రాజకీయ క్రీనీడ
Published Sun, Dec 29 2013 4:12 AM | Last Updated on Sat, Apr 6 2019 9:38 PM
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ఎన్జీవో ఎన్నికలపై రాజకీయ క్రీనీడలు పడుతున్నాయి. యూనియన్ ఎన్నికలను ఆధిపత్య క్రీడగా మార్చేస్తున్నాయి. కాంగ్రెస్, టీడీపీల నేతలు తెరవెనుక పావులు కదుపుతూ తమకు అనుకూలమైన వారిని గెలిపించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని, అవసరమైతే బలవంతంగానైనా ఆ పని చేయించాలని చూస్తున్నట్లు తెలిసింది. జిల్లాలో మొత్తం 52 ఓట్లు ఉన్నాయి. ఇందులో వైద్య ఆరోగ్య, రెవెన్యూ శాఖలకు చెందిన వారి ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. మిగిలిన శాఖల ఓట్లు తక్కువే. వైద్య ఆరోగ్యశాఖలో ఎక్కువ మంది అనర్హులు ఓటర్లుగా ఉన్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల ఆ శాఖ లో 15 మంది ప్రమోషన్లు పొంది గెజిటెడ్ ఉద్యోగులుగా మారారు. వారిని నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘంలో ఓటర్లుగా ఎలా గుర్తిస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు. జిల్లా యూనియన్‌లో విభేదాలకు కారణమైన దీన్నే కొందరు కాంగ్రెస్ ముఖ్య నేతలు అవకాశంగా తీసుకుని ఎన్జీవో ఓటర్లను ఒకరికి తెలియకుండా ఒకరితో మాట్లాడుతున్నట్లు సమాచారం.
ఎన్జీవో సంఘ రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌బాబు సమైక్య ఉద్యమాన్ని నీరుగార్చారని అసంతృప్తితో ఉన్న ప్రత్యర్థి వర్గంలోని ఉద్యోగులను ప్రసన్నం చేసుకుని అశోక్‌బాబుకు ప్యానల్‌కు ఓటు వేసే విధంగా కాంగ్రెస్, టీడీపీల నేతలు యత్నిస్తున్నట్లు సమాచారం. జిల్లాలో అశోక్‌బాబు ప్యానల్‌కే ఎక్కువ ఓట్లు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఎన్జీవో హోం వద్ద ఆ ప్యానల్ ఫ్లెక్సీలే ఏర్పాటు చేశారు. బషీర్ ప్యానల్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయకుండా కొందరు ఉద్యోగ నాయకులు అడ్డుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఎన్జీవో హోం అశోక్‌బాబు వర్గానికి చెందినది కాదని, ఉద్యోగులందరిదని పేర్కొంటున్నారు. అశోక్‌బాబు వచ్చినప్పుడు చూపిన ఆదరణ, బషీర్ వచ్చినప్పుడు ఎందుకు చూపడం లేదని పలువురు ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు.
ఇరువురూ ఎన్జీవో నేతలే అయినందున ఒకేలా చూడాలని, లేదా ఎవరినీ పట్టిం చుకోకుండా ఎవరికి వారు ప్రచారం చేసుకునేలా చూడాలన్న వాదన వినిపిస్తోంది. సంఘంలో చోటు చేసుకుం టు న్న ఈ పరిణామాలే కాంగ్రెస్ నేతలకు అవకాశంగా మారాయి. మరోవైపు మంత్రులు కోండ్రు మురళి, శత్రుచర్ల, కేంద్ర మంత్రి కృపారాణిల వద్దకు ఓటర్లు, నేతలను తీసుకెళ్లి తమకు అనుకూలంగా చెప్పించాలన్న యోచనలో అశోక్‌బాబు వర్గం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. కాగా, వైఎస్‌ఆర్‌సీపీ ఈ వ్యవహారంలో తలదూర్చడం లేదు. ఉద్యోగ సంఘాల్లో రాజకీయప్రమే యం తగదన్న యోచనలో ఆ పార్టీ ఉంది. ఎన్జీవోల్లో ఎక్కువ మంది వైఎస్‌ఆర్‌సీపీ అభిమానులే ఉన్నప్పటికీ దీన్ని యూనియన్ వ్యవహారంగానే ఆ పార్టీ పరిగణిస్తోంది.
Advertisement
Advertisement