అశ్లీల కంటెంట్‌పై ఆలస్యంగా మన తారలు! | Indian Celebrities Late Reactions On Morphing Technology | Sakshi
Sakshi News home page

అశ్లీల కంటెంట్‌పై ఆలస్యంగా మన తారలు!

Published Mon, Nov 6 2023 5:55 PM | Last Updated on Mon, Nov 6 2023 6:55 PM

Indian Celebrities Late Reactions On Morphing Technology - Sakshi

‘ఫన్‌ కోసం ఫేస్‌ మార్చేయండి’.. ఓ నాలుగైదేళ్లుగా ఎడిటింగ్​ సాంకేతికత ద్వారా నడుస్తున్న సరదా ట్రెండ్‌. అయితే తెర వెనుక జరిగే తతంగం వేరే ఉంటోంది. సాధారణ జనాలు వీటిని సరదా వ్యవహారంగానే చూస్తున్నప్పటికీ.. అశ్లీల కంటెంట్​ విపరీతంగా పుట్టుకురావడానికి​ ఈ టెక్నాలజీనే ఒకరకంగా కారణం అవుతోంది. సగటున రోజుకి లక్షల మార్ఫింగ్‌ వీడియోలు, కోట్లలో మార్ఫింగ్‌ ఫొటోలు ఇంటర్నెట్‌లో అప్‌లోడ్‌ అవుతున్నట్లు ఒక అంచనా. అయితే మన దగ్గర సెలబ్రిటీలు ఇంతకాలం ఈ వ్యవహారాన్ని తేలికగా తీసుకున్నప్పటికీ..  వేరే దేశాల్లో మాత్రం ఈ ఫేక్ కంటెంట్​ కట్టడి కోసం ఎప్పటి నుంచో పెద్ద ఉద్యమమే నడుస్తోంది. 

సెలబ్రిటీలు ఏ పని చేసినా.. అదో  వైరల్​ న్యూసే!. ముఖ్యంగా గ్లామర్‌ ప్రపంచంలోని ఫీమేల్​ సెలబ్రిటీల విషయంలో ఇది ఎక్కువ. వాళ్ల దృష్టిలో  ఇంటర్నెట్​ అనేది అధికప్రచార​ సాధనం​. అందుకే తమ క్రేజ్‌ను  నిలబెట్టుకునేందుకు ఫొటో.. వీడియో  ఆధారిత కంటెంట్‌ను ఫాలోవర్లతో, యూజర్లతో పంచుకుంటారు. ఉదయం లేచింది మొదలు ఫిట్​నెస్​ మొదలుకుని.. తినడం, తిరగడం, సరదా కబుర్లు ఇలా.. రోజూవారీ అప్​డేట్‌లు ఇస్తుంటారు. అయితే వాళ్లకు తెలియకుండానే ఆ  కంటెంట్​ తప్పుడు దోవలో దూసుకుపోతోంది​. ఇంటర్నెట్​ నిండా ఫేక్ ఫొటోలు, వీడియోలతో నిండిపోతోంది. 

దాదాపు పాత, కొత్త తరం తారలంతా ఫేక్​ కంటెంట్​ బాధితులుగానే ఉన్నారు. అశ్లీలత గురించి ఓపెన్​గా చర్చించడం మన హీరోయిన్లకు ఇప్పటికీ నామోషీనే. అయితే తమను నెట్టింటికీడుస్తున్న వ్యవహారాలపై కూడా పోరాడటానికి కూడా ఎందుకనో వెనుకంజ వేస్తున్నారు.  విదేశాల్లో మాత్రం ఇలాంటి కంటెంట్​ను హీరోయిన్లు ఏమాత్రం సహించడం లేదు.  టైటానిక్‌ హీరోయిన్‌ కేట్​ విన్స్‌లెట్‌, సీనియర్‌ హీరోయిన్‌ జెస్సికా ఆల్బా ఈ విషయంలో ఫిర్యాదులు చేయడంతో పాటు సోషల్​ మీడియాలో బహిరంగంగా తమ తమ మీద నడుస్తున్న మార్ఫింగ్‌ కంటెంట్‌ మీద చర్చించారు. ‘వండర్​ వుమెన్​’ ఫేమ్‌ గాల్​ గాడోట్​ అయితే ఏకంగా అశ్లీల కంటెంట్​ కట్టడి కోసం చిన్నసైజు ఉద్యమాన్నే నడిపిస్తోంది. ఈజిప్ట్​ నటి నెల్లీ కరీం.. ఓ అడుగు ముందుకు వేసి తన పేరుతో వైరల్ అవుతున్న కంటెంట్‌ను సోషల్​ మీడియాలో స్క్రీన్​ షాట్స్​ షేర్ చేసి మరీ నిరసన వ్యక్తం చేసింది. కొందరు బ్రిటిష్‌​ నటీమణులు సైతం ఇలాంటి అశ్లీల కట్టడి విషయంలో ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తూ వస్తున్నారు. ఈ తతంగాన్ని తీవ్రంగా పరిగణించి.. ప్రత్యేక చట్టాలు చేయాలని ఆ దేశాల ప్రభుత్వాలను కోరుతున్నవాళ్లు లేకపోలేదు.

అవకాశం ఉన్నా గప్‌చుప్‌..
కానీ, మన దగ్గర పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. బాలీవుడ్​, మాలీవుడ్​, కోలీవుడ్, టాలీవుడ్​​.. ఇలా భాషలకతీతంగా సినీ తారలు బాధితులవుతున్నారు. గూగుల్‌లో వాళ్ల ఎడిటింగ్‌ కంటెంట్‌(అసభ్యతతో కూడుకున్నది)​ కుప్పలుగా కనిపిస్తోంది. దారుణమైన విషయం ఏంటంటే.. ‘ఎక్స్‌’, ఫేస్‌బుక్‌ లాంటి ప్రముఖ సోషల్​ మీడియా సైట్‌లలోనూ వేల కొద్దీ అకౌంట్​ల ద్వారా అలాంటివి వ్యాప్తి చెందుతుండడం, అలాంటి పేజీలకు వేల నుంచి లక్షల్లో ఫాలోవర్స్​ ఉండడం!. ఈ తరహా వ్యవహారంలో వ్యక్తిగతంగా ఫిర్యాదులు చేయడానికి ఆస్కారం ఉందని చెప్తున్నారు న్యాయ నిపుణులు. ఐసీసీలోని సెక్షన్​ 292(అశ్లీల కంటెంట్​ను సర్క్యులేట్​ చేయడం), 354సీ(అనుమతి లేకుండా అసభ్య వీడియోల్ని చిత్రీకరించడం), 499(వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీయడం), 509(మహిళా గౌరవానికి భంగం కలిగించడం), వీటితో పాటు ఐటీ యాక్ట్​లో 66ఈ, 67, 67ఎ, 72 సెక్షన్​లు ఇలాంటి ఫేక్​ వీడియో, ఫొటోల సర్యులేషన్​ పై కఠిన చర్యలుంటాయనే విషయాన్ని  గుర్తు చేస్తున్నారు. 

చిన్నతారలు ధైర్యంగా..
ఇంటర్నెట్‌లో దాదాపు అగ్ర హీరోయిన్ల ఫేక్​ వీడియోల, ఫొటో కంటెంట్​ ఎక్కువగా చక్కర్లు కొడుతుంటాయి. కానీ, ఈ విషయంలో అగ్ర తారల కంటే చిన్న ఆర్టిస్టులే ధైర్యం చేసి ఫిర్యాదులు చేస్తున్నారు.  కొన్ని నెలల క్రితం తమిళ చలన చిత్ర పరిశ్రమకు చెందిన ఓ చిన్న నటి​.. ట్విటర్​లో హీరోయిన్ల ఫేక్​ ఫొటోల్ని షేర్​ చేస్తున్న ఓ అడల్ట్​ అకౌంట్‌కు ఫాలో రిక్వెస్ట్​ పెట్టింది. అది చూసి సంబురంగా ఆ స్క్రీన్​ షాట్‌ను షేర్​ చేసి మరీ ఆమె ఫాలో రిక్వెస్ట్​ను యాక్సెప్ట్​ చేశాడు ఆ అకౌంట్​ అడ్మిన్​. వెంటనే సైబర్​ విభాగానికి ఫిర్యాదు చేసి అతన్ని కటకటాల వెనక్కి నెట్టించింది ఆమె. అలా.. కొందరు ఈ-సెలబ్రిటీలు(సోషల్‌ మీడియా ద్వారా పాపులర్‌ అయిన వాళ్లు), షార్ట్‌ఫిల్మ్‌ తారలు, చిన్నాచితకా క్యారెక్టర్లు చేసే నటీమణులు ఫిర్యాదుల విషయంలో ముందుకొచ్చిన సందర్భాలు ఉన్నాయి.

రష్మిక వీడియో.. అసలేం జరిగిందంటే.. 
ఫొటో మార్ఫింగ్​, ఎడిటింగ్‌​లు సరదా కోసం చేయడం సాధారణమైన వ్యవహారం. కానీ, టెక్నాలజీ అప్​డేట్​ మూలంగా అది మరీ శ్రుతి మించిపోతోంది. అందులో ప్రముఖంగా చెప్పుకోదగింది.. ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది డీప్‌ఫేక్‌ టెక్నాలజీ. నేషనల్‌ క్రష్‌గా పేరుండి.. సోషల్‌ మీడియాలోనూ విపరీతంగా ఫాలోయింగ్‌ ఉన్న రష్మిక మందన్నకు సంబంధించిన ఓ వీడియో ఈ మధ్య వైరల్‌ అయ్యింది. అయితే ఎక్స్‌ మాధ్యమం ద్వారా ఆ వీడియో పలువురు ప్రముఖుల దృష్టికి వెళ్లింది. ఫైనల్‌గా అందులో ఉంది రష్మిక కాదని.. జారా పటేల్ అనే సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ అని తేలింది. 

అయితే అప్పటికే ఆ వీడియో గురించి విపరీతమైన చర్చ నడిచింది. రష్మికతో గతంలో ఓ చిత్రంలో నటించిన బాలీవుడ్‌ బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌ సైతం స్పందించడంతో ఈ వ్యవహారం వార్తల్లోకి ఎక్కింది. మరోవైపు ఈ వీడియో వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం సైతం స్పందించింది. ఇంటర్నెట్ ను వినియోగించే వాళ్ళందరికీ భద్రత కల్పించే విషయంలో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ వెల్లడించారు. ఈ వ్యవహారంలో బాధ్యత ఆ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫారమ్‌దేనని, ఏ వినియోగదారు కూడా తమ అకౌంట్ నుంచి తప్పుడు సమాచారాన్ని పోస్ట్ చేస్తే దాని 36 గంటల్లోగా సదరు ఫ్లాట్‌ఫారమ్‌ తొలగించాలని, ఈ నిబంధనలు పాటించకపోతే చట్టపరమైన చర్యలకు గురి కావలసి వస్తుందని హెచ్చరించారు. ఇక తాజాగా ఈ డీప్ ఫేక్ వీడియో పై రష్మిక మందన సైతం స్పందించింది. ఇలాంటి ఓ ఘటనపై స్పందించాల్సి రావడం నిజంగా ఎంతో బాధ కలిగిస్తుందని చెప్పుకొచ్చింది రష్మిక.

డీప్‌ ఫేక్‌తో పాటు ఫేస్‌ స్వాప్‌ కూడా.. ​
డీప్‌ఫేక్‌ ఫీచర్‌.. ఇది ఒకరకంగా మార్ఫింగ్‌ లాంటిదే. ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెంట్‌ టూల్‌ను ఉపయోగించి ఇతర వ్యక్తుల ఫోటోల్లో, వీడియోల్లో నచ్చని వారి ఫోటోలను చొప్పించి, నకిలీ చిత్రాలను, విడియోలను తయారు చేసే సింథటిక్‌ మీడియా. డీప్‌ఫేక్‌ ఫీచర్‌ సాయంతో  అల్రెడీ మొబైల్‌లో ఉన్న వీడియోతోగానీ,  అప్పటికప్పుడు చేసే వీడియోతో  ఫన్నీ వీడియోల్ని క్రియేట్‌ చేయొచ్చు.  ఒక వీడియోలోగానీ, ఫొటోలోగానీ ముఖాన్ని ఈ ఫీచర్‌ ద్వారా మార్చేయొచ్చు. ఆ ప్లేస్‌లో యూజర్‌ తన ఫేస్‌ని లేదంటే తనకు కావాల్సిన ముఖాన్ని అప్‌డేట్ చేసి ఓ కొత్త వీడియో క్రియేట్‌ చేసుకోవచ్చు.  ఇదంతా ఒక సరదా వ్యవహారం.  ఇందుకోసం కోట్లు ఖర్చు చేసి ఏఐ(ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్సీ) టెక్నాలజీ సాయం తీసుకుంటున్నారు. కానీ, సినీ ఫీల్డ్​ సెలబ్రిటీలకు ఫేక్​ వీడియోలతో ఇప్పుడిది కొత్త తలనొప్పిగా మారింది. మరోవైపు యూట్యూబ్‌లోనూ డీప్‌ఫేక్‌ టెక్నాలజీ, బాధిత హీరోయిన్ల గురించి టెక్‌ గురూలు, నిపుణులు దాని గురించి వీడియోలు బోలెడన్ని కనిపిస్తుంటాయి. 

ఇక అశ్లీలతను వ్యాప్తిచెందిస్తోన్న మరో టెక్నాలజీ ఫేస్​ స్వాప్​. రివెంజ్​ పోర్న్‌​ ద్వారా వార్తల్లోకి ఎక్కిన ఫేస్​ స్వాప్​.. ఆ తర్వాత ఓ ఎంటర్​టైనింగ్​ ఫీచర్​\టూల్​గా మారింది. దీనిని ఆసరాగా తీసుకుని ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలను తెర మీదకు తెస్తున్నారు కొందరు. హీరోయిన్ల ఫొటోలను ఎడిట్​ చేసి.. ఇంటర్నెట్​లో వదులుతున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement