లండన్: భూమి మీద పుట్టిన దాదాపు ప్రతి జీవి ఏదో రూపంలో సాటి జీవులతో సమాచార ప్రసారం చేస్తుంటాయి. మనిషి మాటల ద్వారా భావాన్ని ప్రసారం చేస్తే, జంతువులు పలు శబ్దాల ద్వారా, కదలికల ద్వారా చేస్తుంటాయి. వృక్షాలు రసాయన సంకేతాలతో సంభాషించుకుంటాయి. మరి జీవ పటంలో ఇంకా దిగువకు వెళ్లే కనిపించే శిలీంద్రాల సంగతేంటి? పుట్టగొడుగుల్లాంటి శిలీంద్రాలన్నీ మొద్దబ్బాయిల్లాంటివేనా? లేదా మనకు తెలీని రూపంలో వీటిలో సమాచార ప్రసారం జరుగుతుందా? వెస్ట్ ఆఫ్ ఇంగ్లండ్ యూనివర్సిటీకి చెందిన కంప్యూటర్ సైంటిస్టు అండ్రూ అడమట్జీ్క చేపట్టిన నూతన పరిశోధన ఈ ప్రశ్నలకు సమాధానాలిస్తోంది.
శిలీంద్రాలు వాటికే సొంతమైన ఎలక్ట్రికల్ భాషలో ఊసులాడుకుంటాయని పరిశోధన సూచిస్తోంది. పుట్టగొడుగులు ఇరుగుపొరుగుతో సంభాషించేందుకు వాక్యాలను కూడా వాడతాయని పేర్కొంది. ప్రతి బహుకణ జీవిలో కూడా సమాచార ప్రసారానికి నాడులు కారణం. ఇవి విడుదల చేసే ఎలక్ట్రిక్ తరంగాల ఆధారంగానే జీవజాలంలో ప్రసారం సాధ్యమవుతోంది. ఫంగస్‌లో కూడా ఇలాంటి నాడులుంటాయి. వీటిని హైఫే అంటారు. ఒక ఫంగల్ కాలనీలోని జీవులన్నింటి హైఫేలన్నీ కలిసి భూమి ఉపరితలం దిగువన ఒక వలలాంటి నిర్మాణం (మైసీలియం)ను ఏర్పాటు చేస్తాయి. ఈ వల ద్వారా మొత్తం కాలనీకి సమాచారం అందుతుంది. ఈ నెట్‌వర్క్‌ను జీవుల్లోని నాడీ వ్యవస్థతో పోల్చవచ్చు.
ఇలా కనుగొన్నారు
చిన్న చిన్న ఎలక్ట్రోడులను ఉపయోగించి నాలుగు ప్రజాతుల ఫంగస్ మైసీలియంలు విడుదల చేసే విద్యుత్ ప్రేరణలను ఆండ్రూ రికార్డు చేశారు. వీటిని పరిశీలిస్తే ప్రతి ప్రేరణ తరంగధైర్ఘ్యం, తరచుదనం, కాలపరిమితి వేరేగా ఉన్నట్లు తెలిసింది. ఈ ప్రేరణల నమూనాలను గణిత సూత్రాల ఆధారంగా విశ్లేషిస్తే అవి మానవ ప్రసంగ నమూనా(ప్యాటర్న్)తో పోలినట్లు గుర్తించారు. ఫంగస్‌ల భాషలో దాదాపు 50 వరకు పదాలు వివిధ వాక్యాల రూపంలో పేర్చడం గమనించినట్లు ఆండ్రూ చెప్పారు.
ఒక్కో ఫంగస్ ప్రజాతిలో ఒక్కో రకమైన భాష వాడుకలో ఉందని, షైజోఫైలమ్ కమ్యూనే అనే ప్రజాతి అత్యంత క్లిష్టమైన భాషను వాడుతోందని తెలిపారు. దగ్గరలోని ఆహార లభ్యత, ప్రమాద హెచ్చరికలు, నష్టం కలిగించే అంశాల గురించి ఇవి మాట్లాడుకుంటాయని అంచనా వేశారు. ఫంగస్‌లు భూమిలోపల అంతర్గత నెట్‌వర్క్‌తో సమాచార ప్రసారం చేస్తాయని గతంలోనే అంచనాలున్నాయి. తాజా పరిశోధనతో ఈ సమాచార ప్రసారం ఆషామాషీగా జరగదని, మానవుల్లో జరిగినంత పకడ్బందీగా జరుగుతుందని తెలిసింది. ఫంగస్‌ల తెలివితేటలు, చేతనపై మరిన్ని పరిశోధనలకు తాజా సమాచారం ఉపయోగపడనుంది. సో, ఇకపై పుట్టగొడుగులు తినేముందు అవి ఏం చెబుతున్నాయో తెలుసుకోండి!
Comments
Please login to add a commentAdd a comment