సామాజికాంశాలే నేపథ్యంగా..నేటి నుంచి రంగోత్సవ్
Published Wed, Nov 27 2013 12:37 AM | Last Updated on Sat, Sep 2 2017 1:00 AM
న్యూఢిల్లీ: సామాజికాంశాలను కథావస్తువుగా తీసుకొని, దానికి తమ నైపుణ్యాన్ని అద్ది, సమాజాన్ని తట్టి లేపే రంగస్థల ప్రదర్శనలకు నగరం వేదిక కానుంది. ఇక్కడి సాయిరామ్ సెంటర్‌లో ‘రంగోత్సవ్’ నేటినుంచి ప్రారంభం కానుంది. మూడు రోజులపాటు జరగనున్న ఈ ఫెస్టివల్‌లో రంగ్‌భూమి థియేటర్ గ్రూప్‌కు చెందిన కళాకారులు తమ కళానైపుణ్యాన్ని ప్రదర్శించనున్నారు. దయా ప్రకాశ్ సిన్హా రాసిన ‘సామ్రాట్ అశోకా’తో ఉత్సవం ప్రారంభమవుతుందని నిర్వాహకులు తెలిపారు. మిగతా రెండు రోజుల్లో జయవర్ధన్, చిత్రాసింగ్ రాసి, దర్శకత్వం వహిస్తున్న ‘కిస్సా మౌజ్‌పుర్ కా’, ‘హాయ్! హాండ్సమ్’ ప్రదర్శనలు ఉంటాయని చెప్పారు.
పతి ప్రదర్శన మైమరపించే అభినయంతో, చక్కని స్టోరీలైన్‌తో ఉంటుందన్నారు. సహజత్వం ఉట్టి పడే పాత్రలు కట్టిపడేయడం ఖాయమని, పలువురి బహుముఖ ప్రతిభకు ఈ ఉత్సవం వేదిక కాబోతోందన్నారు. ఆత్మన్యూనతాభావంతో కుంగిపోయే అశోకుడిని ‘సామ్రాట్ అశోకా’ తొలిరోజు ప్రేక్షకుల ముందుకు తెస్తుందని, ఇంకా ఈ లోకంలోకి అడుగుపెట్టని ఓ ఆడ శిశువు జీవితం భవిష్యత్తులో ఎలా ఉంటుందో ‘కిస్సా మౌజ్‌పుర్ కా’ ప్రదర్శన కళ్ళకు కడుతుందని, ఇది రెండో రోజు ఉంటుందన్నారు. ఇక ఉత్సవంలో చివరిరోజు ప్రదర్శనలోభాగంగా ‘హాయ్! హాండ్సమ్’ ప్రదర్శన ఉంటుందని, సమాజంలో కన్నవారిపట్ల కడుపులో పుట్టిన బిడ్డలే చూపుతున్న వివక్షతను ఈ ప్రదర్శన ప్రేక్షకుల ముందుకు తెస్తుందన్నారు. ‘ప్రేక్షకులు తమ సందేహాలను నేరుగా వ్యక్తం చేసే అవకాశాన్ని కూడా కల్పిస్తున్నాం. వారి అభిప్రాయా న్ని కూడా కోరతాం. సమాజంలో మార్పు కోసం సలహాలు, సూచనలు తీసుకుంటామ’ని రంగ్‌భూమి కార్యదర్శి జేపీ సింగ్ అన్నారు.
Advertisement