నమో ‘నమూనా’తో నాశనమే | Namo 'model, with Havoc | Sakshi
Sakshi News home page

నమో ‘నమూనా’తో నాశనమే

Published Fri, May 2 2014 1:00 AM | Last Updated on Tue, Nov 6 2018 8:28 PM

నమో ‘నమూనా’తో నాశనమే - Sakshi

నమో ‘నమూనా’తో నాశనమే

మోడీ హయాంలో 16 వేల మంది చిన్న, సన్నకారు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. చంద్రబాబు కాలంలో మన రాష్ట్రంలో జరిగిన రైతు ఆత్మహత్యల కంటె నాలుగు రెట్లు అధికంగా మోడీ హయాంలో జరిగాయి. నలభయ్ అయిదు శాతం చిన్న, సన్నకారు రైతులు సాగు నుంచి తప్పుకున్నట్టు ఒక ఎన్జీవో నిర్వహించిన సర్వే తేల్చింది.
 
ఈ పార్లమెంట్ ఎన్నికలు కొత్త చర్చను లేవనెత్తాయి.  ఆ చర్చంతా నరేంద్ర మోడీ ప్రధాని అభ్యర్థిత్వం సరైనదా? కాదా? అనేదే. దేశ వ్యాప్తంగా మోడీని శీల పరీక్ష, శల్య పరీక్ష చేయడానికి కాంగ్రెస్ సహా రాజకీయ పార్టీలే కాదు, ప్రజా సంఘాలు, సంస్థలు, మేధావులు, కళాకారులు, కవులు ముందు వరసలో నిలబడ్డారు. రాజ్యాంగం ప్రకారం ఈ దేశానికి ప్రధానమంత్రి అయ్యే అర్హత గాంధీల కుటుంబానికే కాదు, చాయ్‌వాలాలకు కూడా ఉంటుంది. అలాంటి సౌలభ్యాన్ని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పొందుపరిచారు. ఆ మేరకు మోడీ కూడా ఆ పదవికి అర్హుడే. అయినా మోడీ అభ్యర్థిత్వానికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ఉద్యమాలు ఎందుకు జరుగుతున్నాయి? ఈ అంశాన్ని పరిశీలిస్తే తప్ప దేశానికి నాయకత్వం వహించే అర్హత మోడీకి ఉందో లేదో తేల్చలేం.
 
 
మోడీ ఎవరి ప్రతినిధి?
విశ్లేషణ హిందూత్వ జాతీయవాదిగా సగర్వంగా చెప్పుకునే మోడీ ఇప్పుడు తనను తాను ఓబీసీగా గుర్తింపు పొందడానికి ఉవ్విళ్లూరుతున్నారు. దీనికి కారణం 2004 నుంచి ఆరెస్సెస్, బీజేపీ సంఘ్ పరివార్ మత రాజకీయాలు పలచ పడడమే. మతం కంటె బతుకు తెరువు ప్రధానమని ప్రజలు భావించడం ప్రారంభించారు. పదేళ్లు అధికారంలో ఉన్నప్పటికీ యూపీఏ సాధించిందేమీ లేదు. దీనితో విఫల నమూనాల యూపీఏ ప్రభుత్వాన్ని మార్చే దిశగా ప్రజల ఆలోచనలు కొనసాగుతున్నాయి. దీనిని అవకాశంగా తీసుకుని పెట్టుబడిదారీ వర్గం, దాని అనుచరులైన మతతత్వ వర్గాలు తమ రాజకీయ ఎజెండాగా గుజరాత్ నమూనాను ముందుకు తీసుకువచ్చాయి.
 
 ఓబీసీ అని చెప్పుకుంటున్న మోడీ మహాత్మా జ్యోతిరావు ఫూలేను జాతీయ సమైక్యతా చిహ్నంగా తీసుకోకుండా భూస్వామ్య, అగ్రకుల వల్లభాయ్ పటేల్‌ను ‘స్టాచ్యూ ఆఫ్ యూనిటీ’గా ఎందుకు నిర్మిస్తున్నారు?  దేశ హోంమంత్రిగా ఉన్నప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు పటేల్ ప్రత్యేకంగా ఒరగబెట్టిందేమీ లేదు. సమైక్య చిహ్నంగా పటేల్‌ను ఎంచుకున్నారంటే, మోడీ భూస్వాముల ప్రతినిధిగా ప్రధానమంత్రి స్థానానికి పోటీ పడుతున్నారే కానీ, బీసీల ప్రతినిధిగా కాదు. గుజరాత్ ముఖ్యమంత్రిగా మోడీ పదమూడేళ్ల పాలనా కాలంలో కార్మికులు, వ్యవసాయ కూలీల సంక్షేమానికి చేసిందేమీ లేదు.
 
ఓబీసీల పురోగతికి విఘాతం
1970 దశకంలో దేశంలో కొన్నిచోట్ల ఓబీసీ ప్రాంతీయ రాజకీయాలు  బలపడినాయి. దాని ఫలితంగానే కేంద్రంలో జనతా (1977), నేషనల్ ఫ్రంట్ (1989) ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. మతతత్వ వ్యతిరేక సెక్యులర్ రాజకీయాలు కొంతయినా రాణించే అవకాశం వచ్చింది. ఇక దేశ వ్యాప్తంగా ఓబీసీ కులాలు 90 దశకంలో రాజకీయ శక్తులుగా అవతరించాయి.
 
ప్రధానంగా లాలూ ప్రసాద్ (ఆర్జేడీ), ములాయం సింగ్ యాదవ్(సమాజ్‌వాదీ), దేవెగౌడ (జేడీ-ఎస్), నితీశ్‌కుమార్, శరద్‌యాదవ్ (జేడీ-యూ), శిబు సోరెన్ (జేఎంఎం), రాం విలాస్ పాశ్వాన్ (ఎల్‌జేపీ) అధికారం చేపట్టారు. అంతకంటె ముందు డీఎంకే, అన్నా డీఎంకే, తెలుగుదేశం తదితర ప్రాంతీయ పార్టీలు అధికారాన్ని కైవసం చేసుకున్నాయి. ఇప్పుడు మోడీ చెప్పుకుంటున్న ఓబీసీ వాదం వల్ల  చరిత్రాత్మక పాత్ర నిర్వహించడం ద్వారా ఈ పార్టీలు, నాయకులు ఇప్పటివరకు  సాధించిన గుర్తింపునకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. ఇప్పటికే ఓబీసీ గుర్తింపుతో మనుగడ సాగిస్తున్న ఆ పార్టీలకు మోడీ వాదం వల్ల భంగం వాటిల్లుతుంది. ఈ నేపథ్యంలోనూ మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ దళిత ఉద్యమ నాయకులు మోడీని ప్రసన్నం చేసుకోవడానికి బారులు తీరడం విచిత్రమే.
 
గుజరాత్ నమూనా ఇదేకదా!
నరేంద్ర మోడీని పెట్టుబడిదారీ వర్గం ‘అభివృద్ధి రక్షకుడు’గా పిలుచుకుంటుంది. కానీ గుజరాత్ అభివృద్ధి అంతా కొత్త వాణిజ్య వర్గం బనియాల అభివృద్ధిని విశాలం చేయడం తప్ప సామాన్య ప్రజల అభివృద్ధికి చోటు ఇవ్వలేదు. కొద్ది మంది ఓబీసీ న్యూ రిచ్ క్లాస్‌కు ప్రభుత్వ అభివృద్ధి పథకాలు అంది ఉండవచ్చు. కానీ కింది వర్గాలకు చేరలేదు. మోడీ అభివృద్ధి నమూనా కొన్ని రంగాలలో ఉత్పత్తిలో పెరుగుదలకు సంబంధించినదే తప్ప సేవల రంగం, ప్రజల సంక్షేమంలో చెప్పుకోదగ్గ వృద్ధిని సాధించలేకపోయింది.
 
1991లో ఆరో స్థానంలో ఉన్న గుజరాత్ మానవాభివృద్ధి ఇప్పుడు పదకొండవ స్థానానికి చేరింది. రాష్ట్రంలో ఇప్పటికీ 30 శాతం ప్రజలు పేదరికంలో మగ్గుతున్నారు. పేదరికంలో ఆ రాష్ట్రానికి 17వ స్థానం. రైతు రాజ్యం అని పిలుస్తున్న గుజరాత్‌లో 25 లక్షల మంది రైతులు, దళితులు, ఆదివాసీలకు చెందిన భూములను సెజ్‌లకు కట్టబెట్టారు. ఆ భూములకు పదేళ్ల దాకా నష్ట పరిహారాన్ని అందించలేదు. మోడీ హయాంలో 16 వేల మంది చిన్న,సన్నకారు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు.
 
చంద్రబాబు కాలంలో మన రాష్ట్రంలో జరిగిన రైతు ఆత్మహత్యల కంటె నాలుగు రెట్లు అధికంగా మోడీ హయాంలో జరిగాయి. నలభయ్ అయిదు శాతం చిన్న, సన్నకారు రైతులు సాగు నుంచి తప్పుకున్నట్టు ఒక ఎన్జీవో నిర్వహించిన సర్వే తేల్చింది. దేశంలోనే అత్యంత వెనుకబడిన రాష్ట్రాలుగా పేర్కొనే బీహార్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌ల కంటె గుజరాత్ వృద్ధి రేటు వెనుకబడి ఉంది. బెంగాల్, కేరళ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లలో జరిగిన భూపంపిణీ విధానం గుజరాత్‌లో కనిపించదు.  1960లో మహారాష్ట్ర నుంచి విడిపోయి ఏర్పడిన గుజరాత్ బనియా వ్యాపార వర్గాలతో నిండిపోయింది. అప్పటి నుంచి కూడా వివిధ రంగాలలో క్రమంగా వృద్ధి కనిపిస్తున్నది. ఉన్నట్టుండి 2002 తరువాత దేశంలో ఎక్కడా లేనట్టు రాకెట్ వేగంతో ఆ రాష్ట్రం అభివృద్ధిపథంలో దూసుకుపోతున్నదని బీజేపీ ప్రచారం చేస్తున్నది.
 
విద్వేషానికి ప్రోత్సాహం అనేక పోరాటాల ఫలితంగా ప్రపంచంలో సెక్యులరిజం అనే భావన రూపుదాల్చింది. అలాంటి సెక్యులరిజం ఈ దేశానికి ప్రమాదమనీ, హిందూత్వమే శ్రీరామరక్ష అని మోడీ నమ్మకం. 2001లో అధికారంలోకి వచ్చిన మోడీ దారుణ మారణకాండకు నాయకత్వం వహించాడు. వివిధ కమిషన్లు, అధికారిక లెక్కల ప్రకారం 2500 మంది అమాయక ముస్లింలను సంఘ్ పరివార్‌తో పాటు కాంగ్రెస్ పార్టీలు హతమార్చినట్టు తెలుస్తుంది. ఇలాంటి మతోన్మాదాన్ని జాతీయవాదంగా చలామణి చేయించడానికి మోడీ యత్నిస్తున్నారు. 1500 మందిని పొట్టన పెట్టుకున్న 1969 నాటి  గుజరాత్ హత్యాకాండను మించిన మారణహోమాన్ని సృష్టించాలని మోడీ 2002లో హిందూత్వ ఉన్మాదులను రెచ్చగొట్టాడు. గుజరాత్ మారణకాండను నివారించడానికి మోడీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని అనేక కమిషన్లు నిర్ధారించాయి.
 
ఇప్పుడు మతోన్మాదం ఓబీసీ ముసుగు ధరించి మోడీ రూపంలో కబళించడానికి వస్తున్నది. అభివృద్ధికీ, రాజకీయాలకూ ఒక వ్యక్తిని కేంద్రబిందువును చేసి మాట్లాడడమంటే; ఒకే వ్యక్తి దేశ భవిష్యత్తును మార్చగలడని ప్రచారం చేయడమంటే మూర్ఖత్వానికి పరాకాష్ట. ఈ పరిస్థితి కేవలం ముస్లింలకే కాదు, మత మైనారిటీ లు, దళిత క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులకు కూడా ప్రమాదకరమే.
 
ఆదివాసీలు, దళితులు, క్రైస్తవులు, ముస్లింలు వారిలో వారు కలహించుకునేటట్టు చేసే పథకాలను సంఘ్ పరివార్ అమలు పరుస్తున్నది. కాబట్టి మోడీకి ఒకసారి అధికారం ఇస్తే దేశాన్ని మధ్య యుగాలకు నడిపినట్టు అవుతుంది. అలాంటి ఒక అభివృద్ధి నిరోధక సమాజాన్ని మోడీ ద్వారా నిర్మించడానికి జరుగుతున్న ప్రయత్నాన్ని ఎదుర్కొనాలి. బీజేపీ హిందూత్వ రాజకీయాలను ఎదుర్కొనడం అంటే ప్రజా సమూహాల ఆకాంక్షలను, ప్రజాస్వామిక విలువలను కాపాడుకోవడమే. ప్రధాని పదవి చేపట్టే అర్హత రాజ్యాంగం ప్రకారం మోడీకి ఉంది. కానీ మానవ సమాజం నిర్మించుకున్న కొన్ని విలువల ప్రకారం ఆయన ఆ పదవికి అర్హుడు కాలేరు.    
 హారతీ వాగీశన్ (అసిస్టెంట్ ప్రొఫెసర్, నల్సార్),
 సుదర్శన్ బాలబోయిన (రీసెర్చ్ స్కాలర్, ఓయూ)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement