చక్రపాణి... విజయవాణి!
సామాజిక ఉద్యమాల్లో ముందువరుస...
చదువు కోసం నిత్యపోరాటం
పాత్రికేయ వత్తి నుంచి పబ్లిక్ సర్వీస్ కమిషన్
చెర్మన్ వరకూ ప్రస్థానం
ఇదీ ఘంటా చక్రపాణి విశిష్టత
జన్మనిచ్చిన ఊరిని ప్రాజెక్ట్ మాయం చేసేసింది. అన్నం పెట్టిన పొలమూ అందులోనే కలసి‘పోయింది.’ చదువూ వెక్కిరించే ప్రయత్నం చేసింది. మెడిసిన్ సీటు ఊరించి... ఉసూరుమనిపించింది. ‘సామాజిక’ సమస్యలు అడుగడుగునా వెనక్కినెట్టే ప్రయత్నం చేశాయి. ఉన్న ఊరిని వదిలి మరో చోటుకు వెళితే... అక్కడి పరిస్థితులు ‘దూరంగా వెళ్లిపోమని’ సలహా ఇచ్చాయి. కుటుంబం...తల్లిదండ్రులు...
బాధ్యతను గుర్తు చేస్తున్నాయి... సాధారణంగా ఎవరికైనా ఇలాంటి స్థితి ఎదురైతే ఈ ముళ్లబాటలో ముందుకెళ్లలేమని ఆగిపోతారు. క్రుంగిపోతారు. కానీ ఆయన హాస్టల్‌ను అమ్మ ఒడిగా మలచుకున్నారు. అక్షరాలను ఆసరాగా చేసుకున్నారు.
భవిష్యత్తుకు సోపానాలుగా మార్చుకున్నారు. ‘దూరంగా వెళ్లిపొమ్మని’ చెప్పిన పరిస్థితులను ఎదగడానికి బాటగా చేసుకున్నారు. వైద్య శాస్త్రం తనను వద్దనుకుంటే.. సామాజిక శాస్త్రాన్ని అస్త్రంగా అందుకున్నారు. అరుదైన అవకాశాలను అందిపుచ్చుకున్నారు. ఆయనే టీపీఎస్‌సీ చైర్మన్ ఘంటా చక్రపాణి.
సిటీబ్యూరో: ఇప్పుడు ఆ ఊరు లేదు. కానీ ఒకప్పుడు కరీంనగర్‌కు పది కిలోమీటర్ల దూరంలో ఉండేది యాష్వాడ. చిన్న పల్లెటూరు. మానేరు డ్యామ్ నిర్మాణంలో మాయమైన 18 ఊళ్లలో అదొకటి. ఊరు మాయమైనట్లే అక్కడ పుట్టి పెరిగిన ఎంతోమంది అస్తిత్వమూ ప్రశ్నార్థకమైంది. సరిగ్గా అక్కడ మొదలైన జీవన పోరాటం... సంఘర్షణ... కోట్లాది తెలంగాణ ప్రజల అస్తిత్వ పోరాట ప్రతీకై... ఆత్మగౌరవ పతాకై ఎగసింది. ఇక్కడి ప్రజల ఆకాంక్షలను సమున్నతంగా ఆవిష్కరించింది. ఒక గొంతుకై నిలిచింది. ఆ గొంతు ప్రొఫెసర్ చక్రపాణిది. ఆ ప్రస్థానంలో మరో మైలురాయిని చేరుకున్నారు. ఒక సీనియర్ పాత్రికేయుడిగా, అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో ఆచార్యుడిగా, సామాజిక, రాజకీయ విశ్లేషకుడుగా మాత్రమే తెలిసిన ఆయన ప్రస్తుతం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్‌గా ఇంకో మెట్టు ఎక్కారు. ఐదో తరగతి వరకు మాత్రమే ఉన్న ఆ ఊళ్లో కిరోసిన్ దీపం గుడ్డి వెలుతురులో అక్షరాలు దిద్దుకున్నారు. బతకడమే పోరాటమైన చోట చదువూ భారమైంది. సంక్షేమ హాస్టల్ ఆదుకొని ఒడ్డున చేర్చింది. ఎక్కడ చేజారిపోతుందోననుకున్న విద్యను గట్టెక్కించింది. అలా ఒక్కో మెట్టూ పెకైక్కారు. టీపీఎస్‌సీ కమిషనర్ స్థాయికి చేరుకున్నారు. తన అనుభవాలను... అంతరంగాన్ని ‘సాక్షి’ వద్ద ఆవిష్కరించారు.
అందని వైద్య విద్య...
చరిత్ర, సామాజిక శాస్త్రాలు తప్ప సైన్స్ అంటే పెద్దగా ఆయనకు ఇష్టం ఉండేది కాదు. కానీ తమ్ముడిని మెడిసిన్ చదివించాలనుకున్న అన్నయ్య సత్యనారాయణ కోరిక మేరకు బైపీసీలో చేరారు. ఇష్టం లేకపోయినా కష్టపడి చదివారు. ఎంసెట్ రాశారు. తనకు మెడిసిన్‌లో సీటొచ్చిందన్న సంగతి ఆరు నెలల తరువాత తెలిసింది. దాని కోసం పెద్ద న్యాయపోరాటమే చేయవలసి వచ్చింది. ఈ ఆరు నెలల వ్యవధిలో మరో విషయం గుర్తించారు. ఆర్థిక భారంతో కూడిన మెడిసిన్ కంటే టీచర్ ఉద్యోగమే మంచిదనుకున్నారు. టీటీ సీ రాశారు. 1985లో ధ ర్మారం మండలం బొమ్మారెడ్డి పల్లెలో రూ.398 వేతనంతో ఉపాధ్యాయుడిగా కెరీర్ ప్రారంభించారు. ఆ రోజుల్లోనే కరీంనగర్‌లో ‘జీవగడ్డ’ సాయంకాలపు దినపత్రికలో పాత్రికేయుడిగా ప్రవేశించారు. అల్లం నారాయణ, నరేందర్, కేఎన్ చారి, మరికొందరు మిత్రులతో కలిసి ‘జీవగడ్డ’ విలేకరిగా విధి నిర్వహణ. అప్పటికే తెలంగాణ సమాజం ఒక భయానకమైన పోలీసు నిర్బంధాన్ని ఎదుర్కొంటోంది. నక్సలైట్ ఉద్యమాలతో అప్పటి యువత బాగా ప్రభావితమవుతోంది. ఆ ప్రభావం చక్రపాణిపైనా ఉంది. అదే సమయంలో మార్క్సిజంపైకి దృష్టి మళ్లింది. రెండు, మూడేళ్ల పాటు బాగా అధ్యయనం చేశారు. టీచర్‌గా కంటే విలేకరిగా పని చేయడమే తనకు ఎంతో సంతృప్తినిచ్చింది. 1987 నాటికి కరీంనగర్‌లో నిర్బంధం మరింత తీవ్రమైంది. ఆ పరిస్థితుల్లో స్నేహితుల సలహా మేరకు కరీంనగర్‌ను వదిలిపెట్టి హైదరాబాద్ వెళ్లవలసి వచ్చింది.
సామాజిక ఉద్యమ పథం
బ్రెజిల్‌లో 2003లో జరిగిన వరల్డ్ సోషల్ ఫోరమ్, ఇట లీలోని యూరోపియన్ సోషల్ ఫోరమ్‌తో పాటు, లెఫ్ట్ థింకర్స్ సారథ్యంలో అమెరికాలో స్థాపించిన ‘న్యూ స్కూల్’ విశ్వవిద్యాలయంలో ‘ప్రపంచీకరణ నేపథ్యంలో భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో, చైనా సోషలిజంలో వచ్చిన సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిణామాలపై పరిశోధనాత్మక అధ్యయనం గొప్ప సంతృప్తి. 2006లో హైదరాబాద్‌లో వరల్డ్ సోషల్ ఫోరమ్ నిర్వహణలో కీలకమైన బాధ్యతలు. అంతకంటే ముందు మావోయిస్టు పార్టీకి, ప్రభుత్వానికి నడుమ చర్చల కోసం పీస్ ఇనిషియేటివ్ కమిటీలో ఎస్‌ఆర్ శంకరన్ వంటి పెద్దలతో కలిసి పని చేశారు. చర్చల సమయంలో ఇరు వర్గాల మధ్య కాల్పులు జరగకుండా ఏర్పాటైన కాల్పుల నియంత్రణ కమిటీకి కన్వీనర్‌గా కీలకమైన బాధ్యతలు నిర్వర్తించారు.
తెలంగాణ మలిదశ ఉద్యమంలో...
2009లో మొదలైన తెలంగాణ మలిదశ ఉద్యమంలో క్రియాశీల కార్యకర్తగా పని చేశారు. ఉద్యమ గమనంపై ఆయన సంధించిన ‘ఘంటాపథం’, వార్తా కథనాల విశ్లేషకుడిగా, వ్యాఖ్యాతగా, ఉస్మానియా విద్యార్థి ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచి సాగించిన పోరాటం ఆయనను తిరుగులేని ఉద్యమకారుడిగా నిలిపాయి. రాత్రిబంవళ్లు టీవీ చానళ్లలో వ్యాఖ్యాతగా వ్యవహరించారు.
అభిరుచులు...
అధ్యయనం, రాయడం, సామాజిక అంశాలపై విశ్లేషణ.
కుటుంబ నేపథ్యం...
రెండెకరాల మెట్ట పొలం మాత్రమే ఉన్న పెద్ద కుటుంబం. ముగ్గురు అన్నదమ్ములు...ముగ్గురు అక్కచెల్లెళ్లు. అమ్మ జనని. నాన్న మొగులయ్య. తాము అనుభవించిన సామాజిక అణచివేత, వివక్ష పిల్లల అనుభవంలోకి రావద్దనుకున్నారా దంపతులు. వ్యవసాయాన్నే ఆధారంగా చేసుకొని కష్టపడ్డారు. తల్లిదండ్రుల ఆకాంక్షలను నెరవేర్చేలా... ఒక వైపు పొలం దున్నుతూ, పశువులను మేపుతూ, పొలంలో పండిన కూరగాయలను అమ్ముతూ... మరోవైపు బడికెళ్లారు చక్రపాణి. ఊళ్లో ఐదో తరగతి పూర్తయింది. పై చదువులు అసాధ్యమనుకొంటున్న తరుణంలో అప్పటి సాంఘిక సంక్షే మ హాస్టల్ వార్డెన్ బీఎస్ రాములు (ప్రముఖ రచయిత) ఆపన్న హస్తం అందించారు. తాను వార్డెన్‌గా పని చేస్తున్న ఎలగందుల హాస్టల్‌లో చేర్చుకున్నారు. అలా చదువు వైపు మళ్లారు. పదో తరగతి వరకు ఆ హాస్టల్‌లోనే ఉండి చదువుకున్నారు. అప్పటి కి మానేరు డ్యామ్ పనులు మొదలయ్యాయి. యాష్వాడతో పాటు 18 ఊళ్లు ఖాళీ చేయవలసి వచ్చింది. దాంతో చక్రపాణి కుటుంబం ఉపాధి కోసం కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ మండలం దూలికట్టకు మకాం మార్చింది. సుల్తానాబాద్‌లోనే 1983లో ఇంటర్మీడియట్ చదివారు.
ఆదర్శ వివాహం
అంబేద్కర్ ఓపెన్ వర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న రోజుల్లోనే ఫిజిక్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పుష్పతో పరిచయం ప్రేమగా మారింది. ఒకరి అభిప్రాయాలు మరొకరికి నచ్చాయి. స్నేహితులు, సీనియర్ జర్నలిస్టుల సమక్షంలో 1994 ఆగస్టు 13వ తేదీన బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో దండలు మార్చుకొని ఆదర్శ వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం పాప అమేయ ఇంటర్ చదువుతోంది. కొడుకు రాహుల్ మిళింద్ ఏడో తరగతి.
మధుర జ్ఞాపకం
హైదరాబాద్‌లో ఒకవైపు దినపత్రికల్లో పాత్రికేయుడిగా విధులు నిర్వహిస్తూనే మరోవైపు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో 1990లో ఎంఏ సోషియాలజీ, 1992 నాటికి ఎంసీజే పూర్తి చేశారు. యూజీసీ నెట్‌కు ఎంపికయ్యారు. అప్పటికి 25 ఏళ్ల వయస్సు. ఆ సమయంలో కాకతీయ విశ్వవిద్యాలయంలో సోషియాలజీ లెక్చరర్‌గా ఉద్యోగం. వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జయశంకర్ మార్గదర్శకత్వంలో డిగ్రీ, పీజీ విద్యార్థులకు టీచింగ్. బియ్యాల జనార్దన్, డాక్టర్ బుర్రా రాములు, ప్రొఫెసర్ బొబ్బిలి వంటి అధ్యాపక మిత్రుల పరిచయం. 20 నెలల పాటు వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయంలో గడిపిన ఆ రోజులు ఎప్పటికీ మరిచిపోలేని మధురమైన జ్ఞాపకాలు. చిన్న వయస్సులోనే లెక్చరర్‌గా పని చేయడం ఒకవైపు... మరోవైపు అప్పటి ఉద్యమ వాతావరణం, సామాజిక, రాజకీయ అంశాలపైన చర్చలు, విశ్లేషణలు. 1993లో అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయానికి పయనం. ప్రజా సంబంధాల అధికారిగా, అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా, ప్రొఫెసర్‌గా, డీన్‌గా, రిజిస్ట్రార్‌గా ఇటీవల వరకు అనేక కీలకమైన బాధ్యతల నిర్వహణ. అక్కడి నుంచి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్‌గా కొత్త బాధ్యతలు.
బాధపడిన క్షణాలు
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఒకవైపు పోరాటం ఉద్ధృతంగా సాగుతున్న రోజుల్లో విద్యార్థుల ఆత్మహత్యలు మన సును ద్రవింపజేశాయి. అప్పటి వరకు ఉద్యమంలో కలియ తిరుగుతూ, అంతటా తానై కనిపించిన విద్యార్థి యాదయ్య ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకొని సజీవ దహనమైన సంఘటన ఇప్పటికీ కన్నీళ్లు తెప్పిస్తుందంటారు.