‘మధ్యాహ్న భోజన’ తీరు అధ్వానం
రాష్ట్రంలో పథకం అమలుపై కేంద్ర ప్రభుత్వం అసంతృప్తి
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లోని స్కూళ్లలో మధ్యాహ్న భోజన పథకం అమలు తీరుపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. గ్రామీణ ప్రాంతాల్లోని స్కూళ్లలో భోజనాన్ని ఆలస్యంగా అందిస్తున్నారని, తల్లిదండ్రులెవరూ కూడా ఆ భోజనాన్ని రుచి చూడటంలేదని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆక్షేపించింది. చిత్తూరు జిల్లాలో ఒక ఎన్‌జీవో తమ వంట గది నుంచి దాదాపుగా 42 కిలోమీటర్ల దూరంలో ఉన్న స్కూళ్లకు భోజనాన్ని సరఫరా చేస్తోందని, దీనివల్ల రెండు గంటల ఆలస్యంగా పిల్లలకు భోజనం అందుతోందని పేర్కొంది. ఇలాంటి పరిస్థితి చాలాచోట్ల ఉందని తెలిపింది.
2015-16 సంవత్సరానికి గాను ఏప్రిల్-డిసెంబర్ మధ్య రాష్ట్రంలో మధ్యాహ్న భోజన పథకం అమలును కేంద్ర మానవ వనరుల అభివృధ్ది మంత్రిత్వ శాఖ సమీక్షించింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ నిష్క్రియాపరత్వంపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో కేవలం 37 శాతం స్కూళ్లలోనే తల్లిదండ్రులు భోజనాన్ని రుచిచూడటం పట్ల కేంద్ర మంత్రిత్వ శాఖ అధికారులు ఆందోళన వ్యక్తంచేశారు. మధ్యాహ్న భోజనం పిల్లలకు అందించే సమయంలో ప్రతి స్కూల్‌లో కనీసం ఇద్దరు విద్యార్థుల తల్లిదండ్రులు హాజరయ్యేలా చర్యలు చేపట్టాలని రాష్ట్రానికి సూచించింది.