social issues
-
Nitish Rajput: వీడియో పెట్టు కోట్లు కొట్టు
వీడియోలు చేస్తే ఎంత వస్తుంది? యూట్యూబ్‌లో పెడితే ఎంత వస్తుంది? ఎంత టాలెంట్ ఉంటే అంత వస్తుంది. నితిష్ రాజ్‌పుట్‌కు నెలకు 25 లక్షలు సంవత్సరానికి ఎంత లేదన్నా 3 కోట్లు వస్తాయి. ‘నాలెడ్జ్ ఈజ్ పవర్’ అన్నారు. సామాజిక అంశాల పై విస్తృత సమాచారం అందిస్తూ అతడు చేసే వీడియోల వల్లే ఈ ఆదాయం. నితిష్ సక్సెస్ స్టోరీ. 2022లో మన దేశంలో పాన్‌మసాలా వ్యాపార లావాదేవీల మొత్తం ఎంతో తెలుసా? 43,410 కోట్లు. ఊహకు అందని భారీ వ్యాపారం. అందుకే పాన్‌మసాలా సంస్థలు తమ బ్రాండ్ పేరు జనం నాలికల మీద తద్వారా వారి పొగాకు ఉత్పత్తులు జనాల నోళ్ల లోపలకు వెళ్లాలంటే పెద్ద పెద్ద సెలబ్రిటీలతో ఎలా యాడ్స్ చేయిస్తాయో నితిష్ రాజ్పుట్ తన 30 నిమిషాల వీడియోలో వివరిస్తాడు. ఎలాగైతే ఆల్కహాల్ కంపెనీలు తమ బ్రాండ్ ప్రచారం కోసం మంచి నీళ్లు, మ్యూజిక్ సీడీలను తమ బ్రాండ్‌తో యాడ్స్ చేస్తాయో... పాన్ మసాలా కంపెనీలు కూడా అదే దారిలో సినిమా స్టార్స్‌ను పెట్టి లాఘవంగా ‘ఇలాచీ’, ‘గులాబ్’ అంటూ దొంగ యాడ్స్ చేస్తాయని వివరిస్తాడు. అమ్మేది మాత్రం పొగాకు ఉత్పత్తులనే అని తెలుపుతాడు. అంతేకాదు పొగాకు ఉత్పత్తుల్లో నేరుగా ప్రభుత్వం ఎలా భాగస్వామ్యం అయి ఉందో కూడా చెప్తాడు. ఇంత సవివరంగా మెయిన్ స్ట్రీమ్ మీడియా దాదాపుగా రాయదు. అందుకే నితిష్ రాజ్పుట్ వీడియోలకు అంత డిమాండ్. అన్ని వైపుల సమాచారం నితిష్ రాజ్పుట్ 2020లో తన పేరు మీద ‘నితిష్ రాజ్‌పూట్ యూట్యూబ్ చానెల్’ను మొదలుపెట్టాడు. అందులో తనే మాట్లాడుతుంటాడు. ఏం మాట్లాడతాడు? ఒరిస్సాలో ట్రైన్ యాక్సిడెంట్‌కు కారణాలేమిటి? మణిపూర్‌లో ఏం జరుగుతోంది? ఖలిస్తాన్ ఉద్యమంలో వాస్తవం ఎంత? తాలిబన్లంటే ఎవరు? క్రెడిట్ కార్డ్స్‌లో మోసం ఎలా జరుగుతుంది... ఇలాంటి అంశాలతో వీడియోలు చేస్తాడు. అయితే ఇవి పైపైన చేసే వీడియోలు కాదు. దాదాపు పరిశోధనాత్మక జర్నలిజం స్థాయిలో ఉంటాయి. తీసుకున్న అంశంలో ఏదో ఒక పక్షం వహించకుండా అన్ని పక్షాల వైపు నుంచి సమాచారాన్ని రాసి పోస్ట్ చేస్తాడు. అంతే కాదు చరిత్రలో జరిగిపోయిన కొన్ని ఘటనలను కూడా వివరిస్తాడు. ఉదాహరణకు ఇజ్రాయిల్– పాలస్తీనాల మధ్య గొడవ. ఇలా ఒకటనేముంది మ్యూచువల్ ఫండ్స్ దగ్గరి నుంచి స్టాక్ మార్కెట్ పాఠాల వరకూ అన్నీ చెబుతాడు. అందుకే రెండేళ్ల కాలంలోనే అనూహ్యమైన విజయం సాధించాడు. ఉత్తరప్రదేశ్ కుర్రాడు నితిష్ రాజ్పుట్ ఉత్తర ప్రదేశ్‌లోని సుల్తాన్పూర్ అనే చిన్న ఊళ్లో పుట్టాడు. ఇప్పుడు అతనికి 33 ఏళ్లు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో బి.టెక్. చేసి ఐ.టి. కంపెనీల్లో పని చేశాడు. కాని తనకంటూ ఒక సొంత అస్తిత్వం, ఆర్థిక అంతస్తు ఉండాలని ఆశించి 2020లో వీడియో చానల్ ప్రారంభించాడు. సగటు మనిషికి నిత్యం కనిపించే విషయాలే లోతుగా తెలియచేయడం అతడు ఎంచుకున్న ఫార్ములా. ఉదాహరణకు బిట్‌కాయిన్ కథా కమామిషు ఏమిటి అనే వీడియో చూస్తే దాని గురించి మనకు దాదాపుగా ఓ సమగ్ర అవగాహన వస్తుంది. ఎయిర్‌పోర్ట్‌లు ఎలా ఆదాయం గడిస్తాయి అనేది అతని మరో వీడియో. బాలీవుడ్లో భారీ సినిమాలు ఫ్లాప్ అయినా డబ్బులెందుకు వస్తున్నాయి అనేది మరో వీడియో. స్పష్టంగా, డేటా విజువల్స్‌తో మంచి ఎడిటింగ్‌తో అతను ధారగా చెప్పుకుపోతాడు. 50 లక్షల ఫాలోయెర్లు నితిష్ రాజ్పుట్ యూట్యూబ్ చానల్‌కు 35 లక్షల మంది సబ్స్క్రయిబర్లు ఉన్నారు. ఫేస్బుక్, ఇన్‌స్టా ఇవన్నీ కలిపి మొత్తం 50 లక్షల మంది అతణ్ణి ఫాలో అవుతున్నారు. నితిష్ రాజ్పుట్ యూట్యూబ్‌లో ఇప్పటి వరకూ చేసిన వీడియోలకు 25 కోట్ల వ్యూస్ వచ్చాయి. ఈ వీడియోల్లో యాడ్స్ ప్లే అవుతాయి కనుక యూట్యూబ్ నుంచి అలాగే ప్రాడెక్ట్స్ ప్రమోషన్ వల్ల నెలకు అతడు 25 లక్షలు సంపాదిస్తున్నాడు. సంవత్సరానికి 3 కోట్ల ఆదాయం గడిస్తున్నాడు. రెండేళ్లల్లో సాధించిన విజయం అంటే ఆశ్చర్యమే. -
అశ్లీల కంటెంట్‌పై ఆలస్యంగా మన తారలు!
‘ఫన్ కోసం ఫేస్ మార్చేయండి’.. ఓ నాలుగైదేళ్లుగా ఎడిటింగ్ సాంకేతికత ద్వారా నడుస్తున్న సరదా ట్రెండ్. అయితే తెర వెనుక జరిగే తతంగం వేరే ఉంటోంది. సాధారణ జనాలు వీటిని సరదా వ్యవహారంగానే చూస్తున్నప్పటికీ.. అశ్లీల కంటెంట్ విపరీతంగా పుట్టుకురావడానికి ఈ టెక్నాలజీనే ఒకరకంగా కారణం అవుతోంది. సగటున రోజుకి లక్షల మార్ఫింగ్ వీడియోలు, కోట్లలో మార్ఫింగ్ ఫొటోలు ఇంటర్నెట్లో అప్లోడ్ అవుతున్నట్లు ఒక అంచనా. అయితే మన దగ్గర సెలబ్రిటీలు ఇంతకాలం ఈ వ్యవహారాన్ని తేలికగా తీసుకున్నప్పటికీ.. వేరే దేశాల్లో మాత్రం ఈ ఫేక్ కంటెంట్ కట్టడి కోసం ఎప్పటి నుంచో పెద్ద ఉద్యమమే నడుస్తోంది. సెలబ్రిటీలు ఏ పని చేసినా.. అదో వైరల్ న్యూసే!. ముఖ్యంగా గ్లామర్ ప్రపంచంలోని ఫీమేల్ సెలబ్రిటీల విషయంలో ఇది ఎక్కువ. వాళ్ల దృష్టిలో ఇంటర్నెట్ అనేది అధికప్రచార సాధనం. అందుకే తమ క్రేజ్‌ను నిలబెట్టుకునేందుకు ఫొటో.. వీడియో ఆధారిత కంటెంట్‌ను ఫాలోవర్లతో, యూజర్లతో పంచుకుంటారు. ఉదయం లేచింది మొదలు ఫిట్నెస్ మొదలుకుని.. తినడం, తిరగడం, సరదా కబుర్లు ఇలా.. రోజూవారీ అప్డేట్లు ఇస్తుంటారు. అయితే వాళ్లకు తెలియకుండానే ఆ కంటెంట్ తప్పుడు దోవలో దూసుకుపోతోంది. ఇంటర్నెట్ నిండా ఫేక్ ఫొటోలు, వీడియోలతో నిండిపోతోంది. దాదాపు పాత, కొత్త తరం తారలంతా ఫేక్ కంటెంట్ బాధితులుగానే ఉన్నారు. అశ్లీలత గురించి ఓపెన్‌గా చర్చించడం మన హీరోయిన్లకు ఇప్పటికీ నామోషీనే. అయితే తమను నెట్టింటికీడుస్తున్న వ్యవహారాలపై కూడా పోరాడటానికి కూడా ఎందుకనో వెనుకంజ వేస్తున్నారు. విదేశాల్లో మాత్రం ఇలాంటి కంటెంట్‌ను హీరోయిన్లు ఏమాత్రం సహించడం లేదు. టైటానిక్ హీరోయిన్ కేట్ విన్స్లెట్, సీనియర్ హీరోయిన్ జెస్సికా ఆల్బా ఈ విషయంలో ఫిర్యాదులు చేయడంతో పాటు సోషల్ మీడియాలో బహిరంగంగా తమ తమ మీద నడుస్తున్న మార్ఫింగ్ కంటెంట్ మీద చర్చించారు. ‘వండర్ వుమెన్’ ఫేమ్ గాల్ గాడోట్ అయితే ఏకంగా అశ్లీల కంటెంట్ కట్టడి కోసం చిన్నసైజు ఉద్యమాన్నే నడిపిస్తోంది. ఈజిప్ట్ నటి నెల్లీ కరీం.. ఓ అడుగు ముందుకు వేసి తన పేరుతో వైరల్ అవుతున్న కంటెంట్‌ను సోషల్ మీడియాలో స్క్రీన్ షాట్స్ షేర్ చేసి మరీ నిరసన వ్యక్తం చేసింది. కొందరు బ్రిటిష్ నటీమణులు సైతం ఇలాంటి అశ్లీల కట్టడి విషయంలో ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తూ వస్తున్నారు. ఈ తతంగాన్ని తీవ్రంగా పరిగణించి.. ప్రత్యేక చట్టాలు చేయాలని ఆ దేశాల ప్రభుత్వాలను కోరుతున్నవాళ్లు లేకపోలేదు. అవకాశం ఉన్నా గప్‌చుప్.. కానీ, మన దగ్గర పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. బాలీవుడ్, మాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్.. ఇలా భాషలకతీతంగా సినీ తారలు బాధితులవుతున్నారు. గూగుల్‌లో వాళ్ల ఎడిటింగ్ కంటెంట్(అసభ్యతతో కూడుకున్నది) కుప్పలుగా కనిపిస్తోంది. దారుణమైన విషయం ఏంటంటే.. ‘ఎక్స్’, ఫేస్బుక్ లాంటి ప్రముఖ సోషల్ మీడియా సైట్లలోనూ వేల కొద్దీ అకౌంట్ల ద్వారా అలాంటివి వ్యాప్తి చెందుతుండడం, అలాంటి పేజీలకు వేల నుంచి లక్షల్లో ఫాలోవర్స్ ఉండడం!. ఈ తరహా వ్యవహారంలో వ్యక్తిగతంగా ఫిర్యాదులు చేయడానికి ఆస్కారం ఉందని చెప్తున్నారు న్యాయ నిపుణులు. ఐసీసీలోని సెక్షన్ 292(అశ్లీల కంటెంట్‌ను సర్క్యులేట్ చేయడం), 354సీ(అనుమతి లేకుండా అసభ్య వీడియోల్ని చిత్రీకరించడం), 499(వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీయడం), 509(మహిళా గౌరవానికి భంగం కలిగించడం), వీటితో పాటు ఐటీ యాక్ట్‌లో 66ఈ, 67, 67ఎ, 72 సెక్షన్లు ఇలాంటి ఫేక్ వీడియో, ఫొటోల సర్యులేషన్ పై కఠిన చర్యలుంటాయనే విషయాన్ని గుర్తు చేస్తున్నారు. చిన్నతారలు ధైర్యంగా.. ఇంటర్నెట్లో దాదాపు అగ్ర హీరోయిన్ల ఫేక్ వీడియోల, ఫొటో కంటెంట్ ఎక్కువగా చక్కర్లు కొడుతుంటాయి. కానీ, ఈ విషయంలో అగ్ర తారల కంటే చిన్న ఆర్టిస్టులే ధైర్యం చేసి ఫిర్యాదులు చేస్తున్నారు. కొన్ని నెలల క్రితం తమిళ చలన చిత్ర పరిశ్రమకు చెందిన ఓ చిన్న నటి.. ట్విటర్లో హీరోయిన్ల ఫేక్ ఫొటోల్ని షేర్ చేస్తున్న ఓ అడల్ట్ అకౌంట్‌కు ఫాలో రిక్వెస్ట్ పెట్టింది. అది చూసి సంబురంగా ఆ స్క్రీన్ షాట్‌ను షేర్ చేసి మరీ ఆమె ఫాలో రిక్వెస్ట్‌ను యాక్సెప్ట్ చేశాడు ఆ అకౌంట్ అడ్మిన్. వెంటనే సైబర్ విభాగానికి ఫిర్యాదు చేసి అతన్ని కటకటాల వెనక్కి నెట్టించింది ఆమె. అలా.. కొందరు ఈ-సెలబ్రిటీలు(సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయిన వాళ్లు), షార్ట్‌ఫిల్మ్ తారలు, చిన్నాచితకా క్యారెక్టర్లు చేసే నటీమణులు ఫిర్యాదుల విషయంలో ముందుకొచ్చిన సందర్భాలు ఉన్నాయి. రష్మిక వీడియో.. అసలేం జరిగిందంటే.. ఫొటో మార్ఫింగ్, ఎడిటింగ్లు సరదా కోసం చేయడం సాధారణమైన వ్యవహారం. కానీ, టెక్నాలజీ అప్డేట్ మూలంగా అది మరీ శ్రుతి మించిపోతోంది. అందులో ప్రముఖంగా చెప్పుకోదగింది.. ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది డీప్‌ఫేక్ టెక్నాలజీ. నేషనల్ క్రష్‌గా పేరుండి.. సోషల్ మీడియాలోనూ విపరీతంగా ఫాలోయింగ్ ఉన్న రష్మిక మందన్నకు సంబంధించిన ఓ వీడియో ఈ మధ్య వైరల్ అయ్యింది. అయితే ఎక్స్ మాధ్యమం ద్వారా ఆ వీడియో పలువురు ప్రముఖుల దృష్టికి వెళ్లింది. ఫైనల్‌గా అందులో ఉంది రష్మిక కాదని.. జారా పటేల్ అనే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అని తేలింది. అయితే అప్పటికే ఆ వీడియో గురించి విపరీతమైన చర్చ నడిచింది. రష్మికతో గతంలో ఓ చిత్రంలో నటించిన బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ సైతం స్పందించడంతో ఈ వ్యవహారం వార్తల్లోకి ఎక్కింది. మరోవైపు ఈ వీడియో వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం సైతం స్పందించింది. ఇంటర్నెట్ ను వినియోగించే వాళ్ళందరికీ భద్రత కల్పించే విషయంలో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ వెల్లడించారు. ఈ వ్యవహారంలో బాధ్యత ఆ సోషల్ మీడియా ప్లాట్ఫారమ్దేనని, ఏ వినియోగదారు కూడా తమ అకౌంట్ నుంచి తప్పుడు సమాచారాన్ని పోస్ట్ చేస్తే దాని 36 గంటల్లోగా సదరు ఫ్లాట్‌ఫారమ్ తొలగించాలని, ఈ నిబంధనలు పాటించకపోతే చట్టపరమైన చర్యలకు గురి కావలసి వస్తుందని హెచ్చరించారు. ఇక తాజాగా ఈ డీప్ ఫేక్ వీడియో పై రష్మిక మందన సైతం స్పందించింది. ఇలాంటి ఓ ఘటనపై స్పందించాల్సి రావడం నిజంగా ఎంతో బాధ కలిగిస్తుందని చెప్పుకొచ్చింది రష్మిక. డీప్ ఫేక్‌తో పాటు ఫేస్ స్వాప్ కూడా.. డీప్‌ఫేక్ ఫీచర్.. ఇది ఒకరకంగా మార్ఫింగ్ లాంటిదే. ఆర్టిఫిషియల్ ఇంటలిజెంట్ టూల్‌ను ఉపయోగించి ఇతర వ్యక్తుల ఫోటోల్లో, వీడియోల్లో నచ్చని వారి ఫోటోలను చొప్పించి, నకిలీ చిత్రాలను, విడియోలను తయారు చేసే సింథటిక్ మీడియా. డీప్‌ఫేక్ ఫీచర్ సాయంతో అల్రెడీ మొబైల్లో ఉన్న వీడియోతోగానీ, అప్పటికప్పుడు చేసే వీడియోతో ఫన్నీ వీడియోల్ని క్రియేట్ చేయొచ్చు. ఒక వీడియోలోగానీ, ఫొటోలోగానీ ముఖాన్ని ఈ ఫీచర్ ద్వారా మార్చేయొచ్చు. ఆ ప్లేస్‌లో యూజర్ తన ఫేస్‌ని లేదంటే తనకు కావాల్సిన ముఖాన్ని అప్డేట్ చేసి ఓ కొత్త వీడియో క్రియేట్ చేసుకోవచ్చు. ఇదంతా ఒక సరదా వ్యవహారం. ఇందుకోసం కోట్లు ఖర్చు చేసి ఏఐ(ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్సీ) టెక్నాలజీ సాయం తీసుకుంటున్నారు. కానీ, సినీ ఫీల్డ్ సెలబ్రిటీలకు ఫేక్ వీడియోలతో ఇప్పుడిది కొత్త తలనొప్పిగా మారింది. మరోవైపు యూట్యూబ్‌లోనూ డీప్‌ఫేక్ టెక్నాలజీ, బాధిత హీరోయిన్ల గురించి టెక్ గురూలు, నిపుణులు దాని గురించి వీడియోలు బోలెడన్ని కనిపిస్తుంటాయి. ఇక అశ్లీలతను వ్యాప్తిచెందిస్తోన్న మరో టెక్నాలజీ ఫేస్ స్వాప్. రివెంజ్ పోర్న్ ద్వారా వార్తల్లోకి ఎక్కిన ఫేస్ స్వాప్.. ఆ తర్వాత ఓ ఎంటర్టైనింగ్ ఫీచర్\టూల్‌గా మారింది. దీనిని ఆసరాగా తీసుకుని ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలను తెర మీదకు తెస్తున్నారు కొందరు. హీరోయిన్ల ఫొటోలను ఎడిట్ చేసి.. ఇంటర్నెట్లో వదులుతున్నారు. -
బొమ్మల కథావాహిని
బొమ్మతో అనుబంధం... బొమ్మతో ఆడుకోవడం మన బాల్య జ్ఞాపకం. బొమ్మను నేస్తంలా, బిడ్డలా హత్తుకునే చిట్టి మనసులకు ఆ బొమ్మతోనే పదేళ్లుగా పిల్లల్లోనూ, పెద్దల్లోనూ సామాజిక సమస్యలపై అవగాహన కలిగిస్తూ ఉన్నారు పప్పెట్రీ కథకురాలు పద్మినీ రంగరాజన్. హైదరాబాద్‌లో ఇరవై ఏళ్లుగా బొమ్మలతో దోస్తీ చేసిన ఈ కథల నేస్తం గురించి... ‘పిల్లలూ.. ఇప్పుడు ఈ మల్లూ మీతో మాట్లాడతాడు..’ అని ఆసక్తిగా బొమ్మలతో కథలు చెప్పడమే కాదు, జానపద సాహిత్యాన్ని మన కళ్లకు కడతారు. సోషియాలజీలో పరిశోధకురాలుగా ఉన్నారు. పదేళ్ల పాటు అధ్యాపకురాలిగా పనిచేశారు. స్ఫూర్తి థియేటర్ ఫర్ ఎడ్యుకేషనల్ పప్పెట్రీ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ పేరుతో సంస్థను నెలకొల్పిన పద్మిని రంగరాజన్‌ని కలిస్తే మనకు ఆసక్తికరమైన ఎన్నో విషయాలు పరిచయం అవుతాయి. పిల్లలకు తోలుబొమ్మల ద్వారా కష్టమైన గణితాన్ని, ఆంగ్లవ్యాకరణాన్ని సులువుగా నేర్పించవచ్చని తెలుస్తుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు, సామాజిక సమస్యలపై అవగాహన ఆసక్తి కలిగేలా చెప్పవచ్చనే విషయం స్పష్టం అవుతుంది. అనుకోకుండా మొదలైన పప్పెట్రీ తన జీవిత విధానంలో తీసుకువచ్చిన మార్పుల గురించి ఎంతో ఆనందంగా ఇలా పంచుకున్నారు పద్మినీ రంగరాజన్. ‘‘మల్లు అనేది నా మొదటి గ్లౌజ్ కోతి తోలుబొమ్మ. నేరుగా నేను కాకుండా బొమ్మ మాట్లాడుతుంటే పిల్లలు ఒళ్లంతా కళ్లు, చెవులు చేసుకుని వింటుంటారు. ఆ సమయంలో ఎంత ఉత్సాహంగా ఉంటుందో మాటల్లో చెప్పలేను. ఇరవై ఏళ్ల క్రితం.. నా కొడుకు ఆసక్తి గా కథ వినడం కోసం ఈ బొమ్మల కళను ఎంచుకున్నాను. అలా మొదటిసారి తోలుబొమ్మతో మా అబ్బాయికి పురాణకథను చెప్పాను. ఆ తర్వాత్తర్వాత పిల్లల పుట్టిన రోజు వేడుకల్లో తోలుబొమ్మతో కథలు చెప్పడం మొదలయ్యింది. స్నేహితుల సంఖ్య పెరిగింది. బొమ్మలతో పిల్లలకు లెక్కలు చెప్పడం, ఇంగ్లిష్ గ్రామర్ చెప్పడం సులువయ్యింది. ఒక్కో అడుగు వేస్తున్న కొద్దీ పప్పెట్రీ నా జీవితంలో భాగమైపోయింది. ఒక్క మాటలో చెప్పాలంటే మా అబ్బాయితోపాటు నాలోనూ ఈ కళ పట్ల ఇష్టం బాగా పెరిగిపోయింది. ఇంటినుంచి మొదలైన ఈ బొమ్మల కథ బయటి నా ప్రపంచాన్ని విస్తృతం చేసింది. స్ఫూర్తి థియేటర్ ఎడ్యుకేషనల్ పప్పెట్రీ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్‌ను ఏర్పాటు చేసేలా చేసింది. పిల్లలే అభిమానులు తోలుబొమ్మలాట కళ అంతరించిపోతుందునుకున్న నాకు కథల ద్వారా ఈ కళను కాపాడవచ్చని, ఇంకా ఇష్టంతో కష్టపడేలా చేసింది. అందులో భాగంగానే వరంగల్ జిల్లాల్లోని అమ్మాపురంలో తీగతోలుబొమ్మలాట పునరుద్ధరణ గుర్తించిన వాటిలో ఒకటి. స్కూళ్లలోనూ పప్పెట్రీ కార్యక్రమాలు ఏర్పాటు చేయడమైనది. పిల్లలకోసమే వర్క్‌షాప్స్ నిర్వహించాను. ముందుకన్నా పిల్లలంతా ఈ కార్యక్రమాల్లో చాలా చురుకుగా మారడం గమనించాను. దీనివల్ల పిల్లల తల్లిదండ్రులకూ దగ్గరయ్యాను. నాన్న మార్గనిర్దేశం.. ఇంట్లో పురాణాలు, ఇతిహాసాలు కథలుగా మా పెద్దలు చెబుతుండేవారు. నేనూ నా తర్వాతి తరానికి అందించడానికి అదే ప్రయత్నం చేశాను. అయితే, తోలుబొమ్మలతో కథలు చెప్పడం మాత్రం మా నాన్న మార్గనిర్దేశం చేశారు. రామాయణ, మహాభారతం, పురాణాల నుండి మాత్రమే కాకుండా సమకాలీన ఇతివృత్తాల మిశ్రమంతో కథలు చెప్పడం ప్రారంభించాను. తోలుబొమ్మలాట శతాబ్దాలుగా మన జీవనంలో ఇమిడి ఉంది. ఇది వినోదం మాత్రమే కాదు అవగాహన నింపే విద్య కూడా. ఈ కళను జనంలోకి తీసుకెళ్లడానికి ప్రస్తుత కాలానికి తగినట్టు ఎన్నో ప్రయోగాలు చేయడం వల్ల పిల్లలతో పాటు పెద్దలు కూడా ఆసక్తిగా వింటున్నారు. కథే స్ఫూర్తి స్ఫూర్తి థియేటర్ ఆర్ట్ అండ్ క్రాప్ట్స్ 2005లో ప్రారంభించినప్పటి నుంచి గిరిజన విద్యార్థులకు కూడా శిక్షణ ఇచ్చాను. ఉట్నూర్‌లో ఆరోగ్య సమస్యల గురించి గోండు భాషలో వివరించిన కార్యక్రమం చాలా ప్రశంసలు పొందింది. టైప్ 1 డయాబెటిస్ పిల్లల ఆరోగ్య స్థితిపైనా పప్పెట్రీ వర్క్ చేస్తున్నాను. పుతాలికా మాస పత్రిక కరోనా సమయంలో పుతాలిక పేరుతో నెలవారీగా ఇ–మ్యాగజైన్ తీసుకువస్తున్నాను. ఇది ప్రపంచంలో ఉన్న తోలుబొమ్మల కళాకారులందరినీ పరిచయం చేస్తుంది. దీంతోపాటు పప్పెట్రీ గురించి ఆన్లైన్ తరగతులు కూడా నిర్వహిస్తున్నాను. కిందటేడాది స్వచ్ఛతా సారథి ఫెలోషిప్ లభించింది. దీంట్లో భాగంగా వ్యర్థాలతో ముఖ్యంగా ప్లాసిక్, ఖాళీ అట్టపెట్టెలు, థర్మాకోల్, పాత కుషన్లలోని దూది, కొబ్బరి చిప్పలు, పాత బట్టలు, పాత టీ స్ట్రెయినర్లు, వార్తాపత్రికలతో బొమ్మలను తయారు చేయిస్తుంటాను. దీనివల్ల వ్యర్థాలను అర్థాలుగా మార్చడం ఎలాగో పిల్లలకు తెలుస్తుంది. మనుగడకు పోరాటం మనదేశంలో తోలుబొమ్మలాట అనేది కుటుంబ సంప్రదాయం. దీనికి తగినంత ప్రోత్సాహం లేకపోవడంతో ఈ సంప్రదాయం అంతరించిపోయే అవకాశాలున్నాయి. ఈ రంగంలో ఉన్నవాళ్లు తమ మనుగడ కోసం వేరే దారులను వెతుకుతున్నారు. అయినప్పటికీ ఇతర దేశాలలో తోలుబొమ్మలాటలో చాలా పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ కళను బతికించడానికి రకరకాల మార్గాలు వెతుకుతున్నాను. ఇందుకోసం నా జీవితాంతం కృషి చేస్తూనే ఉంటాను’ అని వివరించారు పద్మినీ రంగరాజన్. తోలుబొమ్మల ద్వారా పురాణ కథలను ఆసక్తిగా చెప్పడమే కాదు బాల్యవివాహాలను అరికట్టడం, పరిశుభ్రత కోసం ఏం చేయాలి, కుటుంబ నియంత్రణ.. వంటి సామాజిక సమస్యలపై సమర్థంగా పనిచేసే మాధ్యమం తోలుబొమ్మలు అని తెలిపే పద్మినీ రంగరాజన్ ‘తోలుబొమ్మ కఠినంగా మాట్లాడినా ఎవరూ అంతగా బాధపడరు’ అని నవ్వుతూ వివరిస్తారు. – నిర్మలారెడ్డి -
Vedanta : కరోన రహిత గ్రామాల కోసం...
న్యూఢిల్లీ: పారిశ్రామిక దిగ్గజం వేదాంత రిసోర్సెస్ వచ్చే అయిదేళ్లలో సామాజిక కార్యకలాపాలపై రూ. 5,000 కోట్లు వెచ్చించనుంది. 1,000 గ్రామాల్లో వైద్యసేవల కల్పన కోసం ఉద్దేశించిన ’స్వస్థ్ గావ్ అభియాన్’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. వేదాంత రిసోర్సెస్ చైర్మన్ అనిల్ అగర్వాల్ ఈ విషయాలు వెల్లడించారు. రూ. 5,000 కోట్లతో సామాజిక కార్యకలాపాల్లో భాగంగా పౌష్టికాహారం, మహిళా.. శిశు అభివృద్ధి, హెల్త్‌కేర్, జంతు సంరక్షణ, క్షేత్రస్థాయి క్రీడల అభివృద్ధితో పాటు వివిధ రాష్ట్రాల్లో కరోనా రహిత గ్రామాల ప్రాజెక్టుకు ఆర్థిక సహాయం తదితర అంశాలకు ఈ రూ. 5,000 కోట్లు వినియోగించనున్నట్లు అగర్వాల్ వివరించారు. ఈ భారీ కార్యక్రమాన్ని అనిల్ అగర్వాల్ ఫౌండేషన్ నిర్వహించనుండగా .. కన్సల్టెన్సీ సంస్థ కేపీఎంజీ వ్యూహాత్మక భాగస్వామిగా వ్యవహరిస్తుంది. చదవండి : కరోనా కాలంలోనూ కరెంట్ ఖాతా మిగులు -
కొత్త ప్రశ్నలు రేకెత్తిస్తున్న పుస్తకం ‘శూద్రాస్’
ఏదైనా ఒక సమాజం అసమానతల ప్రాతిపదికన ఏర్పడినప్పుడు, దాని పునర్నిర్మాణం కోసం అడుగులు వేయడమొక అనివార్యమైన, అవసరమైన క్రియ. తరతరాలుగా అణచివేతకు గురైనవారు శూద్రులు. వారిని విముక్తి చేసే ప్రక్రియలో భాగంగా, జ్యోతిబా ఫూలే చాతుర్వర్ణ వ్యవస్థను సవాలు చేశాడు. దీన్నే గొప్ప కాంక్షతో అంబేడ్కర్ కూడా చేశాడు. హిందుత్వ బ్రాహ్మణీయ అధికార సంబంధాలను బహిర్గతం చేసి, సామాజిక పునర్నిర్మాణం కోసం తన వంతు పాత్రని నెరవేర్చడంలో భాగంగా వచ్చిన పుస్తకం ‘ద శూద్రాస్: విజన్ ఫర్ ఎ న్యూ పాథ్’. పెంగ్విన్, సమృద్ధ భారత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ‘రీథింకింగ్ ఇండియా’ సిరీస్‌లో భాగంగా వచ్చిన 14వ సంపుటం ఇది. ఈ నెల 22న విడుదలైంది. సామాజిక, రాజకీయ తత్వవేత్త కంచ ఐలయ్య షెపర్డ్, జేఎన్‌యూ పొలిటికల్ సైన్స్ పరిశోధక విద్యార్థి కార్తీక్ రాజా కరుప్పుసామి సంపాదకత్వంలో వెలువడింది. సంపాదకుల పరిచయ వ్యాసంతో కలిపి మొత్తం 12 అధ్యాయాలున్న ఈ పుస్తకం, శూద్రుల సామాజిక, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక స్థితిగతులను విశ్లేషించింది. రచయితలు శూద్ర సామాజిక వర్గం నుంచి రావడం, వివిధ రంగాలలో గుర్తింపు పొందినవాళ్లు కావడం పుస్తకానికి బలాన్ని చేకూర్చింది. పార్లమెంటు సభ్యుడు శరద్ యాదవ్, సామాజిక కార్యకర్త సునీల్ సర్దార్, జర్నలిస్ట్ ఉర్మిలేష్, సోషల్ జస్టిస్ లాయర్ బిందు దొడ్డ హట్టి, వైద్యుడు పుంజాల వినయ్ కుమార్, యూనివర్సిటీ ఫ్యాకల్టీ అరవింద్ కుమార్, రామ్ భీనవేని షెపర్డ్, ప్రాచీ పాటిల్, పరిశోధక విద్యార్థి ఓం ప్రకాష్ మహతో వంటి వారి వ్యాసాలున్నాయి. అనేక ప్రశ్నలను దేశ ప్రజాస్వామ్య వ్యవస్థ ముందుంచారు వ్యాసకర్తలు. శూద్ర విప్లవ దశను, శూద్ర విముక్తిని ఈ పుస్తకం అత్యవసరంగా సూచిస్తున్నది. బీజేపీ ప్రభుత్వం మళ్లీ వర్ణ ధర్మ పాలననూ, గుప్త యుగాన్నీ తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నదని హెచ్చరిస్తున్నది. ప్రాంతీయ పార్టీల ద్వారా తమ ఉనికిని ఆయా రాష్ట్రాలలో కాపాడుకుంటున్న శూద్రుల రాజకీయ పార్టీలను అంతం చేసే పనిలో హిందుత్వ రాజకీయం ఉందని చెబుతున్నది. ఈ వ్యవస్థ ఎవరి కోసం ధనాన్ని కూడగట్టే ప్రయత్నం చేస్తుంది? ఎందుకు తరచుగా ‘ఉగ్రవాది’ అనే వాడుకభాషను అలవాటు చేస్తుంది? ‘రాజ్య/ రాజద్రోహి’ తనాన్ని ఎందుకు ‘దేశద్రోహి’ తనంగా చిత్రీకరిస్తుంది? స్త్రీలను కేవలం పునరుత్పత్తి యంత్రాలుగా ఎందుకు చూస్తుంది అనే ప్రశ్నలను వేసుకుంటే విముక్తి పథంలో తొలి అడుగు వేసినట్టే. శూద్రులకు ఆధ్యాత్మిక సమానత్వం లేదనే మాట ఎంత నిజమో, అసలు సమానత్వం అనే భావనను ఈ వ్యవస్థ వాళ్లకు పరిచయం లేకుండా చేసిందనే మాట కూడా అంతే నిజం. శూద్రత్వం అంటే పనితత్వం అని గొప్పగా చెబుతారు ద్విజులు. కానీ, పనితత్వానికి, అంటే లేబర్ వర్క్‌కు గౌరవం ఇవ్వటం బ్రాహ్మణిజానికి అలవాటు లేదు. ఇక్కడ పనితత్వం అంటే పై వర్ణాలకు, ముఖ్యంగా బ్రాహ్మణులకు సేవ చేయటమే. గాంధీ తెలివిగా శూద్రుల సేవా గుణాన్ని పొగుడుతూ దాన్ని శాశ్వతం చేసే ప్రయత్నం చేశాడు. 1933లో వర్ణధర్మ వ్యవస్థను సరిచేయడం ఎలా అనే అంశంపై రాస్తూ, ‘తన విధిని విస్మరించే బ్రాహ్మణుడి కంటే తనకు తగిన కర్తవ్యాన్ని చేసే శూద్రుడే ఉత్తమం’ అన్నాడు. ఈ పుస్తకం చదివినవాళ్లు ఈ విషయాన్ని ఇంకోవిధంగా అర్థం చేసుకోవచ్చు. తనకు కేటాయించిన విధిని చేసే బ్రాహ్మణుడి కంటే, తనకు తగని కర్తవ్యాన్ని విడిచిపెట్టిన శూద్రుడే ఉత్తమం! శూద్రులు తమ మేధో సామర్థ్యాన్ని, స్పృహను, ఆధ్యాత్మిక సమానత్వం, ప్రజాస్యామ్యం కోసం ఉపయోగిస్తూ, మనువాద హిందుత్వ రాజకీయాలకు బానిస అవ్వకుండా తమ జీవన విధానాన్ని, లక్ష్యాలను గొప్పగా ఉంచుకుంటూ వాటి కోసం ప్రయత్నించినప్పుడే ఈ రాజకీయ ప్రజాస్వామ్యంలో శూద్రులకు సామాజిక ప్రజాస్వామ్యం వైపు అడుగులు వేసే అవకాశం ఉంటుంది. ఎన్నో సందర్భాల్లో అధికారంలో ఉన్న రెడ్డి, కమ్మ, వెలమ, యాదవ్, కూర్మి, వొక్కలిగ, లింగాయత్, నాయర్, పటేల్, జాట్, గుజ్జర్ శూద్ర కులాలు ఈ ప్రశ్నలు వేసుకోవలసిన అవసరం ఉంది. ఇప్పటివరకు ఒక్క నోబెల్ బహుమతి ఎందుకు శూద్రులకు రాలేదు? ఇంకా ఎన్నో ఉత్పత్తి కులాలు, భూమిని నమ్ముకొని బతుకుతున్న కులాలు అధికారం వైపు కాదు కదా, సంపూర్ణ విద్య, ఉద్యోగం వైపు కూడా ఎందుకు అడుగులు వేయలేదు? దీనికి గల కారణాలను ఈ పుస్తకం లోతుగా విశ్లేషించింది. రాజకీయ ఎదుగుదల ఉన్నంత మాత్రాన శూద్రులు సామాజిక సమానత్వ ఫలాలను అనుభవించే దశలో లేరు. ఆధ్యాత్మిక, సాంస్కృతిక సమానత్వం చాలా అవసరం. అలా లేని పరిస్థితుల్లో సామాజిక బానిస త్వాన్ని శాశ్వతం చేసినవాళ్లం అవుతాము. అలాంటి చారిత్రక తప్పిదం జరగకూడదనే హెచ్చరికను ముందుకు తెచ్చిన పుస్తకమే ‘ద శూద్రాస్’. - పల్లికొండ మణికంఠ సమీక్షకుడు పరిశోధక విద్యార్ధి, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ -
ఇంటర్నెట్ వాడకం: వీరిలోనే ఒంటరితనం అధికం!
లండన్ : లాక్డౌన్ కాలంలో సాధారణ సమయంలో కంటే ప్రస్తుతం ఇంటర్నెట్ వినియోగం విపరితంగా పెరిగిపోయింది. అయితే తాజాగా నిర్వహించిన ఓ పరిశోధనలో సరికొత్త విషయం వెలుగు చూసింది. వృద్దుల్లో అప్పుడప్పుడు ఆన్‌లైన్‌లోకి వెళుతున్న వారి కంటే రోజూ ఇంటర్నెట్ను వినియోగిస్తున్న వారు సామాజికంగా ఒంటరిగా ఉండే అవకాశం ఎక్కువగా ఉందని పరిశోధకులు కనుగొన్నారు. రోజువారీ ఇంటర్నెట్ వాడకం సామాజిక ఒంటరితనానికి దారితీయవచ్చని జర్నల్ ఏజింగ్ అండ్ సొసైటీ ఇటీవల జరిపిన పరిశోధనలో రుజువైంది. ఇందుకు ఇంగ్లాండ్‌లోని సగటు వయస్సు 64 ఏళ్లు ఉన్న 4492 మంది నుంచి డేటాను సేకరించారు. వీరిలో 19 శాతం మందిలో ఒంటరితనం అధికంగా ఉన్నట్లు, 33 శాతం మంది సామాజికంగా ఒంటరిగా ఉంటున్నట్లు తేలింది. అంటే వీరు కుటుంబంతో సరిగానే ఉండవచ్చు కానీ వీరిలో సామాజిక సంబంధాలు తక్కువగా ఉంటాయి. (25 నుంచి విమాన సర్వీసులు ప్రారంభం) రోజూ ఇంటర్నెట్ వాడుతున్న వారి కంటే.. వారానికి, నెలకొకసారి ఇంటర్నెట్ను వినియోగించే వృద్ధులు సామాజికంగా ఒంటరిగా ఉండే అవకాశం తక్కువ ఉన్నట్లు యూకేలోని ఆంగ్లియా రస్కిన్ విశ్వవిద్యాలయం జరిపిన పరిశోధనలో తేలింది. సమాచారం శోధించడం, ఈమెయిల్ పంపడం, ఆన్లైన్ షాపింగ్.. ఈ మూడు ఆన్లైన్లో ఎక్కువగా చేసే పనులు. మూడింట రెండు వంతుల మంది(69 శాతం) ప్రతిరోజు ఇంటర్నెట్ను వినియోగిస్తున్నట్లు తేలింది. దీనిపై పీహెచ్డీ స్టూడెంట్ స్టాక్‌వెల్ మాట్లాడుతూ.. రోజూ ఇంటర్నెట్ను వినియోగించే వారి సామాజిక ఒంటరితనం, అసలు ఇంటర్నెట్ ఉపయోగించని వారి స్థాయి ఇంచుమించు ఒకే విధంగా ఉండటం ఆశ్చర్యకరంగా ఉందని తెలిపారు. తరచుగా ఆన్‌లైన్‌లోకి వెళ్లడం వల్ల కొంతమంది వృద్ధులకు చుట్టూ ఉన్నవారితో భౌతిక దూరం పెరగడంతో ఎక్కువ సామాజిక ఒంటరితనం ఏర్పడుతుందన్నారు. (లాక్డౌన్ ఎత్తివేత; నా ఆనందం ఇలాగే ఉంటుంది) -
గిల్లినా నవ్వుతున్నారు
ఏం చేస్తాం.. సమాజం ఇలా ఉంది! మార్చాలంటే మీ చేతుల్లో... మా చేతుల్లో ఉందా? అందరూ కలిసి కూర్చోని ఏడిస్తే మారుతుందా? నవ్వితే మాత్రం మారుతుందంటున్నారు షెఫాలీ పాండే, ప్రీతి దాస్ మారుస్తాం మారుస్తాం అని గ్యాస్ కొట్టకుండా లాఫింగ్ గ్యాస్‌తో మార్పు మొదలెట్టారు! గిల్లితే ఎవరైనా ఏడుస్తారు. కానీ సమాజంలో జరుగుతున్న తప్పులకు మనమే కారణమని వీళ్లు తొడపాశం పెట్టినా నవ్వుతున్నారు!! వ్యంగ్యం మంచి అస్త్రం! బాధ, ఆగ్రహం, ఆవేశాలను అదే రూపంలో తెలియపరచడం కంటే వ్యంగ్యానికి తర్జుమా చేసి ఎక్స్‌ప్రెస్ చేస్తే చేరుకునే రీచ్ ఎక్కువ. అనుకున్న ఫలితం వచ్చే చాన్సూ ఎక్కువే! ఇప్పటికీ కంప్లీట్ హ్యూమర్ కన్నా కూడా వ్యంగ్యం కలిసిన హాస్యానికే మంచి ఆదరణ. అందుకే స్టాండప్ కామెడీకి.. కమెడియన్స్‌కి క్రేజ్ పెరిగిందిప్పుడు. ఎంత సీరియస్ ఇష్యూనైనా సరే వ్యంగ్యాన్ని జోడించి కామెడీ చేస్తే మనోభావాలు దెబ్బతింటున్నాయని బాధపడే గాంభీర్యులు కూడా మనసారా నవ్వుకుంటూ ఆ సెటైర్లో దాగిన సమస్యను మెదడుకు ఎక్కించుకుంటున్నారు. అలాంటి స్టాండప్ కామెడీతో కాంట్రాసెప్టివ్ పిల్స్ నుంచి కథువా రేప్, బాలీవుడ్, డేటింగ్, చైల్డ్‌బర్త్, అచ్ఛేదిన్, మేకిన్ ఇండియా, బేటీ బచావో– బేటీ పఢావో వంటి సీరియస్, పొలిటికల్ ఇష్యూస్ దాకా.. అన్నిటి మీద వ్యంగ్యాన్ని జొప్పిస్తూ జోకులు పండిస్తున్నారు, నవ్వుతో జనాలను ఆలోచింపచేస్తున్నారు, అవగాహన కలిగిస్తున్నారా ఇద్దరు మహిళా స్టాండప్ కమేడియన్స్. ఎవరు? షెఫాలీ పాండే, ప్రీతి దాస్. ఎక్కడ? అహ్మదాబాద్‌లో... తొమ్మిదేళ్లు న్యూయార్క్‌లో, రెండేళ్లు ముంబైలో ఉండి అహ్మదాబాద్‌కు చేరుకుంది షెఫాలి. ప్రస్తుతం ఒక డిజిటల్ ఏజెన్సీని నిర్వహిస్తోంది. ప్రీతి దాస్.. వృత్తిరీత్యా జర్నలిస్ట్. పీహెచ్డీ స్టూడెంట్ కూడా. హాస్యం అంటే ఆసక్తి ఉన్న ఈ ఇద్దరూ 2017లో ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా పరిచయం అయ్యారు. అప్పుడే ‘‘మహిళా మంచ్’’ అనే ఆలోచనను పంచుకున్నారు. ఏమిటీ మహిళా మంచ్? ఇదో మహిళా స్టాండప్ కామెడీ గ్రూప్. రాజకీయాలు, సామాజిక సమస్యల మీద వ్యంగ్యంతో కామెడీని పంచుతున్నారు. మొదట్లో ఒక ట్రయల్‌గా ఓ స్నేహితురాలి ఇంట్లోనే స్టాండప్ కామెడీ ప్రయోగం చేశారు. డెబ్బై మంది హాజరయ్యారు. ఆనందాశ్చర్యాల్లో మునిగిపోయిన షెఫాలి, ప్రీతి ఇక మహిళామంచ్ను ఆపేదిలేదని నిర్ణయించుకున్నారు. ‘‘బేటీ బచావో.. బేటీ పఢావో’’ అన్న నినాదాన్ని.. దేశంలో మహిళల మీద జరుగుతున్న లైంగికదాడుల నేపథ్యంలో ఇలా ‘‘మా.. బెహన్.. దాదీ.. బేటీ బచావో.. మా .. బెహన్, దాదీ, బేటీ ఛుపావో’’ అంటూ వ్యంగ్యంగా మార్చి రాసిన పోస్టర్స్‌ను పెట్టారు ఒక షోలో. టీ.. కాఫీ.. కామెడీ ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ‘‘మంత్లీ పీరియడ్ షో’’ పేరుతో నెలకొకసారి స్టాండప్ కామెడీ షోను నిర్వహిస్తునే ఉన్నారు. కేఫ్‌లు, రెస్టారెంట్స్, స్నేహితుల ఇళ్లే వాళ్ల వేదికలు. టీ, కాఫీతో పాటు కామెడీనీ సర్వ్ చేస్తారు. ఒక్కోసారి ఒక్కో గెస్ట్ స్పీకర్లను ఆహ్వానిస్తారు. ఆ స్పీకర్స్ వాళ్ల జీవితానుభవాలను హాస్యంతో పంచుకుంటారు. ‘‘దీనివల్ల ఈ షో చూడ్డానికి వచ్చిన వాళ్లు తాము పడ్తున్న కష్టాలను తేలిగ్గా తీసుకొని ఆత్మవిశ్వాసం పెంచుకుంటారు. అందువల్లే గెస్ట్ స్పీకర్స్నూ పిలుస్తున్నాం’’ అంటారు షెఫాలి అండ్ ప్రీతి. వ్యవస్థ మీదే తప్ప వ్యక్తుల మీద కాదు వ్యక్తుల బలహీనతలు, లోపాల మీద వీళ్లు కామెడీ చేయరు. మొదట్లో చెప్పుకున్నట్టు వ్యవస్థలోని లోపాలు, పాలసీల మీదే వ్యంగ్యోక్తులు, ఛలోక్తులు విసురుతారు. ప్రీతిదాస్కు రాజకీయాల మీద కచ్చితమైన అభిప్రాయాలున్నాయి. ఆమె చేసే కామెడీ రాజకీయాల మీదే ఉంటుంది. షెఫాలీ మహిళా సమస్యల మీద బాగా స్పందిస్తుంది. అవే ఆమె హాస్యానికి అంశాలవుతాయి. రుతుక్రమం మీది అపోహల మీద ప్రీతి జోక్స్ వేస్తే వెంటనే డేటింగ్ మీద, దేశీ పోర్న్ మీద షెఫాలీ కామెడీ పుట్టిస్తుంది. అలా ఇద్దరు అప్పటికప్పుడు ఆశువుగా హాస్యాన్ని పండిస్తూ మహిళా స్టాండప్ కమెడియన్స్కున్న హద్దులు చెరిపేస్తున్నారు. కడుపుబ్బా ప్రేక్షకులను నవ్విస్తున్నారు. ఆలోచనలను రేకెత్తిస్తున్నారు. ‘‘సహజంగానే బ్రెయిన్ అండ్ పవర్ తమ సొత్తు అనుకుంటారు మగవాళ్లు. మాలాంటి వాళ్లను వేదిక మీద చూసేసరికి కంగుతింటున్నారు. సమకాలీన రాజకీయాలు, టెక్నాలజీ మీద మేం జోక్స్ వేస్తుంటే చాలామంది నోళ్లు వెళ్లబెడ్తుంటారు. అన్నం, పప్పు, చారు, చట్నీ కాకుండా వీళ్లకు ఇవి కూడా తెలుసా? అన్నట్టు ఉంటాయి వారి ఎక్స్ప్రెషన్స్’’ అంటుంది షెఫాలీ. మా .. బెహన్ షో సాధారణంగా మన సమాజంలో మగవాళ్లను తిట్టే.. మగవాళ్లు తిట్టుకునే తిట్లు కూడా అమ్మ, అక్క ఆలీ మీదే ఉంటాయి. అలాంటి తిట్లకు చెక్ పెట్టడానికి వీళ్లు ‘మా.. బెహన్ షో’ చేశారు. విశేష ఆదరణ లభించింది. గ్యాంగ్స్ ఆఫ్ వస్సేపూర్లోని పాటలకు పేరడీ పాటలు రాసి ఒక షో నిర్వహించారు. గుజరాత్‌లోని చట్టవ్యతిరేకమైన సారా వ్యాపారం మీద ‘‘అవర్ బేవ్డా గుజరాత్’’ పేరుతో కామెడీ షో చేశారు. దానికి ఆరువందల మంది హాజరయ్యారట. వీళ్ల షోలన్నీ ఉచితంగానే ఉంటాయి. కనీసం రికార్డ్ చేసుకొని యూట్యూబ్ చానెల్లో పెట్టుకోవడం, ఆ వీక్షణల ద్వారా డబ్బు సంపాదించుకోవడమూ ఉండదు. కారణం హాస్యాన్ని వాళ్లంత పవిత్రంగా చూస్తారట. షో అయిపోగానే ఓ హ్యాట్ పట్టుకొని ప్రతి వ్యక్తి దగ్గరకు వెళ్తారు తోచింది అందులో వేయమని అంతే. అలా వచ్చిన డబ్బు మైక్ ఖర్చులకు సరిపోతే చాలనుకుంటారు. జాగ్రత్త... జనాలు గమనిస్తున్నారు.. ‘‘ఎంత మా షోలను ఆదరిస్తున్నా ఛాందస, సంప్రదాయ అహ్మదాబాద్ ఏదో రకంగా మమ్మల్ని వెనక్కిలాగే ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. మా పేరెంట్స్ మా షోస్‌కి రారు. రాకపోగా... ‘జాగ్రత్త.. జనాలు గమనిస్తున్నారు’ అంటూ సున్నితంగా హెచ్చరిస్తుంటారు. మావారు, మా అబ్బాయి మాత్రం ప్రతీ షో అటెండ్ అవుతారు. అరేంజ్మెంట్స్లోనూ హెల్ప్ కూడా చేస్తారు. మా క్లోజ్ ఫ్రెండ్స్ అయితే మా షోస్ చూసి ‘‘ మీ మీద ఫెమినిస్ట్లనే ముద్రేస్తారేమో జనాలు అంటూ భయపడ్తుంటారు’’ అని చెప్తుంది ప్రీతీ దాస్. ‘‘మా జీవితానుభవాలతోనే కామెడీ చేస్తాం కాబట్టి మా కామెడీలో నిజాలే ఉంటాయి’’ అంటుంది షెఫాలీ పాండే. ‘‘మంత్లీ పీరియడ్ షోస్‌ను ఇంకా విస్తరించాలనుకుంటున్నాం. మరింత మంది మహిళలు వచ్చేలా... మరిన్ని సిటీస్‌కి చేరేలా’’ అంటూ తమ లక్ష్యాన్ని చెప్పారు ఇద్దరూ. -
కవిత్వం సామాజిక అంశాల దర్పణం
విజయవాడ కల్చరల్ : కవిత్వం సామాజిక అంశాల దర్పణమని మంత్రి పల్లెరఘనాథరెడ్డి అన్నారు. పుష్కరాల సందర్భంగా తెలుగు రక్షణ వేదిక , భాషా సాంస్కృతిక శాఖ సహకారంతో ఐఎంఏ హాల్లో సోమవారం ఉదయం కవి సమ్మేళనం నిర్వహించింది. వర్ధమాన, ప్రముఖ కవులు కవయిత్రుల కవిత్వ పఠనం అలరించింది. మంత్రి మాట్లాడుతూ కవిత్వంలో సామాజిక అంశాలు కనిపించినప్పుడే అది సజీవంగా ఉంటుందని అన్నారు. ఏ రాష్ట్రంలో కవులకు కళాకారులకు గౌరవం ఉంటుందో ఆ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందన్నారు. తెలుగు రక్షణ వేదిక జాతీయ అధ్యక్షుడు పొల్లూరి హరికృష్ణ మాట్లాడుతూ నూతన రాజధానిలో కవులను ప్రోత్సహించటానికి తెలుగు రక్షణ వేదిక అనేక కార్యక్రమాలు చేపట్టిందని,అందులో భాగంగా కవులకు పుష్కర పురస్కారం అందిస్తున్నామని విరించారు. రంగస్థల నటుడు గుమ్మడి గోపాల తెలుగు రక్షణవేదిక లక్ష్యాలను వివరించారు. డిప్యూటీ కలెక్టర్ సూర్యకళ, లయోల కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ గుమ్మా సాంబశివరావు, సీనియర్ జర్నలిస్ట్, రచయితల సంఘం ఆంధ్రప్రదేశ్ కార్యవర్గ సభ్యుడు సిహెచ్.వి.ఎన్.శర్మ, పాలపర్తి శ్యామలానందప్రసాద్, సుధారాణి, మందారపు హైమావతి, వలివేటి శివరామకృష్ణతో పాటు పలువురు కవులు, కవయిత్రులు కవిసమ్మేళనంలో పాల్గొన్నారు.మల్లెతీగ సంపాదకుడు కలిమిశ్రీ, రమ్యభారతి సంపాదకుడు చలపాక ప్రకాష్‌లు పర్యవేక్షించారు. -
ఉపాధి వ్యథల ‘గల్ఫ్’
సామాజిక సమస్యలే ఇతివృత్తాలుగా సినిమాలు తెరకెక్కిస్తున్న దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి. ‘సొంత ఊరు’, ‘గంగపుత్రులు’ లాంటి సినిమాలు ఈ దర్శకుడిలోని సామాజిక బాధ్యతను చూపిస్తాయి. ప్రస్తుతం ఆయన మరో సోషల్ ఇష్యూతో ‘గల్ఫ్’ రూపొందిస్తున్నారు. శ్రావ్య ఫిలింస్ బ్యానర్‌పై యెక్కలి రవీంద్రబాబు, మద్దినేని రమణకుమారి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చేతన్ మద్దినేని, సంతోష్ పవన్, అనిల్ కళ్యాణ్, డింపుల్ ముఖ్య తారలు. ప్రస్తుతం కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. సునీల్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ - ‘‘పొట్టకూటి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్తున్న వారి కష్టాలను ఇందులో చూపిస్తున్నాం. ఈ వ్యథలో ఓ స్వచ్ఛమైన ప్రేమకథను చెప్పబోతు న్నాం. సెప్టెంబర్‌లో రిలీజ్ చేయాలను కుంటున్నాం’’ అన్నారు. -
పుస్తకాలే రాలేదు.. ఏం చదవాలి?
ఇన్ బాక్స్ ఆంధ్రప్రదేశ్‌లో డీఎడ్ మొదటి సంవ త్సరం చదువుతున్న వేలాదిమంది విద్యా ర్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. విద్యకు అధిక ప్రాధాన్యమిచ్చి పెద్ద మొత్తంలో నిధులు కేటాయిస్తామని ప్రభు త్వం ఘనంగా చెబుతోంది. అయితే, వాస్త వానికి రాష్ర్ట ప్రభుత్వం అవలంబిస్తున్న అస్త వ్యస్త విద్యా విధానాల వల్ల విద్యార్థులు తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నారు. గత ఏడాది డిసెంబర్ నుంచి డీఎడ్ మొదటి ఏడాది (2015-16) తరగతులు ప్రారంభ మయ్యాయి. పాత సిలబస్‌తోనే అన్ని కళాశా లల్లో విద్యాబోధన చేపట్టారు. అయితే, ప్రభుత్వం అకస్మాత్తుగా ఈ విద్యా సంవ త్సరం నుంచి కొత్త సిలబస్ అమలులోకి వస్తుందని ప్రకటించింది. కానీ, అందుకు తగిన ఏర్పాట్లు ఏమాత్రం చేపట్టలేదు. దీంతో అప్పటికే ఆలస్యంగా ప్రారంభమైన విద్యా సంవత్సరానికి, సిలబస్ మార్పుతో విద్యార్థుల పరిస్థితి మూలిగే నక్కపై తాటిపండు పడినట్లైంది. అసలు సిలబస్ ఏమిటో తెలియకపోవడంతో విద్యార్థులకు ఎలా బోధించాలో అర్థంకాక అధ్యాపకులు కూడా తలలు పట్టుకుంటున్నారు. విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే మారిన సిలబస్‌తో కొత్త పుస్తకాలు ముద్రించి విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చి ఉంటే బాగుండేదని తల్లిదండ్రులు, విద్యావేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డీఎడ్ విద్యా విధానాన్ని నీరుకారుస్తున్నా రని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తు తున్న నేపథ్యంలో ప్రభుత్వం సత్వరం దృష్టి సారించి దిద్దుబాటు చర్యలు చేపట్టాలి. వెంటనే మారిన సిల బస్తో డీఎడ్ మొదటి సంవత్సరం పుస్తకా లను తెలుగు అకాడమీ ముద్రించి విద్యార్థు లకు అందుబాటులోకి తేవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. - బట్టా రామకృష్ణ దేవాంగ్, సౌత్ మోపూరు నెల్లూరు జిల్లా వెంటపడితే కానీ కదలని ఫైళ్లు! గత నెల చివరలో జరిగిన కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఆఫీసులో ఫైళ్లు వాటంతట అవి కదలడం లేదు. ప్రత్యేక ఆసక్తితో వెంటబడిన వారి ఫైళ్లు మాత్రమే కదులు తున్నాయి, అధికారులు వాటినే తీసుకొస్తారు, నేను వాటిపైనే సంతకాలు పెడుతున్నా, వెంటబడని వారి ఫైళ్లు నా ముందుకు రావడం లేదు.. అంటూ స్వయంగా పేర్కొన్నారు. వెంటబడని వారి ఫైళ్లు రావడం లేదనడానికి మచ్చుకు ఒక ఉదాహరణ. ఎయిడెడ్ డిగ్రీ కళాశాలల్లో పనిచేస్తున్న అధ్యాపకేతర సిబ్బందికి ఉద్యోగ విరమణ సమయంలో ఆర్జిత సెలవులను నగదుగా మార్చుకోవడానికి సంబంధించిన ఫైలును (CCE's Bocs. Rc. No. 1251/Admn. 4-3/2008 dated 19-01-2009) గత ముఖ్యమంత్రులు పట్టించుకోక పోవడం వల్లనో, రాష్ట్ర విభజన కారణంగా మరుగున పడిందో లేక అటకెక్కిందో తెలియడం లేదు. సీఎం చంద్రబాబుపై నమ్మకంతో గత రెండేళ్లుగా ఎదురు చూస్తూనే ఉన్నాము. వ్యక్తిగతంగా నేను 2014 జూన్ 6న, నవంబర్ 11న, 2015 సంవత్సరం ఫిబ్రవరి 28న, ఏప్రిల్ 24న, ఈ సంవత్సరం ఫిబ్రవరి 3న ఈ విషయమై రిజిస్టర్ పోస్ట్ ద్వారా ముఖ్యమంత్రికి నేరుగా విజ్ఞాపనలు అందజేయడమైనది. కాని ఈనాటికీ పైన తెలిపిన ఫైలుకు మోక్షం కలగలేదని తెలుపడానికి చింతిస్తున్నాను. ఆ ఫైలు పరిష్కారానికి సీఎం చెప్పినట్లు నేను నిజంగా ఎవరివెంటా పడలేదు. దానికి అనుగుణంగా అధికారులూ స్పందించ లేదు. ముఖ్యమంత్రి వద్దకు ఈ ఫైలు వెళ్లిందీ లేనిదీ కూడా తెలియడంలేదు. నవ్యాంధ్రప్రదేశ్ నవ నిర్మాణ దీక్ష సంద ర్భంగా అయినా మా సమస్యను మానవతా దృక్పథంతో పట్టించుకుని పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని అభ్యర్థి స్తున్నాము. - ఆశం సుధాకరరావు, విశ్రాంత పర్యవేక్షకులు గూడలి, నెల్లూరు జిల్లా -
విద్యార్థులు... పెద్ద మనసులు!
జూబ్లీహిల్స్: వారంతా జేబీఐటీ కాలేజీ విద్యార్థులు తమవంతుగా ఏదైనా చేయాలని నిర్ణయించారు... సామాజిక సమస్యలపై సమరశంఖం పూరిస్తున్న స్ట్రీట్కాజ్ అనే స్వచ్ఛంద సంస్థ సభ్యులైన వీరంతా తలోచేయి వేసి సమస్యల పరిష్కారానికి నడుం బిగించారు. పర్యావరణ ప్రాముఖ్యత, పేదలు, వృద్ధులకు దుస్తులు, పండ్లు పంపిణీ, విద్యార్థులకు పుస్తకాలు పంపిణీలాంటి సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అందులోభాగంగా శనివారం నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న వృద్ధాశ్రమాలు, పేదల బస్తీలు, పాఠశాలలు సందర్శించి దుస్తులు, పుస్తకాలు సహా వివిధ తినుబండారాలు అందజేశారు. జూబ్లీహిల్స్, శ్రీనగర్‌కాలనీ తదితర ప్రాంతాల్లో పాదచారులకు మొక్కల పెంపకం అవశ్యకతను వివరిస్తూ వారికి మొక్కలను అందజేశారు. ప్లాస్టిక్ వాడవద్దని, పేపర్బ్యాగ్లు వాడాలని ప్రచారం చేశారు. ప్రతినెలా ఒక సామాజిక చైతన్య కార్యక్రమం నిర్వహిస్తామని నిర్వాహకులు ప్రణవ్, వైష్ణవి పేర్కొన్నారు. -
చక్రపాణి... విజయవాణి!
సామాజిక ఉద్యమాల్లో ముందువరుస... చదువు కోసం నిత్యపోరాటం పాత్రికేయ వత్తి నుంచి పబ్లిక్ సర్వీస్ కమిషన్ చెర్మన్ వరకూ ప్రస్థానం ఇదీ ఘంటా చక్రపాణి విశిష్టత జన్మనిచ్చిన ఊరిని ప్రాజెక్ట్ మాయం చేసేసింది. అన్నం పెట్టిన పొలమూ అందులోనే కలసి‘పోయింది.’ చదువూ వెక్కిరించే ప్రయత్నం చేసింది. మెడిసిన్ సీటు ఊరించి... ఉసూరుమనిపించింది. ‘సామాజిక’ సమస్యలు అడుగడుగునా వెనక్కినెట్టే ప్రయత్నం చేశాయి. ఉన్న ఊరిని వదిలి మరో చోటుకు వెళితే... అక్కడి పరిస్థితులు ‘దూరంగా వెళ్లిపోమని’ సలహా ఇచ్చాయి. కుటుంబం...తల్లిదండ్రులు... బాధ్యతను గుర్తు చేస్తున్నాయి... సాధారణంగా ఎవరికైనా ఇలాంటి స్థితి ఎదురైతే ఈ ముళ్లబాటలో ముందుకెళ్లలేమని ఆగిపోతారు. క్రుంగిపోతారు. కానీ ఆయన హాస్టల్‌ను అమ్మ ఒడిగా మలచుకున్నారు. అక్షరాలను ఆసరాగా చేసుకున్నారు. భవిష్యత్తుకు సోపానాలుగా మార్చుకున్నారు. ‘దూరంగా వెళ్లిపొమ్మని’ చెప్పిన పరిస్థితులను ఎదగడానికి బాటగా చేసుకున్నారు. వైద్య శాస్త్రం తనను వద్దనుకుంటే.. సామాజిక శాస్త్రాన్ని అస్త్రంగా అందుకున్నారు. అరుదైన అవకాశాలను అందిపుచ్చుకున్నారు. ఆయనే టీపీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి. సిటీబ్యూరో: ఇప్పుడు ఆ ఊరు లేదు. కానీ ఒకప్పుడు కరీంనగర్‌కు పది కిలోమీటర్ల దూరంలో ఉండేది యాష్వాడ. చిన్న పల్లెటూరు. మానేరు డ్యామ్ నిర్మాణంలో మాయమైన 18 ఊళ్లలో అదొకటి. ఊరు మాయమైనట్లే అక్కడ పుట్టి పెరిగిన ఎంతోమంది అస్తిత్వమూ ప్రశ్నార్థకమైంది. సరిగ్గా అక్కడ మొదలైన జీవన పోరాటం... సంఘర్షణ... కోట్లాది తెలంగాణ ప్రజల అస్తిత్వ పోరాట ప్రతీకై... ఆత్మగౌరవ పతాకై ఎగసింది. ఇక్కడి ప్రజల ఆకాంక్షలను సమున్నతంగా ఆవిష్కరించింది. ఒక గొంతుకై నిలిచింది. ఆ గొంతు ప్రొఫెసర్ చక్రపాణిది. ఆ ప్రస్థానంలో మరో మైలురాయిని చేరుకున్నారు. ఒక సీనియర్ పాత్రికేయుడిగా, అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో ఆచార్యుడిగా, సామాజిక, రాజకీయ విశ్లేషకుడుగా మాత్రమే తెలిసిన ఆయన ప్రస్తుతం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్‌గా ఇంకో మెట్టు ఎక్కారు. ఐదో తరగతి వరకు మాత్రమే ఉన్న ఆ ఊళ్లో కిరోసిన్ దీపం గుడ్డి వెలుతురులో అక్షరాలు దిద్దుకున్నారు. బతకడమే పోరాటమైన చోట చదువూ భారమైంది. సంక్షేమ హాస్టల్ ఆదుకొని ఒడ్డున చేర్చింది. ఎక్కడ చేజారిపోతుందోననుకున్న విద్యను గట్టెక్కించింది. అలా ఒక్కో మెట్టూ పెకైక్కారు. టీపీఎస్సీ కమిషనర్ స్థాయికి చేరుకున్నారు. తన అనుభవాలను... అంతరంగాన్ని ‘సాక్షి’ వద్ద ఆవిష్కరించారు. అందని వైద్య విద్య... చరిత్ర, సామాజిక శాస్త్రాలు తప్ప సైన్స్ అంటే పెద్దగా ఆయనకు ఇష్టం ఉండేది కాదు. కానీ తమ్ముడిని మెడిసిన్ చదివించాలనుకున్న అన్నయ్య సత్యనారాయణ కోరిక మేరకు బైపీసీలో చేరారు. ఇష్టం లేకపోయినా కష్టపడి చదివారు. ఎంసెట్ రాశారు. తనకు మెడిసిన్‌లో సీటొచ్చిందన్న సంగతి ఆరు నెలల తరువాత తెలిసింది. దాని కోసం పెద్ద న్యాయపోరాటమే చేయవలసి వచ్చింది. ఈ ఆరు నెలల వ్యవధిలో మరో విషయం గుర్తించారు. ఆర్థిక భారంతో కూడిన మెడిసిన్ కంటే టీచర్ ఉద్యోగమే మంచిదనుకున్నారు. టీటీ సీ రాశారు. 1985లో ధ ర్మారం మండలం బొమ్మారెడ్డి పల్లెలో రూ.398 వేతనంతో ఉపాధ్యాయుడిగా కెరీర్ ప్రారంభించారు. ఆ రోజుల్లోనే కరీంనగర్లో ‘జీవగడ్డ’ సాయంకాలపు దినపత్రికలో పాత్రికేయుడిగా ప్రవేశించారు. అల్లం నారాయణ, నరేందర్, కేఎన్ చారి, మరికొందరు మిత్రులతో కలిసి ‘జీవగడ్డ’ విలేకరిగా విధి నిర్వహణ. అప్పటికే తెలంగాణ సమాజం ఒక భయానకమైన పోలీసు నిర్బంధాన్ని ఎదుర్కొంటోంది. నక్సలైట్ ఉద్యమాలతో అప్పటి యువత బాగా ప్రభావితమవుతోంది. ఆ ప్రభావం చక్రపాణిపైనా ఉంది. అదే సమయంలో మార్క్సిజంపైకి దృష్టి మళ్లింది. రెండు, మూడేళ్ల పాటు బాగా అధ్యయనం చేశారు. టీచర్‌గా కంటే విలేకరిగా పని చేయడమే తనకు ఎంతో సంతృప్తినిచ్చింది. 1987 నాటికి కరీంనగర్లో నిర్బంధం మరింత తీవ్రమైంది. ఆ పరిస్థితుల్లో స్నేహితుల సలహా మేరకు కరీంనగర్‌ను వదిలిపెట్టి హైదరాబాద్ వెళ్లవలసి వచ్చింది. సామాజిక ఉద్యమ పథం బ్రెజిల్లో 2003లో జరిగిన వరల్డ్ సోషల్ ఫోరమ్, ఇట లీలోని యూరోపియన్ సోషల్ ఫోరమ్‌తో పాటు, లెఫ్ట్ థింకర్స్ సారథ్యంలో అమెరికాలో స్థాపించిన ‘న్యూ స్కూల్’ విశ్వవిద్యాలయంలో ‘ప్రపంచీకరణ నేపథ్యంలో భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో, చైనా సోషలిజంలో వచ్చిన సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిణామాలపై పరిశోధనాత్మక అధ్యయనం గొప్ప సంతృప్తి. 2006లో హైదరాబాద్‌లో వరల్డ్ సోషల్ ఫోరమ్ నిర్వహణలో కీలకమైన బాధ్యతలు. అంతకంటే ముందు మావోయిస్టు పార్టీకి, ప్రభుత్వానికి నడుమ చర్చల కోసం పీస్ ఇనిషియేటివ్ కమిటీలో ఎస్ఆర్ శంకరన్ వంటి పెద్దలతో కలిసి పని చేశారు. చర్చల సమయంలో ఇరు వర్గాల మధ్య కాల్పులు జరగకుండా ఏర్పాటైన కాల్పుల నియంత్రణ కమిటీకి కన్వీనర్‌గా కీలకమైన బాధ్యతలు నిర్వర్తించారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో... 2009లో మొదలైన తెలంగాణ మలిదశ ఉద్యమంలో క్రియాశీల కార్యకర్తగా పని చేశారు. ఉద్యమ గమనంపై ఆయన సంధించిన ‘ఘంటాపథం’, వార్తా కథనాల విశ్లేషకుడిగా, వ్యాఖ్యాతగా, ఉస్మానియా విద్యార్థి ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచి సాగించిన పోరాటం ఆయనను తిరుగులేని ఉద్యమకారుడిగా నిలిపాయి. రాత్రిబంవళ్లు టీవీ చానళ్లలో వ్యాఖ్యాతగా వ్యవహరించారు. అభిరుచులు... అధ్యయనం, రాయడం, సామాజిక అంశాలపై విశ్లేషణ. కుటుంబ నేపథ్యం... రెండెకరాల మెట్ట పొలం మాత్రమే ఉన్న పెద్ద కుటుంబం. ముగ్గురు అన్నదమ్ములు...ముగ్గురు అక్కచెల్లెళ్లు. అమ్మ జనని. నాన్న మొగులయ్య. తాము అనుభవించిన సామాజిక అణచివేత, వివక్ష పిల్లల అనుభవంలోకి రావద్దనుకున్నారా దంపతులు. వ్యవసాయాన్నే ఆధారంగా చేసుకొని కష్టపడ్డారు. తల్లిదండ్రుల ఆకాంక్షలను నెరవేర్చేలా... ఒక వైపు పొలం దున్నుతూ, పశువులను మేపుతూ, పొలంలో పండిన కూరగాయలను అమ్ముతూ... మరోవైపు బడికెళ్లారు చక్రపాణి. ఊళ్లో ఐదో తరగతి పూర్తయింది. పై చదువులు అసాధ్యమనుకొంటున్న తరుణంలో అప్పటి సాంఘిక సంక్షే మ హాస్టల్ వార్డెన్ బీఎస్ రాములు (ప్రముఖ రచయిత) ఆపన్న హస్తం అందించారు. తాను వార్డెన్‌గా పని చేస్తున్న ఎలగందుల హాస్టల్లో చేర్చుకున్నారు. అలా చదువు వైపు మళ్లారు. పదో తరగతి వరకు ఆ హాస్టల్లోనే ఉండి చదువుకున్నారు. అప్పటి కి మానేరు డ్యామ్ పనులు మొదలయ్యాయి. యాష్వాడతో పాటు 18 ఊళ్లు ఖాళీ చేయవలసి వచ్చింది. దాంతో చక్రపాణి కుటుంబం ఉపాధి కోసం కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ మండలం దూలికట్టకు మకాం మార్చింది. సుల్తానాబాద్‌లోనే 1983లో ఇంటర్మీడియట్ చదివారు. ఆదర్శ వివాహం అంబేద్కర్ ఓపెన్ వర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న రోజుల్లోనే ఫిజిక్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పుష్పతో పరిచయం ప్రేమగా మారింది. ఒకరి అభిప్రాయాలు మరొకరికి నచ్చాయి. స్నేహితులు, సీనియర్ జర్నలిస్టుల సమక్షంలో 1994 ఆగస్టు 13వ తేదీన బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో దండలు మార్చుకొని ఆదర్శ వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం పాప అమేయ ఇంటర్ చదువుతోంది. కొడుకు రాహుల్ మిళింద్ ఏడో తరగతి. మధుర జ్ఞాపకం హైదరాబాద్‌లో ఒకవైపు దినపత్రికల్లో పాత్రికేయుడిగా విధులు నిర్వహిస్తూనే మరోవైపు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో 1990లో ఎంఏ సోషియాలజీ, 1992 నాటికి ఎంసీజే పూర్తి చేశారు. యూజీసీ నెట్‌కు ఎంపికయ్యారు. అప్పటికి 25 ఏళ్ల వయస్సు. ఆ సమయంలో కాకతీయ విశ్వవిద్యాలయంలో సోషియాలజీ లెక్చరర్‌గా ఉద్యోగం. వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జయశంకర్ మార్గదర్శకత్వంలో డిగ్రీ, పీజీ విద్యార్థులకు టీచింగ్. బియ్యాల జనార్దన్, డాక్టర్ బుర్రా రాములు, ప్రొఫెసర్ బొబ్బిలి వంటి అధ్యాపక మిత్రుల పరిచయం. 20 నెలల పాటు వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయంలో గడిపిన ఆ రోజులు ఎప్పటికీ మరిచిపోలేని మధురమైన జ్ఞాపకాలు. చిన్న వయస్సులోనే లెక్చరర్‌గా పని చేయడం ఒకవైపు... మరోవైపు అప్పటి ఉద్యమ వాతావరణం, సామాజిక, రాజకీయ అంశాలపైన చర్చలు, విశ్లేషణలు. 1993లో అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయానికి పయనం. ప్రజా సంబంధాల అధికారిగా, అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా, ప్రొఫెసర్‌గా, డీన్‌గా, రిజిస్ట్రార్‌గా ఇటీవల వరకు అనేక కీలకమైన బాధ్యతల నిర్వహణ. అక్కడి నుంచి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్‌గా కొత్త బాధ్యతలు. బాధపడిన క్షణాలు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఒకవైపు పోరాటం ఉద్ధృతంగా సాగుతున్న రోజుల్లో విద్యార్థుల ఆత్మహత్యలు మన సును ద్రవింపజేశాయి. అప్పటి వరకు ఉద్యమంలో కలియ తిరుగుతూ, అంతటా తానై కనిపించిన విద్యార్థి యాదయ్య ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకొని సజీవ దహనమైన సంఘటన ఇప్పటికీ కన్నీళ్లు తెప్పిస్తుందంటారు. -
సామాజిక న్యాయానికి నిర్వచనం
ఇంతవరకూ న్యాయమూర్తులు తీర్పులు చెప్పడానికే పరిమితమైపోయారు. కాని న్యాయ మూర్తులుగా మన పని సామాజిక వ్యవస్థను సమూలంగా మార్చడంగా ఉండాలి’’ అని కృష్ణయ్యర్ దండోరా వేశాడు. సామాజిక సమస్యలకు, రాజ్యాంగ నిబంధనలకు ప్రజా ప్రయోజనాల భాష్యం చెప్పుకుంటూ పోయాడు. పాలక వర్గాలకు రుచించని అనేక తీర్పులను నిర్మొహమాటంగా చెప్పిపోయాడు. పాలక వర్గాల ప్రజా వ్యతిరేక నిర్ణయాలను రాజ్యాంగ పరిమితులలో ఎదుర్కొంటూనే... న్యాయ సమానత్వం, వ్యక్తి స్వేచ్ఛ, జీవించే హక్కులకు సామాన్యుని ప్రయోజనం లక్ష్యంగా చైతన్యపూరితమైన అర్థాన్ని కల్పించాడు. భారతదేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు న్యాయమూర్తి స్థానా న్ని 1973 జూలై 17న అధిష్టించి, తొలి ఏడేళ్ల లోపే ఆ స్థానం నుంచి అత్యంత విశిష్టమైన 724 తీర్పులు, విస్పష్టమైన ఆలోచనాత్మక భావప్రకటనలూ, వ్యాఖ్య లూ సకాలంలో వెలువరించి ప్రపంచ న్యాయకోవిదులచే ‘ఔరా’ అనిపించు కున్న సుప్రసిద్ధ న్యాయమూర్తి జస్టిస్ వి.ఆర్. కృష్ణయ్యర్. కేరళలో ఇ.ఎం.ఎస్. నంబూద్రిపాద్ ముఖ్యమంత్రిగా ఏర్పడ్డ దేశంలోని తొలి కమ్యూనిస్టు ప్రభు త్వంలో న్యాయశాఖ సహా, హోం, సాంఘిక సంక్షేమం, నీటిపారుదల శాఖలను అత్యంత సమర్థవంతంగా నిర్వహించి ఖ్యాతిగన్న వాడాయన. శత వృద్ధుగా కొలది రోజుల నాడు పరమపదించారు. కృష్ణయ్యర్ ఒక సాధారణ వ్యక్తిగా మరణిస్తే మనం ఆ మేరకు నివాళులర్పిస్తాం. కాని కృష్ణయ్యర్ ప్రజాస్వామ్య ఉద్యమాలకు, న్యాయశాస్త్ర నియమ విలువల వ్యాప్తికి, అభ్యుదయకర శక్తులకు, వారి పోరాటాలకు, పౌర హక్కుల సంఘాలకు, మహిళా ఉద్యమాలకు అండగా నిలబడిన అరుదైన విశిష్ట వ్యక్తి. 99వ ఏట కూడా విద్యార్థి యువజన, పారి శ్రామిక, వ్యవసాయ కార్మిక ఉద్యమాల సామంజస్యాన్ని సమర్థించడమే తన వృత్తి ధర్మంగా శ్వాసించిన అఖండ మేధావి! వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రు లకు, దేశ ప్రధాన మంత్రులకు కృష్ణయ్యర్ ఒక దేశభక్తుడిగా, విశ్రాంత న్యాయ మూర్తిగా క్లిష్ట ఘట్టాలలో వివిధ ప్రజా సమస్యలపైన ప్రజాశ్రేయస్సునాశించి ఉత్తరాలు రాస్తూనే ఉన్నారు. మేధావిగా, బాధ్యతగల పౌరునిగా కృష్ణయ్యర్ కార్యక్షేత్రం ఒకటి కాదు. న్యాయశాస్త్ర విషయాలతోనే సరిపెట్టుకోకుండా, వాటిని సామాజిక, ఆర్థిక, తాత్త్విక, సాహిత్యాదిరంగాలకు పరివ్యాప్తం చేసుకుని తన వృత్తి జీవితాన్ని పరి పుష్టం చేసుకున్నవాడాయన. మనో దిఙ్మండలాన్ని విస్తృతం చేసుకున్నవారా యన. మార్క్సిజం ఆయన దృక్కోణం. ‘‘ఇంత వరకు తత్వవేత్తలు ప్రపంచానికి భాష్యం చెప్పడానికే పరిమితమై పోయారు. ఇక నుంచి వారి పని - ప్రపంచాన్ని మార్చడం’’గా ఉండాలని కారల్ మార్క్స్ అంటే, దాన్ని న్యాయవ్యవస్థకు అనువర్తింపచేసి ‘‘ఇంతవరకూ న్యాయమూర్తులు తీర్పులు చెప్పడానికే పరిమి తమైపోయారు. కాని న్యాయమూర్తులుగా మన పని సామాజిక వ్యవస్థను సమూలంగా మార్చడంగా ఉండాలి’’ అని ఆయన దండోరా వేశాడు. ఈ లక్ష్యా నికి అనుగుణంగానే ఆయన సామాజిక సమస్యలను, భారత రాజ్యాంగ నిబం ధనలకు, రాజ్యాంగానికి ప్రజా ప్రయోజనాల భాష్యం చెప్పుకుంటూ పోయా డు. పాలక వర్గాలకు రుచించని అనేక తీర్పులను నిర్మొహమాటంగా చెప్పిపోయాడు. మానవతా న్యాయమూర్తి పాలక వర్గాల ప్రజావ్యతిరేక నిర్ణయాలను రాజ్యాంగ పరిమితులలోనే నిరంతరం ఎదుర్కొంటూ రాజ్యాంగ అధికరణలకు, ముఖ్యంగా ‘చట్టం ముందు అందరూ సమానులే’నని చాటే 14వ అధికరణకు, వ్యక్తి స్వేచ్ఛను, జీవించే హక్కునూ గ్యారంటీ చేస్తున్న 21వ అధికరణకు సామాన్యుని ప్రయోజనం లక్ష్యంగా చైతన్యపూరితమైన అర్థ గౌరవాన్ని కల్పించినవాడు కృష్ణయ్యర్. అందుకే సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ సహా, దేశంలోని పలు హైకోర్టు బార్ అసోసియేషన్లు ఆయనను ‘‘మానవతా న్యాయమూర్తి’’గా సంబోధించుకుంటూ వచ్చాయి. భావప్రకటనా స్వేచ్ఛను ప్రాథమిక హక్కుగా గుర్తించడమంటే, పౌరులకు స్వేచ్ఛగా న్యాయం పొందే అవకాశమని ఆయన భావించాడు. పౌరునికి ఉండవలసిన ఈ రెండు రకాల స్వేచ్ఛను కోర్టు ధిక్కార నేరంగా, న్యాయస్థానాలపై విమర్శగా భావించడాన్ని తూర్పారబట్టాడు. ఈ పరిధిలోనే పత్రికా స్వేచ్ఛను కాపాడేందుకు ఆయన ముందుకొచ్చాడు. అలా అని నిరాధార ఆరోపణలతో న్యాయస్థానాలపైన, న్యాయమూర్తుల తీర్పులపైన విరుచుకుపడే కొన్ని పత్రికలు, కొందరు పాలకుల ధోరణినీ సహించినవాడు కాడు. అయితే న్యాయస్థానాలపై సహేతుకమైన విమర్శను ఆయన ఎన్నడూ కాదనలేదు. న్యాయమూర్తులకు లేదా కోర్టు తీర్పులకు ‘మోటివ్స్’ అంటగట్ట కుండా ఎంతగానైనా విమర్శించే హక్కును ఆయన గౌరవించాడు! అందుకే సుప్రసిద్ధుడైన బ్రిటిష్ న్యాయమూర్తి లార్డ్ డెన్నింగ్ ఒక సందర్భంగా కృష్ణయ్యర్‌కు రాసిన లేఖలో, న్యాయమూర్తిగా ‘‘పూర్తి సమయాన్ని సద్వినియో గం చేస్తున్న వ్యక్తి మీరు. మానవ హక్కుల గురించి, న్యాయచట్టాలపైన మీరు రాసిన గ్రంథం అనేక దేశాల ప్రజలకు అత్యంత విలువైనదిగా భావిస్తున్నాను. న్యాయమూర్తిగా పనిచేసిన కాలంలో మీ భావధార, మీ తీర్పులూ ప్రశంసలు పొందాయి. మీ న్యాయశాస్త్ర పరిజ్ఞానం ఇతరులకు మార్గదర్శకం కావాలని కోరుకుంటున్నాను’’ అని పేర్కొన్నాడు! న్యాయ నిఘంటువుకు నూతన పెన్నిధి ఈ సునిశితమైన మానవతా కోణం ఆయనకు అబ్బడానికి మరో కారణం- తొలి నుంచీ కృష్ణయ్యర్‌కు ఆది హైందవమైన బౌద్ధ ధర్మంపైన ప్రగాఢమైన విశ్వాసం కూడా. నిజానికి బౌద్ధం ప్రభావంలోనే ఆయనకు, చరిత్రాధ్యయనంలో మార్క్సిస్టు సులోచనాలు తోడు నీడయ్యాయని చెప్పాలి! కనుకనే రాజ్యాంగ పరిమితులలోనే ధర్మాసన చైతన్యాన్ని పెంచడానికి, ప్రజాప్రయోజన వ్యాజ్యాల (పిల్స్) ద్వారా నిస్తేజంగా పడివున్న చట్టాన్ని, న్యాయవ్యవస్థను చైతన్యంలోకి నెట్టడానికి కృషి సల్పారు. ఈ కర్తవ్యంలో ఆయనకు తోడుగా నిలిచిన వారు, ‘పిల్’ ప్రక్రియకు ఆద్యులూ జస్టిస్ భాగవతి, జస్టిస్ హెచ్.ఆర్.ఖన్నా. భావ వ్యక్తీకరణలోనే కాదు, అందుకు తోడు నీడైన భాషా మాధ్యమం వినియోగంలో కూడా కృష్ణయ్యర్ విలక్షణమైన పోకడలు పోయాడు. నూతన పదసృష్టికి, పదబంధాలకు దోహదం చేశాడు. న్యాయశాస్త్ర నిఘంటువుకు అనేక టెలిస్కోపిక్ పదాలను సృష్టించి, శ్రీశ్రీ మాదిరిగా భావప్రక్రియా సాధనాలుగా వదిలాడు. ఉదాహరణకు తీర్పులలో భాగంగానూ, అన్యధానూ ‘ఫార్మకోపిక్ ప్లూరలిజం’ అనీ, ‘ఫార్మలోపిక్ స్వరాజ్’ అనీ ప్రయోగించాడు. భోపాల్ గ్యాస్ వల్ల ప్రజలకు కలిగిన ఘోర విషాదాన్ని హిరోషిమాపై అమెరికా తొలి అణుబాంబు ప్రయోగం ద్వారా కలిగిన మానవతా మారణ హోమంతో పోల్చి ‘భోపోషియా’ అన్న పదాన్ని సృష్టించాడు. వెలుగులు చిమ్ముకుంటూ రాలిన ఉల్క ఇలా కృష్ణయ్యర్ తన పదజాల సృష్టితో జాతీయ రాజకీయ, ఆర్థిక సాంఘిక, సాంస్కృతిక పరిణామ క్రమంలో ఎదురైన ముఖ్య ఘటనలు, సన్నివేశాలపైన వ్యాఖ్యానించకుండా ఉన్న సందర్భాలు చాలా తక్కువ! అమెరికా, బ్రిటిష్ సామ్రాజ్యవాదులు పారిశ్రామిక యుగం ఫలితాలు బడుగు దేశాలకు అంద కుండా చేయడానికి ప్రవేశపెట్టిన సరికొత్త ఫార్ములా ‘మేధా సంపద!’ బడుగు వర్ధమాన దేశాల జీవవైవిధ్య సంపదను కాజేయాలంటే సృష్టికి దోహదం చేసే మౌలిక ప్రక్రియలపైనే తమకు ఆధిపత్యం కావాలని బహుళజాతి గుత్త కంపెనీలు కోరుకుంటున్నాయి. ఇందుకై వస్తూన్న విదేశీ ఒత్తిళ్లకు లొంగి స్థానిక జీవ వైవిధ్య సంపదను ధారాదత్తం చేయరాదని కృష్ణయ్యర్ చెప్పాడు. కృష్ణయ్యర్ మాదిరి ఇలా ఎన్నెన్ని కోణాల నుంచో న్యాయమూర్తి స్థానంలో నిలిచి సామాజిక, ఆర్థిక, రాజకీయ పునాదిపై అభిప్రాయాలను పెంచుకుని, క్రోడీకరించుకున్న వారు తక్కువ. సుప్రసిద్ధ ఆంగ్ల శ్రామికవర్గ నవలాకారుడు జాక్ లండన్ అన్నట్టు ‘‘మానవుడు మందకొడిగా ఒక శాశ్వత గ్రహంగా మిగిలిపోయేకంటే, జగజ్జేగీయమానంగా వెలుగులు చిమ్ముకుంటూ రాలిపోయే ఉల్కగా మారాలి. మనిషన్నవాడు జీవిస్తే చాలదు, చైతన్యం లేని బతుకీడ్చడం కాదు.’’ అలా చైతన్యంతో రాలిన మరో ఉల్కే.. కృష్ణయ్యర్. - ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు -
అర్జీలే..అర్జీలు
ముగిసిన జన్మభూమి-మా ఊరు గ్రామసభలు * ప్రజల నుంచి సుమారు 2.50 లక్షల దరఖాస్తులు * 27 వేల మందికి పింఛన్ల నిలిపివేత * కొత్తగా పింఛన్లు కోరుతూ 25 వేల దరఖాస్తులు * 100 వాటర్ ప్లాంట్లతో సరి ఏలూరు : జిల్లాలో జన్మభూమి-మా ఊరు కార్యక్రమం మంగళవారంతో ముగిసింది. చివరి రోజున పెంటపాడు మండలం పడమర విప్పర్రు, పాలకొల్లు మండలం ఆగర్తిపాలెం గ్రామాల్లో సభలు నిర్వహించారు. అక్టోబర్ 2న ఈ కార్యక్రమం ప్రారంభం కాగా, హుద్‌హుద్ తుపాను కారణంగా గత నెల 11 నుంచి వారుుదా వేశారు. తిరిగి నవంబర్ 1నుంచి కార్యక్రమాలు ప్రారంభం కాగా, ఆ రోజున ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు ఉండి, పాలకొల్లు నియోజకవర్గాల్లో జరిగిన గ్రామ సభల్లో పాల్గొన్నారు. పింఛను మొత్తాలను పెంచిన ప్రభుత్వం జిల్లాలో సుమారు 27 వేల మంది పింఛనుదారులను అనర్హులుగా పేర్కొంటూ.. వారికి ఆ మొత్తాలను ఇవ్వడం నిలిపివేయడం విమర్శలకు తావిచ్చింది. ఘుల్లుమన్న లబ్ధిదారులు న్యాయం చేయండంటూ అధికారులు, ప్రజాప్రతినిధులకు మొరపెట్టుకున్నా ప్రయోజనం లేకపోయింది. కొత్తగా పింఛన్లు మంజూ రు చేయూలంటూ 25 వేల మంది దరఖాస్తులు సమర్పించారు. జన్మభూమిలో భాగంగా చేపట్టిన నీరు-చెట్టు, స్వచ్ఛ భారత్‌పై అవగాహన కార్యక్రమాలు మొక్కుబడిగానే సాగాయి. అర్జీలు ఫుల్.. పరిష్కారం నిల్ సామాజిక సమస్యలు, మౌలిక వసతుల కల్పన, ఇతర అంశాలపై ప్రజల నుంచి రమారమి 2.50 లక్షల అర్జీలు అందారుు. మండలాల వారీగా వచ్చిన అర్జీలను కేటగిరీల వారీగా విభజించి పూర్తి సమాచారాన్ని ఆన్లైన్ చేసే పనిలో యంత్రాంగం నిమగ్నమైంది. ప్రతి అర్జీని ఆన్లైన్లో పొందుపర్చడానికి చాలా సమయం పడుతుందని అధికారులు పేర్కొంటున్నారు. రానున్న రోజుల్లో పంచాయతీలకు అభివృద్ధి పనుల నిమిత్తం రూ.5 నుంచి రూ.20 లక్షల వరకు విడుదల చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఈ మొత్తాలను జన్మభూమి సభల సందర్భంగా వెలుగు చూసిన సమస్యల పరిష్కారానికి వినియోగించేలా చర్యలు చేపడితే ఎంతోకొంత ప్రయోజనం కలుగుతుందనే అభిప్రాయం టీడీసీ వర్గాల నుంచి వ్యక్తమవుతోంది. 100 వాటర్ ప్లాంట్ల ప్రారంభం రక్షిత నీరు లభ్యం కాని నివాసిత ప్రాంతాల్లోని ప్రజలకు రూ.2కే 20 లీటర్ల మంచినీటిని అందించేందుకు వీలుగా వాటర్ ప్లాంట్లను నెలకొల్పుతామన్న ప్రభుత్వం ఆచరణలో విఫలమైంది. జిల్లాలో కనీసం 340 వాటర్ ప్లాం ట్లను ఏర్పాటు చేస్తామని అధికారులు ప్రకటిం చగా, సుమారు 100 ప్లాంట్లను మాత్రమే ప్రారంభించారు. కొన్నిచోట్ల ప్రైవేట్ వ్యక్తులు నడుపుతున్న ప్లాంట్లకు కొత్త రంగులు వేసి వాటిని కొత్తగా ఏర్పాటు చేసినట్టు ప్రకటిం చడం విమర్శల పాలైంది. కాగా, జన్మభూమి గ్రామ సభల సందర్భంగా 1,400 చోట్ల వైద్య శిబిరాలు ఏర్పాటు చేసినట్టు యంత్రాంగం చెబుతోంది. -
టెక్నాలెడ్జ్
సిటీ సాఫ్ట్వేర్ ఉద్యోగుల్లో సేవాభావం పెరుగుతోంది. ఎక్కడ సామాజిక సమస్య కనిపించినా వెంటనే స్పందిస్తున్నారు. మురికివాడలు, పేదలు నివసించే ప్రాంతాల్లో స్వచ్ఛంద సేవా సంస్థల తరఫున వాలంటీర్లుగా పనిచేస్తున్న వీరు.. విరాళాలు ఇవ్వడమే కాకుండా ఆధునిక సాంకేతికతను ఉపయోగించి ఎన్జీఓ కార్యకలాపాలకు మార్గం సుగమం చేస్తున్నారు. సాఫ్ట్వేర్లు... హార్డ్వేర్లే కాదు... సామాజిక చైతన్యంతోనూ ముందుకు కదులుతున్నారు ఐటీ ఉద్యోగులు. సమయం, అవకాశం ఉన్నప్పుడల్లా ఆ దిశగా తలో చేయి వేసి చేతనైన సాయం చేస్తున్నారు. తాజాగా గచ్బిబౌలి మైక్రోసాఫ్ట్ కార్యాలయంలో ‘గ్లోబల్ గివింగ్ క్యాంపెయిన్’ నిర్వహిస్తున్నారు ఆ సంస్థ ఉద్యోగులు. సామాజిక సేవకు పాటుపడే ఎన్జీఓల నిర్వాహకులకు ‘ఆఫీస్ 365’పై వర్క్‌షాప్ ఏర్పాటు చేశారు. వచ్చే నెల 7 వరకు జరిగే ఈ వర్క్‌షాపులో తమ రోజువారీ కార్యకలాపాలు పొందుపరుచుకొనేలా ఇందులో తర్ఫీదు ఇస్తున్నారు. మొత్తం 30 మంది ఎన్జీఓలకు చెందిన వారు మెళకువలు నేర్చుకొంటున్నారు. చాలా తెలిశాయి... ‘వెబ్‌లో ఫైల్ ఎలా సేవ్ చేసుకోవాలి.. పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఎలా చేయాలి వంటివి ఈ వర్క్‌షాప్‌లో నేర్చుకొంటున్నా. ఎంతో ఉపయోగకరంగా ఉంది’ అని ఎస్ఓఎస్ ఎన్జీఓకు చెందిన నిర్మలారాణి తెలిపారు. ‘ఈ ట్రైనింగ్ వల్ల వెబ్సైట్లో ఎప్పటికప్పుడు కంటెంట్‌ను అప్లోడ్ చేయడమెలాగో తెలిసింది. అందించిన సేవలను ఓ క్రమపద్ధతిలో పెట్టుకోవడానికి ఈ టెక్నాలజీ ఉపయోగపడుతోంది’ అన్నారు మహిత సంస్థ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ సదానంద్. ‘ఏటా ఏటా అక్టోబర్‌లో మైక్రోసాఫ్ట్ గివింగ్ రిలే నిర్వహిస్తాం. భారత్‌తో పాటు 19 దేశాల్లోని మైక్రోసాఫ్ట్ కార్యాలయాల్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. సంస్థ ఉద్యోగులు అంకితభావంతో పనిచేసే ఎన్జీఓలకు విరాళాలు ఇస్తుంటారు. వారితో కలసి పనిచేస్తుంటారు’ అని మైక్రోసాఫ్ట్ ఇండియా డెవలప్మెంట్ సెంటర్ డెరైక్టర్ చిత్రసూద్ తెలిపారు. - వీఎస్ -
సామాజికాంశాలే నేపథ్యంగా..నేటి నుంచి రంగోత్సవ్
న్యూఢిల్లీ: సామాజికాంశాలను కథావస్తువుగా తీసుకొని, దానికి తమ నైపుణ్యాన్ని అద్ది, సమాజాన్ని తట్టి లేపే రంగస్థల ప్రదర్శనలకు నగరం వేదిక కానుంది. ఇక్కడి సాయిరామ్ సెంటర్లో ‘రంగోత్సవ్’ నేటినుంచి ప్రారంభం కానుంది. మూడు రోజులపాటు జరగనున్న ఈ ఫెస్టివల్లో రంగ్‌భూమి థియేటర్ గ్రూప్‌కు చెందిన కళాకారులు తమ కళానైపుణ్యాన్ని ప్రదర్శించనున్నారు. దయా ప్రకాశ్ సిన్హా రాసిన ‘సామ్రాట్ అశోకా’తో ఉత్సవం ప్రారంభమవుతుందని నిర్వాహకులు తెలిపారు. మిగతా రెండు రోజుల్లో జయవర్ధన్, చిత్రాసింగ్ రాసి, దర్శకత్వం వహిస్తున్న ‘కిస్సా మౌజ్‌పుర్ కా’, ‘హాయ్! హాండ్సమ్’ ప్రదర్శనలు ఉంటాయని చెప్పారు. పతి ప్రదర్శన మైమరపించే అభినయంతో, చక్కని స్టోరీలైన్‌తో ఉంటుందన్నారు. సహజత్వం ఉట్టి పడే పాత్రలు కట్టిపడేయడం ఖాయమని, పలువురి బహుముఖ ప్రతిభకు ఈ ఉత్సవం వేదిక కాబోతోందన్నారు. ఆత్మన్యూనతాభావంతో కుంగిపోయే అశోకుడిని ‘సామ్రాట్ అశోకా’ తొలిరోజు ప్రేక్షకుల ముందుకు తెస్తుందని, ఇంకా ఈ లోకంలోకి అడుగుపెట్టని ఓ ఆడ శిశువు జీవితం భవిష్యత్తులో ఎలా ఉంటుందో ‘కిస్సా మౌజ్‌పుర్ కా’ ప్రదర్శన కళ్ళకు కడుతుందని, ఇది రెండో రోజు ఉంటుందన్నారు. ఇక ఉత్సవంలో చివరిరోజు ప్రదర్శనలోభాగంగా ‘హాయ్! హాండ్సమ్’ ప్రదర్శన ఉంటుందని, సమాజంలో కన్నవారిపట్ల కడుపులో పుట్టిన బిడ్డలే చూపుతున్న వివక్షతను ఈ ప్రదర్శన ప్రేక్షకుల ముందుకు తెస్తుందన్నారు. ‘ప్రేక్షకులు తమ సందేహాలను నేరుగా వ్యక్తం చేసే అవకాశాన్ని కూడా కల్పిస్తున్నాం. వారి అభిప్రాయా న్ని కూడా కోరతాం. సమాజంలో మార్పు కోసం సలహాలు, సూచనలు తీసుకుంటామ’ని రంగ్‌భూమి కార్యదర్శి జేపీ సింగ్ అన్నారు.