సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు పనులకు చేసిన ఖర్చులో మరో రూ.826.18 కోట్లను కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి విడుదల చేసింది. ఈ మేరకు కేంద్ర ఆర్థికశాఖ మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం ఇంకా రూ.1,755.80 కోట్లు రీయింబర్స్ చేయాల్సి ఉంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు రూ.1,671.23 కోట్లను కేంద్రం పోలవరం ప్రాజెక్టుకు విడుదల చేసింది.
విభజన చట్టం ప్రకారం వంద శాతం వ్యయంతో కేంద్రమే నిర్మించా ల్సిన ఈ ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను కమీషన్ల కక్కుర్తితో 2016, సెప్టెంబరు 7 అర్ధరాత్రి రాష్ట్ర ప్రభుత్వానికి దక్కేలా నాటి సీఎం చంద్రబాబు చేశారు. ఈ క్రమంలో 2013–14 ధరల ప్రకారం 2014, ఏప్రిల్ 1 నాటికి మిగిలిన నీటిపారుదల విభాగం వ్యయాన్ని మాత్రమే చెల్లిస్తామని కేంద్రం పెట్టిన షరతుకు నాటి టీడీపీ సర్కార్ అంగీకరించింది. ప్రాజెక్టు పనులకు తొలుత రాష్ట్ర ప్రభుత్వం ఖర్చుచేస్తే.. ఆ తర్వాత వాటిని రీయింబర్స్ చేస్తామని కూడా కేంద్రం మెలిక పెట్టింది.
రీయింబర్స్ చేయడంలో కేంద్రం తీవ్ర జాప్యంచేస్తున్నా.. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ రాష్ట్ర ఖజానా నుంచే నిధులు కేటాయిస్తూ పోలవరం ప్రాజెక్టును సీఎం వైఎస్ జగన్ ప్రణాళికాయుతంగా పూర్తిచేస్తున్నారు. ప్రాజెక్టు సత్వర పూర్తికి రూ.15 వేల కోట్లను ముందస్తుగా విడుదల చేయాలని.. బకాయిపడిన రూ.2,581.88 కోట్లను రీయింబర్స్ చేయాలని ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమైన ప్రతి సందర్భంలోనూ సీఎం వైఎస్ జగన్ విజ్ఞప్తి చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే కేంద్రం స్పందించి రూ.826.18 కోట్లు విడుదల చేసింది.
ఏడాదికి సగటున రూ.1,587.71 కోట్లు..
పోలవరం ప్రాజెక్టు పనులకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటిదాకా రూ.20,775.90 కోట్లు ఖర్చుచేసింది. ఇందులో జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించక ముందు.. అంటే 2014, ఏప్రిల్ 1కి కంటే ముందు రూ.4,730.71 కోట్లను వెచ్చించింది. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాక 2014, ఏప్రిల్ 1 తర్వాత ప్రాజెక్టు పనులకు రూ.16,045.19 కోట్లు వ్యయం చేసింది. అందులో 2014 నుంచి ఇప్పటిదాకా రూ.14,289.39 కోట్లను కేంద్రం రీయింబర్స్ చేసింది. అంటే తొమ్మిదేళ్లలో ఏడాదికి సగటున రూ.1,587.71 కోట్లు విడుదల చేస్తోంది.
వెంటాడుతున్న చంద్రబాబు పాపం..
♦ కమీషన్ల కక్కుర్తితో ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను దక్కించునే క్రమంలో 2013–14 ధరల ప్రకారం నిధులిస్తామని కేంద్రం పెట్టిన షరతుకు నాటి సీఎం చంద్రబాబు అంగీకరించడం పోలవరం ప్రాజెక్టుకు శాపంగా మారింది.
♦ 2017–18 ధరల ప్రకారం పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనా వ్యయం రూ.55,548.86 కోట్లుగా కేంద్ర జలసంఘం సాంకేతిక సలహా మండలి (టీఏసీ) ఆమోదించింది. దీన్ని రూ.47,725.74 కోట్లకు రివైజ్డ్ కాస్ట్ కమిటీ (ఆర్‌సీసీ) కుదించింది. 2013–14 ధరల ప్రకారం పోలవరం ప్రాజెక్టు నీటిపారుదల విభాగం వ్యయం రూ.20,398.61 కోట్లుగా తేల్చింది. ఇందులో 2014, ఏప్రిల్ 1 వరకూ ఖర్చుచేసిన రూ.4,730.71 కోట్లు పోనూ మిగిలిన రూ.15,667.90 కోట్లను మాత్రమే విడుదల చేస్తామని తేల్చిచెప్పింది.
♦ 2013–14 ధరల ప్రకారం నిధులిస్తే చాలని నాటి సీఎం చంద్రబాబు అంగీకరించడంతో.. ఆ ప్రకారమే నిధులిస్తామని కేంద్ర జల్‌శక్తి శాఖ పేర్కొంది. ఇప్పటికే రూ.14,289.39 కోట్లను విడుదల చేసిన నేపథ్యంలో.. ఇంకా రూ.1,378.51 కోట్లు మాత్రమే ఇస్తామని చెబుతోంది. ఇది పోలవరం ప్రాజెక్టు పనులకు అడ్డంకిగా మారుతోంది.
♦ 2017–18 ధరల ప్రకారం భూసేకరణ, నిర్వాసితులకు పునరావాస కల్పన వ్యయమే రూ.33,168.23 కోట్లని.. రూ.20,398.61 కోట్లతో ప్రాజెక్టును ఎలా పూర్తిచేయగలమని ప్రధాని మోదీ, కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్, కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌లతో సమావేశమైన ప్రతి సందర్భంలోనూ సీఎం జగన్ విజ్ఞప్తి చేస్తూ వస్తుండటంతో.. కేంద్రం ఆ దిశగా అడుగులు వేస్తోంది. 2017–18 ధరల ప్రకారం కేంద్రం నిధులు ఇవ్వాలంటే.. సవరించిన అంచనా వ్యయం రూ.55,548.87 కోట్లను కేంద్ర మంత్రిమండలి ఆమోదించాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment