విద్యార్థులు... పెద్ద మనసులు!
జూబ్లీహిల్స్: వారంతా జేబీఐటీ కాలేజీ విద్యార్థులు తమవంతుగా ఏదైనా చేయాలని నిర్ణయించారు... సామాజిక సమస్యలపై సమరశంఖం పూరిస్తున్న స్ట్రీట్‌కాజ్ అనే స్వచ్ఛంద సంస్థ సభ్యులైన వీరంతా తలోచేయి వేసి సమస్యల పరిష్కారానికి నడుం బిగించారు. పర్యావరణ ప్రాముఖ్యత, పేదలు, వృద్ధులకు దుస్తులు, పండ్లు పంపిణీ, విద్యార్థులకు పుస్తకాలు పంపిణీలాంటి సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.
అందులోభాగంగా శనివారం నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న వృద్ధాశ్రమాలు, పేదల బస్తీలు, పాఠశాలలు సందర్శించి దుస్తులు, పుస్తకాలు సహా వివిధ తినుబండారాలు అందజేశారు. జూబ్లీహిల్స్, శ్రీనగర్‌కాలనీ తదితర ప్రాంతాల్లో పాదచారులకు మొక్కల పెంపకం అవశ్యకతను వివరిస్తూ వారికి మొక్కలను అందజేశారు. ప్లాస్టిక్ వాడవద్దని, పేపర్‌బ్యాగ్‌లు వాడాలని ప్రచారం చేశారు. ప్రతినెలా ఒక సామాజిక చైతన్య కార్యక్రమం నిర్వహిస్తామని నిర్వాహకులు ప్రణవ్, వైష్ణవి పేర్కొన్నారు.