ఒక గానమూ - కొన్ని పలవరింతలు | Society will know about writings of poets | Sakshi
Sakshi News home page

ఒక గానమూ - కొన్ని పలవరింతలు

Published Sun, Sep 13 2015 12:29 AM | Last Updated on Sun, Sep 3 2017 9:16 AM

ఒక గానమూ - కొన్ని పలవరింతలు

ఒక గానమూ - కొన్ని పలవరింతలు

రాయలసీమా! నువ్వు శాప దత్త భూమివి. ఆంగ్లేయులముందు నిజాం విసిరిన పాచికవి. భాష ఒక మిష. సోదరత్వం ఒక సాకు. భాషోద్యమం ఒక కుట్ర.   ఏ చారిత్రక మలుపులో ఎవరితో ఎటువంటి రచనలు రాయించుకోవాలో సమాజానికి తెలుసు. తెలంగాణ విడిపోయింది. సమైక్యాంధ్ర బద్దలైంది. నవ్యాంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ అస్తిత్వం ప్రశ్నార్థకమైంది. రాయలసీమ కరువూ,  భాషా, సంస్కృతి, చరిత్రా వెరసి స్థానిక ప్రత్యేకత ఒక చర్చనీయ సందర్భమైంది. ఈ సామాజిక సందర్భమే హంద్రీగానానికి గొంతు సవరించుకుంది. రాయలసీమ నేలగీతం క్రిష్ణానది.

రాయలసీమకు చెందిన ముఖ్యమంత్రులు కోస్తాకు వనరులై ఉపయోగపడుతుంటే, మా క్రిష్ణానది ఒక పరాధీనగీతమే! రాయలసీమ ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో కేంద్ర ప్రణాళికాసంఘం ఆమోదంకూడా పొందిన క్రిష్ణా పెన్నార్ ప్రాజెక్టు ఏమైంది? ఆ ప్రాజెక్టునుంచి రాయలసీమకు రావాల్సిన 400 టీఎంసీలు ఎక్కడకు పోయినాయి. మనది ఒకే భాష ఒకే జాతి అనే నెపం మీద రాయలసీమను ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలోంచి బైటికి తీసుకువచ్చి మోసం చేసిందెవరు? క్రిష్ణా పెన్నార్‌ను నాగార్జునసాగర్ అనే బానపొట్టగా మార్చి హైజాక్ చేసిందెవరు? వాడే!
 
 బ్రిటన్ హయాంలోనే నీటి రుచి మరిగినవాడు! రాయలసీమ నీళ్ళకోసం భాషను కూడా పాచికగా విసరగలిగిన వాడు! వాడే!! రాయలసీమా! నువ్వు శాప దత్త భూమివి. ఆంగ్లేయులముందు నిజాం విసిరిన పాచికవి. లాభంలేనివాన్ని చివరకు నెట్టే కుట్రను దొరలపాలనే కనిపెట్టింది. రెళైై్ల, నీళ్లై కోస్తాకు ఆధునిక వికాసమైన ఆంగ్లపాలన నీ దేహం మీద కరువుల పర్వమే రచించింది. భాష ఒక మిష. సోదరత్వం ఒక సాకు. భాషోద్యమం ఒక కుట్ర. సర్కారు సోదరులమీద సీమ హృదయప్రేమ అనుమానపు తెరలుగా ఊగింది. చరిత్రలో పెద్దన్న బుద్ధి ద్రోహ ఉదాహరణలుగానే నమోదయ్యింది. సియామిస్ కవలల కల అట్లా భగ్నమైంది. అలిగిన కోటి రతనాల వీణ తీగలు తెంచుకు వెళ్ళిపోయింది. కానీ, ఆ పొరపాటు అతుకు కోసం  నువ్వు కోల్పోయిన బళ్ళారి మాటేమిటి? భద్ర నీటి హక్కు మాటేమిటి? కొండారెడ్డి ఋరుజు ముందు చెదరిన గుడారాలు చార్మినార్ ఎదుట రాజధానిగా మారిన మాటేమిటి?
 
 ఆంధ్రా బూర్జువాలకేం? తమ పెట్టుబడి గుడ్లను పొదుగుతూనే ఉంటారు, ఎక్కడైనా ఎప్పుడైనా! కోస్తాకు స్తన్యమిచ్చిన నా రాయలసీమ తల్లీ! శ్రీబాగ్ ఒడంబడికను సమాధి చేసిన నా సోదరుల నేర చరిత్ర మాటేమిటి? వారు మాట్లాడినదే భాషంట! వారు జీవించినదే నాగరికతంట! అట్లయితే, మైసూరు నుండీ శ్రీలంక దాకా మాది దుఃఖ తెనుగు స్వగతమేకదా! కానీ, ప్రతి అస్తిత్వ హననమూ చివరికి పునరుజ్జీవనాన్నే వాగ్దానం చేస్తుంది కదా! అదిగో ఫినిక్స్ గానం!
 
 రాయలసీమా! నీ కావ్యజగత్తును ఏమని వర్ణించను? పెద్దనకు హిమవన్నగమై, తిమ్మనకు దివ్యలోక పారిజాతమై, ధూర్జటికి భక్తి నేర్పిన మూగప్రాణాలై, సూరనకు కళాపూర్ణో దయ వైభవమై... అంతేనా? ఈస్తటిక్సును కాస్సేపు పక్కకు పెట్టు. అన్నమయ్యకు మాత్రమే జీర్ణమైన నీ తెనుగు పదం మాటేమిటి? వేమన పలికిన సమాజ నిష్టూరాల్నీ, వీరబ్రహ్మం తెచ్చిన అపండిత భాషా విప్లవాన్నీ, సూఫీ గురువుల సామరస్య మార్గాన్నీ సాంస్కృతిక జిగిబిగిగా అల్లుకున్నది నువ్వేకదా రాయలసీమా! జనసమూహాల ఆశలపై జీమూతంలా వాలే రాజకీయ పాలేగాళ్ళకు నీ చరిత్రా, సంస్కృతి ఏం అక్కరకు వస్తాయిలే! అధికారపు నిచ్చెన మెట్లకు ఒక్కొక్క సహోదరుణ్ణీ బలి ఇచ్చేవాళ్ళేకదా నేటి రాయలసీమ రాజకీయ విభులు! రాయలసీమా! నీవు జలదాహాల దేహార్తివి. కరువు మాత్రమే పండే పంటపొలానివి. చరిత్ర చిల్లర దేవుళ్ళకు చించి చుట్టబెట్టిన వస్త్రానివి. నీ బాధ్యతల్ని భుజానికెత్తుకునే దాహపు వీలునామా ఎక్కడ? ఇదంతా చూస్తూ కూడా నీ లేపాక్షి బసవడో, యాగంటి బసవడో తోక తొక్కిన త్రాచుపామై ఎందుకు లేవడు?
 
 నువ్వెవరని ఎవరైనా ఎందుకంటారు రాయలసీమా! బతుకుతెరువు కోసం యుద్ధమైనావు. చరిత్ర నేర్పిన గుణపాఠాల జ్ఞాపకమైనావు. అనాదిక్రోధపు సంకేతమైన దేవరగుట్ట కర్రల సమర శబ్దానివయినావు. రాగిముద్దా ఊరుమింటిని సద్ది కట్టుకో రాయలసీమా! రాజధానిని చూడవద్దువు గానీ. గుట్టల మీదా కొండల కిందా వెలసిన అవధూతల దర్గాతాతల ఆశీర్వాదాలు తీసుకోవడం మరిచిపొయేవు సుమా. అదిగో నీ దారి. ఊరి బొడ్రాయి గడ్డన వెలసిన మారెమ్మ గుడి సందులనుంచీ, బీరప్ప పరసల జాతర్లనుంచీ రా! సూఫీ దర్గాలనుంచీ, ఆదోని మాదిగ లక్ష్మమ్మ కరుణా ప్రసాదంతో రా!
 
 దుఃఖాన్ని పండించే పంటపొలాలనుంచీ, పెన్నా క్రిష్ణలు కలిసే కలను ఛిద్రం చేసిన ఆ తీరప్రాంతానికి రా! మూన్నాళ్ళ ముచ్చటైన రాజధానిని చూసి నా ఎద మీద ప్రశ్నగా మొలుచుకొస్తావేమో! చిట్లిపోయిన కన్నీటి చుక్కల మట్టి కేకనవుతాను. ఉరి పేనిన బతుకుపంటనవుతాను. కోడెగిత్తలు కాడి తప్పిపోతుంటే, నదీ మూలాలు నడకలు మరిచిపోతుంటే, నెర్రెలు చీలిన పగుళ్ళలోంచి ఆత్మశ్వాసనవుతాను. కానీ, రాయలసీమ ఫీనిక్స్ గానంలో ఉన్నానున్నానేనున్నాను కవీ! అనంతపురం గూగూడుకుళ్ళాయి స్వామి సూఫీతత్వపు మంత్ర కణికనై, చిత్తూరు గంగ జాతరలో అనాది చిందునై, కడప అమీర్ పీరా దర్గాలో సామరస్య ప్రార్థననై, ఒంగోలు గిత్త చర్మపు డప్పు జనక జనక జజ్జనకనై, గుండ్లకమ్మ నుండీ పెన్న దాకా, కొండారెడ్డి బురుజు నుంచీ హోసూరు దాకా ఉన్నానున్నానేనున్నాను రాయలసీమ కవీ! రాయలసీమ భూమిపుత్రులను మేల్కొలిపే శబ్దశరంకదా నీ హంద్రీగానం!
 
 ఉపసంహారం: వెంకటక్రిష్ణ హంద్రీగానంలో కాలం పేజీలు వెనక్కితిప్పి చరిత్రను తడిమే స్పర్శ జ్ఞానముంది. సాంస్కృతిక పునరుజ్జీవన భవిష్యద్దర్శనముంది. ఐతిహాసిక చిత్రణ ఉంది. జీసస్ వెప్ట్ అన్నట్లు రాయలసీమ కోసం ఇతనిది ప్రవక్త దుఃఖం. ఇతనిలో దున్నేకొద్దీ దుఃఖముంది. మండే కొద్దీ ధర్మాగ్రహముంది. చరిత్ర వైపు వేలెత్తి చూపే సాహసముంది. ఇతడు రాయలసీమ జనహృదయ గానాన్ని సాధన చేసినవాడు. ఈ కవికి అభినందనలు. ఇతని కవిత్వానికి జేజేలు.
 - బండి నారాయణస్వామి
 8886540990

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement