మంత్రి బొత్స సత్యనారాయణ
సాక్షి, విశాఖపట్నం: దేశంలో బీజేపీదే అతి పెద్ద అవినీతి చరిత్ర అని, ఆ పార్టీ చేస్తున్న అవినీతి దేశంలో ఏ పార్టీ చెయ్యలేదని మంత్రి బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. ప్రధాని పదవికి మోదీ విలువ లేకుండా చేశారని మండిపడ్డారు. బొత్స మంగళవారం ఇక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. మోదీకి తోడు దొంగ అయిన చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్టునే సోమవారం సభల్లో చదివారని చెప్పారు.
తోడు దొంగల కూటమి ఏ స్క్రిప్ట్ ఇస్తే ఆది చదివేయడమేనా, నిజాలు పరిశీలించొద్దా అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజల అవసరాలు, స్టీల్ ప్లాంట్ గురించి ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు. మోదీ అదే నోటితో పోలవరాన్ని చంద్రబాబు ఏటీఎంలా మార్చుకున్నాడని చెప్పిన విషయాన్ని మర్చిపోయారా! అని అన్నారు. ప్రధాన మంత్రి మాటలంటే వాటికి పవిత్రత ఉండాలని చెప్పారు. ఇంతలా దిగజారిపోయి మాట్లాడే ప్రధానిని ఎప్పుడూ చూడలేదని అన్నారు.
పోలవరంపై విచారణ చేసుకోండి
పోలవరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని భావిస్తే విచారణ జరిపించుకోవచ్చు కదా అని అన్నారు. రూ.15 వేల కోట్లకు ఈసీలు ఇవ్వకుండానే ప్రధాని నిధులు విడుదల చేశారా అని ప్రశ్నించారు. ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తి ఇంత నిరాధారపూరితంగా మాట్లాడకూడదని చెప్పారు. జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరానికి కేంద్రం సహకారం ఉంటే తప్పకుండా పూర్తవుతుందన్నారు. చంద్రబాబు హయాంలో పునరావాసం సొమ్మును ఫ్రీజ్ చేశారని షెకావత్ చెప్పారన్నారు.
అప్పట్లో చూపిన లబ్దిదారులు సరైనవాళ్లు కాదని వాస్తవ లబ్దిదారులు ఆరోపిస్తున్నారని అన్నారు. నిర్వాసితులకు డబ్బు ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రానిదేనన్నారు. చంద్రబాబు నిర్వాకం వల్ల డయాఫ్రం వాల్ కొట్టుకుపోయిందన్నారు. చంద్రబాబు తప్పులను కూడా తాము సరిచేస్తున్నామని చెప్పారు. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ మంచి కార్యక్రమమని బీజేపీ వాళ్లు చెప్తుంటే.. చంద్రబాబు, పవన్ మాత్రం ప్రజల్ని మోసం చేసేలా మాట్లాడుతున్నారన్నారు. వాళ్లిద్దరికీ సుద్దులు చెప్పాల్సిన మోదీ.. తమకు చెప్తున్నారని మండిపడ్డారు.
నీచంగా మానవత్వం లేకుండా కూటమి చర్యలు
టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వ పథకాలకు మోకాలడ్డుతూ నీచంగా, మానవత్వం లేకుండా పేదల కడుపు కొడుతున్నాయని బొత్స ధ్వజమెత్తారు. వలంటీర్ల ద్వారా పెన్షన్ల పంపిణీని అడ్డుకొని, రెండు నెలల్లో 40 మంది అవ్వా తాతలను పొట్టన పెట్టుకున్నారని తెలిపారు. సుమారు 79 లక్షల మంది లబ్దిదారులున్న వైఎస్సార్ ఆసరా పథకంలో చివరి విడతలో ఇంకా రూ.1,839 కోట్లు చెల్లించకుండా అడ్డుకొన్నారని చెప్పారు. విద్యాదీవెన పథకంలో కూడా 28 లక్షల మంది లబి్ధదారులకు రూ.703 కోట్లు ఇవ్వకుండా అడ్డుపడ్డారన్నారు.
తుపాను, కరవు వల్ల నష్టపోయిన 13.60 లక్షల మంది రైతులకు ఇచ్చే ఇన్‌పుట్ సబ్సిడీ రూ.1,294.58 కోట్లు బ్యాంకుల్లో ఉన్నా లబ్ధిదారుల ఖాతాల్లో వేయకుండా అడ్డుకున్నారన్నారు. వైఎస్సార్ చేయూత నాలుగో విడత కింద 33 లక్షల మందికి రూ.565 కోట్లు విడుదల చేయడానికీ ఒప్పుకోలేదన్నారు. ఈబీసీ నేస్తం కింద 4.20 లక్షల మందికి రూ.629 కోట్లు ఇవ్వాల్సి ఉందన్నారు. ఇవన్నీ అమలులో ఉన్న పథకాలే అని, సాధారణంగా జరగాల్సినవేనని, అందుకే ఎన్నికల సంఘాన్ని గత నెలలోనే అనుమతి కోరామని, అయినా అనుమతివ్వలేదని చెప్పారు.
2019లో పసుపు కుంకుమ కార్యక్రమం ఎన్నికల నోటిఫికేషన్ తరవాత ఇచ్చారని, తాము దానికి అడ్డుపడ్డామా అని ప్రశ్నించారు. దీనికి తోడు సీఎం వైఎస్ జగన్‌పై చంద్రబాబు కారు కూతలు కూస్తున్నారని, 14 ఏళ్లు సీఎంగా చేసిన వ్యక్తి అలాంటి మాటలు మాట్లాడవచ్చా! అని ప్రశ్నించారు. చంద్రబాబు పేరెత్తడానికే అసహ్యంగా ఉందన్నారు. తమకూ అలాంటి మాటలు వచ్చని, అయితే తమకు సభ్యత సంస్కారం ఉన్నాయని చెప్పారు. ప్రజలు 15 రోజులు ఓపిక పడితే మళ్లీ మన ప్రభుత్వం వస్తుందని, అప్పుడు ఏ కూటమి దయాదాక్షిణ్యాలు అక్కర్లేదని అన్నారు.
ఈసీ వాస్తవాలు పరిశీలించాలి..
కూటమికి ఎన్నికల సంఘం వత్తాసు పలుకుతూ ఏ ఫిర్యాదు చేసినా వెంటనే స్పందించడం సరికాదని అన్నారు. ఎన్నికల నిబంధనలకు, రాజ్యాంగానికి తాము వ్యతిరేకం కాదని, కానీ ఈసీ విజ్ఞతతో వాస్తవాలు పరిశీలించాలని కోరారు. కూటమి ఫిర్యాదు వల్ల వ్యక్తులకు, వ్యవస్థకు నష్టమా అనేది ఆలోచించకుండా వృద్ధుల చావుకు కారణం అవ్వడం భావ్యమా అని అన్నారు. చంద్రబాబు నీచమైన భాషపై ఈసీ తీసుకున్న చర్యలేమిటని ప్రశ్నించారు.
వృద్ధుల చావులకు కారణమైన వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని అన్నారు. ఇన్‌పుట్ సబ్సిడీ అందక రైతులకు జరిగే నష్టానికి, ఫీజులందక విద్యార్థులను పరీక్షలు రాయనివ్వకపోవడం, టీసీలు ఇవ్వకపోవడం జరిగితే ఎవరిది బాధ్యత అని ప్రశ్నించారు. గత ఎన్నికల్లో టీడీపీ కార్యక్రమాలకు ఈసీ ఓకే చెప్పిందన్నారు. అందుకే నిన్న సీఎం వైఎస్ జగన్ సజావుగా ఎన్నికలు జరుగుతాయా! అన్న అనుమానం వ్యక్తం చేశారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment