
జీవీఎల్ నరసింహారావు
సాక్షి,ఢిల్లీ: టీడీపీ నేతలు రంగస్థలాన్ని బట్టి డ్రామాను మారుస్తున్నారని బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. తెలుగుదేశం కొత్త డ్రామాలు ఆడుతోందన్నారు. ఎదో పొడిచేస్తాం అంటూ విర్రవీగుతున్నారని బీజేపీ నేత ధ్వజమెత్తారు. అంతేకాక టీడీపీ అంటే టోటల్ డ్రామా పార్టీ అని ఆయన ఎద్దేవా చేశారు. నేతలు దొంగ దీక్షలు చేస్తున్నారని, వీరి దొంగ దీక్షలు ఎండగట్టామని ఆయన పేర్కొన్నారు.
‘తెలుగుదేశం డ్రామాలను ప్రజలకు చూపించాం. కేంద్రం నుంచి నిధులను తీసుకుంటూ డ్రామాలు ఆడుతోంది. స్పెషక్ ప్యాకేజీని తీసుకుంటూ... మళ్ళీ డ్రామాలు ఆడుతున్నారు. రెండేళ్ల క్రితం ప్యాకేజీ అద్భుతం అన్నారు. ఇప్పుడు మరో నాటకం ఆడుతున్నారు. పటేల్ విగ్రహం ఏర్పాటు, దోలేర విషయంలో తప్పుడు సమాచారం ఇస్తూ డ్రామాలు ఆడారు. తెలుగుదేశం డ్రామాలను పార్లమెంట్ సాక్షిగా ఎత్తి చూపుతాం. ప్రజలు ఎన్నుకున్న పాపానికి 1500 రోజులుగా మిమ్మల్ని భరిస్తున్నారు.
తెలుగుదేశం మళ్ళీ గెలవడం కల్ల .. బాబు పాపాల చిట్ట మా దగ్గర ఉంది. ప్రజల ముందు మీ బాగోతాలను బయట పెడతాం. తెలుగుదేశానికి క్రెడిబిలిటీ లేదు. రాష్ట్రంలో ప్రజలే చీ కొడుతున్నారు. తెలుగుదేశం అవిశ్వాసం పెడితే మేము చర్చకు రెడీ. సభ సజావుగా నడపడానికి అందరి సహకారం అవసరం. కేంద్రం పథకాలకు పచ్చ బ్రాండ్ వేస్తున్నారు.
పోలవరానికి వారం వారం వెళ్లి ఏమి సాధిస్తున్నారు. పోలవరానికి మీరు ఏమి చేశారు? కడప స్టీల్ ప్లాంట్ విషయంలోనూ డ్రామాలే. కడప స్టీల్ ప్లాంట్ రాకుండా చేసింది తెలుగుదేశమే. ఇప్పుడు మళ్లీ దీక్షలు చేస్తున్నారు. సాగరమల కింద రెండు లక్షలకోట్ల పెట్టుబడులు వస్తాయని నితిన్ గడ్కరీ చెప్పారు. ప్రచారం కోసం గడ్కరీ చుట్టూ తిరిగారు. ఆంధ్ర అభివృద్ది కోసం వెనక్కి తిరిగి చూస్తే ప్రధాని మోదీ కనిపిస్తున్నారు.. అక్కడ బాబు కనిపించడం లేదని’ అని జీవీఎల్ నరసింహారావు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment