పప్పెట్స్ ద్వారా పిల్లలకు అవగాహన కల్పిస్తున్న పద్మిని రంగరాజన్
బొమ్మతో అనుబంధం... బొమ్మతో ఆడుకోవడం మన బాల్య జ్ఞాపకం. బొమ్మను నేస్తంలా, బిడ్డలా హత్తుకునే చిట్టి మనసులకు ఆ బొమ్మతోనే పదేళ్లుగా పిల్లల్లోనూ, పెద్దల్లోనూ సామాజిక సమస్యలపై అవగాహన కలిగిస్తూ ఉన్నారు పప్పెట్రీ కథకురాలు పద్మినీ రంగరాజన్. హైదరాబాద్‌లో ఇరవై ఏళ్లుగా బొమ్మలతో దోస్తీ చేసిన ఈ కథల నేస్తం గురించి...
‘పిల్లలూ.. ఇప్పుడు ఈ మల్లూ మీతో మాట్లాడతాడు..’ అని ఆసక్తిగా బొమ్మలతో కథలు చెప్పడమే కాదు, జానపద సాహిత్యాన్ని మన కళ్లకు కడతారు. సోషియాలజీలో పరిశోధకురాలుగా ఉన్నారు. పదేళ్ల పాటు అధ్యాపకురాలిగా పనిచేశారు. స్ఫూర్తి థియేటర్ ఫర్ ఎడ్యుకేషనల్ పప్పెట్రీ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ పేరుతో సంస్థను నెలకొల్పిన పద్మిని రంగరాజన్‌ని కలిస్తే మనకు ఆసక్తికరమైన ఎన్నో విషయాలు పరిచయం అవుతాయి.
పిల్లలకు తోలుబొమ్మల ద్వారా కష్టమైన గణితాన్ని, ఆంగ్లవ్యాకరణాన్ని సులువుగా నేర్పించవచ్చని తెలుస్తుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు, సామాజిక సమస్యలపై అవగాహన ఆసక్తి కలిగేలా చెప్పవచ్చనే విషయం స్పష్టం అవుతుంది. అనుకోకుండా మొదలైన పప్పెట్రీ తన జీవిత విధానంలో తీసుకువచ్చిన మార్పుల గురించి ఎంతో ఆనందంగా ఇలా పంచుకున్నారు పద్మినీ రంగరాజన్.
‘‘మల్లు అనేది నా మొదటి గ్లౌజ్ కోతి తోలుబొమ్మ. నేరుగా నేను కాకుండా బొమ్మ మాట్లాడుతుంటే పిల్లలు ఒళ్లంతా కళ్లు, చెవులు చేసుకుని వింటుంటారు. ఆ సమయంలో ఎంత ఉత్సాహంగా ఉంటుందో మాటల్లో చెప్పలేను. ఇరవై ఏళ్ల క్రితం.. నా కొడుకు ఆసక్తి గా కథ వినడం కోసం ఈ బొమ్మల కళను ఎంచుకున్నాను. అలా మొదటిసారి తోలుబొమ్మతో మా అబ్బాయికి పురాణకథను చెప్పాను. ఆ తర్వాత్తర్వాత పిల్లల పుట్టిన రోజు వేడుకల్లో తోలుబొమ్మతో కథలు చెప్పడం మొదలయ్యింది.
స్నేహితుల సంఖ్య పెరిగింది. బొమ్మలతో పిల్లలకు లెక్కలు చెప్పడం, ఇంగ్లిష్ గ్రామర్ చెప్పడం సులువయ్యింది. ఒక్కో అడుగు వేస్తున్న కొద్దీ పప్పెట్రీ నా జీవితంలో భాగమైపోయింది. ఒక్క మాటలో చెప్పాలంటే మా అబ్బాయితోపాటు నాలోనూ ఈ కళ పట్ల ఇష్టం బాగా పెరిగిపోయింది. ఇంటినుంచి మొదలైన ఈ బొమ్మల కథ బయటి నా ప్రపంచాన్ని విస్తృతం చేసింది. స్ఫూర్తి థియేటర్ ఎడ్యుకేషనల్ పప్పెట్రీ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్‌ను ఏర్పాటు చేసేలా చేసింది.
పిల్లలే అభిమానులు
తోలుబొమ్మలాట కళ అంతరించిపోతుందునుకున్న నాకు కథల ద్వారా ఈ కళను కాపాడవచ్చని, ఇంకా ఇష్టంతో కష్టపడేలా చేసింది. అందులో భాగంగానే వరంగల్ జిల్లాల్లోని అమ్మాపురంలో తీగతోలుబొమ్మలాట పునరుద్ధరణ గుర్తించిన వాటిలో ఒకటి. స్కూళ్లలోనూ పప్పెట్రీ కార్యక్రమాలు ఏర్పాటు చేయడమైనది. పిల్లలకోసమే వర్క్‌షాప్స్ నిర్వహించాను. ముందుకన్నా పిల్లలంతా ఈ కార్యక్రమాల్లో చాలా చురుకుగా మారడం గమనించాను. దీనివల్ల పిల్లల తల్లిదండ్రులకూ దగ్గరయ్యాను.
నాన్న మార్గనిర్దేశం..
ఇంట్లో పురాణాలు, ఇతిహాసాలు కథలుగా మా పెద్దలు చెబుతుండేవారు. నేనూ నా తర్వాతి తరానికి అందించడానికి అదే ప్రయత్నం చేశాను. అయితే, తోలుబొమ్మలతో కథలు చెప్పడం మాత్రం మా నాన్న మార్గనిర్దేశం చేశారు. రామాయణ, మహాభారతం, పురాణాల నుండి మాత్రమే కాకుండా సమకాలీన ఇతివృత్తాల మిశ్రమంతో కథలు చెప్పడం ప్రారంభించాను. తోలుబొమ్మలాట శతాబ్దాలుగా మన జీవనంలో ఇమిడి ఉంది. ఇది వినోదం మాత్రమే కాదు అవగాహన నింపే విద్య కూడా. ఈ కళను జనంలోకి తీసుకెళ్లడానికి ప్రస్తుత కాలానికి తగినట్టు ఎన్నో ప్రయోగాలు చేయడం వల్ల పిల్లలతో పాటు పెద్దలు కూడా ఆసక్తిగా వింటున్నారు.
కథే స్ఫూర్తి
స్ఫూర్తి థియేటర్ ఆర్ట్ అండ్ క్రాప్ట్స్ 2005లో ప్రారంభించినప్పటి నుంచి గిరిజన విద్యార్థులకు కూడా శిక్షణ ఇచ్చాను. ఉట్నూర్‌లో ఆరోగ్య సమస్యల గురించి గోండు భాషలో వివరించిన కార్యక్రమం చాలా ప్రశంసలు పొందింది. టైప్ 1 డయాబెటిస్ పిల్లల ఆరోగ్య స్థితిపైనా పప్పెట్రీ వర్క్ చేస్తున్నాను.
పుతాలికా మాస పత్రిక
కరోనా సమయంలో పుతాలిక పేరుతో నెలవారీగా ఇ–మ్యాగజైన్ తీసుకువస్తున్నాను. ఇది ప్రపంచంలో ఉన్న తోలుబొమ్మల కళాకారులందరినీ పరిచయం చేస్తుంది. దీంతోపాటు పప్పెట్రీ గురించి ఆన్‌లైన్ తరగతులు కూడా నిర్వహిస్తున్నాను. కిందటేడాది స్వచ్ఛతా సారథి ఫెలోషిప్ లభించింది. దీంట్లో భాగంగా వ్యర్థాలతో ముఖ్యంగా ప్లాసిక్, ఖాళీ అట్టపెట్టెలు, థర్మాకోల్, పాత కుషన్‌లలోని దూది, కొబ్బరి చిప్పలు, పాత బట్టలు, పాత టీ స్ట్రెయినర్లు, వార్తాపత్రికలతో బొమ్మలను తయారు చేయిస్తుంటాను. దీనివల్ల వ్యర్థాలను అర్థాలుగా మార్చడం ఎలాగో పిల్లలకు తెలుస్తుంది.
మనుగడకు పోరాటం
మనదేశంలో తోలుబొమ్మలాట అనేది కుటుంబ సంప్రదాయం. దీనికి తగినంత ప్రోత్సాహం లేకపోవడంతో ఈ సంప్రదాయం అంతరించిపోయే అవకాశాలున్నాయి. ఈ రంగంలో ఉన్నవాళ్లు తమ మనుగడ కోసం వేరే దారులను వెతుకుతున్నారు. అయినప్పటికీ ఇతర దేశాలలో తోలుబొమ్మలాటలో చాలా పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ కళను బతికించడానికి రకరకాల మార్గాలు వెతుకుతున్నాను. ఇందుకోసం నా జీవితాంతం కృషి చేస్తూనే ఉంటాను’ అని వివరించారు పద్మినీ రంగరాజన్.
తోలుబొమ్మల ద్వారా పురాణ కథలను ఆసక్తిగా చెప్పడమే కాదు బాల్యవివాహాలను అరికట్టడం, పరిశుభ్రత కోసం ఏం చేయాలి, కుటుంబ నియంత్రణ.. వంటి సామాజిక సమస్యలపై సమర్థంగా పనిచేసే మాధ్యమం తోలుబొమ్మలు అని తెలిపే పద్మినీ రంగరాజన్ ‘తోలుబొమ్మ కఠినంగా మాట్లాడినా ఎవరూ అంతగా బాధపడరు’ అని నవ్వుతూ వివరిస్తారు.
– నిర్మలారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment