మధ్యాహ్న భోజనంపై ‘మూడో కన్ను’
♦ జనవరి 18 నుంచి ప్రత్యేక బృందాలతో తనిఖీలు
♦ నిర్ణయించిన విద్యాశాఖ.. షెడ్యూలు ఖరారు
♦ వంట నుంచి పాత్రలు కడిగే వరకు పరిస్థితులపై అధ్యయనం
♦ సెస్, ఎన్‌ఐఎన్, హోంసైన్స్ కాలేజీ ప్రతినిధులతో తనిఖీ బృందాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకం తీరును తెలుసుకునేందుకు విద్యాశాఖ ‘మూడో కన్ను’ను ప్రయోగించనుంది. సేవాసంస్థలతో ఏర్పాటైన బృందాలు ‘థర్డ్ పార్టీ’ తనిఖీలను చేపట్టే విధంగా చర్యలు తీసుకుంటోంది. ఈ తనఖీలను జనవరి 18, 19, 20, 21 తేదీల్లో నిర్వహించాలని విద్యా శాఖ నిర్ణయించింది. భోజనం వండటం మొదలుకొని నిల్వ చేయడం, విద్యార్థులకు పెట్టడం, ఆ తరువాత పాత్రలు శుభ్ర పరిచే వరకూ అన్నింటా ఎలా పని చేస్తున్నారన్న అంశాలను తెలుసుకునేందుకు ఈ తనిఖీలు చేపట్టాలని నిర్ణయించింది.
హైదరాబాద్, మెదక్, రంగారెడ్డి వంటి కొన్ని ప్రాంతాల్లో ఎప్పుడో ఉదయం 5 గంటలకు వండిన భోజనం మధ్యాహ్నం విద్యార్థులకు పెడుతున్నారని, దీంతో అది పాడవుతోందని, దుర్వాసన వస్తోందన్న ఫిర్యాదులు ఇటీవల విద్యాశాఖకు అందాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకం అమలు తీరుపై అధ్యయనం చేసేందుకు విద్యాశాఖ నడుం బిగించింది. ఈ తనిఖీలను విద్యాశాఖ నేతృత్వంలో కాకుండా ‘థర్డ్ పార్టీ’ నేతృత్వంలో చేపట్టాలని, తద్వారా కచ్చితమైన నివేదిక వస్తుందన్న ఆలోచనలతో ఈ చర్యలు చేపట్టింది. దాంతో తదుపరి చర్యలపై పక్కాగా దృష్టి సారించవచ్చని భావిస్తోంది.
ఇందులో భాగంగా సెంటర్ ఫర్ ఎకనమిక్ అండ్ సోషల్ స్టడీస్ (సెస్), నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఎన్‌ఐఎన్), హోంసైన్స్ కాలేజీ, స్వచ్ఛంద సంస్థకు చెందిన ప్రతినిధులు సభ్యులుగా కలిగిన బృందాల నేతృత్వంలో ఈ తనిఖీలకు చర్యలు చేపడుతోంది. మొదటి దశలో వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో తనిఖీలకు ఏర్పాట్లు చేస్తోంది. ఒక్కో బృందం ఒక్కో జిల్లాలో రెండు రోజుల పాటు పాఠశాలల్లో పర్యటించి భోజనం అందిస్తున్న తీరుపై అధ్యయనం చేస్తుంది. ఆ తరువాత ఆయా బృందాలను విద్యాశాఖకు అందజేసే నివేదిక ఆధారంగా అవసరమైన చర్యలు చేపట్టవచ్చని విద్యాశాఖ భావిస్తోంది.
కేంద్ర ప్రభుత్వం కూడా మధ్యాహ్న భోజనం నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ దిశగా చర్యలు చేపడుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఒకటో నుంచి 8వ తరగతి వరకున్న 22,44,322 మంది విద్యార్థులకు భోజనం అందించేందుకు ఏటా రూ.324 కోట్లు వెచ్చిస్తోంది. అలాగే 9, 10 తరగతుల 4,70,571 మంది విద్యార్థులకు భోజనం అందించేందుకు ఏటా రూ. 90 కోట్లు వెచ్చిస్తోంది. ఇలా మధ్యాహ్న భోజనం అందించేందుకు ఒక్కో విద్యార్థిపై చెల్లిస్తున్న మొత్తంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో విద్యార్థిపై రోజుకు రూపాయి వంతున వారంలో రెండు కోడిగుడ్లు అందించేందుకు అదనంగా చర్యలు చేపట్టింది. సన్నబియ్యంతో వండిన భోజనం అందిస్తోంది. అయినా ఫిర్యాదులందుతున్న నేపథ్యంలో ఈ అధ్యయనానికి సిద్ధమైంది.
ఆహార నాణ్యతపైనా పరీక్షలు
భోజనం నాణ్యత, పోషక విలువలపైనా పరీక్షలు నిర్వహించాలని విద్యాశాఖ యోచిస్తోంది. ఇందుకోసం ఎన్‌ఐఎన్ వంటి జాతీయ స్థాయి ఆహార పరిశోధన సంస్థలతో సంప్రదింపులు జరుపుతోంది. ఇన్ని వందల కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నా విద్యార్థులకు నాణ్యమైన, పోషక విలువలు కలిగిన ఆహారం అందించకపోతే వృథానేనన్న భావనతో ఈ చర్యలకు సిద్ధం అవుతోంది. ఆకస్మిక తనిఖీల ద్వారా ఆహార శాంపిళ్లను సేకరించి పరీక్షలు నిర్వహించాలని యోచిస్తోంది.