పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోవడం
కేంద్రం సహకరిస్తే రాష్ట్రం వెనుకడుగు వేయడం శోచనీయం
బీజేపీ కిసాన్‌మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు పూడి
శ్రీకాకుళం అర్బన్: పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోవడం విచారకరమని, దీనివల్లే పనులు నత్తనడకన సాగుతున్నాయని బీజేపీ కిసాన్‌మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు పూడి తిరుపతిరావు ధ్వజమెత్తారు. శ్రీకాకుళంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టును సకాలంలో పూర్తిచేయాలనే ఉద్దేశంతో తెలంగాణా నుంచి ఎనిమిది ముంపు మండలాలను ప్రత్యేక ఆర్డినెన్స్‌తో ఆంధ్రప్రదేశ్‌లో కలిపినట్టు వెల్లడించారు.
పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేందుకు రాష్ట్రప్రభుత్వం కనీసం సహకరించడంలేదని ఆరోపించారు. పీపీఏకు వివరాలు సమర్పించడంలో జాప్యం చేస్తోందన్నారు. కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చడానికి ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని పెంచడం, పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని పోలవరంలో అంతర్భాగంగా చూపించడం వంటి విషయాలను కిసాన్‌మోర్చా తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్నారు. కేంద్రం అమలుచేస్తున్న ప్రధానమంత్రి పంటలబీమా పథకంతో రైతులకు లబ్ధికలుగుతుందన్నారు. సమావేశంలో బీజేపీ నగర అధ్యక్షుడు చల్లా వెంకటేశ్వరరావు, బీజేపీ నాయకుడు దుప్పల రవీంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.