ఇంగ్లిష్‌ వెలుగులు చెదరనివ్వొద్దు | People Know English Language Importance Special Story By Kancha Ilaiah | Sakshi
Sakshi News home page

ఇంగ్లిష్‌ వెలుగులు చెదరనివ్వొద్దు

Published Tue, Aug 30 2022 1:16 AM | Last Updated on Tue, Aug 30 2022 1:42 AM

People Know English Language Importance Special Story By Kancha Ilaiah - Sakshi

ఒకే దేశం, ఒకే భాష పేరుతో గతంలో హిందీని ప్రచారం చేసిన కేంద్ర హోంమంత్రి ఇప్పుడు ప్రాంతీయ భాషా రాగం అందుకున్నారు. భారతీయుల ప్రతిభా సామర్థ్యాలు పూర్తిగా వెల్లడి కావాలంటే, ప్రాంతీయ భాషలను ప్రోత్సహించడం తప్పనిసరి అంటున్నారు. ఇది పూర్తిగా గ్రామీణ ప్రజానీకాన్ని వెనుకబాటుతనంలో ఉంచే సిద్ధాంతం. ఇప్పటికే అంతర్జాతీయంగా ఎదగాలంటే ఇంగ్లిష్‌ విద్య కీలకమైనదని గ్రామీణ ప్రజానీకం అర్థం చేసుకుంది. ఈ అవగాహనతోనే ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ఇంగ్లిష్‌ మీడియంను ప్రవేశపెట్టాయి. ఇంగ్లిష్‌ వల్ల తమ పిల్లల ముఖాల్లోని వెలుగును ఏపీ ప్రజానీకం చూస్తోంది. అదే రానున్న ఎన్నికల్లో వైసీపీకి భారీ ఓట్లు తేనుంది. దీన్నొక శక్తిమంతమైన ఆయుధంగా టీఆర్‌ఎస్‌ ఇంకా మల్చుకోవాల్సి ఉంది.

ఒకే దేశం, ఒకే భాష సూత్రానికి నిరంతర సమర్థకుడిగా కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా వ్యవహరించి ఎక్కువ కాలం కాలేదు. ఆ ఒకే భాషగా హిందీని షా పదేపదే ప్రచారం చేశారు. కానీ అలాంటి ప్రతిపాదన పట్ల దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా ప్రతిఘటించడం; ప్రధాని నరేంద్రమోదీ, ఆరెస్సెస్‌ అధినేత మోహన్‌ భాగవత్‌ కూడా అన్ని భారతీయ భాషలూ సమాన ప్రాధాన్యత కలిగినట్టివే అని ప్రకటించడంతో అమిత్‌ షా కాస్తా గేర్లు మార్చారు. మోదీ తర్వాత ఆరెస్సెస్, బీజేపీలకు ప్రధాని అభ్యర్థి అమిత్‌ షాయేనని అన్ని సంకేతాలూ వెలువడుతున్నాయి. భారతీయ ప్రతిభా సామర్థ్యాలు పూర్తిగా వెల్లడి కావాలంటే, ప్రాంతీయ భాషలను ప్రోత్సహించడం తప్పనిసరి అనే అభిప్రా యాన్ని ఆయన కలిగివున్నారు.

జాతీయ విద్యావిధానం 2020 (ఎన్‌ఈపీ) రెండో వార్షికోత్సవం సందర్భంగా అమిత్‌ షా ఆగస్టు 19న ఢిల్లీలో మాట్లాడారు. న్యాయ శాస్త్రం, వైద్యశాస్త్రం, ఇంజినీరింగ్‌ వంటివాటిని భారతీయ భాషల్లోనే బోధించాలని ఆయన నొక్కి చెప్పారు. ఎవరైనా తమ సొంత భాషలో ఆలోచించినప్పుడే పరిశోధన, అభివృద్ధి సాధ్యపడతాయన్నారు. సొంత భాషలో ఆలోచించకపోవడమే పరిశోధనా రంగంలో భారత్‌ వెనుకబడి ఉండటానికి ఒక కారణంగా చూపారు.ప్రత్యేకించి కర్ణాటక తర్వాత తెలంగాణలో అధికారంలోకి రాగలమని ఆరెస్సెస్, బీజేపీ కూటమి పెద్ద ఆశలు పెట్టుకుని ఉంది. ఈ కొత్త సిద్ధాంతంతో అమిత్‌ షా దక్షిణాదిలో కూడా ఆమోద నీయమైన నాయకుడిగా మారాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఇంగ్లిష్‌ మీడియం విద్యకు సంబంధించిన చైతన్యం గతంలో కంటే ఇప్పుడు దక్షిణాదిలో మరింత ఎక్కువగా విస్తరించింది. అంత ర్జాతీయ ఉపాధి మార్కెట్లలో స్థానం సంపాదించాలని దక్షిణాదిలోని ప్రతి గ్రామమూ ఆకలిగొని ఉంది. జాతీయంగా, అంతర్జాతీయంగా ఎదగాలంటే ఇంగ్లిష్‌ విద్య కీలకమైనదని గ్రామీణ ప్రజానీకం కూడా అర్థం చేసుకున్నారు. కానీ ప్రాంతీయభాషా ప్రాతిపదికన ఉన్న ఉన్నత విద్యా వ్యవస్థ వీరిని తమ భాషా రాష్ట్రాన్ని దాటి ముందుకు పోనీయడం లేదు. అదే సమయంలో ఎగువ, మధ్యతరగతి వర్గాలు ఇప్పటికే ప్రాంతీయ భాషా విద్యను దాటి ముందుకెళ్లిపోయాయి. వారిలోని ఈ కొత్త శక్తికీ, అధికార సంపదలకూ ప్రైవేట్‌ ఇంగ్లిష్‌ మీడియం విద్యే ప్రధాన వనరుగా మారింది. ఇప్పుడు వీరు ప్రాంతీయ భాషా విద్య వైపు వెనక్కు మళ్లరు. ఈ అవగాహనే ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలను ప్రభుత్వరంగంలో ఇంగ్లిష్‌ మీడియం స్కూలు విద్యవైపు మరలేట్టు చేసింది. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని అనుకుంటే, అప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో మీడియం తిరిగి తెలుగుకు మారుతుందా?
అమిత్‌ షా ఆంతర్యం సరిగ్గా ఇదే మరి. కానీ అదే జరిగితే తెలంగాణలోని అత్యంత వెనుకబడిన గ్రామీణ వర్గాలు దెబ్బతిని పోతాయి. నిజానికి ప్రభుత్వ పాఠశాలలు తిరిగి తెలుగుకు మళ్లితే– రైతు బంధు, దళిత బంధు వంటి సంక్షేమ పథకాలు ఆగిపోవడం కంటే కూడా ఎక్కువ ప్రతికూలతను అది ప్రజల మీద కలిగిస్తుంది.

తన కుమారుడైన జయ్‌ షాను ప్రపంచ స్థాయి ఇంగ్లిష్‌ మీడియం పాఠశాలలో చదివించిన అమిత్‌ షాకు... తన కార్పొరేట్‌ స్నేహితు లందరూ సంపన్నుల కోసం ప్రపంచ ప్రమాణాలతో కూడిన ఇంగ్లిష్‌ మీడియం ప్రైవేట్‌ పాఠశాలలను ప్రారంభిస్తున్నారని చక్కగా తెలుసు. అమిత్‌ షా ప్రాంతీయ భాషా విద్యా అజెండా ఈ సంపన్నుల కోసం ఉద్దేశించింది కాదు. ప్రాంతీయ భాషల్లోనే తమ పిల్లలను చదివిం చాలని గ్రామీణ ప్రజానీకాన్ని కోరడం ద్వారా, భాషా ప్రయోజనాలు ఏవీ పొందలేని చారిత్రక వెనుకబాటుతనంలో వీరిని ఉంచాలని ఆయన కోరుకుంటున్నారు. 

నాణ్యమైన వసతులు, బోధనా సిబ్బందితో కూడిన ఇంగ్లిష్‌ మీడియం చదువు అంతర్జాతీయంగా అనుసంధానం కలిగి ఉండి, నాణ్యమైన జాతి నిర్మాణానికి పెట్టుబడిగా ఉంటుంది. అయితే ఇంగ్లిష్‌ మీడియం స్కూల్‌ విద్య ద్వారా విద్యాపరమైన సమానత్వం సాధించడానికి ఆరెస్సెస్, బీజేపీ కూటమి వ్యతిరేకం. ఇంగ్లిష్‌ను రహస్యంగా ఉపయోగిస్తూ, సంస్కృతం, హిందీని వీరు సైద్ధాంతి కంగా సమర్థిస్తున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మనం చూస్తున్నట్లుగా ప్రజానీకం అంతర్జాతీయ అనుసంధానం కలిగిన నాణ్యమైన విద్యకు మద్దతు తెలుపుతున్నారు. పరిశోధన, వైద్యం, ఇంజనీరింగ్, తదితర అంశాలను ప్రాంతీయ భాషల్లోనే సాగించాలని అమిత్‌ షా చెబుతున్న సిద్ధాంతం ఆ వ్యవస్థలో భాగమైన వారికి విధ్వంసకరంగా పరిణమిస్తుంది.

తెలంగాణలోని పాఠశాల విద్యా వ్యవస్థను మెరుగపర్చడానికి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేయవలసింది చాలానే ఉన్నప్పటికీ, అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియంను ప్రవేశపెట్టాలని తీసుకున్న నిర్ణయం సైద్ధాంతికంగా చదువులో సమానత్వం వైపు వేసిన తొలి అడుగు. కానీ తాము ప్రవేశపెట్టిన ఇంగ్లిష్‌ మీడియానికి వ్యతిరేకంగా బీజేపీ విద్యా విధానం ఉందని టీఆర్‌ఎస్‌ నేతలు ప్రజలకు సమర్థంగా చెప్పలేకపోతున్నారు. మరోవైపున ఢిల్లీలో ఆమ్‌ ఆద్మీ ప్రభుత్వం తమ పాఠశాల విద్యా వ్యవస్థ గురించిన ప్రచారం ద్వారా ఆరెస్సెస్, బీజేపీలను ఆత్మరక్షణలో పడవేసిందనే చెప్పాలి. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ దీని విశ్వసనీయతను అంతర్జాతీయ స్థాయి ప్రచారంగా మలిచారు.

తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి ఇంగ్లిష్‌ మీడియంను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. కానీ, ప్రత్యేకించి ఇంగ్లిష్‌ వ్యతిరేకి అయిన అమిత్‌ షాతో, సాధార ణంగా ఆరెస్సెస్, బీజేపీ శక్తులతో పోరాటానికి తగిన శక్తిమంతమైన సైద్ధాంతిక సంక్షేమ పథకంగా దీన్ని టీఆర్‌ఎస్‌ పరిగణించడం లేదు. ఇంగ్లిష్‌ మీడియం విద్యపై ఉన్న అరకొర అవగాహన కారణంగా అతి పెద్ద సంఖ్యలో ఓట్లు రాబట్టే శక్తిగా దాన్ని గుర్తించడం లేదు. దక్షిణాదిలో, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మాత్రమే... ప్రత్యేకించి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి గ్రామీణ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం విద్య ప్రాధాన్యాన్ని అర్థం చేసు కున్నారు.

దక్షిణాది రాష్ట్రాలన్నింటిలో కొంత శాతం మేరకు ఇంగ్లిష్‌ మీడియం ప్రభుత్వ పాఠశాలలు ఉంటుండగా, జగన్‌ నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ పాఠశాలలనూ ఇంగ్లిష్‌ మీడియం పాఠశాలలుగా మార్చడానికి తీవ్ర ప్రయత్నం జరిగింది. ఏపీలోని అన్ని అండర్‌ గ్రాడ్యుయేట్‌ కాలేజీల్లోనూ ఇంగ్లిష్‌ మీడియం తప్పనిసరిగా ప్రవేశపెట్టాలని కూడా వైఎస్‌ జగన్‌ సంవత్సరం క్రితం ప్రకటించారు. అమ్మ ఒడి పథకంతో కూడిన ఇంగ్లిష్‌ విద్య కారణంగా ఏపీలో టీడీపీ సంకటస్థితిలో పడిపోయింది. పిల్లలందరికీ మెరుగైన ఇంగ్లిష్‌ మీడియం పాఠశాల విద్య అనేది ‘ఉచితాల’లో భాగమేనని ఆరోపించడానికి ఎవరూ సాహసించలేరు. పాఠశాల విద్యపై పెట్టే వ్యయాన్ని ‘ఉచితాలు’ అని చెప్పి ఏ కోర్టూ, ఏ శాసన సభ కూడా ఖండించలేవు.

ఆంధ్రప్రదేశ్‌లో ఇంగ్లిష్‌ మీడియం పాఠశాల విద్య 2024లో భారీ స్థాయిలో ఓట్లను సమీకరించబోతోంది. ప్రధానంగా స్కూల్‌ విద్యపై వైఎస్‌ జగన్‌ రోజువారీ ప్రాతిపదికన చేసిన పోరాటం కారణంగా టీడీపీ, బీజేపీ రెండింటికీ పరాజయాలు ఇప్పటికే నమోదయ్యాయి. ఇంగ్లిష్‌ విద్య వల్ల తమ పిల్లల ముఖాల్లోని వెలుగును ప్రజానీకం చూస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ పోరాటమే... తెలంగాణలో ఎలాంటి వ్యతిరేకతా లేకుండా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఇంగ్లిష్‌ మీడియంను  ప్రవేశపెట్టడాన్ని సులభతరం చేసింది. కానీ దీన్ని ఇంకా ఓట్లుగా మల్చుకోవడం జరగలేదు. తెలంగాణ ప్రభుత్వం కూడా తన పాఠ శాల విద్యకు సంబంధించి సరైన ప్రచారం చేసుకోగలిగితే, ప్రతి తల్లీ తన పిల్లల శత్రువును ఓడించడానికి పోలింగ్‌ బూతుకు వెళ్తుంది. ప్రతి గ్రామీణ మహిళా కూడా అమిత్‌ షా కంటే ఉత్తమమైన జాతీయవాది.


ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్‌
 వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement