సామాజిక న్యాయానికి నిర్వచనం | Best Definition for Social justice | Sakshi
Sakshi News home page

సామాజిక న్యాయానికి నిర్వచనం

Published Tue, Dec 9 2014 1:15 AM | Last Updated on Mon, Oct 22 2018 6:35 PM

సామాజిక న్యాయానికి నిర్వచనం - Sakshi

సామాజిక న్యాయానికి నిర్వచనం

ఇంతవరకూ న్యాయమూర్తులు తీర్పులు చెప్పడానికే పరిమితమైపోయారు. కాని న్యాయ మూర్తులుగా మన పని సామాజిక వ్యవస్థను సమూలంగా మార్చడంగా ఉండాలి’’ అని కృష్ణయ్యర్ దండోరా వేశాడు. సామాజిక సమస్యలకు, రాజ్యాంగ నిబంధనలకు ప్రజా ప్రయోజనాల భాష్యం చెప్పుకుంటూ పోయాడు. పాలక వర్గాలకు రుచించని అనేక తీర్పులను నిర్మొహమాటంగా చెప్పిపోయాడు. పాలక వర్గాల ప్రజా వ్యతిరేక నిర్ణయాలను రాజ్యాంగ పరిమితులలో ఎదుర్కొంటూనే... న్యాయ సమానత్వం, వ్యక్తి స్వేచ్ఛ, జీవించే హక్కులకు సామాన్యుని ప్రయోజనం లక్ష్యంగా చైతన్యపూరితమైన అర్థాన్ని కల్పించాడు.
 
భారతదేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు న్యాయమూర్తి స్థానా న్ని 1973 జూలై 17న అధిష్టించి, తొలి ఏడేళ్ల లోపే ఆ స్థానం నుంచి అత్యంత విశిష్టమైన 724 తీర్పులు, విస్పష్టమైన ఆలోచనాత్మక భావప్రకటనలూ, వ్యాఖ్య లూ సకాలంలో వెలువరించి ప్రపంచ న్యాయకోవిదులచే ‘ఔరా’ అనిపించు కున్న సుప్రసిద్ధ న్యాయమూర్తి జస్టిస్ వి.ఆర్. కృష్ణయ్యర్. కేరళలో ఇ.ఎం.ఎస్. నంబూద్రిపాద్ ముఖ్యమంత్రిగా ఏర్పడ్డ దేశంలోని తొలి కమ్యూనిస్టు ప్రభు త్వంలో న్యాయశాఖ సహా, హోం, సాంఘిక సంక్షేమం, నీటిపారుదల శాఖలను అత్యంత సమర్థవంతంగా నిర్వహించి ఖ్యాతిగన్న వాడాయన. శత వృద్ధుగా కొలది రోజుల నాడు పరమపదించారు.

కృష్ణయ్యర్ ఒక సాధారణ వ్యక్తిగా మరణిస్తే మనం ఆ మేరకు నివాళులర్పిస్తాం. కాని కృష్ణయ్యర్ ప్రజాస్వామ్య ఉద్యమాలకు, న్యాయశాస్త్ర నియమ విలువల వ్యాప్తికి, అభ్యుదయకర శక్తులకు, వారి పోరాటాలకు, పౌర హక్కుల సంఘాలకు, మహిళా ఉద్యమాలకు అండగా నిలబడిన అరుదైన విశిష్ట వ్యక్తి. 99వ ఏట కూడా విద్యార్థి యువజన, పారి శ్రామిక, వ్యవసాయ కార్మిక ఉద్యమాల సామంజస్యాన్ని సమర్థించడమే తన వృత్తి ధర్మంగా శ్వాసించిన అఖండ మేధావి! వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రు లకు, దేశ ప్రధాన మంత్రులకు కృష్ణయ్యర్ ఒక దేశభక్తుడిగా, విశ్రాంత న్యాయ మూర్తిగా క్లిష్ట ఘట్టాలలో వివిధ ప్రజా సమస్యలపైన ప్రజాశ్రేయస్సునాశించి ఉత్తరాలు రాస్తూనే ఉన్నారు.
 
 మేధావిగా, బాధ్యతగల పౌరునిగా కృష్ణయ్యర్ కార్యక్షేత్రం ఒకటి కాదు. న్యాయశాస్త్ర విషయాలతోనే సరిపెట్టుకోకుండా, వాటిని సామాజిక, ఆర్థిక, తాత్త్విక, సాహిత్యాదిరంగాలకు పరివ్యాప్తం చేసుకుని తన వృత్తి జీవితాన్ని పరి పుష్టం చేసుకున్నవాడాయన. మనో దిఙ్మండలాన్ని విస్తృతం చేసుకున్నవారా యన. మార్క్సిజం ఆయన దృక్కోణం. ‘‘ఇంత వరకు తత్వవేత్తలు ప్రపంచానికి భాష్యం చెప్పడానికే పరిమితమై పోయారు. ఇక నుంచి వారి పని - ప్రపంచాన్ని మార్చడం’’గా ఉండాలని కారల్ మార్క్స్ అంటే, దాన్ని న్యాయవ్యవస్థకు అనువర్తింపచేసి ‘‘ఇంతవరకూ న్యాయమూర్తులు తీర్పులు చెప్పడానికే పరిమి తమైపోయారు. కాని న్యాయమూర్తులుగా మన పని సామాజిక వ్యవస్థను సమూలంగా మార్చడంగా ఉండాలి’’ అని ఆయన దండోరా వేశాడు. ఈ లక్ష్యా నికి అనుగుణంగానే ఆయన సామాజిక సమస్యలను, భారత రాజ్యాంగ నిబం ధనలకు, రాజ్యాంగానికి ప్రజా ప్రయోజనాల భాష్యం చెప్పుకుంటూ పోయా డు. పాలక వర్గాలకు రుచించని అనేక తీర్పులను నిర్మొహమాటంగా చెప్పిపోయాడు.
 
 మానవతా న్యాయమూర్తి
 పాలక వర్గాల ప్రజావ్యతిరేక నిర్ణయాలను రాజ్యాంగ పరిమితులలోనే నిరంతరం ఎదుర్కొంటూ రాజ్యాంగ అధికరణలకు, ముఖ్యంగా ‘చట్టం ముందు అందరూ సమానులే’నని చాటే 14వ అధికరణకు, వ్యక్తి స్వేచ్ఛను, జీవించే హక్కునూ గ్యారంటీ చేస్తున్న 21వ అధికరణకు సామాన్యుని  ప్రయోజనం లక్ష్యంగా చైతన్యపూరితమైన అర్థ గౌరవాన్ని కల్పించినవాడు కృష్ణయ్యర్. అందుకే సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ సహా, దేశంలోని పలు హైకోర్టు బార్ అసోసియేషన్‌లు ఆయనను ‘‘మానవతా న్యాయమూర్తి’’గా సంబోధించుకుంటూ వచ్చాయి. భావప్రకటనా స్వేచ్ఛను ప్రాథమిక హక్కుగా గుర్తించడమంటే, పౌరులకు స్వేచ్ఛగా న్యాయం పొందే అవకాశమని ఆయన భావించాడు. పౌరునికి ఉండవలసిన ఈ రెండు రకాల స్వేచ్ఛను కోర్టు ధిక్కార నేరంగా, న్యాయస్థానాలపై విమర్శగా భావించడాన్ని తూర్పారబట్టాడు. ఈ పరిధిలోనే పత్రికా స్వేచ్ఛను కాపాడేందుకు ఆయన ముందుకొచ్చాడు.
 
 అలా అని నిరాధార ఆరోపణలతో న్యాయస్థానాలపైన, న్యాయమూర్తుల తీర్పులపైన విరుచుకుపడే కొన్ని పత్రికలు, కొందరు పాలకుల ధోరణినీ సహించినవాడు కాడు. అయితే న్యాయస్థానాలపై సహేతుకమైన విమర్శను ఆయన ఎన్నడూ కాదనలేదు. న్యాయమూర్తులకు లేదా కోర్టు తీర్పులకు ‘మోటివ్స్’ అంటగట్ట కుండా ఎంతగానైనా విమర్శించే హక్కును ఆయన గౌరవించాడు! అందుకే సుప్రసిద్ధుడైన బ్రిటిష్ న్యాయమూర్తి లార్డ్ డెన్నింగ్ ఒక సందర్భంగా కృష్ణయ్యర్‌కు రాసిన లేఖలో, న్యాయమూర్తిగా ‘‘పూర్తి సమయాన్ని సద్వినియో గం చేస్తున్న వ్యక్తి మీరు. మానవ హక్కుల గురించి, న్యాయచట్టాలపైన మీరు రాసిన గ్రంథం అనేక దేశాల ప్రజలకు అత్యంత విలువైనదిగా భావిస్తున్నాను. న్యాయమూర్తిగా పనిచేసిన కాలంలో మీ భావధార, మీ తీర్పులూ ప్రశంసలు పొందాయి. మీ న్యాయశాస్త్ర పరిజ్ఞానం ఇతరులకు మార్గదర్శకం కావాలని కోరుకుంటున్నాను’’ అని పేర్కొన్నాడు!
 
 న్యాయ నిఘంటువుకు నూతన పెన్నిధి
 ఈ సునిశితమైన మానవతా కోణం ఆయనకు అబ్బడానికి మరో కారణం- తొలి నుంచీ కృష్ణయ్యర్‌కు ఆది హైందవమైన బౌద్ధ ధర్మంపైన ప్రగాఢమైన విశ్వాసం కూడా. నిజానికి బౌద్ధం ప్రభావంలోనే ఆయనకు, చరిత్రాధ్యయనంలో మార్క్సిస్టు సులోచనాలు తోడు నీడయ్యాయని చెప్పాలి! కనుకనే రాజ్యాంగ పరిమితులలోనే ధర్మాసన చైతన్యాన్ని పెంచడానికి, ప్రజాప్రయోజన వ్యాజ్యాల (పిల్స్) ద్వారా నిస్తేజంగా పడివున్న చట్టాన్ని, న్యాయవ్యవస్థను చైతన్యంలోకి నెట్టడానికి కృషి సల్పారు.
 
 ఈ కర్తవ్యంలో ఆయనకు తోడుగా నిలిచిన వారు, ‘పిల్’ ప్రక్రియకు ఆద్యులూ జస్టిస్ భాగవతి, జస్టిస్ హెచ్.ఆర్.ఖన్నా. భావ వ్యక్తీకరణలోనే కాదు, అందుకు తోడు నీడైన భాషా మాధ్యమం వినియోగంలో కూడా కృష్ణయ్యర్ విలక్షణమైన పోకడలు పోయాడు. నూతన పదసృష్టికి, పదబంధాలకు దోహదం చేశాడు. న్యాయశాస్త్ర నిఘంటువుకు అనేక టెలిస్కోపిక్ పదాలను సృష్టించి, శ్రీశ్రీ మాదిరిగా భావప్రక్రియా సాధనాలుగా వదిలాడు. ఉదాహరణకు తీర్పులలో భాగంగానూ, అన్యధానూ ‘ఫార్మకోపిక్ ప్లూరలిజం’ అనీ, ‘ఫార్మలోపిక్ స్వరాజ్’ అనీ ప్రయోగించాడు. భోపాల్ గ్యాస్ వల్ల ప్రజలకు కలిగిన ఘోర విషాదాన్ని హిరోషిమాపై అమెరికా తొలి అణుబాంబు ప్రయోగం ద్వారా కలిగిన మానవతా మారణ హోమంతో పోల్చి ‘భోపోషియా’ అన్న పదాన్ని సృష్టించాడు.
 
 వెలుగులు చిమ్ముకుంటూ రాలిన ఉల్క

 ఇలా కృష్ణయ్యర్ తన పదజాల సృష్టితో జాతీయ రాజకీయ, ఆర్థిక సాంఘిక, సాంస్కృతిక పరిణామ క్రమంలో ఎదురైన ముఖ్య ఘటనలు, సన్నివేశాలపైన వ్యాఖ్యానించకుండా ఉన్న సందర్భాలు చాలా తక్కువ! అమెరికా, బ్రిటిష్ సామ్రాజ్యవాదులు పారిశ్రామిక యుగం ఫలితాలు బడుగు దేశాలకు అంద కుండా చేయడానికి ప్రవేశపెట్టిన సరికొత్త ఫార్ములా ‘మేధా సంపద!’ బడుగు వర్ధమాన దేశాల జీవవైవిధ్య సంపదను కాజేయాలంటే సృష్టికి దోహదం చేసే మౌలిక ప్రక్రియలపైనే తమకు ఆధిపత్యం కావాలని బహుళజాతి గుత్త కంపెనీలు కోరుకుంటున్నాయి.

ఇందుకై వస్తూన్న విదేశీ ఒత్తిళ్లకు లొంగి స్థానిక జీవ వైవిధ్య సంపదను ధారాదత్తం చేయరాదని కృష్ణయ్యర్ చెప్పాడు. కృష్ణయ్యర్ మాదిరి ఇలా ఎన్నెన్ని కోణాల నుంచో న్యాయమూర్తి స్థానంలో నిలిచి సామాజిక, ఆర్థిక, రాజకీయ పునాదిపై అభిప్రాయాలను పెంచుకుని, క్రోడీకరించుకున్న వారు తక్కువ. సుప్రసిద్ధ ఆంగ్ల శ్రామికవర్గ నవలాకారుడు జాక్ లండన్ అన్నట్టు ‘‘మానవుడు మందకొడిగా ఒక శాశ్వత గ్రహంగా మిగిలిపోయేకంటే, జగజ్జేగీయమానంగా వెలుగులు చిమ్ముకుంటూ రాలిపోయే ఉల్కగా మారాలి. మనిషన్నవాడు జీవిస్తే చాలదు, చైతన్యం లేని బతుకీడ్చడం కాదు.’’ అలా చైతన్యంతో రాలిన మరో ఉల్కే.. కృష్ణయ్యర్.    
 - ఏబీకే ప్రసాద్
 సీనియర్ సంపాదకులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement