శ్రీకాకుళం : లెక్కల చిక్కులు విద్యాశాఖ అధికారులను ముప్పుతిప్పలు పెడుతున్నాయి. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఆరేళ్ల లెక్కలు కక్కమని కేంద్ర ప్రభుత్వం కోరడంతో అధికారుల నోట్లో పచ్చి వెలక్కాయ పడింది. మింగలేక.. కక్కలేక.. గత 45 రోజులు గా మల్లగుల్లాలు పడుతున్నారు. మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి 208 నుంచి 2014 వరకు విడుదలైన నిధులు, ఖర్చులతోపాటు బియ్యం వివరాలు పంపాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఆ మేరకు వివరాలు సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాల విద్యాశాఖ అధికారులను ఆదేశించింది. అక్కడి నుంచి పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు తాఖీదులు వెళ్లాయి. అయితే ఇన్నేళ్ల లెక్కలు చెప్పడం కష్టమని ఉపాధ్యాయ వర్గంతో పాటు జిల్లా అధికారులు అంటున్నారు.
కాగ్(కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వం వివరాలు కోరినట్లు తెలుస్తోంది. కేంద్రం నుంచి ఖో-ఖో ఆట తరహాలో పాఠశాలల ప్రధానోపాధ్యాయుల వరకు ఒకరి నుంచి ఒకరికి వివరాలు ఇవ్వాలన్న సమాచార మార్పిడి జరుగుతోందే తప్ప అసలు పని ముందుకు సాగడం లేదు. ఆరేళ్ల వివరాలు ఇవ్వడం కొంత కష్టమే అయినప్పటికీ, అసాధ్యమేమీ కాదు. రెవెన్యూ అధికారుల ఆదేశాల మేరకు పౌరసరఫరాల శాఖ పాఠశాలలకు బియ్యం సరఫరా చేస్తోంది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులను విద్యాశాఖాధికారులు ఆయా మండలాల్లోని విద్యార్ధుల సంఖ్యను బట్టి కేటాయింపులు జరుపుతుం టారు. ఎవరి నుంచి ఎవరికి బియ్యం, నిధులు వచ్చినా..
అవన్నీ ఎప్పటికప్పుడు రికార్డుల్లో నమోదవుతాయి. ఆ రికార్డులు ఉంటే లెక్కలు చెప్పడం కష్టం కాదు. మధ్యాహ్న భోజన పథకం నిధులు పక్కదారి పడుతున్నాయన్న విమర్శలు ఏనాటి నుంచో ఉన్నా యి. ప్రస్తుతం లెక్కలు చెప్పడం కష్టమని ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు వ్యాఖ్యానిస్తుండటానికి ఇదే కారణం కావచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు. అన్ని పాఠశాలల్లో కాకపోయినా అత్యధిక శాతం పాఠశాలల్లో అవినీతి జరుగుతుందనే వ్యాఖ్యలు బహిరంగంగానే విన్పిస్తున్నాయి. ఇటువంటి ఆరోపణలను తిప్పికొట్టేందుకైనా విద్యాశాఖాధికారులు, ప్రధానోపాధ్యాయులు లెక్కలు చెప్పాల్సిన అవసరం ఉంది. అయితే వివరాలు కోరి 45 రోజులు దాటినా లెక్కలు ఒక కొలిక్కి రాలేదు. కాగా వివరాలు సమర్పించకుంటే ఇకముందు నిధులు మంజూరు చేయరాదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తున్నట్టు సమాచారం. దీని వల్ల పేద విద్యార్థులు నష్టపోతారు.
మధ్యాహ్న భోజన.. లెక్కలు కక్కండి!
Published Sun, Sep 14 2014 2:40 AM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM
Advertisement
Advertisement