
మీ ఆనందం మీ చేతుల్లోనే...
ఆ మధ్య నన్ను ఒకరు ఓ సందేహం అడిగారు. ‘సహచరుడైన నా మిత్రుడొకరు ఎప్పుడూ తాను చేసిందే సరైనదని అనుకుంటూ ఉంటాడు.
ఆ మధ్య నన్ను ఒకరు ఓ సందేహం అడిగారు. ‘సహచరుడైన నా మిత్రుడొకరు ఎప్పుడూ తాను చేసిందే సరైనదని అనుకుంటూ ఉంటాడు. అందువల్ల అతనితో ఇబ్బంది పడుతున్నా. నేనేం చేయాలి?’ అని ప్రశ్నించారు. నిజానికి ఇలాంటి సంఘర్షణలు భార్యాభర్తల మధ్య, తండ్రీ బిడ్డల మధ్య కూడా ఉంటాయి. అందుకే, ముందుగా ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. అప్పుడే దాన్ని సమర్థంగా ఎదుర్కోగలం. రెండో విషయం ఏమిటంటే, అవతలివాళ్ళతో కమ్యూనికేషన్ జరపడమే దీనికి పరిష్కార మార్గం. మరి, ఆ కమ్యూనికేషన్ ఎలా జరపాలన్నది ప్రశ్న. మాటామంతి జరిపేది ఎంతసేపటికీ ఎవరిది తప్పు అని నిర్ణయించడానికి కాదు... ఏది ఒప్పు అన్నది చూడడానికి. ఈ విషయం గుర్తుంచుకోవాలి.
ఎవరితోనైనా అనుబంధం నిలవాలంటే, ఐదు అంశాలు ప్రధానం. ఎదుటి వ్యక్తితో స్నేహంగా ఉండాలి. నిష్పక్షపాతంగా ఉండాలి. నిజాయితీగా ఉండాలి. దృఢంగా ఉండాలి. పట్టు విడుపులుండాలి. ఈ అయిదూ ఉంటే ఏ బంధమైనా చిరకాలం నిలుస్తుంది.
మరి, ఈ అయిదు అంశాలనూ ఎలా ఆచరించాలన్నది ఆలోచించండి. అప్పుడది మీ అనుభవంగా మారుతుంది. జీవితానికి ఉపకరిస్తుంది. ముందు ఆత్మవిశ్వాసంతో నిలబడండి. కళ్ళెదుట కనిపిస్తున్న అంశాలను గుర్తించండి. ఆలోచనల ద్వారా, మనసులోని ఖాళీలను పూరించండి. అలాగే, మనం ఏం మాట్లాడినా, ఎంత మాట్లాడినా సరే, అవతలి వ్యక్తి దేని మీద శ్రద్ధ పెడితే అదే వింటారన్నది గుర్తించండి. మిగిలినదంతా గాలికి పోతుంది. అవతలి వ్యక్తి పట్ల కరుణతో మాట్లాడితే, ఆ మాటలు ఎంతో ప్రభావం చూపిస్తాయని గుర్తించాలి.
ఒక్కోసారి అవతలి వ్యక్తి ఏది తప్పు ఏది ఒప్పు అని చూడకుండా, తన వాదనను నెగ్గించుకోవాలని ప్రయత్నిస్తుంటాడు. అలా ఒకసారి మన కమ్యూనికేషన్ విఫలమైతే, భిన్నమైన మార్గాల ద్వారా కమ్యూనికేట్ చేయడానికి ప్రయత్నించాలి. వాళ్ళకు మన మాట అర్థమయ్యేలా చెప్పాలి. అయితే, ఒక్కమాట... ఏ బంధంలోనైనా మధ్య మధ్యలో సవాళ్ళు లేకపోతే జీవితంలో మజా ఏముంది?
అసలు ఎప్పుడైనా సాదాసీదాగా ఉండడంలో ఎంతో ఆనందం ఉంది. అది అనుభవమైతే కానీ అర్థం కాదు. అధికారం, హోదాల ద్వారా అవతలి వ్యక్తి మీద పైచేయి సాధించి, గెలిచామని సంబరపడాలని అనుకుంటే అంతకన్నా పొరపాటు మరొకటి లేదు. మామూలుగా ఉండండి... జీవితాన్ని సంక్లిష్టంగా మార్చుకోకుండా, సరళం చేసుకోండి. జీవితమంటే, మనం ఎదగడానికి ఉన్న జాగా. అంతేతప్ప, కేవలం వయసు పెరగడం కాదని గుర్తుంచుకోవాలి.
అలవాట్లకు మనం బానిసగా మారితే, అప్పుడు వాటి చేతిలో మనం కీలుబొమ్మలమవుతాం. ఈ సంగతులు గుర్తిస్తే, జీవితం సరళంగా మారుతుంది. మనకు సంతృప్తినిచ్చేది సుఖభోగాలు కాదు... ప్రశాంతత అన్నది అర్థమవుతుంది. ఈ లోచూపు ఉంటే, మీ జీవితమే మారిపోతుంది.
- స్వామి సుఖబోధానంద