reaserch
-
ఔషధ పరిశోధన రంగం వృద్ధికి సూచనలు
దేశీయంగా ఫార్మాస్యూటికల్ పరిశోధన, అభివృద్ధి భవిష్యత్‌ను నిర్ణయించడంలో కీలక పాత్ర పోషిస్తాయని డెలాయిట్, అసోచామ్ సంయుక్త నివేదిక తెలిపింది. ఈ దిశగా అనుమతుల ప్రక్రియను సులభతరం చేయడం, మేధో సంపత్తి (ఐపీ) హక్కులను కాపాడడం, ఆవిష్కరణలను ప్రోత్సాహించడం కీలకమని పేర్కొంది. ఫార్మాస్యూటికల్స్ పరిశ్రమలో పరిశోధన, అభివృద్ధి (ఆర్అండ్డీ)కి ఇప్పటికీ విధానపరమైన సవాళ్లు నెలకొంటున్నట్లు తెలిపింది. నియంత్రణ కార్యాచరణను ఆధునికీకరించడం, అంతర్జాతీయ నియంత్రణ సంస్థలతో భారత ఫార్మా రంగం సమన్వయం చేసుకుంటుందని నివేదిక తెలిపింది. అయితే ఈ రంగం మరింత వృద్ధి చెందేందుకు ప్రస్తుతం ఎదురవుతున్న సవాళ్లను అధిగమించాలని సూచించింది.నివేదికలోని వివరాల ప్రకారం..ఔషధ నియంత్రణల పరంగా అత్యాధునిక పరీక్షా కేంద్రాల కొరత ఉంది. తయారీ యూనిట్లలో క్వాలిటీ నిబంధనల అమలును పర్యవేక్షించేందుకు బలమైన కార్యాచరణ లేదు. దాంతో ఫార్మాస్యూటికల్ పరిశోధన, అభివృద్ధి (ఆర్అండ్డీ) వెనకబడుతోంది. ఏకరూప నియంత్రణ నిబంధనలు అమలు చేసేందుకు కేంద్రం, రాష్ట్రాల మధ్య సమన్వయానికి అవకాశాలున్నాయి. ఇప్పటికే ఉన్న వివిధ నియంత్రణ సంస్థల మధ్య సమన్వయలోపం ఉంది. పాలనా పరమైన సమస్యల వల్ల ఔషధాలు, క్లినికల్ ట్రయల్స్ అనుమతులకు అదనపు సమయం అవసరమవుతుంది. ఫలితంగా అత్యున్నత నాణ్యతతో కూడిన క్లినికల్ పరిశోధనలకు భారత్ ఆకర్షణీయ కేంద్రంగా నిలవలేకపోతుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో పోల్చి చూస్తే నిబంధనల అమలుకు భారత్‌లో అధికంగా ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇది సూక్ష్మ, చిన్న ఫార్మాస్యూటికల్ సంస్థలకు భారంగా మారుతుంది.ఇదీ చదవండి: వాటర్ బాటిల్ ధర తగ్గనుందా..?అంతర్జాతీయంగా ఫార్మాస్యూటికల్ ఆర్అండ్డీలో భారత్‌ను మెరుగైన స్థానంలో నిలిపేందుకు స్పష్టమైన నియంత్రణలు, సరళీకృత ప్రక్రియలు అవసరమని ఈ నివేదిక సూచించింది. అందుకోసం ప్రభుత్వ ప్రోత్సాహం అవసరమని అభిప్రాయపడింది. అత్యాధునిక పరిశోధనా కేంద్రాల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సాయం అందించాలని తెలిపింది. ప్రభుత్వం, విద్యా సంస్థలు కలసి ఫార్మాస్యూటికల్ పరిశ్రమకు ప్రత్యేక కోర్సులు రూపొందించాలని సూచించింది. -
చేదు వేపకు.. చెడ్డ రోగం!
సాక్షి, హైదరాబాద్: పురుగులు, కీటకాలను నివారించేందుకు, మరెన్నో సమస్యలకు మందుగా వాడే వేప చెట్లను.. ఓ చిన్న కీటకం, మూడు శిలీంద్రాలు ముప్పుతిప్పలు పెడుతున్నాయి. చెట్లను నిలువునా మాడ్చేస్తున్నాయి. గత ఏడాది సెప్టెంబర్ నుంచి ఏ ఊళ్లో చూసినా వేపచెట్ల కొమ్మలు ఎండిపోతున్నాయి. అప్పటివరకు బాగున్న చెట్లు కూడా.. చిగుళ్లు, ఆకులు, కొమ్మలు వరుసగా ఎండిపోయి నిట్టనిలువుగా మాడిపోయినట్టు కనిపిస్తున్నాయి. దీనిపై ఫిర్యాదులు రావడంతో.. వ్యవసాయ విశ్వవిద్యాలయం రంగంలోకి దిగింది. వర్సిటీ పరిశోధన విభాగం సంచాలకుడు జగదీశ్వర్ ఆధ్వర్యంలో నిపుణులు టి.కిరణ్‌బాబు, జి.ఉమాదేవి, ఎన్.రామ్‌గోపాల్‌వర్మల బృందం రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వేపకొమ్మలు సేకరించి పరిశీలించింది. తెగులు సోకిన భాగాలను ల్యాబ్‌లో పరీక్షించి సమస్యకు కారణాలను గుర్తించింది. వేపచెట్లను కాపాడే చర్యలపై ప్రభుత్వానికి పలు సూచనలు చేసింది. కానీ ప్రభుత్వ పరంగా చర్యలేమీ లేకపోవటంతో రోజురోజుకు వేప చెట్లు మాడిపోతూనే ఉన్నాయి. కీటకం కొరికి.. శిలీంద్రాలు (ఫంగస్) ఆశించి.. వేపకొమ్మల చివరిభాగంలో టిమస్కిటో బగ్ అన్న కీటకం కొరికి రసాన్ని పీల్చడంతో ఈ సమస్య మొదలైందని పరిశోధకులు గుర్తించారు. ఈ కీటకాలు ముందునుంచే ఉన్నా.. దానికితోడుగా కొన్నిరకాల శిలీంద్రాలు వ్యాపించడంతో సమస్య ముదిరిందని తేల్చారు. వేపచెట్లపై టిమస్కిటో బగ్ కొరికేసి రసం పీల్చడంతో ఆ ప్రాంతంలోని చిగుళ్లు ఎండిపోవటం మొదలవుతోంది. అదేచోట కొన్నిరకాల శిలీంద్రాలు పాగా వేసి.. మెల్లగా విస్తరిస్తూ చెట్టు నిలువునా మాడిపోయేలా చేస్తున్నాయి. ఇందులో ‘ఫోమోప్సిస్ అజాడిరెక్టే’ అన్న శిలీంద్రం తీవ్ర విధ్వంసానికి కారణమవుతోందని గుర్తించారు. వ్యవసాయ వర్సిటీ పరిశోధన బృందం చేసిన కల్చర్ టెస్టుల్లో మూడొంతులకుపైగా ఈ శిలీంద్రమే కనిపించింది. ఆ తర్వాత ఫ్యుజేరియం, కర్వులేరియా అనే ఫంగస్‌లు ప్రభావం చూపుతున్నట్టు తేలింది. ఇవి కాకుండా మరో ఏడెనిమిది రకాల ఫంగస్‌లు కనిపించినా.. అవి నామమాత్రంగానే ఉన్నట్టు పరిశోధకులు చెప్పారు. వేప చెట్ల కొమ్మలపై కనిపిస్తున్న జిగురు మచ్చలు ఈ ఫంగస్ల వల్ల ఏర్పడినవేనని తెలిపారు. వాడాల్సిన కీటకనాశనులివీ.. కీటకాలను నిర్మూలించేందుకు.. ప్రతి లీటర్ నీటిలో థయోమెథాక్సమ్ 0.2 గ్రాములు, అసిటామిప్రిడ్ 0.2 గ్రాముల చొప్పున కలిపి చెట్లపై పిచికారీ చేయాలి. శిలీంద్రాల తెగులును నాశనం చేసేందుకు కార్బండాజిమ్, మ్యాంకోజెబ్‌ల మిశ్రమాన్ని ప్రతి లీటర్‌కు 2.5 గ్రాముల చొప్పున కలిపి చెట్లపై పిచికారీ చేయాలి. ఆ వేపపుల్లలు వాడొచ్చు శిలీంద్రాలు ఆశించిన వేప చెట్లు ఎండిపోతున్న నేపథ్యంలో.. చాలాచోట్ల వేపపుల్లలతో పళ్లు తోముకునేందుకు జనం జంకుతున్నారు. అయితే వాటి నుంచి మనుషుల ఆరోగ్యానికి ప్రమాదమేమీ లేదని, మాడినంత మేర తొలగించి మిగతా పుల్లలతో పళ్లు తోముకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. జామ చెట్లపైనా ప్రభావం ఈ శిలీంద్రాలు వేపకే పరిమితం కాకుండా కొన్ని ఇతర రకాల చెట్లపైనా కనిపిస్తున్నట్టు నిపుణులు తాజాగా గుర్తించారు. కొన్ని ప్రాంతాల్లో జామకాయలపై పెద్దపెద్ద మచ్చలు ఏర్పడుతున్నాయన్న ఫిర్యాదులు వచ్చాయని.. వాటిని పరిశీలించగా ఈ శిలీంద్రాల ప్రభావమేనని తేలిందని అనురాగ్ విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. ప్రస్తుతం జామకాయలపైనే ఈ సమస్య ఉందని, ఆ చెట్లపై ఇంకా ప్రభావం కనిపించలేదని పేర్కొన్నారు. మరోవైపు కానుగ చెట్లకు కూడా ఈ సమస్య వస్తోందని ఏజీ వర్సిటీ నిపుణులు చెప్తున్నారు. -
కరోనా ఎఫెక్ట్: 14కోట్ల ఉద్యోగాలపై వేటు
ముంబై: కరోనా వైరస్ ఉదృతి వల్ల 14కోట్ల70లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారని సిడ్నికి చెందిన 'ప్లోస్ వన్' అనే రీసెర్చ్ సంస్థ నివేదిక తెలిపింది. అదేవిధంగా కరోనా వైరస్ కారణంగా అంతర్జాతీయంగా 3.8ట్రిలియన్ల ఉత్పత్తిని కంపెనీ యాజమాన్యాలు నష్టపోయారని నివేదిక పేర్కొంది. అయితే తమ సర్వేలో తయారీ రంగం, పర్యాటక రంగం, రవాణా రంగాలు తీవ్రంగా నష్టపోయినట్లు సిడ్నీ యూనివర్సిటీకి చెందిన అరుణిమా మాలికా తెలిపారు. మరోవైపు ఉత్పత్తికి అంతరాయం కలగడం వల్ల 2.1ట్రిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఉద్యోగులు నష్టపోయినట్లు పేర్కొంది. ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో ఉద్యోగాలు కోల్పోయినట్లు నివేదిక పేర్కొంది. అయితే కరోనా కారణంగా ప్రజలు రవాణాకు దూరంగా ఉండడం వల్ల వాతావరణ కాలుష్యం తగ్గినట్లు నివేదిక తెలిపింది. కరోనాను నివారించేందుకు ప్రభుత్వాలు పరష్కార మార్గాలను ఆలోచించాలని సర్వే ప్రతినిధులు పేర్కొన్నారు.కాగా కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు లాక్‌డౌన్‌ను విధించడం వల్ల ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొందని ఆర్థిక నిపుణులు విశ్లేషించారు. (చదవండి: కరోనా వల్ల మహిళలకే ఎక్కువ సమస్యలు: యూఎన్) -
టీకా ఎవరిదైనా మన పాత్ర ఉండాల్సిందే!
ముంబై: కరోనా వైరస్ కట్టిడికి ప్రపంచ వ్యాప్తంగా టీకాను కనుగొనడానికి అన్ని దేశాలు పోటీ పడుతున్నాయి. ఈ క్రమంలో ఎవరు ఏ ఫార్ములాతో కనుగొన్న మన దేశ దిగ్గజ సంస్థ సీరం ఇన్స్టిట్యూట్ పాత్ర ఉండాల్సిందే. ప్రపంచంలోనే భారీ స్థాయిలో వ్యాక్సిన్ ఉత్పత్తి చేసే సత్తా సీరమ్ సంస్థకు ఉంది. ప్రస్తుతం ఆక్స్ఫర్డ్ వర్సిటీ తయారుచేస్తున్న కరోనా వ్యాక్సిన్ తయారీలో సీరం సంస్థ భాగస్వామ్యం ఉంది. సీరమ్ సంస్థ ప్రయోగాలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ముఖ్య సాంకేతిక సలహాదారు కె విజయ్‌రాఘవన్ నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. సీరమ్ సంస్థ వ్యాక్సిన్ ఉత్పత్తే లక్ష్యంగా 1966 సంవత్సరం పూణెలో నెలకోల్పిన విషయం తెలిసిందే. వ్యాక్సిన్ ప్రయోగాలకు కావాల్సిన అన్ని సదుపాయాలను సీరం సంస్థకు కల్పిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. సంస్థ చేస్తున్న ప్రయోగాలను ఉమేష్ శాలిగ్రామ్ అనే సీనియర్ శాస్త్రవేత్త పర్యవేక్షిస్తున్నారు. వ్యాక్సిన్ ప్రయోగ పురోగతిని ప్రభుత్వానికి నివేదిస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. తమ సంస్థ కేవలం కరోనా నియంత్రణకు మాత్రమే కాకుండా రాబోయే వైరస్‌లను ఊహించి అందుకనుగుణంగా నూతన వ్యాక్సిన్ల ఉత్పత్తి కూడా చేయనున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. చదవండి: సెప్టెంబర్ నాటికి మూడుకోట్ల డోస్‌లు! -
‘ఏఐ’ రంగంలోనూ లింగ వివక్షతనా ?
సాక్షి, న్యూఢిల్లీ : ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)’ అంటే కత్రిమ మేధస్సు దినదినం అభివద్ధి చెందుతూ ఎక్కడికో పోతోంది. ‘గో’ లాంటి గేముల్లో మానవ ప్రపంచ ఛాంపియన్లను సైతం ఓడించి మానవ శరీరంలోని క్యాన్సర్ కణతులను మెడికల్ స్కాన్ ద్వారా రేడియోలాజిస్టులకన్నా అద్భుతంగా గుర్తిస్తూ సాంకేతిక పరిజ్ఞానాన్ని మరెక్కడికో తీసుకెళుతున్న కత్రిమ మేధస్సులో ఓ లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. స్టీమ్ ఇంజన్, ఎలక్ట్రిసిటీ, రేడియోలతో కత్రిమ మేధస్సును ఆర్థిక వేత్తలు అభివర్ణిస్తున్న సమయంలో ఇందులో లింగ వివక్ష కనిపిస్తోంది. సమష్టి నిర్ణయంతో కత్రిమ మేధస్సుకు సజనాత్మకతను తీసుకరావాల్సిన సమయంలో లింగ వివక్ష వల్ల ఈ రంగంలోకి మహిళలను ఎక్కువగా ఆహ్వానించక పోవడం వల్ల భవిష్యత్‌లో అనూహ్య ముప్పును ఎదుర్కొనాల్సి రావచ్చు. ఇప్పటికీ ‘అమెజాన్ ఈ కామర్స్’ కంపెనీ ద్వారా మహిళలకు ముప్పు వాటిల్లుతోంది. ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న మహిళలను అమెజాన్ కంప్యూటర్లు పేర్ల ద్వారా గుర్తుపట్టి ఏరివేస్తోంది. ఏఐ సదస్సులో పాల్గొంటున్న పరిశోధకుల్లో మహిళలు 20 శాతం కన్నా తక్కువగా ఉంటున్నారు. బర్కిలోని కాలిఫోర్నియా యూనివర్శిటీలో చదువున్న ఏఐ మహిళా అండర్ గ్రాడ్యువేట్లలో నాలుగు వంత మాత్రమే పరిశోధనల్లో పొల్గొంటున్నారు. 1990 దశకం నుంచి కత్రిమ మేధస్సు రంగంలో మహిళల ప్రాతినిధ్య శాతం ఏమాత్రం పెరగలేదు. అయితే నెదర్లాండ్స్, నార్వే, డెన్మార్క్ దేశాల ఏఐ రంగంలో మహిళల ప్రాతినిధ్యం కొంచెం ఎక్కువగా ఉండగా, జపాన్, సింగపూర్ దేశాల్లో మహిళల ప్రాతినిధ్యం మరీ తక్కువగా ఉంది. శాస్త్ర విజ్ఞానం, సాంకేతిక రంగం, ఇంజనీరింగ్, మ్యాథమేటిక్స్ రంగాల్లో లింగ వైవిధ్యం లేకపోతే సమగ్ర ప్రగతి అసాధ్యం. కత్రిమ మేథస్సు రంగం ప్రశ్న పత్రాల రూపకల్పనలో కూడా మహిళల పాత్ర చాలా తక్కువగా ఉంటుంది. దానివల్ల ప్రశ్న పత్రాల్లో వైవిధ్యం కనిపించదు. వైవిద్యం ఉన్నప్పుడే పురోగతి, ప్రయోజనం ఎక్కువగా ఉంటుంది. ఏఐ రంగంలో వైవిధ్యతను పెంచేందుకు, అంటే మహిళలను ప్రోత్సహించేందుకు కేంద్రం 117 కోట్ల రూపాయలను కేటాయించినప్పటికీ మహిళల ప్రాధాన్యత పెరగక పోవడం శోచనీయం. నేడు మీడియాకు నకిలీ వార్తలు ముప్పుతెస్తున్నట్లే లింగ వివక్ష కారణంగా ఏఐ రంగానికి ముప్పు రావచ్చు. -
మగవారికన్నా మహిళలేమి బెటర్ కాదు!
సాక్షి, న్యూఢిల్లీ : ఇంట్లో వంటావార్పు చేస్తూ పిల్లల ఆలనా పాలనా చూసుకుంటూ భర్తకు టిఫిన్ పెట్టి, లంచ్ బాక్స్ సర్ది ఆఫీసుకు పంపించడమే కాకుండా తాను ఓ ఆఫీసుకెళ్లి పనిచేస్తున్న ఆడవాళ్లను అరుదుగానైనా చూస్తూనే ఉన్నాం. అది వారికున్న ప్రత్యేక నైపుణ్యమని, ఏకకాలంలో విభిన్న పనులు చేసే సామర్థ్యం ఆ దేవుడు వారికి ఇచ్చిన వరమంటూ పురుష పుంగవులు ప్రశంసించిన సందర్భాలను వినే ఉంటాం. అయితే అదంతా ఓ ట్రాష్ అని ‘ప్లాస్ వన్’ అనే ఆంగ్ల వెబ్సైట్ ప్రచురించిన ఓ సర్వే తెలియజేసింది. ఏకకాలంలో అనేక పనులు చేస్తే.. చేసే అసలు పనిపై మగవాళ్లకు దృష్టి తగ్గినట్లే ఆడవాళ్లకు కూడా దృష్టి తగ్గుతుందని, ఏకకాలంలో బహు పనులు చేసే సామర్థ్యం ఆడవాళ్ల మెదళ్లకు లేదని, ఈ విషయంలో ఇరువురి మెదళ్ల మధ్య ఎలాంటి తేడా లేదని సర్వే తేల్చి చెప్పింది. వాస్తవానికి రెండు పనులు, ముఖ్యంగా ఒకే రకమైన పనులు ఏకకాలంలో చేయడానికి మానవ మెదడు పనిచేయదని సర్వే తెలిపింది. అయితే ఒక పని మీది నుంచి మరో పనిపైకి దృష్టిని వేగంగా మళ్లించేందుకు స్త్రీ, పురుష లింగ భేదం లేకుండా మానవ మెదడు వేగంగా పనిచేస్తుందని కూడా సర్వే కనుక్కొంది. జర్మనీకి చెందిన పరిశోధకుల బృందం 43 మంది పురుషులను, అంతే సంఖ్యలో మహిళలను ఎంపిక చేసి వారికి సంఖ్యలు, అంకెలను విశ్లేషించే పరీక్షలు నిర్వహించింది. ఒకే సమయంలో ఒక పనిని, ఒకే సమయంలో రెండు రకాల పనులు అప్పగించి చూశారు. స్త్రీ, పురుషుల మధ్య తేడా లేకుండా ఒకే రకమైన ఫలితాలు వచ్చాయి. ఏకకాలంలో ఒక పనిపైనే దృష్టి పెట్టినప్పుడు మాత్రమే ఆ పనికి సంబంధించిన ఫలితాలు బాగున్నాయి. ఏకకాలంలో రెండు పనులు చేసినప్పుడు వాటి ఫలితాల మధ్య తేడాలు కనిపించాయి. ఇంటి పనులు చేయడంలో ఆడవాళ్లదే పైచేయని, మగవారి కంటే ఇంటిని శుభ్రంగా ఉంచే సామర్థ్యం వారికే ఉందన్నది కూడా భ్రమేనని సర్వే తెలిపింది. కాకపోతే ఆడవాళ్లు శుభ్రానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారట. మిగతా దేశాల్లో కన్నా ఆస్ట్రేలియాలో మగవాళ్లు వంట కోసం ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నారట. పిల్లల ఆలనాపాలనతోపాటు ఇంటి పనులను ఆడవాళ్లు చూసుకునేలా చేసిందీ మగవాళ్ల ఆధిపత్యమేనని, ఆ సామర్థ్యం వారికే ఉందడనం వారిని మభ్య పెట్టడానికేనని సర్వే తేల్చి చెప్పింది. పర్యవసానంగా ప్రపంచవ్యాప్తంగా మహిళలే ఎక్కువ కష్టపడుతున్నారు. -
పెద్ద వయసు డాడీ.. పెను సమస్యల దాడి
మగాడికేముంది? ఏ వయసులోనైనా పెళ్లి చేసుకుని పిల్లల్ని కనొచ్చు. కానీ మహిళలకు అలా కాదు కదా.. సమాజంలో పేరుకుపోయిన ఓ అభిప్రాయం ఇది. శరీర నిర్మాణ వైవిధ్యాలు కూడా దీనికి అనుగుణంగా ఉండడంతో ఇది అంతకంతకూ బలపడుతూ వచ్చింది. అయితే పెద్ద వయసులో తండ్రి కావడం వల్ల మగవాళ్లకు కాకపోయినా అలా పుట్టే పిల్లలకు రకరకాల సమస్యలు తప్పవని హెచ్చరిస్తోంది ఓ సర్వే. తగిన వయసులో పెళ్లి, పిల్లల్ని కనడం అవసరమని సూచిస్తోంది. సాక్షి, సిటీబ్యూరో : కేరీర్, ఆర్థిక భద్రత కోసం.. నలభై ఏళ్లకు కాస్త అటూ ఇటూగా వయసు ఉండే మగవాళ్ల చేతుల్లో నెలల పసికూనలు.. కనపడడం ఇప్పుడు నగరంలో సర్వసాధారణం. రకరకాల కారణాలు పెళ్లిని, ఆ తర్వాత సంతాన భాగ్యానికి అడ్డుతగులుతున్నాయి. ఎంచుకున్న కెరీర్‌కు అనుగుణంగా చదివే చదువులు పూర్తయ్యేటప్పటికి కనీసం పాతికేళ్లు నిండుతున్నాయి. ఆ తర్వాత ఉద్యోగమో, మరో రంగంలోనో స్థిరపడేటప్పటికి మరో ఐదేళ్లు, ఇల్లు, తగినంత ఆర్థిక భద్రత కోసం మరో నాలుగైదేళ్లు.. ఇలా ప్రస్తుతం మగవాళ్లు పెళ్లి చేసుకునే వయసు అటూ ఇటుగా 35 ఏళ్లకు చేరింది. ఆ తర్వాత వీళ్లకి సంతానం కలిగేసరికి మధ్యవయసు వస్తోంది. గుండెలపై చిన్నారి పాదాలు నృత్యం చేయడం, కన్నబిడ్డ చేత నాన్నా అని పిలిపించుకోవడం.. పురుషులకి ఓ మధురానుభూతి. పితృత్వపు ఆనందం సంపూర్ణంగా పొందాలంటే తగిన వయసులోనే పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి లేని పక్షంలో ఎదురయ్యే సమస్యలు ఆ అనుభూతిని హరించివేసే ప్రమాదం ఉంది. దీనిపై నగరంలోని ఇందిరా ఐవీఎఫ్ సెంటర్‌కు చెందిన ఐవీఎఫ్ స్పెషలిస్ట్, గైనకాలజిస్ట్ డాక్టర్ స్వాతి మోతె చెప్పిన విశేషాలివీ.. పిల్లల ఆరోగ్యంపై ప్రభావం.. మహిళల్లో పెద్ద వయసు కారణంగా సంతాన ప్రాప్తికి అవసరమైన పునరుత్పత్తి వ్యవస్థ బలహీనపడడం, మోనోపాజ్ సమీపించే ప్రమాదాలు ఉంటాయి. మగవాళ్లలో అలాంటి సమస్య ఉండదని భావిస్తారు. ఈ తరహా ఆలోచనలతో పెద్ద వయసు తండ్రులకు పిల్లలు జన్మించడం అనేది ఒకప్పటితో పోలిస్తే బాగా పెరిగింది. ఉదాహరణకు 40 ఏళ్లు దాటిన తర్వాత తండ్రులు కావడం అనేది దశాబ్దాల క్రితం 4శాతం కాగా ఇప్పుడు 10శాతం. మగవాళ్లలో మధ్య వయసు దాటాక సంతానలేమితో పాటు ఒకవేళ పిల్లలు పుట్టినా.. వారు అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి అని అమెరికాలో నిర్వహించిన ఓ పరిశోధన తేల్చింది. సర్వే ‘జననా’.. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ), నేషనల్ సెంటర్ ఫర్ హెల్త్ స్టాటిస్టిక్స్లు నమోదు చేసిన దాదాపు 40 మిలియన్ల జననాల రికార్డ్స్‌ను విశ్లేషించిన తర్వాత స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ పరిశోధకుల బృందం ఈ అంశాలను వెల్లడించింది. గత అక్టోబరు 21న బ్రిటిష్ మెడికల్ జర్నల్‌లో ప్రచురితమైన ఆ పరిశోధనా ఫలితాల ప్రకారం.. తండ్రి వయసు కూడా తల్లీ, పిల్లలపై ప్రతికూల ప్రభావాలకు కారణమవుతోంది. తండ్రి వయసు సగటు 35 ఏళ్ల అయిన పక్షంలో జనన ప్రమాదాల్లో కొద్దిగా హెచ్చుదల ఉంటుందని, వయసు పెరుగుతున్న కొద్దీ ప్రతి పురుషుడి డీఎన్ఎలో జరిగే రెండు నూతన ఉత్పరివర్తనలు జనన శిశువులకు ప్రమాదకరంగా పరిణమిస్తాయి స్పష్టం చేసింది. కనీసం 35ఏళ్లు దాటిన తండ్రులు కన్న బిడ్డల్లో అత్యధికులకు జనన సమయంలో ప్రమాదావకాశాలు హెచ్చుగా ఉంటున్నాయి. అలాగే మధ్య వయసు తండ్రుల పిల్లలు తక్కువ బరువుతో పుడుతున్నారు. అంతేకాదు పుట్టిన వెంటనే వెంటిలేషన్ అవసరం ఏర్పడుతోంది. తండ్రి అయ్యే వయసు మరింత పెరుగుతున్న కొద్దీ పిల్లలకు ప్రమాదావకాశాలు కూడా పెరుగుతున్నాయి. వయసు 35 కన్నా మించిన వయసులో తండ్రి అవుతున్నవారికి నెలలు నిండని పిల్లలు పుట్టే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. వయసు 50 దాటిన తండ్రుల్లో 28 శాతం మందికి పుట్టిన బిడ్డ నియోన్యాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఎన్ఐసీయూ)లో చేరాల్సిన అవసరం ఏర్పడుతోంది. తల్లికీ ముప్పే.. వయసు దాటాక తండ్రి అవుతున్న పురుషుల కారణంగా ఆ బిడ్డలను కన్న తల్లులు సైతం కొన్ని ఆరోగ్య సమస్యలను ఎదుర్కుంటున్నారని పరిశోధన వెల్లడించింది. తండ్రి వయసు ప్రభావం తల్లి గర్భధారణపై రకరకాలుగా ఉంటుంది. ఇలాంటి తల్లులకు ప్రసూతి సమయంలో మధుమేహంవచ్చే అవకాశాలు ఉన్నాయి. తగిన వయసులోనే మేలు.. తగిన వయసులో పెళ్లి చేసుకుని పిల్లలను కనడం మంచిది. వీలైనంత వరకూ పెళ్లయిన తర్వాత ఎక్కువ కాలం పిల్లలను వాయిదా వేయకపోవడం అవసరం. వయసు మీరాక పెళ్లి– పిల్లలు అనే పరిస్థితి నుంచి పుట్టే సమస్యలపై ప్రస్తుత తరంలో అవగాహన పెరగాల్సి ఉంది. – డాక్టర్ స్వాతి మోతె -
కేన్సర్ మళ్లీరాకుండా చేయవచ్చు!
చికిత్స చేసిన తరువాత కూడా కేన్సర్ మళ్లీమళ్లీ తిరగబెడుతుంది ఎందుకు? కేన్సర్ మందులు కొందరికి పనిచేస్తాయి. ఇంకొందరికి చేయవు. ఎందుకు? కేన్సర్ కణితిలోని మూలకణాలు కొన్నిసార్లు నిద్రాణంగా, మరికొన్ని సార్లు చురుకుగా ప్రవర్తించడం వల్ల ఇలా జరుగుతూంటుంది. వీటిని తొలగించగలిగితే కేన్సర్‌కు చెక్ పెట్టడమూ సాధ్యమే. అచ్చంగా ఈ ఘనతనే సాదించారు మిషిగన్ యూనివర్శిటీలోని రోజెల్ కేన్సర్ సెంటర్ శాస్త్రవేత్తలు. నిద్రాణంగా ఉన్నప్పుడు ఈ మూలకణాలు గ్లూకోజ్ ద్వారా, చైతన్యవంతంగా ఉన్నప్పుడు ఆక్సిజన్ ద్వారా శక్తిని పొందుతూంటాయని గుర్తించిన శాస్త్రవేత్తలు ఈ రెండు మార్గాలను అడ్డుకోవడం ద్వారా కేన్సర్ మూలకణాలను నాశనం చేయగలిగారు. కీళ్లనొప్పులకు వాడే ఓ మందుతో మైటోకాండ్రియా (కణాలకు శక్తిని తయారు చేసే భాగం) పనితీరును అడ్డుకోవడంతో పాటు, ఆక్సిజన్ కూడా అందకుండా చేసినప్పుడు మూలకణాలు నాశనమై పోయాయి. కణాలను విషాలతో చంపేందుకు బదులుగా తాము జీవక్రియలను ఉపయోగించామని, తద్వారా కేన్సర్ కణం తనంతట తానే చనిపోయే పరిస్థితి కల్పించామని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త విచా మేడలైన్, సిడ్నీ ఫోర్బ్స్‌లు తెలిపారు. కేన్సర్ చికిత్సకు ప్రస్తుతం ఉపయోగిస్తున్న ఇమ్యూనోథెరపీకి, ఈ మూలకణ చికిత్సను జోడిస్తే మెరుగైన చికిత్స కల్పించడంతోపాటు కేన్సర్ తిరగబెట్టకుండా చూడవచ్చునని వీరు అంటున్నారు. -
సెలవు దినాల్లోనూ పని.. కారణమేంటంటే?
సాక్షి, న్యూఢిల్లీ : ఎంత తక్కువ పని గంటలుండి, అంత ఎక్కువ జీతమిస్తే ఆనందపడే వారు ఎందరుంటారోగానీ తక్కువ పని గంటలుండి ఎక్కువ సెలవులుంటే ఆనంద పడేవారు ఎక్కువే ఉంటారు. ఒకప్పుడు ఫ్యాక్టరీలలో 15, 18 గంటలు పని చేయించుకునేవారు. శారీరకంగా, మానసికంగా అన్ని గంటలు పనిచేయడం కష్టమవడంతో అమెరికాలో మేడే ఉద్యమం ద్వారా అంతర్జాతీయంగా కార్మికులకు 8 గంటల పని విధానం అమల్లోకి వచ్చింది. రాను, రాను సాంకేతిక పరిజ్ఞానం అభివద్ధి చెందడంతో కొన్ని రంగాల్లో పని దినాలు తగ్గుతూ సెలవు దినాలు పెరుగుతూ వచ్చాయి. కార్మికులు లేదా ఉద్యోగులు మానసికంగా ఉల్లాసంగా ఉన్నప్పుడు ఉత్పత్తి పెరుగుతుందని భావించిన ఐటీ లాంటి కంపెనీలు ఉద్యోగులకు క్రీడల లాంటి అదనపు సౌకర్యాలు కూడా కల్పిస్తూ వచ్చాయి. రానురాను సాంకేతిక పరిజ్ఞానం మరింత పెరగడం వల్ల 2030 సంవత్సరానికి పని గంటలు వారానికి 15 గంటలకు చేరుకుంటుందని జాన్ మేనర్డ్ కీనెస్ వంటి ఆర్థిక వేత్తలు ఆశించారు. ఉద్యోగల నుంచి అధిక దిగుబడిని రాబట్టేందుకు పెట్టుబడుదారులు వారి పని గంటలను తగ్గించి, సెలవుదినాలను పెంచుతారని వారు అంచనా వేశారు. ఎందుకంటే తక్కువ పని వల్ల ఉద్యోగులు ఎక్కువ ఆరోగ్యంతో ఉంటారని వారు భావించారు. ఎక్కువ పని గంటల వల్ల ఎక్కువ మానసిక ఒత్తిడి, శారీరక ఒత్తిడి ఎక్కువై కార్మికులు అస్వస్థులవడం చూసి వారు అలా భావించారు. ఎక్కువ పని ఒత్తిడి వల్ల అనారోగ్యం పాలవడం నిజమేగానీ తక్కువ పని గంటల వల్ల ఆరోగ్యంగా ఉంటారని చెప్పలేం. ఆరోగ్యంపై ఇతర సామాజిక అంశాలు కూడా ప్రభావం చూపుతాయి. ఎక్కువ పని గంటల వల్ల గుండెపోటు వచ్చే అవకాశం కూడా ఎక్కువేనని కూడా అధ్యయనాల్లో తేలింది. ఈ అంశాలను పెద్దగా పట్టించుకోకుండా ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడుదారులు కార్మికుల నుంచి వీలైనంత ఎక్కువ పనిని రాబట్టేందుకే ప్రయత్నిస్తూ వచ్చారు. ఫలితంగా కార్మికులు సెలవుల్లో కూడా పనిచేయడం, అస్వస్థతతో ఉండి కూడా పనిచేయడం ఎక్కువైంది. ఈ అస్వస్థతతో పనిచేసే వారి సంఖ్య 2010 సంవత్సరంలో 26 శాతం ఉండగా, ఇప్పుడు 86 శాతం ఉందని ‘చార్టెట్ ఇనిస్టిట్యూడ్ ఆఫ్ పర్సనల్ అండ్ డెవలప్మెంట్’ అనే సంస్థ వెల్లడించింది. ఆశ్చర్యకరంగా సెలవు దినాల్లో పనిచేసేందకు ఎక్కువ మంది సిద్ధపడుతున్నారని, అందుకు పనిపట్ల ఉన్న అంకిత భావం కాదని, సెలవుల్లో కూడా పనిచేస్తున్నారనే గుర్తింపు కోసమని ఈ సంస్థ ఓ నివేదికలో పేర్కొంది. అయితే ఈ మనస్థత్వం ఎక్కువగా మధ్యతరగతి ఉద్యోగుల్లోనే ఉందని తెలిపింది. పని పట్ల అంకిత భావం ఉన్నట్లు కనపడకపోతే ఉద్యోగం పోతుందనే భయంతో కూడా ఎక్కువ మంది సెలవుల్లో, అనారోగ్యంతో ఉన్నప్పుడు విధులకు హాజరవుతున్నారని తెల్సింది. ఏదేమైనా ఈ పద్ధతి మారక పోతే ఎక్కువ గంటల పని వల్ల అనారోగ్యానికి గురై, మత్యువాత పడక తప్పదని ఆ నివేదిక హెచ్చరించింది. -
శెట్టిగుంట భూములపై సీఎం ఆరా!
కడప అగ్రికల్చర్: రైతులకు ఎంతో ఉపయోగపడే పరిశోధనస్థానం, కళాశాలను శెట్టిగుంట వద్ద ఏర్పాటు చేస్తుంటే అందుకు సహకరించాల్సింది పోయి మోకాలడ్డడం సరికాదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రైల్వేకోడూరుకు చెందిన కొందరు టీడీపీ నేతలకు చురకలు అంటించినట్లు సమాచారం. ‘ప్రభుత్వభూమిపై కన్ను’ శీర్షికన సాక్షిలో ప్రచురితమైన కథనం నేపథ్యంలో రైల్వేకోడూరులోని మరోవర్గం నేతలు సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన సీఎం సదరు నేతలతో నేరుగా మాట్లాడినట్లు తెలిసింది. ‘పరిశోధన స్థానం వల్ల రైతులకు మంచి ఫలితాలు వస్తాయి. వాటిని మనం బేరీజు వేసి ప్రభుత్వం వల్లనే ఉద్యాన రైతులు ఈ ప్రయోజనం పొందుతున్నారని చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది కదా.. పార్టీకి ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. అటువంటప్పుడు ఎందుకు దీన్ని అడ్డుకోవడం’ అని నేతలను ప్రశ్నించినట్లు తెలిసింది. అయితే ఏమి పాలుపోని సదరు నేతలు బిక్కమొహం వేసినట్లు రైల్వేకోడూరు టీడీపీలోని ఒక వర్గం వారు చర్చించుకుంటున్నారు. టీడీపీ నేత తీరును ఆ వర్గం వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రైతులకు ఉపయోగపడే భూములు, స్థలాలను తీసుకోవాలనుకోవడం మంచి పద్ధతి కాదని సీఎం వారించినట్లు తెలిసింది. 2324 సర్వే నంబరులో లెటర్ 1,2,3,4,5లో ఉన్న 40ఎకరాల భూమిని ఉద్యాన పరిశోధన స్థానానికి, కళాశాలకు కేటాయిస్తారో లేదో తెలుసుకుని, దానికి కేటాయించకపోతే పండ్ల రసాల ఫ్యాకరీ పెడుతున్నట్లు పరిశ్రమల శాఖకు దరఖాస్తు చేసుకుని భూమిని ఇవ్వాలని కోరితే ఇప్పిస్తామని సీఎం అన్నట్లు తెలిసింది. పార్టీకి చెడ్డపేరు తీసుకువస్తే ఎంతటి వారినైనా క్షమించేది లేదని సీఎం హెచ్చరించినట్లు పార్టీ కార్యకర్తలు చర్చించుకుంటున్నాయి. -
ఆ విగ్రహంలో బంగారం ఎందుకు లేదు?
కాంచీపురం: కంచి ఏకాంబరనాధర్ ఆలయంలో ఉన్న రాజులకాలం నాటి విగ్రహంలో బంగారం ఎందుకులేదని తెలుసుకోవడం కో సం అధికారులు ఆదివారం ఆలయానికి వచ్చి పరిశోధనలు చేశారు. ఆలయాల నగరంగా పేరొందిన కాంచీపురంలో పురాతన కాలం నాటి ఆలయాల్లో ఏకాంబరనాధర్ స్వామి ఆలయం ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలో ఉత్సవమూర్తి విగ్రహంలో బంగారం లేదని తెలిసింది. దీంతో ఉత్సవ మూర్తి విగ్రహంపై పలు సందేహాలు వెల్లడవుతున్నాయి. అదేవిధంగా కొత్తగా తయారు చేయించిన సోమసుందరం ఉత్సవ మూర్తి విగ్రహం కోసం పొందిన విరాళంలో కూడా అక్రమాలు చోటు చేసుకున్నట్టు ఆరోపణలు వెల్లడైయ్యాయి. రాజుల కాలం నాటి విగ్రహాల్లో బంగారు లేకపోవడం, కొత్త ఉత్సవ మూర్తి విగ్రహం తయారీలో అక్రమాలు వంటి వాటితో భక్తులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఈ స్థితిలో ఆ విగ్రహం ఎన్నేళ్ల కాలం నాటిది, అందులో ఎందుకు బంగారం లేదని తెలుసుకోవడం కోసం విగ్రహాన్ని అక్రమ రవాణా నిరోదక విభాగం ఐ జీ పొన్ మాణిక్యవేల్ అధ్యక్షతన అధికారులు ఆదివారం పరిశీలన చేశా రు. అధికారులు, ఆలయ నిర్వాహకులు, డీఎస్పీ శివశంకర్ ఉన్నారు. -
పర్యాటకులకు ప్రాణాంతకంగా కొడైకెనాల్
టీ.నగర్: కొడైకనాల్‌లో జలవనరులు కలుషితమైనట్లు ఐఐటీ పరిశోధనలో వెల్లడైంది. ఈ ప్రాంతంలో మూతబడిన థర్మామీటర్ పరిశ్రమ నుంచి విడుదలైన పాదరసం వ్యర్థాలు కొడైకెనాల్, పెరియకుళం జల వనరుల్లో కలిసినట్లు హైదరాబాద్‌కు చెందిన సంస్థ దిగ్భ్రాంతి కలిగించే నివేదిక విడుదల చేసింది. దీంతో సదరు కంపెనీలో అధికారులు తనిఖీలు జరిపారు. దిండుగల్ జిల్లా, కొడైకెనాల్లోని థర్మామీటర్ తయారీ కార్మాగారంలో ఉద్యోగులు అస్వస్థతకు గురికావడంతో 2001లో మూతబడింది. ఈ కర్మాగారంలోని పాదరసం వ్యర్థాలను సాంకేతిక పరిజ్ఞానంతో తొలగించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్‌చేస్తూ వస్తున్నారు. ఇలాఉండగా హైదరాబాద్‌కు చెందిన ఐఐటీ సంస్థ పరిశోధకులు ఆషిఫ్ క్యూరిసి, కొడైకెనాల్ కొండ ప్రాంతం, తేని జిల్లా పెరియకుళం జలవనరులను పరిశీలించారు. దీనిగురించి ఇటీవల ఒక నివేదిక దాఖలు చేశారు. అందులో కొడైకెనాల్ జలవనరుల్లో 31.10 నుంచి 41.90 మైక్రోగ్రాములు, పెరియకుళం జలవనరుల్లో 94 నుంచి 165 మైక్రోగ్రాముల వరకు పాదరసం కలిసినట్లు పేర్కొన్నారు. 30 మైక్రోగ్రాముల కంటే ఎక్కువగా పాదరసం కలిసినట్లయితే మానవుని మెదడు, మూత్రపిండాలు దెబ్బతింటాయని తెలిపారు. అంతేకాకుండా గర్భిణులకు ప్రాణాపాయం ఏర్పడుతుందన్నారు. పాదరసంతో కలుషితమన నీటితో ఈ ప్రాంత ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు పేర్కొన్నారు. ఈ ప్రాంతాల్లోగల చెరువులు, నీటిగుంటల్లో ప్రజలు చేపలు పట్టరాదని హెచ్చరించారు. ఇలాఉండగా రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి రీజినల్ అధికారి చార్లెస్, కొడైకెనాల్ ఆర్డీఓ మోహన్, ఇతర ప్రభుత్వ శాఖల అధికారులు మంగళవారం పాదరసం కర్మాగారంలో తనిఖీలు జరిపారు. దీనిపై ఆర్డీఓ మోహన్ విలేకరులతో మాట్లాడుతూ పాదరసం శుభ్రం చేసేందుకు చేపట్టాల్సిన చర్యలపై తనిఖీలు జరిపామని అన్నారు. ఈ కర్మాగారంలో నెలకొన్న మిస్టరీని ఛేదించి ప్రజల్లో భయాందోళనలు తొలగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సామాజిక హితులు కోరుతున్నారు. థర్మామీటర్ కర్మాగారం: కొడైకెనాల్లో 1984లో 25 ఎకరాల విస్తీర్ణంలో థర్మామీటర్ కర్మాగారం ప్రారంభమైంది. సుమారు 1,200 మంది ఉద్యోగులు ఇక్కడ పనిచేస్తూ వచ్చారు. ఈ కర్మాగారంలో అనేక మంది కార్మికులు తీవ్ర అనారోగ్యానికి గురైనట్లు అప్పట్లో ఫిర్యాదులందడంతో 2001లో కర్మాగారం మూతపడింది. -
వారాంతపు వ్యాయామమైనా చాలు!
హూస్టన్: వ్యాయామం రోజూ చేయడం సాధ్యపడని వారు కనీసం వారాంతాల్లో చేసినా ఫరవాలేదని ఓ అధ్యయనం చెబుతోంది. రోజుకు 75 నిమిషాలపాటు కఠోరంగా లేదా 150 నిమిషాలపాటు తేలికైన వ్యాయామాలు చేయాలని వైద్యులు చెబుతుంటారు. తీరికలేని జీవనశైలితో ఇది సాధ్యపడదు. అలాంటివారు కనీసం వారాంతాల్లో బాగా ఎక్కువ సమయాన్ని శారీరక శ్రమ చేయడానికి కేటాయించినా ఆరోగ్యపరంగా మంచి ఫలితాలే ఉంటాయని పరిశోధకులు అంటున్నారు. ఇంగ్లాండ్‌లోని లాఫ్బోరఫ్ విశ్వవిద్యాలయంలో ఉన్న ‘ఎక్సర్సైజ్ యాజ్ మెడిసిన్’ అనే విభాగంలో పరిశోధకుడిగా పనిచేస్తున్న డోనోవన్ అనే వ్యక్తి, ఆరోగ్య సర్వేల్లోని 63 వేల మంది వివరాలను పరిశీలించి ఈ విషయం తేల్చాడు. -
పారిశుధ్యంపై అధ్యయనం
కలెక్టర్‌ను కలిసిన యూఎస్ఏ బృందం ముకరంపుర: యూఎస్ఏ స్మిత్ కాలేజీలో ప్రొఫెషనల్ మానిటర్ టౌన్ ఇంజినీర్ డానియల్ మర్ఫి, విద్యార్థినులు మిరాయలా, జేఫర్సన్ విద్యార్థినుల బృందం బుధవారం క్యాంపు ఆఫీసస్‌లో కలెక్టర్‌ను కలిశారు. టౌన్ ఇంజినీర్ డానియల్ మర్పీ మాట్లాడుతూ శానిటేషన్‌పై సర్వే చేసేందుకు ఇండియాకు వచ్చామని వివరించారు. కరీంనగర్ ఎంపీ వినోద్‌కుమార్ ఆహ్వానం మేరకు తెలంగాణలోని వరంగల్, కరీంనగర్ జిల్లాలో శానిటేషన్‌పై అధ్యయనం చేస్తున్నామని తెలిపారు. గురువారం ఎంపీ దత్తత గ్రామం వీర్నపల్లిలో సర్వే చేసేందుకు వెళ్తున్నట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా స్వచ్ఛభారత్ పథకంలో బహిరంగ మలవిసర్జనరహిత జిల్లాలుగా మార్చుటకు చేపట్టిన వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు సత్ఫలితాలిస్తుందన్నారు. కలెక్టర్ నీతూప్రసాద్ మాట్లాడుతూ వీర్నపల్లి 3వేల జనాభాగల మారుమూల వెనుకబడిన గ్రామమని, అక్కడ వంద శాతం మరుగుదొడ్లు నిర్మించినట్లు తెలిపారు. వందశాతం అక్షరాస్యత, గుడుంబా రహిత గ్రామంగా మార్చామని తెలిపారు. గుడుంబాపై జీవనోపాధి పొందేవారికి వివిధ రకాల రుణాలిప్పించి స్వయం ఉపాధి కల్పించామని తెలిపారు. అంతర్గత రోడ్లు నిర్మించామని, మెడికల్ క్యాంపులు నిర్వహించామని వివరించారు. రైతులకు ఆధునిక సాంకేతిక పద్ధతుల ద్వారా వ్యవసాయ సాగును ప్రోత్సహిస్తున్నామని తెలిపారు.