టెక్‌నాలెడ్జ్
సిటీ సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల్లో సేవాభావం పెరుగుతోంది. ఎక్కడ సామాజిక సమస్య కనిపించినా వెంటనే స్పందిస్తున్నారు. మురికివాడలు, పేదలు నివసించే ప్రాంతాల్లో స్వచ్ఛంద సేవా సంస్థల తరఫున వాలంటీర్లుగా పనిచేస్తున్న వీరు.. విరాళాలు ఇవ్వడమే కాకుండా ఆధునిక సాంకేతికతను ఉపయోగించి ఎన్జీఓ కార్యకలాపాలకు మార్గం సుగమం చేస్తున్నారు.
సాఫ్ట్‌వేర్‌లు... హార్డ్‌వేర్‌లే కాదు... సామాజిక చైతన్యంతోనూ ముందుకు కదులుతున్నారు ఐటీ ఉద్యోగులు. సమయం, అవకాశం ఉన్నప్పుడల్లా ఆ దిశగా తలో చేయి వేసి చేతనైన సాయం చేస్తున్నారు. తాజాగా గచ్బిబౌలి మైక్రోసాఫ్ట్ కార్యాలయంలో ‘గ్లోబల్ గివింగ్ క్యాంపెయిన్’ నిర్వహిస్తున్నారు ఆ సంస్థ ఉద్యోగులు. సామాజిక సేవకు పాటుపడే ఎన్జీఓల నిర్వాహకులకు ‘ఆఫీస్ 365’పై వర్క్‌షాప్ ఏర్పాటు చేశారు. వచ్చే నెల 7 వరకు జరిగే ఈ వర్క్‌షాపులో తమ రోజువారీ కార్యకలాపాలు పొందుపరుచుకొనేలా ఇందులో తర్ఫీదు ఇస్తున్నారు. మొత్తం 30 మంది ఎన్జీఓలకు చెందిన వారు మెళకువలు నేర్చుకొంటున్నారు.
చాలా తెలిశాయి...
‘వెబ్‌లో ఫైల్ ఎలా సేవ్ చేసుకోవాలి.. పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఎలా చేయాలి వంటివి ఈ వర్క్‌షాప్‌లో నేర్చుకొంటున్నా. ఎంతో ఉపయోగకరంగా ఉంది’ అని ఎస్‌ఓఎస్ ఎన్జీఓకు చెందిన నిర్మలారాణి తెలిపారు. ‘ఈ ట్రైనింగ్ వల్ల వెబ్‌సైట్‌లో ఎప్పటికప్పుడు కంటెంట్‌ను అప్‌లోడ్ చేయడమెలాగో తెలిసింది. అందించిన సేవలను ఓ క్రమపద్ధతిలో పెట్టుకోవడానికి ఈ టెక్నాలజీ ఉపయోగపడుతోంది’ అన్నారు మహిత సంస్థ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ సదానంద్.
‘ఏటా ఏటా అక్టోబర్‌లో మైక్రోసాఫ్ట్ గివింగ్ రిలే నిర్వహిస్తాం. భారత్‌తో పాటు 19 దేశాల్లోని మైక్రోసాఫ్ట్ కార్యాలయాల్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. సంస్థ ఉద్యోగులు అంకితభావంతో పనిచేసే ఎన్జీఓలకు విరాళాలు ఇస్తుంటారు. వారితో కలసి పనిచేస్తుంటారు’ అని మైక్రోసాఫ్ట్ ఇండియా డెవలప్‌మెంట్ సెంటర్ డెరైక్టర్ చిత్రసూద్ తెలిపారు.
- వీఎస్