. భీమనపల్లిలో బుడగ, బేడ జంగాలు బొబ్బిలి బుర్రకథలు ఆలపించి సమైక్య రాష్ట్రం కోసం మద్దతు పలికారు. ఉప్పలగుప్తంలో మండల రైతు సంఘం ఆధ్వర్యంలో రాస్తారోకో చేసి, రోడ్డుపై నాట్లు వేసి నిరసన తెలిపారు. గొల్లవిల్లిలో రైతు సంఘం
నేతలు, ఎన్.కొత్తపల్లిలో ఉపాధ్యాయులు రిలే దీక్షలు చేశారు. ముమ్మిడివరంలో బుడగా, బేడ సంఘం ఆధ్వర్యంలో బుర్రకథలో కేసీఆర్, సోనియాలను ప్రధాన పాత్ర లుగా చేసి వారికి శాపనార్థాలు పెడుతూ ప్రదర్శన చేశారు. యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు కొత్తపేట మండలంలోని పలు గ్రామాల్లో యాత్ర చేశారు. రావులపాలెం సెంటర్, గోపాలపురంలో జాతీయ రహదారిపై మహిళలు మానవహారంగా ఏర్పడి సమైక్య నినాదాలు చేశారు. ఆత్రేయపురంలో జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న దీక్షలుకు జిల్లా టీడీపీ అధ్యక్షులు చిమ్మకాయల చినరాజప్ప, మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు, నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి రెడ్డి సుబ్రహ్మణ్యం సంఘీభావం తెలిపారు.
రాజోలు నుంచి అప్పనపల్లికి పాదయాత్ర
రాజోలు ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో రాజోలు నుంచి అప్పనపల్లి శ్రీ బాలబాలాజీ ఆలయం వరకూ 16 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. దారిలో మామిడికుదురు మసీదులో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అప్పనపల్లి చేరుకుని శ్రీ బాలబాలాజీ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మామిడికుదురులో జాతీయ రహదారిపై మండల ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో సమైక్యవాదులు డ్రిల్ చేస్తూ నిరసన తెలిపారు. తూర్పుపాలెంలో ఓఎన్‌జీసీ గ్యాస్ కలెక్షన్ సెంటర్‌ను సమైక్య వాదులు ముట్టడించి, కార్యకలాపాలను అడ్డుకున్నారు. వాహనాలు బయటికి రాకుండా ప్రధాన గేటు ముందు బైఠాయించి సమైక్య నినాదాలు చేశారు. మలికిపురంలో అధ్యాపకులు డప్పు వాయిస్తూ రాష్ట్ర విభజనకు నిరసన తెలిపారు. బట్టేలంక సెంటర్‌లో యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు మానవహారంగా ఏర్పడి నినాదాలు చేశారు.
సామర్లకోటలో వీఆర్‌ఓ అవసరాల గోపాలకృష్ణ 24 గంటల నిరవధిక దీక్ష చేపట్టారు. పెద్దాపురం జేఏసీ శిబిరంలో కళాకారుడు అశోక్‌కుమార్ జూనియర్ ఎన్‌టీఆర్‌గా సమైక్య గీతాలకు డ్యాన్స్ చేసి అలరించాడు. ఉద్యోగులు తహశీల్దారు కార్యాలయం వద్ద రాస్తారోకో చేశారు. గృహ నిర్మాణశాఖ ఉద్యోగులు జేఏసీ దీక్షల్లో పాల్గొన్నారు. తుని అల్లూరి సీతారామరాజు సెంటర్‌లో తుని, పాయకరావుపేట పండ్ల వర్తక సంఘం సభ్యులు దీక్షల్లో పాల్గొన్నారు. రెవెన్యూ కార్యాలయం వద్ద ఉద్యోగులు జేఏసీ దీక్షల్లో పాల్గొన్నారు. రోడ్డుపై బ్యాడ్మింటన్, కబడ్డీ ఆడి నిరసన తెలిపారు. మున్సిపల్ కార్యాలయం వద్ద పురపాలక సంఘ ఉద్యోగులు దీక్షలు కొనసాగించారు. ఏలేశ్వరంలో నాయీ బ్రాహ్మణులు బ్యాండుతో ర్యాలీ చేసి, అనంతరం రోడ్డుపై క్షవరాలు చేస్తూ నిరసన తెలిపారు.
జగ్గంపేటలో జర్నలిస్టుల బంద్
జర్నలిస్టుల ఆధ్వర్యంలో జగ్గంపేట బంద్ నిర్వహించారు. ఈ సందర్భంగా అన్ని వర్గాల సమైక్యవాదులు ఒకే వేదికపై చేరి సమైక్య నినాదాలు చేశారు. కేసీఆర్, సోనియా దిష్టిబొమ్మలు దహనం చేశారు. గండేపల్లి, కిర్లంపూడి ప్రాంతాల జేఏసీ సభ్యులు బంద్‌కు మద్దతు పలికారు. కె.గంగవరంలో ఉపాధ్యాయులు రైల్‌రోకో చేపట్టారు. కాకినాడ, కోటిపల్లి రైల్ కారును 10 నిమిషాలు అడ్డుకున్నారు. ద్రాక్షారామ, కాజులూరుల్లో జేఏసీ వంటా వార్పూ చేపట్టింది. రంపచోడవరంలో ప్రధానోపాధ్యాయులు, వార్డెన్ల సమావేశాన్ని సమైక్య వాదులు అడ్డుకున్నారు.
రాజమండ్రిలో ప్రైవేట్ కళాశాలల జేఏసీ సమావేశం
ప్రైవేట్ కళాశాలల జేఏసీ రాజమండ్రి మహిళా డిగ్రీ కళాశాల ఆవరణలో సమావేశమై 23 నుంచి నగరంలో పూర్తి బంద్ చేసేందుకు నిర్ణయించారు. నర్సరీ నుంచి పీజీ వరకూ ప్రైవేట్ విద్యా సంస్థల వరకు బంద్ పాటిస్తూ నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తారు.
నగరంలో 25న విద్యార్థులతో మహా సైకిల్ ర్యాలీ, 26న పుష్కరాల రేవులో స్కేటింగ్, కోలాటం, విద్యార్థినులకు ముగ్గుల పోటీలు నిర్వహిస్తారు. 27న విద్యార్థి గళ ఘోష, 28న మోరంపూడి సెంటర్‌లో విద్యార్థి లక్ష గళార్చన నిర్వహిస్తారు. 30న పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలు, ప్రిన్సిపాళ్లు పుష్కరాల రేవు వద్ద రిలే దీక్షలు చేపడతారు. సమావేశంలో జేఏసీ చైర్మన్ టి.కె.విశ్వేశ్వరరెడ్డి, కన్వీనర్ గంగిరెడ్డి తదితర నేతలు హాజరయ్యారు.
వైఎస్సార్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో..
ముమ్మిడివరం మండలం అయినాపురంలో జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన వంటా వార్పూ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ సీజీసీ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ పాల్గొన్నారు. ఏలేశ్వరంలో వైఎస్సార్ కాంగ్రెస్ నేత అలమండ చలమయ్య ఆధ్వర్యంలో మెయిన్ రోడ్డులో కుండలు చేస్తూ నిరసన తెలిపారు. వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో మామిడికుదురులో కార్యకర్తలు చేపట్టిన దీక్షలు 32వ రోజుకు చేరాయి. రాజోలు కో ఆర్డినేటర్ మత్తి జయప్రకాష్ పాల్గొన్నారు. మలికిపురంలో వైఎస్సార్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి.
హోరెత్తిన మహా ‘జన’ గర్జన
అమలాపురం/అంబాజీపేట, న్యూస్‌లైన్ :
అంబాజీపేట సమైక్య నినాదాలతో హోరెత్తింది. మండల జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం అంబాజీపేట సెంటర్‌లో మహాజన గర్జన ఉద్ధృతంగా జరిగింది. మండలవ్యాప్తంగానే కాకుండా ఇతర మండలాల నుంచి సైతం వేలాదిగా సమైక్యవాదులు తరలిరావడంతో అంబాజీపేట సెంటర్ జనసంద్రమైంది. విద్యార్థులు, మహిళలు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, వ్యాపారులు, కార్మికులు, రైతులు తదితరులు ఈ గర్జనకు హాజరయ్యారు. ఉదయం భారతీయ కిసాన్ సంఘ్ (బీకేఎస్) ఆధ్వర్యంలో రైతులు బలరామ హలపూజ, గోపూజ నిర్వహించారు.
అనంతరం మహాజనగర్జనలో జేఏసీ నేతలు, ప్రతినిధుల ప్రసంగాలు, విద్యార్థులు, కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు, సమైక్యాంధ్ర, దేశభక్తి గేయాలతో హోరెత్తింది. గరగ నృత్యాలు, డప్పు వాయిద్యాలు అలరించాయి. తెలుగుతల్లి, పొట్టి శ్రీరాములు, అల్లూరి సీతారామరాజు, భగత్‌సింగ్, ఝాన్సీలక్ష్మీబాయి, జవహర్‌లాల్ నెహ్రూ, రైతులు, రాక్షసుల వేషధారణల్లో విద్యార్థులు ఆకట్టుకున్నారు. కళాభారతి సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన హస్యవల్లరి కరతాళ ధ్వనులందుకుంది. జిల్లా టైలర్స్ అసోసియేషన్ నాయకుడు ఎం.వి.వి.రామారావు హిజ్రా వేషదారణతో చేసిన ప్రసంగం ఆలోచింపజేసింది. 450 అడుగుల జాతీయ పతాకాన్ని పురవీధుల్లో ఊరేగించడం హైలైట్‌గా నిలిచింది. మండల ఉద్యోగ జేఏసీ నాయకుడు డి.రాంబాబు, వివిధ సంఘాల జేఏసీల ఆధ్వర్యంలో జరిగిన ఈ మహజన గర్జనలో కోనసీమ సమైక్యాంధ్ర జేఏసీ చైర్మన్ వి.ఎస్.దివాకర్, కన్వీనర్లు బండారు రామ్మోహనరావు, కల్వకొలను తాతాజీ, ఆర్టీసీ ఉద్యోగ సంఘం నాయకులు గణపతి, కె.సత్యనారాయణ తదితరులు ప్రసంగించారు.
జిల్లాలో ఉద్ధృతంగా కొనసాగిన సమైక్య ఉద్యమం
Published Fri, Sep 20 2013 11:55 PM | Last Updated on Wed, Oct 17 2018 5:10 PM
Advertisement
Advertisement