సాక్షి, హైదరాబాద్: పురుగులు, కీటకాలను నివారించేందుకు, మరెన్నో సమస్యలకు మందుగా వాడే వేప చెట్లను.. ఓ చిన్న కీటకం, మూడు శిలీంద్రాలు ముప్పుతిప్పలు పెడుతున్నాయి. చెట్లను నిలువునా మాడ్చేస్తున్నాయి. గత ఏడాది సెప్టెంబర్ నుంచి ఏ ఊళ్లో చూసినా వేపచెట్ల కొమ్మలు ఎండిపోతున్నాయి. అప్పటివరకు బాగున్న చెట్లు కూడా.. చిగుళ్లు, ఆకులు, కొమ్మలు వరుసగా ఎండిపోయి నిట్టనిలువుగా మాడిపోయినట్టు కనిపిస్తున్నాయి. దీనిపై ఫిర్యాదులు రావడంతో.. వ్యవసాయ విశ్వవిద్యాలయం రంగంలోకి దిగింది.
వర్సిటీ పరిశోధన విభాగం సంచాలకుడు జగదీశ్వర్ ఆధ్వర్యంలో నిపుణులు టి.కిరణ్‌బాబు, జి.ఉమాదేవి, ఎన్.రామ్‌గోపాల్‌వర్మల బృందం రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వేపకొమ్మలు సేకరించి పరిశీలించింది. తెగులు సోకిన భాగాలను ల్యాబ్‌లో పరీక్షించి సమస్యకు కారణాలను గుర్తించింది. వేపచెట్లను కాపాడే చర్యలపై ప్రభుత్వానికి పలు సూచనలు చేసింది. కానీ ప్రభుత్వ పరంగా చర్యలేమీ లేకపోవటంతో రోజురోజుకు వేప చెట్లు మాడిపోతూనే ఉన్నాయి.
కీటకం కొరికి.. శిలీంద్రాలు (ఫంగస్) ఆశించి..
వేపకొమ్మల చివరిభాగంలో టిమస్కిటో బగ్ అన్న కీటకం కొరికి రసాన్ని పీల్చడంతో ఈ సమస్య మొదలైందని పరిశోధకులు గుర్తించారు. ఈ కీటకాలు ముందునుంచే ఉన్నా.. దానికితోడుగా కొన్నిరకాల శిలీంద్రాలు వ్యాపించడంతో సమస్య ముదిరిందని తేల్చారు. వేపచెట్లపై టిమస్కిటో బగ్ కొరికేసి రసం పీల్చడంతో ఆ ప్రాంతంలోని చిగుళ్లు ఎండిపోవటం మొదలవుతోంది. అదేచోట కొన్నిరకాల శిలీంద్రాలు పాగా వేసి.. మెల్లగా విస్తరిస్తూ చెట్టు నిలువునా మాడిపోయేలా చేస్తున్నాయి. ఇందులో ‘ఫోమోప్సిస్ అజాడిరెక్టే’ అన్న శిలీంద్రం తీవ్ర విధ్వంసానికి కారణమవుతోందని గుర్తించారు.
వ్యవసాయ వర్సిటీ పరిశోధన బృందం చేసిన కల్చర్ టెస్టుల్లో మూడొంతులకుపైగా ఈ శిలీంద్రమే కనిపించింది. ఆ తర్వాత ఫ్యుజేరియం, కర్వులేరియా అనే ఫంగస్‌లు ప్రభావం చూపుతున్నట్టు తేలింది. ఇవి కాకుండా మరో ఏడెనిమిది రకాల ఫంగస్‌లు కనిపించినా.. అవి నామమాత్రంగానే ఉన్నట్టు పరిశోధకులు చెప్పారు. వేప చెట్ల కొమ్మలపై కనిపిస్తున్న జిగురు మచ్చలు ఈ ఫంగస్‌ల వల్ల
ఏర్పడినవేనని తెలిపారు.
వాడాల్సిన కీటకనాశనులివీ..
కీటకాలను నిర్మూలించేందుకు.. ప్రతి లీటర్ నీటిలో థయోమెథాక్సమ్ 0.2 గ్రాములు, అసిటామిప్రిడ్ 0.2 గ్రాముల చొప్పున కలిపి చెట్లపై పిచికారీ చేయాలి.
శిలీంద్రాల తెగులును నాశనం చేసేందుకు కార్బండాజిమ్, మ్యాంకోజెబ్‌ల మిశ్రమాన్ని ప్రతి లీటర్‌కు 2.5 గ్రాముల చొప్పున కలిపి చెట్లపై పిచికారీ చేయాలి.
ఆ వేపపుల్లలు వాడొచ్చు
శిలీంద్రాలు ఆశించిన వేప చెట్లు ఎండిపోతున్న నేపథ్యంలో.. చాలాచోట్ల వేపపుల్లలతో పళ్లు తోముకునేందుకు జనం జంకుతున్నారు. అయితే వాటి నుంచి మనుషుల ఆరోగ్యానికి ప్రమాదమేమీ లేదని, మాడినంత మేర తొలగించి మిగతా పుల్లలతో పళ్లు తోముకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
జామ చెట్లపైనా ప్రభావం
ఈ శిలీంద్రాలు వేపకే పరిమితం కాకుండా కొన్ని ఇతర రకాల చెట్లపైనా కనిపిస్తున్నట్టు నిపుణులు తాజాగా గుర్తించారు. కొన్ని ప్రాంతాల్లో జామకాయలపై పెద్దపెద్ద మచ్చలు ఏర్పడుతున్నాయన్న ఫిర్యాదులు వచ్చాయని.. వాటిని పరిశీలించగా ఈ శిలీంద్రాల ప్రభావమేనని తేలిందని అనురాగ్ విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. ప్రస్తుతం జామకాయలపైనే ఈ సమస్య ఉందని, ఆ చెట్లపై ఇంకా ప్రభావం కనిపించలేదని పేర్కొన్నారు. మరోవైపు కానుగ చెట్లకు కూడా ఈ సమస్య వస్తోందని ఏజీ వర్సిటీ నిపుణులు చెప్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment