కడప రూరల్: పులివెందుల తాలూకా యూనిట్ ఎన్జీఓ అసోషియేషన్‌కు ఈ నెల 28వ తేదీన ఎన్నికలు జరుగనున్నాయి. అందులో భాగంగా ఈ నెల 19వ తేదీన నామినేషన్ల ప్రక్రియ జరగనుంది. ఇందుకోసం సిద్ధం చేసిన ఓటర్ల జాబితా సమస్తం తప్పుల తడకగా మారడంతో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బోగస్ వ్యవహారం బయటికి రావడంతో అంతా గందరగోళ పరిస్థితి నెలకొంది. ఎందుకు ఈ విధంగా వ్యవహరించారన్నది అర్థం కావడం లేదు. ఎలాగోలా గెలుపే లక్ష్యంగా అడుగులు వేయడంలో భాగంగా బోగస్‌ల ద్వారా లబ్ధి పొందాలని ప్రణాళిక రచించినట్లు లిస్టు ద్వారా వెల్లడవుతోంది. ఈ ఎన్నికలు మూడేళ్లకు ఒకసారి జరుగుతాయి.
ఆ మేరకు అర్హులైన ఉద్యోగులను(ఎన్జీఓ)లను మాత్రమే ఓటర్ల జాబితాలో చేర్చాలి. ఆ ప్రకారం గత ఎన్నికల జాబితాలో 350 మంది ఓటర్లు ఉండగా, ప్రస్తుతం జరిగే ఎన్నికల జాబితాలో 503 మంది నమోదై ఉండడం గమనార్హం. అందులో పులివెందులకు సంబంధంలేని ఉద్యోగులతో పాటు అటెండర్లు, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బంది పేర్లు కూడా నమోదు కావడం విచిత్రం. జాబితాలో అర్హులైన దాదాపు 100 మంది ఎన్జీఓల పేర్లు లేకపోవడం గమనార్హం. కేవలం గెలుపే లక్ష్యంగా బోగస్‌ను చేర్చించారని ఉద్యోగ వర్గాల్లో చర్చకు దారి తీసింది.
పోటీ లేకుండా కుట్ర..?
వాస్తవానికి ఎన్నికల జాబితాను ఎన్నికల అధికారి ముందుగానే అందరికీ అందుబాటులో ఉంచాలి. అయితే నామినేషన్‌కు ముందు రోజు మాత్రమే జాబితాను అందుబాటులో ఉంచారు. దీనిని పరిశీలించిన ఉద్యోగ వర్గాలు నివ్వెరపోయాయి. . ఈ ఎన్నికల్లో కొంతమంది పోటీ చేయాలని సిద్ధమయ్యారు. అలాంటి వారి పేర్లు ఓటర్ల జాబితాలో లేకపోవడంతో ఆందోళనకు లోనయ్యారు. అంటే ప్రత్యర్ధులు పోటీలో లేకుండా చేయడానికి ఒక వర్గం ఇలా కుట్ర పన్నింది అని మరొక వర్గం ఆరోపిస్తోంది, ఈ నేపథ్యంలో ఎన్నికలను రద్దు చేయడంతో పాటు ఎన్నికల జాబితాపై విచారణ చేపట్టాలని ఉద్యోగ వర్గాలు పట్టుపడుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment