దేశీయంగా ఫార్మాస్యూటికల్ పరిశోధన, అభివృద్ధి భవిష్యత్‌ను నిర్ణయించడంలో కీలక పాత్ర పోషిస్తాయని డెలాయిట్, అసోచామ్ సంయుక్త నివేదిక తెలిపింది. ఈ దిశగా అనుమతుల ప్రక్రియను సులభతరం చేయడం, మేధో సంపత్తి (ఐపీ) హక్కులను కాపాడడం, ఆవిష్కరణలను ప్రోత్సాహించడం కీలకమని పేర్కొంది. ఫార్మాస్యూటికల్స్ పరిశ్రమలో పరిశోధన, అభివృద్ధి (ఆర్‌అండ్‌డీ)కి ఇప్పటికీ విధానపరమైన సవాళ్లు నెలకొంటున్నట్లు తెలిపింది. నియంత్రణ కార్యాచరణను ఆధునికీకరించడం, అంతర్జాతీయ నియంత్రణ సంస్థలతో భారత ఫార్మా రంగం సమన్వయం చేసుకుంటుందని నివేదిక తెలిపింది. అయితే ఈ రంగం మరింత వృద్ధి చెందేందుకు ప్రస్తుతం ఎదురవుతున్న సవాళ్లను అధిగమించాలని సూచించింది.
నివేదికలోని వివరాల ప్రకారం..ఔషధ నియంత్రణల పరంగా అత్యాధునిక పరీక్షా కేంద్రాల కొరత ఉంది. తయారీ యూనిట్లలో క్వాలిటీ నిబంధనల అమలును పర్యవేక్షించేందుకు బలమైన కార్యాచరణ లేదు. దాంతో ఫార్మాస్యూటికల్ పరిశోధన, అభివృద్ధి (ఆర్‌అండ్‌డీ) వెనకబడుతోంది. ఏకరూప నియంత్రణ నిబంధనలు అమలు చేసేందుకు కేంద్రం, రాష్ట్రాల మధ్య సమన్వయానికి అవకాశాలున్నాయి. ఇప్పటికే ఉన్న వివిధ నియంత్రణ సంస్థల మధ్య సమన్వయలోపం ఉంది. పాలనా పరమైన సమస్యల వల్ల ఔషధాలు, క్లినికల్ ట్రయల్స్ అనుమతులకు అదనపు సమయం అవసరమవుతుంది. ఫలితంగా అత్యున్నత నాణ్యతతో కూడిన క్లినికల్ పరిశోధనలకు భారత్ ఆకర్షణీయ కేంద్రంగా నిలవలేకపోతుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో పోల్చి చూస్తే నిబంధనల అమలుకు భారత్‌లో అధికంగా ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇది సూక్ష్మ, చిన్న ఫార్మాస్యూటికల్ సంస్థలకు భారంగా మారుతుంది.
ఇదీ చదవండి: వాటర్ బాటిల్ ధర తగ్గనుందా..?
అంతర్జాతీయంగా ఫార్మాస్యూటికల్ ఆర్‌అండ్‌డీలో భారత్‌ను మెరుగైన స్థానంలో నిలిపేందుకు స్పష్టమైన నియంత్రణలు, సరళీకృత ప్రక్రియలు అవసరమని ఈ నివేదిక సూచించింది. అందుకోసం ప్రభుత్వ ప్రోత్సాహం అవసరమని అభిప్రాయపడింది. అత్యాధునిక పరిశోధనా కేంద్రాల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సాయం అందించాలని తెలిపింది. ప్రభుత్వం, విద్యా సంస్థలు కలసి ఫార్మాస్యూటికల్ పరిశ్రమకు ప్రత్యేక కోర్సులు రూపొందించాలని సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment